పాక హోటల్ లో ఇడ్లీ భేష్.. వెంకయ్య
posted on May 2, 2023 @ 1:02PM
వెంకయ్యనాయుడు.. మాజీ ఉపరాష్ట్రపతి.. అంతకంటే ముందు రాజకీయ నాయకుడు, కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు.. యిలా అన్ని దశలూ సక్సెస్ ఫుల్ గా దాటి వచ్చిన నేత. రాజకీయ నాయకుడిగా గానీ, కేంద్ర మంత్రిగా కానీ, ఆ తరువాత ఉప రాష్ట్రపతిగా కానీ ఆయన ఎక్కడా వివాదాల జోలికి వెళ్ల లేదు. వివాదరహితుడిగానే పేరొందారు. తన వాక్చాతుర్యంతో, వాగ్ధాటితో తోటి రాజకీయ నాయకులనే కాకుండా సామాన్యులను సైతం మెప్పించారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందే సమయంలో ఆయన ఏపీకి న్యాయం కోసం గళమెత్తారు. కొన్ని హామీలు పార్లమెంటు సాక్షిగా సాధించగలిగారు కానీ, ఆ తరువాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కీలక శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టినా పార్లమెంటు సాక్షిగా పొందిన హామీలను అమలు చేయించే విషయంలో సొంత ప్రభుత్వాన్నే ఒప్పించలేకపోయారు. అయితే వాటిపై అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ గళమెత్తి.. సొంత ప్రభుత్వానికే తలనొప్పిగా మారారు. అంతే ఆయనకు పదోన్నతి అంటూ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయించి ఏకంగా ఉపరాష్ట్రపతి కుర్చీలో కూర్చోబెట్టేసి రాజకీయాలకు దూరం చేసేసింది మోడీ సర్కార్. ఉప రాష్ట్రపతిగా రాజకీయాలు మాట్లాడకూడదన్న విలువకు కట్టుబడి ఆయన ఏపీ ప్రయోజనాల గురించి నోరెత్తలేదు.
ఆయన ఉప రాష్ట్రపతిగా వెళ్లడం వల్ల ఏపీకి నష్టం జరిగిందనే వారూ లేకపోలేదు. అయితే అదంతా గతం. తన మొత్తం పొలిటికల్ కెరీర్ అంతా బీజేపీ కోసం పాటుపడిన వెంకయ్యకు ఉప రాష్ట్రపతిని చేసి పార్టీ రుణం తీర్చుకుందని చెప్పుకోవడానికి లేకుండా.. మరో సారి ఆ అవకాశం ఇవ్వకుండా.. రాష్ట్రపతి అయ్యే చాన్స్ కూడా ఇవ్వకుండా బలవంతపు రిటైర్మెంట్ ఇచ్చేసింది మోడీ సర్కార్. ఈ విషయంలో తన అసంతృప్తిని సన్నిహితుల వద్ద వ్యక్తం చేసుకోవడానికి మాత్రమే పరిమితమైన వెంకయ్యనాయుడు.. బహిరంగంగా మాత్రం హుందాగా.. రిటైర్మెంట్ లైఫ్ గడిపేస్తున్నారు. తెలిసిన వారూ, అభిమానించే వారు ఆహ్వానిస్తున్న కార్యక్రమాలకు హాజరౌతూ.. ప్రసంగాలలో ఏవో మంచి మాటలు చెబుతూ కాలం గడిపేస్తున్నారు.
తాజాగా ఆయన విజయవాడలోని మునిసిపల్ ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న ఎస్ఎస్ఎస్ హోటల్ లో కూర్చుని ఇడ్లీలు తిన్నారు. ఆ ఎస్ఎస్ఎస్ హోటల్ గుబురు చెట్ల నీడలో ఉండే ఓ పాక హోటల్. చక్కగా అందరూ బొంబాయ్ చట్నీ అనే శనగపచ్చడి, అల్లం చట్నీ, కారప్పొడి, నెయ్యితో ఇడ్లీలను ఆరగించిన వెంకయ్య నాయుడు ఆ హోటల్ యజమానిని అభినందించి, గతంలో కూడా ఓ సారి తాను ఇక్కడ ఇడ్లీలు తిన్న విషయాన్ని చెప్పి ఊరుకోకుండా అలవాటు ప్రకారం ఇడ్లీల ప్రాశస్థ్యం, వాటి వల్ల ఆరోగ్యానికి చేకూరే మేలు వంటి విషయాలపై కూడా ప్రసంగించేవారు. బలవర్ధకమైన మన భారతీయ సంప్రదాయ వంటలను, రుచులను కాపాడుకోవాలని సూచనా ఇచ్చేశారు.