బజ‘రంగు’ పడుద్దా
posted on May 5, 2023 @ 4:07PM
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్’కు కౌంట్ డౌన్’ మొదలైంది... మరో మూడు రోజుల్లో (మే 8న) ప్రచారం ముగుస్తుంది. మరో ఐదు రోజుల్లో మే 10న పోలింగ్ జరుగుతుంది. మే 13న ఫలితాలు వెలువడతాయి.ఇక అక్కడితో కర్నాటకంలో ఒక అంకం ముగుస్తుంది, మరో అంకం మొదలవుతుంది.
అయితే కర్ణాటక పీఠాన్ని నిలుపుకునేందుకు బీజేపీ, కర్ణాటక గెలుపుతో దేశంలో పూర్వ వైభవాన్ని పొందేందుకు కాంగ్రెస్ హోరాహోరీగా పోరాదుతున్న ఈ ఎన్నికల ఫలితాలు కర్ణాటకకు మాత్రమే పరిమితం కావు. ఈ సంవత్సరం చివరలో జరగనున్న తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘర్ అసెంబ్లీ ఎన్నికల పైనా, వచ్చే సంవత్సరం జరిగే సార్వత్రిక ఎన్నికల పైనా ప్రభావం చుపుతాయనే అంచనాలతో, దేశం మొత్తం కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
కాగా, ఇంతవరకు వచ్చిన సర్వేలు చాలా వరకు కర్ణాటక ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనే సంకేతాలనే ఇస్తున్నారు.
అయితే సర్వే సర్వేకు గ్రాఫ్ మారుతోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజారిటీ (135/224) ఖాయం చేసిన సర్వే సంస్థలే.. తాజా సర్వేలో కాంగ్రెస్ పార్టీకి బొటాబొటి మెజారిటీ నుంచి సింగిల్ – లార్జెస్ట్ దాకా వచ్చారు. అటు చేసి ఇటు చేసిచివరకు మళ్ళీ హంగ్ వైపుకే సర్వే లెక్కలు సర్దుకుంటున్నాయి. అయితే, ఈసారి కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తుందని, సర్వేలు సూచిస్తున్నాయి.
ఇంతవరకు ఒక లెక్క అయితే, ఇక ముందు ఇంకో లెక్క అన్నట్లుగా, మిగిలున్న ఐదు రోజులు అత్యంత కీలకమని సర్వే సంస్థలతో పాటుగా రాజకీయ పండితులు కూడా పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. ఒకప్పటి సంగతి ఏమో కానీ,ఇప్పడు ఎన్నికలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ గా మారిపోయాయి. చివరి బంతి (ఓటు) పడే వరకు ఏమైనా జరగవచ్చును. ఒక్క బంతి .. ఒక్క రాంగ్ షాట్ మ్యాచ్ రిజల్ట్ ను మార్చి వేసినట్లు ఎన్నికల్లో చివరి ‘ఘడియ’ లో తీసుకునే నిర్ణయాలు, చేసే కామెంట్స్ ఫలితాలను తారుమారు చేస్తాయని గతంలో అనేక సందర్భాలలో రుజువైంది.
ఇప్పుడు కర్ణాటకలో అదే జరుగుతోందా అంటే అవుననే అంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదలు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ చేసిన, ‘మోడీ విషసర్పం’ వంటి వివాదాస్పద కామెంట్స్ పార్టీ ఇమేజ్ ని డ్యామేజి చేయడమే కాదు, ఎన్నికల ఫలితాలపైన ప్రతికూల ప్రభావం చూపుతాయిని గుర్తించారు, అందుకే ఖర్గే, తూచ్. అన్నారు. విష సర్పం అనండి మోదీని కాదు, ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్దాంతాలను అంటూ అర్థ తాత్పర్యాలు విడమరిచ్ని చెప్పే ప్రయత్నం చేశారు. అయినా, అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయిందని, కాంగ్రెస్ నాయకులే అంగీకరిస్తున్నారు.
అలాగే సిద్దరామయ్య,డీకే శివకుమార్ లింగాయత్ కమ్యూనిటీకే వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రభావం కూడా ఎన్నికల ఫలితాలపై ఉంటుందని అంటున్నారు. అదలా ఉంటే ఎన్నికల ప్రచారం ఆఖరి ఘట్టానికి చేరుతున్న సమయంలో. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ...తాము అధికారంలోకి వస్తే ‘బజరంగ్‌దళ్’పై నిషేధం విధిస్తామని ఇచ్చిన హామీ ప్రకంపనలు సృష్టిస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ యూ టర్న్ తీసుకుంది. బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని తమ మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసింది.అసలు తాము బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని అననేలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బజరంగ్‌దళ్‌ను బ్యాన్ చేయలేదని కూడా తెలిపారు. మరోవంక ఈ విషయంపై స్పందించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గ నిరాకరించారు. ముఖ్యం చాటేశారు.
మరోవైపు ఓటు వేసేటప్పుడు ‘జై బజరంగబలి’ నినాదం చేయడం ద్వారా కాంగ్రెస్ దుష్ట సంస్కృతిని శిక్షించాలని కర్ణాటక ఓటర్లకు ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. ఆ పార్టీయే అభివృద్ధి, శాంతిసామరస్యాలకు శత్రువని నిందించారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ, దక్షణ కన్నడ, బెళగావి జిల్లాల్లో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన నేపథ్యంలో మోడీ ప్రతి బహిరంగసభలోనూ ‘జై బజరంగబలి’ అంటూ నినదించారు.
దీంతో పోలింగ్ తేదీ సమీపిస్తున్న సమయంలో అందివచ్చిన అవకాశాన్ని బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు పూర్తి స్థాయిలో వినియోగించు కుంటున్నాయి. మరో వంక ఎన్నికల విశ్లేషకులు.. ఒకటి రెండు శాతం ఓట్లు అటూ ఇటూ అయితే ఫలితాలు తారుమారతాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సర్వేలు సూచించిన విధంగా హస్తానికి పట్టా కడతాయా ? లేక తుస్సు మంటాయాఅన్నది మే 13న తేలిపోతుంది.