నయీంతో పోలిక..
posted on May 5, 2023 @ 1:06PM
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర యాదాద్రి జిల్లాలో కొనసాగుతోంది. గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ జరిగా సంవత్సరాలు గడుస్తున్నా అతని డైరీని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ముందు ప్రవేశ పెట్టడం లేదని భట్టి ఆరోపిస్తున్నారు. ప్రజల నుంచి దోచుకున్న బంగారం,నగదు, భూములను తిరిగి ప్రజలకే ముట్టజెప్పాలని భట్టి వాదన. నయీం సంపాదించిన ఆస్తులను అతని కుటుంబ సభ్యులు, ముఠాసభ్యులే అనుభవిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నిందిస్తుంది.
నయీం చోటామోటా గ్యాంగ్ స్టర్ కాదు. గుజరాత్ లో సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్లో నయీం పాత్ర కీలకం. సోహ్రబుద్దీన్ తో నయీంకు ఉన్న పరిచయంతోనే గుజరాత్ పోలీసులకు ఇన్ ఫార్మర్గా మారి ఎన్ కౌంటర్ చేయించినట్లు సమాచారం. నయీంను షాద్ నగర్ లో 2016 ఆగస్టులో ఎన్ కౌంటర్ చేశారు. తెలంగాణ పోలీసులు . ఎపిసిఎల్ సి నేత కరణం పురుషోత్తం హత్య కేసులో నయీం ముద్దాయిగా ఉన్నాడు. ఐపీఎస్ అధికారి కెఎస్ వ్యాస్ హత్య కేసులో నయీం ముద్దాయి. నయీం ఎన్ కౌంటర్ జరిగి ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం నయీం డైరీని బయట పెట్టడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నయీంకు బీఆర్ ఎస్ ప్రభుత్వానికి పెద్ద తేడాలేదని మిలియన్ మార్చ్ పాదయాత్రలో భట్టి సంచలన ఆరోపణ చేశారు. నయీం దోచుకున్న తీరులోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని భట్టి అంటున్నారు. మార్చి 16న యాత్ర ప్రారంభమై మొత్తం 90 రోజుల పాటు యాత్ర సాగనుంది. 39 నియోజకవర్గాల్లో భట్టి కలియ తిరుగుతున్నారు. భట్టి దాదాపు 1,365 కిలో మీటర్ల మేర పాదయాత్ర జరపనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర తర్వాత భట్టి చేపడుతున్న పాదయాత్ర రెండో అతి పెద్ద యాత్ర అని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి 50 అసెంబ్లీనియోజకవర్గాల్లో పర్యటించారు. 5 బహిరంగ సభలు నిర్వహించారు. భట్టి దళిత కమ్యూనిటీ నుంచి వచ్చారు. మునుపటి ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. భట్టి చేపట్టిన పాదయాత్ర ఖమ్మం జిల్లాలో జూన్ 15న ముగుస్తుంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను స్పూర్తిగా తీసుకుని భట్టి ఈ యాత్రను చేపట్టారు. గడప గడపకు పాదయాత్ర వెళ్లడం వల్ల ప్రజా సమస్యలు తెలుసుకోవచ్చని ఎ ఐసీసీ భావిస్తుంది. రాష్ట్రంలోబీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ఇస్తున్న బూటకపు వాగ్దానాలను కాంగ్రెస్ ఎండగట్టడానికి ఈ పాదయాత్ర దోహదపడుతుంది. ఇరు ప్రభుత్వాలు యువత కు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఈ యాత్రలో ఆరోపిస్తుంది. తెలంగాణ ఏర్పాటు కాకమునుపు 12 లక్షల మంది ఉన్న నిరుద్యోగులు ప్రస్తుతం 30 లక్షలకు చేరుకున్నారని కాంగ్రెస్ లెక్కలేసి చెప్పింది.
భట్టి విక్రమార్క కేసీఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. విద్యార్థులు కొలువులు రాక ఇబ్బందులు పడుతుంటే కేసిఆర్ అద్భుతంగా సెక్రటేరియట్ కట్టామని మట్లాడటం బాధాకరమన్నారు. నిజాం రాచరిక నియంతృత్వ నిరంకుశ మనస్తత్వం కలిగిన కేసీఆర్ ను గద్దె దించటానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో ప్రజలు మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. దివంగత నేత వైఎస్ ఆర్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర వల్లే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో రాగలిగింది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలో రావడానికి ఈ పాదయాత్ర దోహదపడుతుందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి.