కేసీఆర్ పై పోటీకి రె‘ఢీ’అంటున్ననేతలు
posted on May 5, 2023 @ 7:58PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? జాతీయ రాజకీయాల్లో కీలక పాత్రను పోషించేందుకు వీలుగా ...లోక్ సభకు పోటీచేస్తారా? లేక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, హ్యాట్రిక్ ముచ్చట తీర్చుకుంటారా? లోక్ సభ ఎన్నికల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి, ఆ తర్వాత కేటీఆర్ కు పగ్గాలు అప్పగించి ఢిల్లీకి మకాం మారుస్తారా? అసెంబ్లీకి పోటీచేసే పక్షాన గజ్వేల్ నుంచే పోటీ చేస్తారా? సిద్దిపేట లేదా మరో నియోజక వర్గం నుంచి బరిలో దిగుతారా? ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై వ్యూహాగానాలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి.
అయితే నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఏమి చేస్తారు, అనేది ఈరోజు ఊహించడం సాహసమే అవుతుంది. ముఖ్యంగా ఎన్నికల వ్యూహ రచనలో ఆయన ప్రత్యర్ధి పార్టీల నాయకులకే కాదు సొంత పార్టీ, సొంత గూటి నేతలకు కూడా చిక్కరు.. దొరకరు. నువ్వుకటి తలిస్తే దైవం ఒకటి తలచాడు అన్నట్లుగా ఆయన ప్రత్యర్ధులు ఒకటి ఉహిస్తే, ఆయన ఇంకొకటి చేసి ప్రత్యర్ధులను ఇట్టే బురిడి కొట్టిస్తారు. ఆ విషయంలో ఆయన చాలా చాలా సమర్ధులు. సో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..ఉహకు అందని సందేహం.
అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయనపై పోటీ చేసేందుకు రె‘ఢీ’ అవుతున్న ప్రత్యర్దుల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. ఒకప్పడు మాజీ మంత్రి , హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గజ్వేల్ బరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ‘ఢీ’ కొనేందుకు తాను రెడీ అని ప్రకటించారు.
ప్రకటించడమే కాదు నియోజక వర్గంలో కొంత హడావిడి కూడా చేశారు. అప్పట్లో స్వయంగా ఆయనే పబ్లిక్ గా సవాల్ విసిరారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని పార్టీ అధిష్ఠానానికి ముందే చెప్పానని తెలిపారు. అంతే కాదు, ఆయన పశ్చిమ బెంగాల్ తో పోలిక కూడా తెచ్చారు. అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, బీజేపీ నేత సువేందు అధికారి ఓడించారని అదే విధంగా ఇక్కడ తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడిస్తానని ధీమా వ్యక్త పరిచారు. అలాగే మరో బీజేపీ ఎమ్మెల్యే, రఘునందన రావు కూడా పార్టీ ఆదేశిస్తే, ముఖ్యమంత్రి పై పోటీ చేసేందుకు తాను సిద్దమని టీవీ డిబేట్స్ లో ప్రకటించారు.
అదలా ఉంటే ఇప్పుడు తాజాగా, విప్లవ గాయకుడు గద్దర్ బీఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా కేసీఆర్ టార్గెట్ గా గజ్వేల్ నుంచి పోటీ చేస్తామని ప్రకటించారు. రెండు మూడు రోజుల క్రితమే గద్దర్ స్వయంగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై పోటీకి సిద్ధమని తెలిపారు. అయితే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా, లేక ఏదైనా పార్టీలో చేరి పోటీ చేస్తారా, అనేది ఇంకా స్పష్టం కాలేదు. అలాగే, ముఖ్యమంత్రి కేసీఆరే వ్యూహాత్మకంగా ఆయన్ని బరిలో దించుతున్నారా,అనే అనుమానాలు కూడా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం.
గద్దర్ విషయం ఎలా ఉన్నా తాజాగా బీఆర్ఎస్ బహిష్కృత నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై పోటీ చేసేందుకు తాను సైతం సిద్ధమని అన్నారు.గురువారం (మే 4)బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఇతర బీజేపీ నాయకులు ఖమ్మంలో పొంగులేటి నివాసంలో ఆయనతో పాటు మరో బీఆర్ఎస్ బహిష్కృత నేత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో సమావేశమయ్యారు. బీజేపీ నేతలు ఆ ఇద్దరినీ తమ పార్టీలోకి ఆహ్వానించారు. అనతరం మీడియాతో మాట్లాడిన పొంగులేటి, బీజేపీలో చేరే విషయంలో స్పష్టత ఇవ్వక పోయినా గజ్వేల్ లో కేసిఆర్ పై పోటీకి కూడా వెనకడేది లేదని అన్నారు. అలాగే, కేసీఆర్ అవినీతి పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమని అందుకోసం అవసరం అయితే రెండు మెట్లు దిగేందుకు కూడా సిద్దమని ప్రకటించారు.
అదెలా ఉన్నప్పటికీ, ఇంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి పోటీ చేస్తారా? ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళతారా? అనే విషయంలో స్పష్టత లేదు, ఆలాగే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే విషయంలోనూ క్లారిటీ లేదు, కానీ, ఆయనతో ‘ఢీ’అనేదుకు రెడీ అవుతున్న నాయకుల నెంబర్ మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది.