కీలక నేతలకు విజయాలు, అపజయాలు

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక నేతల పాత్ర ప్రధానం. అయితే కీలక నేతలు కూడా ఓడిపోయారు. బిజేపీలో కూడా అదే పరిస్థితి.  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. పలువురు కీలక నేతలు విజయం సాధించగా... మరికొందరు ఊహించని విధంగా పరాజయం పాలవుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షిగ్గావ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. వరుణ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపురి నియోజకవర్గం నుంచి జయకేతనం ఎగురవేశారు.  బళ్లారి రూరల్ స్థానం నుంచి బి.శ్రీరాములు ఓటమి పాలయ్యారు. హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్ స్థానం నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ సీఎం జగదీశ్ శెట్టార్ ఓడిపోయారు. మరోవైపు రేపు ఉదయం బెంగళూరులో సీఎల్పీ సమావేశం జరగనున్నట్టు సమాచారం. ఈ భేటీలో సీఎం అభ్యర్థి పేరును ఖరారు చేయనున్నారు. గెలుపొందిన అభ్యర్థులు వెంటనే బెంగళూరుకు రావాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది.

ఖాకీల కండకావరం.. సామాన్యుడిలో కలవరం

ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. అధికార జగన్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని.. ఆ పార్టీ నేతల అడుగులకు పోలీసులు మడుగులోతుత్తోన్నారని.. ఇంకా చెప్పాలంటే  రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ.. ఫ్యాన్ పార్టీ నేతల చేతుల్లో కీలుబొమ్మగా మారిందంటూ గత నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్షాలు గగ్గొలు పెడుతోన్నాయి. అయితే జగన్ పాలనలో పోలీసులు వ్యవహరిస్తున్న శైలిని చూసి.. యావత్ భారతావని ఔరా అంటు ముక్కున వేలేసుకొనే పరిస్థితి అయితే దాపురించిందని ఇప్పటికే ప్రజాస్వామిక వాదులు స్పష్టం చేస్తున్నారు.   ఆ క్రమంలో తాజాగా నెల్లూరు జిల్లా కావలిలో చోటు చేసుకొన్న సంఘటన చూసి.. జాతీయ మానవ హక్కుల సంఘం సైతం నోరెళ్లబెట్టే పరిస్థితికి వచ్చేస్తోందని సంకేతాలు సైతం వినిపిస్తున్నాయి. మే 12వ తేదీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని  కావలి వేదికగా రైతులకు చుక్కల భూముల హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ విచ్చేశారు. ఆ క్రమంలో పట్టణంలో నిరసనకారులు.. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో వారిని పోలీసులు అడ్డుకొవడంలో భాగంగా.. ఓ పోలీస్.. తన కాళ్ల మధ్య ఆ కార్యకర్త తల ఉంచి.. గట్టిగా నొక్కుతోన్న వీడియో దృశ్యాలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు సైతం వెల్లువెత్తుతోన్నాయి.   ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన... అమెరికాలో చోటు చేసుకొన్న అప్రో అమెరికన్ జార్జి ప్లాయిడ్ ఘటనను గుర్తు చేసే విధంగా ఉందనే అభిప్రాయం సైతం ప్రజాస్వామిక వాదుల్లో వ్యక్తమవుతోంది. 2020, మే 25వ తేదీన అమెరికాలోని మినిపోలీస్ నగరంలో కర్కశత్వానికి మారు పేరుగా నిలిచిన పోలీస్ అధికారి డెరెక్ షావిన్ మోకాళ్ల కింద జార్జి ప్లాయిడ్ నలిగి పోతూ కూడా... తనకు ఊపిరి అందడం లేదని చెబుతున్నా వినకుండా.. తుది శ్వాస విడిచే వరకు అతడిని గట్టిగా తన కాళ్లతో అదిమి పెట్టి ఉంచడంతో.. జార్జీ ప్లాయిడ్ మృత్యు ఒడిలోకి జారుకొన్నాడు... అందుకు సంబంధించిన వీడియోతోపాటు ఫొటోలు సైతం వైరల్ కావడంతో అగ్రరాజ్యం అమెరికా అట్టుడికిపోయింది. చివరకు ట్రంప్ ప్రభుత్వంపై ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతోపాటు.. ఆయన తన అధ్యక్ష పదవి పోగొట్టుకోవడంలో జరిగిన అతి ముఖ్య  సంఘటనల్లో ఇది ఒకటిగా నిలవడం గమనార్హం. చివరకు అంత కూర్రత్వంతో వ్యవహరించిన పోలీస్ అధికారి డెరెక్ షావిన్‌కి 22 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ.. కోర్టు తీర్పు సైతం వెలువరించడం.. అదీ కూడా అతడి హత్య జరిగిన జస్ట్ 36 రోజుల్లోనే ఈ తీర్పు వెలువడం నిజంగా శుభ పరిణామమేనని చెప్పాలి.  ఎందుకంటే.. ఇటువంటి ఘటనలు.. సంఘటనలు మన రాష్ట్రంలో చోటు చేసుకొన్నా.. ఈ చర్యలకు పాల్పడిన పోలీసులపై చర్యలు అయితే ఉండవు. ఓ వేళ చర్యలు తీసుకొన్నా.. అవి కంటితుడుపు చర్యలే ఉంటాయన్నది మాత్రం పక్కా వాస్తవం. అదీకాక  బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్లిన వేళ అంటూ మనం ఘనంగా అమృతోత్సవాలు జరుపుకొంటున్నాం కానీ.. మనం.. మన ఎన్నుకొన్న నాయకాగణం మాత్రం.. ఆ నాటి బ్రిటిష్ వారి రాసిన.. చేసిన  చట్టాలనే ఏళ్లకు ఏళ్లు పట్టుకొని వేలాడుతోన్నారు. అంతేకానీ.. కాలానుగుణంగా వచ్చిన మార్పులకు అనువుగా పోలీసు చట్టాలను మార్చాలనే  చిత్త శుద్ది మన పాలకల్లో కొరవడింది. దీంతో పోలీసు వ్యవస్థ అంటే.. బలవంతులు, అధికారంలో ఉన్నవారి రక్షణకే రక్షక భట వర్గం అనే ఓ రాజముద్ర  దేశంలోని ప్రతీ సామాన్యడి మదిలో బలంగా ముద్ర పడిపోయింది. అయితే తాజాగా కావలిలో చోటు చేసుకోన్న ఈ ఘటన.. రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలను దారి తీస్తుందోనని ప్రజాస్వామిక వాదుల్లో ఓ కలవరం అయితే మొదలైందనేది మాత్రం  పక్కా వాస్తవం.  

కర్ణాటకలో కాయ్ రాజా కాయ్

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడే క్రమంలో కర్ణాటకలో జోరుగా బెట్టింగుల పర్వం కొనసాగుతోంది. ఓ వ్యక్తి అయితే తనకున్న రెండు ఎకరాలను పందానికి పెట్టాడు. తనతో పందెం కాసేవారు ఉంటే రావాలని డప్పు కొట్టి మరీ చాటింపు వేయించాడు. ఈ ఘటన హొన్నాళ్లి నియోజకవర్గంలో చోటు చేసుకొంది. సదరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శాంతనగౌడ, బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్య బరిలో నిలవగా.. వీరిద్దరిపై జోరుగా పందాలు కొనసాగుతోండగా.., నాగణ్ణ అనే వ్యక్తి మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాంతనగౌడ విజయం సాదిస్తారని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. అందుకోసం తను రెండెకరాల పొలాన్ని పందెం కాస్తున్నానని, తనపై పందెం కాసేవారు ఉంటే ముందుకు రావాలంటూ గ్రామంలో డప్పు కొట్టి మరీ చాటింపు వేయించాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.  మరోవైపు కొండసీమల చామరాజనగర జిల్లాలోనూ బెట్టింగులు జోరుగా జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ సోమణ్ణ  గెలుస్తారంటూ కోటి రూపాయల వరకు పందం కాసినట్లు తెలుస్తోంది. ఇక గుండ్లుపేట తాలూకా మల్లయ్యైనపుర గ్రామానికి చెందిన కిరణ్.. తన చేతిలో రూ. 3 లక్షలు పట్టుకుని కాంగ్రెస్ గెలుస్తుందని పందెం కాయడం.. అందుకు సంబంధించిన వీడియో బహిర్గతం కావడంతో..  పోలీసులు ఆయన నివాసంపై దాడులు నిర్వహించి.. విచారణ చేపట్టారు. మరోవైపు తాను ప్రకటించిన అభ్యర్థులు తప్పక గెలుస్తారని.. అలా కాదన్న వారు కోటి రూపాయల పందెం కాయవచ్చు అంటూ ప్రకటించిన ఓ వ్యక్తి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

నాన్న ముఖ్యమంత్రి కావాలి 

మైసూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఫలితాల సరళిని బట్టి చూస్తే.. కాంగ్రెస్ ముందంజలో ఉంది. దీంతో తమ పార్టీ విజయం సాధిస్తుందని హస్తం పార్టీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆ క్రమంలో కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య తనదైనశైలిలో స్పందించారు. బీజేపీకి అధికారం దూరం చేసేందుకు తాము చేయాల్సిందంతా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి స్థాయి మెజార్టీ సాధిస్తుందని.. ఇతర పార్టీల మద్దతు లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక ప్రయోజనాల కోసం తన తండ్రి సిద్దరామయ్య ముఖ్యమంత్రి కావాలని... ఒక కుమారుడిగా తన తండ్రిని సీఎంగా చూడాలని అనుకుంటున్నానని ఆయన తన మనస్సులోని మాటను ఈ సందర్భంగా వెల్లడించారు.  గతంలో తన తండ్రి సిద్దరామయ్య నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన అందించిందని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఇంతకాలం బీజేపీ పాలనలో కొనసాగిన అవినీతి, విధానపరమైన లోపాలను ఆయన సరిచేస్తారని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సిద్దరామయ్య ముఖ్యమంత్రి కావాలన్నారు. తన తండ్రి... వరుణ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారని.. భారీ ఆధిక్యంతో ఆయన విజయం సాధిస్తారని చెప్పారు.  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీన జరగగా..  మే 13వ తేదీన శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి చూస్తే... మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను 100కి పైగా స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలో ఉండగా 70 పై చిలుకు స్థానాలో బీజేపీ లీడ్‌లో ఉంది. జేడీ(ఎస్‌) 30 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవికి గట్టి పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే సీఎంగా పని చేసిన సిద్ధూ మరోసారి ఆ పదవిని దక్కించుకోవాలని తన వంతు ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ సైతం పోటీపడుతోన్నట్లు సమాచారం. అదీకాక.. పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంతో ఆయన సఫలీకృతులయ్యారనే ప్రచారం సైతం పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై తనకు ఆసక్తి ఉందని పలుమార్లు పరోక్షంగా ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయ ఢంకా మోగిస్తే.. సీఎం అభ్యర్థిని పార్టీ అధిష్టానమే ఎంపిక చేస్తుందనే ప్రచారం ఇప్పటికే జోరందుకొంది.

దేశమంతా మిన్నంటిన కాంగ్రెస్ సంబరాలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (113) కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ 118 స్థానాల్లో లీడ్ లో ఉండగా... బీజేపీ 75, జేడీఎస్ 24, ఇతరులు 7 సీట్లలో లీడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతుండటం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ ను నింపింది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని  సూచించడంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సంబరాలు అంబరాన్నంటాయి. గాంధీభవన్ వద్ద పార్టీ సీనియర్ నేతల సమక్షంలో వేడుకలు జరుపుకుంటున్నారు. తెలంగాణాలో వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ఈ ఫలితాలు నిరాశపర్చాయి. తెలంగాణలో తమకు  ప్రధానప్రతి పక్షం రాబోదని జోస్యం చెప్పే బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ విజయంతో రానున్న ఎన్నికల్లో తమ పార్టీపై పడనుందని అనుమానించే పరిస్థితి నెలకొంది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ విజయంతో దేశమంతా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. 

తెలంగాణలో కుల రాజకీయాలు భగ్గుమంటున్నాయ్ 

తెలంగాణలో కుల రాజకీయాలు మొదలయ్యాయి. తెలంగాణ  పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ వివాదానికి కేంద్ర బిందువయ్యారు. యాదవకులాన్ని కించపరిచే వాఖ్యలు చేసిన రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేసే కార్యక్రమాలు తెలంగాణా అంతటా జరుగుతున్నాయి. యాదవ కులానికి రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులతో బాటు యాదవ కులస్తులు డిమాండ్ చేస్తున్నారు.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్.  బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఎంపీ బడుగుల రియాక్ట్ అయ్యారు. తలసాని శ్రీనివాస్ కు వెంటనే రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గొల్ల కురుమ జాతులను రేవంత్ రెడ్డి అవమాన పరిచారని ధ్వజమెత్తారు. మా జాతులు నీతి నిజాయితీగా బతుకుతాయని.. అందరి తలలో నాలుకలా ఉండే జాతులు మావి అని రేవంత్ కుల దురహంకారంతో మాట్లాడారని దుయ్యబట్టారు. రేవంత్ తన నీచ రాజకీయాల గురించి కులాలను కించపరచడం తగదని అన్నారు. ఓటకు నోటు కేసులో దొంగ రేవంత్ రెడ్డి అని విమర్శించారు.  బడుగు బలహీన వర్గాలకు కేసీఆర్ చేయూతనందిస్తే.. రేవంత్ రెడ్డి వారిని కించపరుస్తున్నాడన్నారు. జైల్లో చిప్పకూడు తిన్న రేవంత్ మా జాతులను విమర్శించడమేంటని ప్రశ్నించారు. గొల్ల కురుమలకు రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఓ పెద్ద బ్లాక్ మెయిలర్ అని ఎద్దేవా చేశారు. శ్రీనివాస్ యాదవ్ రాజకీయాల్లో సీనియర్ అని కూడా చూడకుండా రేవంత్ కులం పేరుతో దూషించారని మండిపడ్డారు. రేవంత్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ కు సంస్కారం లేదని.. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడ పోటీ చేసినా గొల్ల కురుమలు కంకణం కట్టుకుని ఓడిస్తారని వ్యాఖ్యానించారు యెగ్గే మల్లేశం.  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై యాదవులు భగ్గుమన్నారు. యాదవులను కించపర్చడం, కులాన్ని చులకన చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. యాదవుల ఆందోళనకు గొల్ల కురుమలు కూడా గొంతు కలిపారు. రేవంత్‌.. ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. యాదవులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో గాంధీభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో రేవంత్‌ ఎక్కడ తిరిగినా దున్నపోతులు, గొర్రె పొట్టేళ్లతో నిరసన తెలుపుతామని తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కులం పేరుతో కించపరిచేలా రేవంత్‌రెడ్డి బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘తలసానికి చిన్నప్పటి నుంచి పేడ పిసికే అలవాటుంది. చాలాకాలం దున్నపోతులను కాసిండు’ అంటూ మంత్రి తలసానిని, యాదవ కులాన్ని కించపరిచేలా రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను యాదవులు తీవ్రంగా ఖండించారు. రేవంత్‌రెడ్డి తన అగ్రకుల అహంకారాన్ని బయటపెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అగ్ర కులస్థుడనే పొగరుతో బీసీ కులస్థులను అవమానపరుస్తున్నాడని మండిపడ్డారు.  

నాకు అంత  సీన్ లేదు

 కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత జెడిఎస్ పార్టీ కింగ్ మేకర్ కాబోతుందని వచ్చిన వార్తలను అదే పార్టీ ఖండిస్తుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బెంగళూరులోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒకవేళ కర్ణాటకలో హంగ్ వస్తే జేడీఎస్ కింగ్ మేకర్ పాత్రను పోషిస్తుందనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ ఉదయం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీతోనూ టచ్ లో లేనని... ఏ పార్టీ కూడా తనను సంప్రదించలేదని ఆయన అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు తమ పార్టీని నిరాశ పర్చాయన్నారు. కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని వచ్చిన వార్తలను ఆయన కొట్టివేశారు. రెండు, మూడు గంటలు గడిస్తే క్లియర్ పిక్ఛర్ వస్తుందని కుమారస్వామి చెప్పారు. రెండు జాతీయ పార్టీలకు ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయని... తమ జేడీఎస్ కు 30 నుంచి 32 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పాయని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం తమ పార్టీ అవసరం ఇతర పార్టీలకు రాకపోవచ్చని చెప్పారు. తమది ఒక చిన్న పార్టీ అని... తనకు అంత డిమాండ్ లేదని వ్యాఖ్యానించారు.

కర్ణాటకలో కాంగ్రేస్ ఆధిక్యం

ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించిన ఫలితాలు కర్ణాటక రాష్ట్ర కౌంటిగ్  ఫలితాలు దాదాపు దగ్గరగానే ఉన్నాయి.  దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యతను కనబరుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకే ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటి స్పష్టమైన మెజార్టీ దిశగా ముందుకు సాగుతోంది. మొత్తం 224 స్థానాలకు గాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 113 స్థానాల మ్యాజిక్ ఫిగర్ సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 117 స్థానాల్లో లీడ్ లో ఉంది. బీజేపీ 77 స్థానాల్లో, జేడీఎస్ 25 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

కక్ష కట్టిన ఆడబిడ్డ.. రంగంలోకి బ్రదర్ అనిల్!

ఇంటిగుట్టు లంకకి చేటు అన్నట్లు.. ఇంటి గుట్టు పార్టీకి.. అదీ అధికార ఫ్యాన్ పార్టీకి చేటు అన్నట్లుగా ఉందనే ఓ చర్చ అయితే అంధ్రప్రదేశ్ పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది. మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసులో ప్రదానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డిలు చేసిన తీవ్ర ఆరోపణలపై వైయస్ ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరు స్పందించిందీ లేదు.. ఖండించిందీ లేదని.. కానీ వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మాత్రం వైయస్ అవినాష్ రెడ్డి అండ్ కో చేసిన ప్రతీ ఆరోపణను అటు ఢిల్లీలో... ఇటు హైదరాబాద్‌లో.. ఎక్కడైనా సరే మీడియా ముందకు వచ్చి.. ఎన్నీ ప్రెస్ మీట్ సింగిల్ హ్యాండ్ అన్నట్లు.. ఏ మాత్రం అదురు బెదురు లేకుండా వైయస్ వివేకాపై వచ్చిన ఆరోపణలను ఖండించడమే కాదు.. తమ చిన్నాన్న ఎలాంటి వ్యక్తి.. ఆయన వ్యక్తిత్వం ఏమిటి... అలాగే కడప జిల్లా ప్రజల్లో ఆయనకు ఉన్న గుడ్ వీల్ ఎలాంటిదో కూడా సోదాహరణగా వివరించింది.. వివరిస్తోంది కూడా. దీంతో వైయస్ షర్మిల వ్యాఖ్యలను తెలుగు ప్రజానికం నమ్మక తప్పని పరిస్థితి నెలకొందనే ఓ చర్చ అయితే సదరు సర్కిల్‌లో కొన... సాగుతోంది.  మరోవైపు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తన చిన్నన్న వైయస్ వివేకా హత్య చోటు చేసుకొందని.. అందులో సీఎం చంద్రబాబు పాత్ర ఉందని.. దీనిపై సీబీఐతో విచారణ జరిపిస్తేనే కానీ.. ఈ హత్య కేసులో పాత్రదారులు, సూత్రధారులు బయటకు వస్తారంటూ పులివెందుల్లోని వైయస్ వివేకా మృతదేహం సాక్షిగా నాటి ప్రతిపక్షనేత వైయస్ జగన్ డిమాండ్ చేశారని.. ఆ క్రమంలో ఆయన కోర్టులో సైతం ఈ హత్య కేసు సీబీఐ విచారణ చేపట్టాలంటూ పిటిషన్ కూడా దాఖలు చేశారని... ఆ తర్వాత ఎన్నికలు జరగడం.. ఆ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి బంపర్ మెజార్టీ రావడం.. జగన్ ముఖ్యమంత్రి కావడం... నాటి నుంచి సీఎం వైయస్ జగన్ .. నేటి వరకు ఈ వివేకా హత్య కేసులో అనుసరించిన వ్యవహారశైలిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా నడుస్తోంది.    ఇంకోవైపు వైయస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ సైతం ప్రస్తుతం రంగంలోకి దిగి.. వైయస్ జగన్‌ను గద్దె దింపేందుకు ఎంత చేయాలో అంత చేసేందుకు తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు.. అందులోభాగంగా వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి కొన్ని వర్గాల వారి నుంచి ఓట్లు పడకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికలు సైతం ఆయన సిద్దం చేసి.. వాటిని ఎన్నికల నాటికి స్లిపర్ సెల్స్‌లాగా జనాల్లోకి పంపేందుకు వ్యూహరచన సైతం సిద్దం చేసినట్లు సదరు సర్కిల్‌లో ఓ టాక్ అయితే హల్‌చల్ చేస్తోంది.    అయితే ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత స్థానం నుంచి వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారంటే.. ఆ అందులో ఆయన తల్లి వైయస్ విజయమ్మ, చెల్లి వైయస్ షర్మిల, బావ బ్రదర్ అనిల్ కుమార్ పాత్ర ఖచ్చితంగా ఉందని.. ఇది ఎవరు కాదనలేని సత్యమని స్పష్టం చేసే వారు ఉన్నారని... అయితే వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల.. జగనన్న వదిలిన బాణం అంటూ తన పాదయాత్రలో బాణంలాగా దూసుకుపోతే.. ఆమె భర్త బ్రదర్ అనిల్ మాత్రం.. 2019 ఎన్నికల వేళ.. జగన్ గెలుపు కోసం చాలా పకడ్బందీ వ్యూహాంతో ముందుకు వెళ్లారని... దీంతో క్రిస్టియానిటీ ఓటింగ్ అంతా గంపగుత్తగా ఫ్యాన్ పార్టీకి పడడంలో కీలకంగా మారిందని.... ఆ క్రమంలో రాష్ట్రంలోని మొత్తం 24 ఎస్సీ నియోజకవర్గాల్లో 23 జగన్ పార్టీ ఖాతాలోకి వచ్చి పడ్డాయంటే అదంతా బ్రదర్ అనిల్ కుమార్ వ్యూహా రచన అనే వారు సైతం ఫ్యాన్ పార్టీలో ఉన్నారనే టాక్ సైతం వైరల్ అవుతోంది.   అదీకాక వచ్చే ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవాలని.. ఆ క్రమంలో  వై నాట్ 175 అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్.. పార్టీ శ్రేణులతో నిర్వహిస్తున్న వివిధ సమీక్షా సమావేశాల్లో మాట్లాడడమే  కాకుండా.. ఆ దిశగా ఆయన ప్రణాళికలు సైతం వేసుకొని.. ముందుకు సాగుతోన్నారని... అయితే ఇప్పటికే వైయస్ జగన్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఓ క్లారిటీ అయితే వచ్చేసిందని.. అలాగే  గత ఎన్నికల వేళ.. వైయస్ జగన్ వెంట నడిచిన వారు.. ఈ ఎన్నికల వేళ నడుస్తారా? అంటే అదీ సందేహమేనని.. ఐ ప్యాక్ తప్ప.. వైయస్ ఫ్యామిలీలోని  వారు సైతం ఆయన వెంటనే నడిచే పరిస్థితులు అయితే లేవనే వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయని... మరి జగనన్న వదిలిన బాణం అంటూ నాడు వైయస్ జగన్‌ను అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఎంత చేయాలో అంత చేసిన వైయస్ షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్.. అదే జగనన్నను గద్దె దింపేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ దంపతులు సఫలీకృతులవుతారా? లేదా? అనేది మాత్రం వచ్చే ఎన్నికల ద్వారా సుస్పష్టమవుతోందని చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.

పవన్ కల్యాణ్ మాటలలో ముందస్తు ఎన్నికల సంకేతం?

ఏపీలో ముందస్తు ఎన్నికల ముచ్చట గతంలో కంటే గట్టిగా వినిపిస్తోంది.  విపక్షాలలో అయోమయాన్ని సృష్టించి ఆ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మరల్చుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా ముందస్తు ముచ్చటను తెరమీదకు తెచ్చిందన్న వాదన వినవస్తున్నా..  విశ్వసనీయ సమాచారం మేరకు వైసీపీ యిప్పటికే పార్టీ జెండాలు, ఇతర ఎన్నికల సరంజామాకు పెద్ద ఎత్తున ఆర్డర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. కారణాలేమైనా జగన్  అసెంబ్లీని గడువుకు ముందే రద్దు చేసి  ప్రజా తీర్పును కోరుతారన్న భావన రాజకీయ వర్గాలు, పరిశీలకుల్లోనే కాదు.. సామాన్య ప్రజానీకంలో కూడా వెల్లువెత్తుతోంది. పార్టీలో అసంతృప్తి, అంతర్గత కలహాలు, కోర్టు కేసులు, ఆర్థిక సంక్షోభం.. అన్ని వర్గాలలోనూ వెల్లువెత్తుతున్న ప్రభుత్వ వ్యతిరేకత కలిపి ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ఫ్రెష్ మేండెట్ కోరడం ద్వారానే ఒకింత ఊరట పొంందావచ్చని జగన్ భావిస్తున్నట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా గురువారం (మే 11)  మంగళగిరిలో విలేకరులతో మాట్లాడుతూ  జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున తాను ఇక ఏపీలోనే ఉంటానని ప్రకటించారు. ఆయన పొత్తల గురించి ఎలాంటి శశబిషలూ లేకుండా క్లరిటీ ఇవ్వడం.. పొత్తులకు సీఎం పదవి అనేది ఎంత మాత్రం అవరోధం కాదనీ, తాను ఆ పదవి కోసం వెంపర్లాడటం లేదనీ రేసులో లేదనీ కూడా స్పష్టంగా చెప్పేసి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు సాగడమే మిగిలిందని కుండబద్దలు కొట్టేశారు. పార్టీలో  పొత్తును ఇష్టపడని వారినీ, ఇతర వైసీపీ వ్యతిరేక పార్టీలలో ఏ పార్టీ అయినా పొత్తును వ్యతిరేకిస్తుంటే వారినీ ఒప్పించే బాధ్యత తానే తీసుకుంటున్నాననీ కూడా జనసేనాని విస్పష్టంగా చెప్పేశారు. దీంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల జరగడం ఖాయమన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా సన్నాహాలు ప్రారంభించేసినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఇక జనసేనాని తన ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన వివరాలను కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. వచ్చే నెల 3 నుంచి తాను ఏపీలో నే ఉంటానని తేటతెల్లం చేయడం ద్వారా సినిమాలకు విరామం ఇచ్చేసినట్లేనన్న సంకేతాలిచ్చారు. దీంతో ముందస్తు ఎన్నికలకు సంబంధించిన స్పష్టమైన సమాచారం పవన్ కల్యాణ్ వద్ద ఉందని పరిశీలకులు అంటున్నారు.   మొత్తంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల  సెంట్రిక్ గానే పవన్  పొత్తులు, ముఖ్యమంత్రి పదవి గురించి తమ పార్టీ శ్రేణులకే కాకుండా అభిమానులకు కూడా ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వడం ద్వారా  పొత్తులపై అధికారిక ప్రకటన వచ్చే సమయానికి ఎటువంటి ఇబ్బందులూ, అసమ్మతులూ వెల్లువెత్తకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడ్డారన్న భావన రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నది. మొత్తం మీద పవన్ కల్యాణ్  పొత్తులు, పదవులు, సీట్ల పంపకం తదితర అంశాలపై ఇచ్చిన క్లారిటీ కారణంగా రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేనల పొత్తుకు ఒక సానుకూల వాతావరణాన్నీ, ఆ పొత్తుకు ఇరు పార్టీలే కాకుండా జనం సమ్మతిని ముందుగానే పొందే అవకాశం ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు. 

లెప్టినెంట్ గవర్నర్ పాలనా? ఢిల్లీ ప్రభుత్వ పాలనా?

  దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీ వంటి పాక్షిక రాష్ట్రానికి పరిపాలనలో తేడా ఉంటుంది. పార్లమెంటు ఆమోదంతో తయారైన చట్టాలు ఢిల్లీకి వర్తిస్తాయి. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల వలె ఢిల్లీ ముఖ్యమంత్రి పరిపాలన ఉండదు. దీనికి ప్రధాన కారణం ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం. చట్ట సభ ద్వారా అధికారంలో వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల వలె అధికారుల మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. అయితే ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్నికేంద్రం అణచి వేస్తుందా? మోదీ ప్రభుత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కంటి నిండా నిద్ర లేకుండా చేస్తున్నారా? వంటి ప్రశ్నలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తమ రాష్ట్ర పరి పాలనా వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఆరోపిస్తూ ఇవ్వాళ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ ప్రభుత్వానికి తగిన న్యాయం చేయాలని ఆయన అభ్యర్థించారు.  కేంద్ర పాలనలో ఉండే చిన్న ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం అంటారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ప్రాంత పాలన ఉంటుంది. ఇప్పటి వరకు దేశంలో ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. దిల్లీ, పుదుచ్చేరి, అండమాన్-నికోబర్ దీవులు, దాద్రా-నగర్ హవేలీ, చంఢీగర్, డామన్-డయ్యూ, లక్షదీవులు. కొత్తగా నిర్ణయించిన జమ్మూ కశ్మీర్, లద్ధాఖ్‌ యూటీలు కూడా ఏర్పడితే కేంద్ర పాలిత ప్రాంతాలు తొమ్మిది అవుతాయి. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కలిగి ఉన్న పరిపాలనా విభాగంగా రాష్ట్రాలను నిర్వచిస్తారు. ఇవి సొంతంగా చట్టాలను రూపొందించుకోవచ్చు. పారిపాలన కోసం ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఉంటుంది. చట్ట సభ ఉంటుంది. రాజ్యసభకు ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ, కేంద్ర పాలిత ప్రాంతం పాలన నేరుగా కేంద్ర చేపడుతుంది. శాసన సభ ఉన్న, లేని కేంద్రపాలిత ప్రాంతాలకు బేధం ఉంది.  దిల్లీ, పుదిచ్చేరి మాదిరిగా ఉన్న యూటీలకు శాసన సభ ఉంటుంది. ఎన్నుకున్న ఎమ్మేల్యేలు ఉంటారు. అయితే, ఎగువ సభ(విధాన సభ) ఉండదు. తుది నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటుంది. ఈయనను కేంద్రం నియమిస్తుంది. చట్టసభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఒక విధంగా పాక్షిక రాష్ట్రం అని చెప్పొచ్చు. లెఫ్టినెంట్ గవర్నర్ తమ ప్రభుత్వాన్ని వేధింపులకు గురి చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రధాన ఆరోపణ. చాలా కాలంగా ఈ వివాదం ఉంది. ఇవ్వాళ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సుప్రీం కోర్టు ను ఆశ్రయించే ఒక రోజు ముందు సుప్రీం ఆయనకు ఊరట కలిగించే ఆదేశాలు జారి చేసింది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి విశేష అధికారాలు ఉంటాయని ఈ ఆదేశాల ముఖ్య ఉద్దేశ్యం.   అధికారుల బదిలీలు, పోస్టింగ్ ల విషయంలో లెప్టినెంట్ గవర్నర్ జోక్యం బాగా పెరిగిపోయిందని కే జ్రీవాల్ మరొకసారి సుప్రీంను ఆశ్రయించారు. కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించడంతో కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఉండే అధికారాలు  ఎంతవరకు  అనే అంశంపై ప్రత్యేక చర్చకు అంకురార్పణ జరిగినట్టయ్యింది. 

కర్నాటక ఫలితాలపైనే కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ

కర్నాటక ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఒక లిట్మస్ టెస్టుగా  దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ భావిస్తున్నాయి. ఇందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ భావనలో కూడా మినహాయింపు లేదు. అందుకే కర్నాటకలో బీజేపీ సర్కార్ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకతను గుర్తించిన కమలం పార్టీ సున్నత అంశాలను హైలైట్ చేస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో  విజయం కోసం సర్వ శక్తులనూ ఓడ్డింది. పోలింగ్ పూర్తై ప్రజా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. శనివారం (మే13) ఫలితాలు వెలువడుతాయి. ఈ నేపథ్యంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో ఏ మాత్రం సంబంధం లేని బీఆర్ఎస్ ఈ రాష్ట్ర ఫలితాలపై ఎనలేని ఆసక్తి చూపుతోంది. జాతీయ రాజకీయాలలో తన ప్రస్థానం ఎలా సాగించాలన్న దానికి ఈ ఫలితాలను గీటురాయిగా బీఆర్ఎస్ తీసుకుంటోంది. కర్నాటకలో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీగా పోరు జరిగిందన్న అంచనాల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న పార్టీ కొద్ది నెలలో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో మరింత ఉత్సాహంతో దూసుకు వెళుతుంది. అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ గట్టిగా ఎదుర్కొనవలసిన పార్టీ కూడా అదే అవుతుంది. ఆ ఉద్దేశంతోనే కర్నాటక ఫలితాలపై బీఆర్ఎస్ అధినేత అమిత ఆసక్తి చూపుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా ఒక వేళ కర్నాటకలో హంగ్ అంటూ ఏర్పడితే.. అప్పుడు ఆ రాష్ట్రంలో ఎన్నికలలో పాల్గొనకపోయినా చక్రం తిప్పే అవకాశం దొరుకుతుందని కేసీఆర్ భావిస్తున్నారనీ, జేడీఎస్ ద్వారా కర్నాటక రాజకీయాలలో తానే కింగ్ మేకర్ గా అవతరించే అవకాశం లభిస్తుందన్నది కేసీఆర్ భావన. అదే జరిగితే బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలలో మరింత ప్రభావమంతంగా వ్యవహరించేందుకు గట్టి పునాది ఏర్పడినట్లేనని కేసీఆర్ అంచనాగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జాతీయ రాజకీయాలు సహా తెలంగాణలో మరో మారు అధికారాన్ని చేజిక్కించుకునేలా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి కూడా కర్నాటక ఫలితాలు ఒక గ్రౌండ్ ను ప్రిపేర్ చేస్తాయని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు.  

పరాన్న జీవి -ఆర్జీవి

రాముడిని, గోపాలుడిని కలిపి ఒకడిగా అవతరించిన రూపం రామగోపాలవర్మ. ఈయనను అందరూ అర్జీవీ అని పిలుచుకుంటారు. బహుశా ప్రపంచంలో  యింత కన్ఫ్యూజన్ క్యారెక్టర్ మరోకటి ఉండదేమో అనినిస్తుంది అర్జీవీని చూస్తే. అసలే కన్ఫ్యూజన్ లో ఉండే ఈ పెద్ద మనిషి అందరినీ కన్ఫ్యూజన్ లో పెట్టడంలో బిజీగా ఉంటాడు. అప్పుడెప్పుడో మూడున్నర దశాబ్దాల క్రితం ఒక సినిమా తీసి పాపులర్ అయిన రామ్ గోపాల్ వర్మ తన కెరీర్ ని కొంత కాలం కొనసాగించారు. టాలీవుడ్, బాలీవుడ్ లలో కొన్ని గొప్ప సినిమాలు తీసిన ఆర్జీవీ తరువాత తన విపరీత మనస్తత్వానికి పదును పెట్టాడు. సినిమాలు తప్ప అన్ని విషయాలపై తన మేధస్సును ప్రపంచానికి పంచే పని మొదలు పెట్టాడు.  మొదట్లో జనాలకు ఆయన ధోరణి నచ్చింది కానీ క్రమంగా విద్యావంతులు, ఆలోచనాపరులు ఆర్జీవీ వాదలను వ్యతిరేకించడం మొదలైంది. తన సినిమాలను చూడండని తానెప్పుడూ ప్రేక్షకులను కోరలేదని బోల్డ్ స్టేట్ మెంట్స్ ఇచ్చే రామ్ గోపాల్ వర్మ, తన పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను కూడా పాపులారిటీగా  తీసుకున్నాడు. చిరంజీవి, శ్రీదేవి లాంటి పెద్ద స్టార్లతో సినిమా మొదలు పెట్టి ఆపేసిన ఆర్జీవీ  తాను తీసిన సినిమాల కంటే ఆపేసినవే ఎక్కువ అని చెబుతుంటారు.  సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఏ విషయాన్నీ ఆర్జీవీ వదిలి పెట్టడం జరగదు. అలాగే రాజకీయాలలో ఎవరు ఎలాంటి  ప్రకటన చేసినా రామ్ గోపాల్ వర్మ నోరు విప్పక మానడు. రాంగోపాల్ వర్మ అంటే ఎందరికో వినోదం. కొందరికి అసహ్యం. కొద్ది మందికి అవసరం అనేది అందరికీ తెలిసిన అక్షర సత్యం. 2019 ఎన్నికల ముందు లక్ష్మీ పార్వతి కథతో సినిమా తీసి చంద్రబాబును ఇరుకున పట్టాలన్నా, పవన్ కల్యాణ్ ఏమి మాట్లాడినా దానిపై సెటైర్లు వేయాలన్నా అది రాంగోపాల్ వర్మకే సాధ్యం. ఆర్జీవీ చేసేప్రతి పనికీ ఒక ప్యాకేజీ ఉంటుందని సినీ పరిశ్రమలో చెప్పుకుంటారు. అడవి దొంగ వీరప్పన్ తనకు ఆదర్శం అని బాహాటంగా చెప్పే అర్జీవీ నిజ  జీవితంలో కూడా అలాంటి వ్యక్తులనే సమర్ధిస్తుంటాడు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి. సహజంగా పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యలు చేసిన వారిని ఆయన అభిమానులు వదిలిపెట్టరు, కానీ తాజాగా పవన్ కల్యాణ్ పై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు ఆగ్రహించినట్లుగా ఎక్కడా కనిపించలేదు. కారణం ఆర్జీవీని పట్టించుకోకపోవడమే సరైన జవాబు అని జనసేన భావించడమే  ఆ పార్టీ శ్రేణులు చెప్పడం ఆర్జీవీ ప్రస్తుత స్థితిని అద్దం పడుతోంది. 

దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హంగామా

వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో వచ్చిన బిఆర్ ఎస్ హాట్రిక్ కొట్టాలని తీవ్రంగా యత్నిస్తోంది. ఈ రెండు పర్యాయాలు డెవలప్ మెంట్,  వెల్ఫేర్ కార్యక్రమాలతో ప్రజలను అలరించినట్లు తెలంగాణ ప్రభుత్వం చెప్పకనే చెప్పబోతుంది. పట్టుమని పదేళ్లు నిండిన ప్రభుత్వానికి తగిన ప్రచారం అవసరమైంది. పదేళ్ల విజయోత్సవాలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు  ఈ మేరకు ఉత్తర్వులు జారి చేసింది.   తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. పదో వసంతంలోకి తెలంగాణ అడుగుపెడుతుంది. ఈ శుభసందర్భాన్ని పుర స్కరించుకొని దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జూన్ 2 నుంచి పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానాన్ని పదేళ్ల పండుగ సందర్భంగా ఘనంగా చాటేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు, దశాబ్దాల పోరాట చరిత్రను స్మరించుకునేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. కేసీఆర్ సర్కార్ ప్రాధాన్యత పథకాలు, వాటి ద్వారా ప్రజలకు కల్గిన ప్రయోజనాలను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చాటి చెప్పనున్నారు. రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రగతిపై విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు సాధించి విజయాలు, అమలు చేస్తున్న అభివృద్థి, సంక్షేమ పథకాలు, వినూత్న విధానాలు, ఇతర రాష్ట్రాలు, ఇంకా దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా మారిన తీరును ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకొని వెళ్లడానికి కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, ఇతర సంబరాలు కూడా ప్రభుత్వం నిర్వహించాలని భావిస్తోంది. ఇక వీటితో పాటు రాష్ట్ర రాజధానిలో ఓ భారీ బహిరంగ సభను కూడా సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కళాశాల మైదానం, ఎల్బీ స్టేడియం లలో ఏదో ఒక చోట భారీ సభ నిర్వహించేందుకు ఆలోచన చేస్తోంది. ఇక తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవాన్ని కూడా దశాబ్ది ఉత్సవాల్లోనే చేపట్టనున్నారు. అయితే ఈ కార్యక్రమాలపై అధికారుల కసరత్తు తరువాత ఎన్ని రోజులు వేడుకలు నిర్వహించాలి, ఏయే కార్యక్రమాలు నిర్వహిచాలన్న దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.

ఇమ్రాన్ ఖాన్ కు మరో ఊరట 

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో ఊరట లభించింది . నిన్న పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఇమ్రాన్ అరెస్ట్ పై సీరియస్ అయిన సంగతి తెలిసిందే . న్యాయస్థాన ప్రాంగణంలో  ఏకంగా 90 మందికి పైగా భధ్రతా సిబ్బంది జొరబడి అరెస్ట్ చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇవ్వాళ  తోషాఖానా కేసులో ఆయనకు ఇస్లామాబాద్ హైకోర్టు స్టే జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆయన శుక్రవారం కోర్టుకు హాజరు కాగా.. ఆయనపై చర్యలు తీసుకోకుండా కోర్టు ఇంజంక్షన్ ఉత్తర్వులను కూడా ప్రకటించింది. ఇమ్రాన్ పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేబట్టరాదని ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. ఈ కేసులో ఆయన దోషి అన్న ఉత్తర్వులు చెల్లవని కూడా పేర్కొంది. ఆయన అరెస్టు చట్టవిరుద్ధమని, ఆయనను తక్షణమే విడుదల చేయాలని పాక్ సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది.ఈ కేసులో ఆయన దోషి అన్న ఉత్తర్వులు చెల్లవని కూడా పేర్కొంది. ఆయన అరెస్టు చట్టవిరుద్ధమని, ఆయనను తక్షణమే విడుదల చేయాలని పాక్ సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. ఇస్లామాబాద్ హైకోర్టు బయట ఇమ్రాన్ ను పారామిలిటరీ బలగాలు అరెస్టు చేయడంపై మండిపడుతూనే.. ఆయన మద్దతుదారులు వెంటనే హింసాకాండకు స్వస్తి చెప్పాలని కూడా న్యాయమూర్తులు సూచించారు. తనను పోలీసులు టార్చర్ పెట్టారని, లాఠీలతో కొట్టారని ఇమ్రాన్ కోర్టులో వాపోయారు. రెండు కోర్టుల నుంచి కూడా తనకు ఊరట లభించడంతో 70 ఏళ్ళ ఇమ్రాన్ ఖాన్.. ఈ మధ్యాహ్నం తన పార్టీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్టు తెలుస్తోంది. పైగా ముందస్తు బెయిలు కోసం ఆయన ప్రయత్నించవచ్చునని వెల్లడయింది. కోర్టుల నుంచి తమ నేతకు ఉపశమనం లభించడంతో ఆయన మద్దతుదారులు హర్షం ప్రకటిస్తున్నారు.

ఆ జీవో ప్రాథమిక హక్కులకు భంగకరం

జగన్ సర్కార్ కు హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సభలూ, సమావేశాలూ నిర్వహించకుండా, రోడ్ షోలకు అవకాశం లేకుండా చేస్తూ తీసుకువచ్చిన జీవో నంబర్ వన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవో జారీ చేసినప్పుడే  ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమంటూ విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కడానికీ, విపక్ష పార్టీలను అణచివేయడానికే ఈ జీవో ను జగన్ సర్కార్ తీసుకువచ్చిందంటూ  అన్ని రాజకీయ పార్టీలూ, ప్రజాస్వామ్య వాదులూ ఈ జీవోను వ్యతిరేకించారు.   అప్పట్లో  చంద్రబాబు నిర్వహించిన రెండు వరుస సభల్లో తొక్కిసలాటలు జరిగాయి. ఆ తొక్కిసలాటలలో మరణాలు సంభవించాయి. అంతే ఆ రెండు సంఘటనలనూ సాకుగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద రాష్ట్రంలో సభలూ, సమావేశాలు, రోడ్డు షోలపై ఆంక్షలు విధిస్తూ జీవో నంబర్ 1 తీసుకు వచ్చేసింది. ఆ జీవోను అడ్డుపెట్టుకుని  అప్పట్లో చంద్రబాబు కుప్పం పర్యటనను సర్కార్ అడ్డుకుంది. తర్వాత ఆనపర్తిలోనూ చంద్రబాబు పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు కల్పించింది. యిదే జీవోను చూపుతూ  లోకేష్ పర్యటనపై ఆంక్షలు విధించింది. కాగా ఈ జీవోను కొట్టి వేస్తూ ఏపీ హైకోర్టు ఇది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు  విఘాతం కలిగించేదిగా ఉందని  పేర్కొంది.  జీవో నెం.1ను సవాల్ చేస్తూ  సీపీఐ నేత రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రోడ్ షోలను కట్టడి చేసేలా జీవో ఉందన్న పిటిషనర్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జీవో ఇచ్చారని పోలీస్ యాక్ట్ 30కు భిన్నంగా జీవో నెం.1 జారీ చేశారని రామకృష్ణ తరపు న్యాయవాది వాదించారు. ప్రజల ప్రాథమిక హక్కును హరించేలా జీవో ఉందని తన పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. వీటితో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. ఈ జీవో జారీ చేసినప్పుడు హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఆకారణంగా  ఈ పిటిషన్ ను అప్పుడు విచారించిన  వెకేషన్ బెంచ్ ఈ జీవోపై స్టే ఇచ్చింది.  తర్వాత విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ బెంచ్.. ఆ స్టేను పొడిగించడానికి నిరాకరిస్తూ,  తీర్పు రిజర్వ్ చేసింది.  చాలా కాలం పాటు తీర్పు ఇవ్వకపోవడంతో రామకృష్ణ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. త్వరగా తీర్పు ఇవ్వాలని హైకోర్టులోనే కోరాలని.. తీర్పు వచ్చే వరకూ స్టే ఇవ్వాలని హైకోర్టును కోరాలని పిటిషనర్ రామకృష్ణకు సుప్రీంకోర్టు సూచించింది.  ఇటీవల హోంశాఖపై సమీక్ష జరిపిన సీఎం జగన్ జీవో వన్ సమర్థంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఇప్పుడు హైకోర్టు ఆ జీవోను కొట్టివేసింది. 

రక్షణ కల్పించండి మహప్రభో.. మోడీ షాలకు రాజాసింగ్ లేఖ

గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ కు ఉగ్ర ముప్పు పొంచి ఉందా అంటే ఔననే అంటున్నారు ఆయన. ఈ మేరకు   ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు లేఖలు రాశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆ లేఖలో కోరారు. ఉగ్ర సంస్థల నుంచి తమకు ప్రాణముప్పు పొంచి ఉందని, భారీ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఇటీవల ఉగ్రవాద కార్యాకలాపాలకు పాల్పడుతున్నవారిని పోలీసులు పట్టుకున్న నేపథ్యంలో రాజా సింగ్  మోడీ,  షాలకు లేఖ రాయడం ప్రాధాన్యత  సంతరించుకుంది. హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించడంతో పాటు బాంబ్‌లతో తమపై దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నారనే విషయం తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని రాజాసింగ్ ఆ లేఖలో పేర్కొన్నారు.  ఇప్పటికే దేశ విదేశాల నుంచి తనను ఖతం చేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చిన విషయాన్ని ఆ లేఖలో రాజాసింగ్ ప్రస్తావించారు. తనకు భద్రత కల్పించాల్సిందిగా పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా  ఫలతం లేకపోయిందని పేర్కొన్నారు.  గతంలోనూ తన భద్రత విషయంపై మోదీ, అమిత్ షాలకు రాజాసింగ్ లేఖలు రాశారు.  ఇప్పుడు హైదరాబాద్‌లో ఉగ్రకదలికలు బయటపడిన నేపథ్యంలో రాజాసింగ్ మరోసారి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.  హైదరాబాద‌లో ఇటీవల ఉగ్రవావదుల కుట్ర కోణం బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తుండగా.. కీలక విషయాలు బయటపడుతున్నాయి. నగరంలో భారీగా ఉగ్ర దాడులకు నిందితులు ప్లాన్ చేసినట్లు తెలిసింది. నిందితులకు హిజబ్ ఉట్ తెహ్రిర్  (హెచ్ యుటి) సంస్థతో సంబంధాలున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో మరోసారి ఉగ్రవాద మూలాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లో ఐదుగురిని అరెస్ట్ చేసి భోపాల్‌కు తరలించారు. భోపాల్ ప్రత్యేక న్యాయస్థానం మే 19వ తేదీ వరకు నిందితులకు కస్టడీ విధించింది. ఉగ్ర దాడుల కోసం అడవుల్లో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఒకరితో మరొకరికి నేరుగా కాంటాక్టు లేకుండా డార్క్ వెబ్ ద్వారా సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది.

బీజేపీ కోర్టులో బంతి!

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది నానుడి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఆ నానుడికి అద్దం పట్టేవిగానే ఉన్నాయి.  నాలుగేళ్ల కిందట మైత్రీ బంధాన్ని తెంచుకున్న తెలుగుదేశం, జనసేనలు మళ్లీ దగ్గరయ్యాయి? ఏపీలో తెలుగుదేశంతో  జనసేన మైత్రి విషయంలో నిన్న మొన్నటి దాకా ఉన్న అనుమానాలూ, సందేహాలను పవన్ కల్యాణ్ పటాపంచలు చేసేశారు. అంతే కాదు.. తన మిత్రపక్షమైన బీజేపీని కూడా తమతో  అడుగులు వేసేలా ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నానని కూడా చెప్పారు.   జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ పొత్తుల విషయంలో క్లారిటీ యిచ్చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోమన్నతన మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.  అలాగే ఈ విషయంలో తనతో కలిసి రావాలని బీజేపీని కోరేందుకే ఢిల్లీ వెళ్లానని కూడా స్పష్టం చేశారు. బీజేపీతో  జనసేన అధికారిక పొత్తులో  ఉన్న సంగతి తెలిసిందే.  తాము టీడీపీతో వెళ్తామని బీజేపీని కూడా కలిసి రావాలని కోరుతున్నానని కూడా పవన్ విస్పష్టంగా  చెప్పారు.   ఓ వైపు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి టీడీపీతో కలిసి పని చేయాలనే సంకేతాలు ఇవ్వడం.. మరో వైపు చంద్రబాబు కూడా రిపబ్లిక్ టీవీ చానల్‌తో మాట్లాడుతూ ..మోదీకి పూర్తి మద్దతు ప్రకటించడంతో  ఏపీలో బీజేపీని కూడా తమతో కలుపుకునేందుకు యిటు తెలుగుదేశం, అటు జనసేనా కూడా ప్రయత్నాలు చేస్తున్నాయని తేటతెల్లమైపోయింది.   నిజానికి చంద్రబాబు ఎన్డీఏలో చేరుతారని గత ఏడాది నుంచి ప్రచారం జరుగుతోంది. రెండు సార్లు ఢిల్లీలో చంద్రబాబు మోదీని కలిశారు.  ఇప్పుడు పవన్ ప్రకటనతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.  పవన్ కల్యాణ్.. కలిసి వస్తే రావాలి లేకపోతే వైసీపీ విముక్త ఏపీ కోసం టీడీపీతో వెళ్తామని తేల్చేయడంతో  యిక యిప్పుడు ఎటు వైపు వెళ్లాలన్న విషయంలో బంతి బీజేపీ కోర్టులోనే ఉంది. రాష్ట్రంలో కనీసంలో కనీసం ఒక్క శాతం ఓటు షేరు కూడా లేని బీజేపీ.. ఏం నిర్ణయించుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.  

కేసీఆర్ పై రాములమ్మ ఫైర్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు సీనియర్ బిజేపీ నేత విజయశాంతి. పూర్వాశ్రమంలో బీఆర్ఎస్ లో  కేసీఆర్ వెంటే ఉన్న విజయశాంతి అదే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తో విభేధించి బయటకొచ్చారు. తల్లి తెలంగాణా పార్టీ స్థాపించి అప్పట్లో  క్రియాశీల రాజకీయాల్లో చురుకు పాల్గొన్నారు. తర్వాత బిజేపీ సిద్దాంతాలకు ఆకర్షితులై  ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో దూసుకొచ్చిన రాములమ్మ ఈ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ను ఓడించాలని కంకణం కట్టుకున్నట్టు కనబడుతోంది.  సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ మార్చ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ది అంతా దోపిడీ రాబడి అంటూ ఆరోపించారు. కేసీఆర్ మనసు క్రూరమైనదంటూ విమర్శించారు. కేసీఆర్ ఎగ్జామ్ పేపర్లన్నీ అమ్ముకుంటున్నారని.. కేసీఆర్ నీకు సిగ్గుందా.. నిరుద్యోగులు ఉసురు పోసుకున్నాడంటూ ఆరోపించారు. నీ కూతురు లిక్కర్ స్కామ్.. నీ కొడుకు పేపర్ లీక్ వీరుడు.. నువ్ దేశంలో ప్రతిపక్షాలకు డబ్బులు ఇస్తున్నావ్.. అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు విజయశాంతి. బండి సంజయ్ ని అక్రమంగా జైలులో పెట్టారన్నారు. మనుగోడులో డబ్బు, మద్యంతో గెలిచారని దుయ్యబట్టారు. ఒక్కో ఓటుకు రూ.5 వేలు ఇచ్చారని ఆరోపించారు. సచివాలయం ఆయన కోసమే కట్టారంటూ ఎద్దేవా చేశారు విజయశాంతి. ప్రతిపక్షాలకు అందులో అనుమతి లేదట అంటూ సెటైర్లు వేశారు. రూ.400 కోట్ల నుంచి రూ.1600 కోట్లకి సచివాలయం వ్యయం పెరిగిందన్నారు. 1200 కోట్లు ఎవరి ఇంట్లో నుంచి తెచ్చి కట్టారన్నారు. 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.. నిర్ణయం మీదే రాములక్క చెప్పిన నిజాలు గమనించాలన్నారు. ఆరు నెల్లోల కేసీఆర్ ని గద్దె దింపాలని సూచించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు తోడు దొంగలే అన్నారు. ఉమ్మడి మెదక్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాగా నొక్కుతున్నారని దుయ్యబట్టారు విజయశాంతి. ప్రస్తుతం విజయశాంతి లోకసభ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. మాజీ మెదక్ లోకసభ సభ్యురాలిగా పని చేసిన విజయశాంతికి  బిజెపి నుంచి టికెట్ కన్ఫమ్ అయినట్లేనని తెలుస్తోంది. ప్రస్తుతం బిఆర్ఎస్ ఎంపీ ఈ నియోజకవర్గం నుంచి కొత్త కోట ప్రకాశ్ రెడ్డి ఉన్నారు. ఆయన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో విజయశాంతికి పోటీ మీద బిఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. విజయశాంతిని ఓడించడానికి బలమైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్  కేసీఆర్ వెతుకుతున్నారు.