ఇస్లామిక్ తీవ్రవాదంతో పాటూ ఇండియన్ ఐటీపై దృష్టి పెట్టాడు!

ట్రంప్ సెగ మెల్ల మెల్లగా ఒక్కొక్కరికీ తగులుతున్నట్టు కనిపిస్తోంది. వైట్ హౌజ్ లో కాలుమోపపటంతోనే మెక్సికో పై బడ్డ ఆయన గోడ కడతానని అన్నంత పనీ చేశాడు. మెక్సికో సరిహద్దులో గొడ కట్టడం ప్రారంభించాలని ఆర్డర్ వేశాడు! అది చాలదన్నట్టు ఏడు దేశాల ముస్లిమ్ లను అమెరికాలోకి రానీయకుండా అడ్డుకున్నాడు. దాని వల్ల ఇంటా, బయటా వ్యతిరేకత వచ్చినా డోంట్ కేర్ అంటున్నాడు. సాక్షాత్తూ అటార్నీ జనరల్ ఆఫ్ అమెరికా తనని వ్యతిరేకిస్తే ఆమెని కూడా పోస్టులోంచి పేకాశాడు ట్రంప్. ఎన్నికల ముందు అన్నవన్నీ చేస్తూ చాలా మందికి వెన్నులో వణకు పుట్టిస్తున్నాడు. అలా ట్రంప్ హిట్ లిస్ట్ లో ఇండియన్ ఐటీ దిగ్గజాలు కూడా చేరియాపోయాయి...  అమెరికాలో ఉద్యోగాలు మొదట అమెరికన్స్ కే చెందాలి. ఇది ట్రంప్ ఎలక్షన్స్ టైంలో పదే పదే చెప్పిన మాట. అందుకోసం ఏం చేయాలో ట్రంప్ చేయటం మొదలెట్టాడు. హెచ్ వన్ బీ వీసాల జారీకి సంబంధించి నిబంధనలు మార్చేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమైంది. బిల్లు చట్ట సభ దాకా వెళ్లిపోయింది కూడా! తాజా హెచ్ వన్ బీ వీసాల బిల్లు అమోదం పొందితే ఇండియన్ ఐటీ కంపెనీలకు పెద్ద ఇబ్బందే వస్తుంది. హెచ్ వన్ బీ వీసా ఇచ్చేందుకు కనీస జీతం 60వేల డాలర్లుగా వుండేది ఇప్పటిదాకా. కాని, ట్రంప్ కొత్త నిర్ణయం మేరకు ఒక లక్ష ముప్పై వేల డాలర్లు అవ్వనుంది. అంటే డబుల్ సాలరీ పెంచాలన్నమాట. తమ పాత ఉద్యోగులకి అంతగా జీతాలు పెంచి కంపెనీలు వార్ని ఉద్యోగాల్లో వుంచుకుంటాయా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నే. ఒక వేళ ఆ కంపెనీలు భారీగా జీతాలు ఇచ్చి ఇండియన్స్ ని పెట్టుకోవద్దని నిర్ణయిస్తే చాలా మందికి ఉద్యోగాలు ఊడే అవకాశం వుంది. కాని, అదే సమయంలో నిజంగా అద్భుతమైన టాలెంట్ వున్న వారికి జీతాలు అమాంతం పెరిగిపోయి అభివృద్ధి కనిపించే ఛాన్స్ వుంది.  ట్రంప్ వీసాల జారీని క్లిష్టతరం చేయటం అమెరికన్స్ కి ఎంత వరకూ లాభిస్తుందో తెలియదుగాని ... లక్షలాది మంది మన వారు మాత్రం అమెరికాలో ఆశ్రయం పొందటం ఇక మీద కష్టమైపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇండియా నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఐటీ కంపెనీలు తమ బిజినెస్ ఫార్మాట్ మార్చుకోవాలి. ట్రంప్ నియమ, నిబంధనలు పాటిస్తూనే ఎట్లా కాస్ట్ కంట్రోల్ చేయోచ్చో గ్రహించాలి. ఆఫ్ట్రాల్, ప్రతీ సమస్యకూ ఏదో ఒక పరిష్కారం వుండే తీరుతుంది కదా...     

ఆర్దిక మంత్రుల చేతుల్లో బడ్జెట్ బ్రీఫ్ కేస్... ఆసక్తికర అంశాలేంటో మీకు తెలుసా?

బడ్జెట్ అంటే మాటలు కాదు. అదో ఫైనాన్షియల్ బాక్సింగ్! ఆర్దిక అంశాలతో కుస్తీ పట్టాలి. అదీ భారత్ లాంటి అతి పెద్ద దేశంలో బడ్జెట్ అంటే మరింత జటిలంగా వుంటుంది. వర్గాలు, ప్రాంతాలు, కులాలు, మతాలు, రాష్ట్రాలు .. ఇలా బోలెడు కోణాలు దృష్టిలో పెట్టుకుని కత్తి మీద సాము చేయాలి. అయితే, బడ్జెట్ లెక్కలన్నీ ఎవరు ఎక్కడ వేస్తారో మనకు తెలియదు. మనకు కేవలం పార్లమెంట్లో మంత్రిగారి ఉపన్యాసమే వినిపిస్తుంది. సుదీర్ఘంగా సాగే బడ్జెట్ ప్రసంగంలోని ప్రతీ మాటా పవర్ ఫుల్లే. ఏది ఏ రంగం మీద ప్రభావం చూపిస్తుందో చెప్పలేం. అయితే, అలాంటి మాటలన్నీ భద్రంగా దాచుకొచ్చేఆర్దిక మంత్రి చేతిలోని సూట్ కేస్ గురించి మీకు తెలుసా?      బడ్జెట్  ప్రతీ యేడూ మారిపోతుంటుంది. అలాగే, కొన్నేళ్లు కాగానే ఆర్దిక మంత్రి కూడా మారిపోతుంటాడు. కాని, దాదాపు డెబ్బై ఏళ్ల మన స్వతంత్ర భారత దేశంలో ఎప్పుడూ మారనిది ఈ బడ్జెట్ బాక్సే! మంత్రిగారు పార్లమెంట్లో ప్రవేశించే ముందు ఫోటోలకు ఫోజులిస్తారు. అప్పుడు ఆయన చేతిలో ఓ బాక్సో , లేదా లెదర్ సూట్ కేసో దర్శనమిస్తుంది! పార్టీ, నాయకుడు మారిపోతున్నా బడ్జెట్ పేపర్లను ఇలా బ్యాగ్ లో తేవటం మాత్రం మారటం లేదు. దీని వెనుక పెద్ద కహానీనే వుంది...    మనం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఇతరత్రా వ్యవస్థలన్నీ పాశ్చాత్య దేశాల నుంచే అరువు తెచ్చుకున్నాం. మన రూల్సు, రెగ్యులేషన్స్ అన్నీ అక్కడి నమూనాతో రూపొందించుకున్నవే. ఈ బడ్జెట్ బ్యాగ్ కూడా అలాంటిదే. బడ్జెట్ ను ఫ్రెంచ్ భాషలో బోగెట్టి అంటారు. ఆ పేరే ఇంగ్లీషులో బడ్జెట్ అయింది. ప్రపంచమంతా అదే వాడుతోంది. ఈ బడ్జెట్ ప్రెజెంట్ చేసేటప్పుడు అవసరమయ్యే భారీ మొత్తం పేపర్లు ఏదో ఒక పద్ధతిలో పార్లమెంటుకు తీసుకురావాలి కాబట్టి మొట్ట మొదట బ్రిటన్ ఆర్దిక మంత్రి 1860వ సంవత్సరంలో ఒక బాక్స్ ఉపయోగించారు. అప్పట్నుంచీ మంత్రులందరూ ప్రపంచ వ్యాప్తంగా అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. ఎక్కడో ఒకరిద్దరు సింపుల్ గా ఫైల్ లో పెట్టుకుని వచ్చి బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పటీకీ చాలా వరకూ మాత్రం ఒక పెట్టేగాని, లెదర్ బ్యాగ్ గాని వాడతారు. మన దేశంలో కూడా అదే జరుగుతోంది. 1947 నవంబర్ 26న తొలి సారి షణ్ముగం అనే మంత్రిగారు బడ్జెట్ బ్యాగ్ సంప్రదాయం మొదలు పెట్టారు. ఇప్పటికీ అరుణ్ జైట్లీ శకంలో కూడా అదే నడుస్తోంది.      మొదట్లో బ్రిటీషు వారు బడ్జెట్ పత్రాలను పెట్టెలో పెట్టుకుని తీసుకొచ్చే వారు. కాని, తరువాత ఇప్పుడంతా బ్యాగులకే సై అంటున్నారు. రెడ్,బ్రౌన్, బ్లాక్ కలర్ లెదర్ బ్యాగుల్లోనే ఆర్దిక మంత్రులు కెమెరాల ముందు ప్రత్యక్షమవుతున్నారు. అయితే, ఇప్పటి రాష్ట్రపతి, యూపీఏ హయాంలోని ఆర్దిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మాత్రం బాక్స్ తెచ్చేవారు! ఈ మధ్య కాలంలో ఇలా పెట్టె మోసుకొచ్చిన మరెవరూ లేరు!      ఫైనాన్స్ మినిస్టర్ చేతిలోని బడ్జెట్ బ్యాగ్ వల్ల జనానికి వచ్చే లాభ, నష్టాలు ఏవీ లేవు కాని... తరతరాలుగా అది అమాత్యుల చేతుల్లో వెలిగిపోతూ ఒక సంకేతంగా మారిపోయింది! దాన్ని చూడగానే దేశానికి బడ్జెట్ మూడ్ వచ్చేస్తుంది! 

వివాదపు నిప్పులో... ట్వీట్ల ఉప్పేస్తున్నారు!

సంజయ్ లీలా బన్సాలీపై దాడి జరిగింది. ఆయన తీస్తున్న రాణి పద్మావతీ చిత్రం షూటింగ్ టైంలో కొందరు రాజ్ పుత్ లు వెళ్లి గొడవ చేశారు. ఆ క్రమంలోనే వాళ్లలో ఒకరు బన్సాలీపై చేయి చేసుకున్నారు. అయితే, అదే సమయంలో సంజయ్ లీలా బన్సాలీ సెక్యురిటీ సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారని కూడా అంటున్నారు. ఏదీ ఏమైనా, ఒక దర్శకుడు అన్ని పర్మిషన్లు తీసుకుని చట్ట ప్రకారం షూటింగ్ చేస్తుంటే అక్కడికి వెళ్లి దౌర్జన్యం చేయటం ఖండించాల్సిన విషయం. ఆ పని చేసిన కర్ణి సేన అనే రాజ్ పుత్ సంఘం వారు శిక్షార్హులే...  సంజయ్ పై దాడిని ఖండించిన మనం రాజ్ పుత్ లు చెబుతున్నది ఏంటో కూడా వినాలి. వారు ఎంచుకున్న పద్ధతి తప్పైనా వారు ఆందోళన చెందుతోన్న కోణం తీవ్రమైనదే. సంజయ్ లీలా బన్సాలీ తన సినిమాలో రాజ్ పుత్ రాణి పద్మావతిగా దీపికా పదుకొనే నటిస్తుందని చెప్పాడు. అప్పుడు ఎవ్వరూ ఆందోళన చేయలేదు. తరువాత ఆయన తన రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ చిత్రాల హీరో రణవీర్ సింగ్ ని కూడా లిస్ట్ లో చేర్చాడు. దీపికా, రణవీర్లు హీరో, హీరోయిన్స్ అని కూడా ప్రచారం జరిగింది. కాని, సినిమాలో రణవీర్ చేస్తోన్న పాత్ర అల్లావుద్దీన్ ఖిల్జీ! అంటే, పద్మావతి, ఖిల్జీల మద్య రొమాన్స్ వుంటుందనే కదా అర్థం? దాడి జరిగినా కూడా ఇప్పటి వరకూ అల్లా వుద్దీన్ ఖిల్జీ, పద్మావతీ మధ్య రొమాన్స్ వుండదని సంజయ్ చెప్పలేదు... కార్టూన్ వేయటం దగ్గర్నుంచీ సినిమా తీయటం వరకూ అన్నీ భావ ప్రకటనా స్వాతంత్ర్యం కిందకే వస్తాయి. కాబట్టి బన్సాలీ తన సినిమాలో ఏమి చూపించినా తప్పు పట్టటానికి లేదు. చివర్లో సెన్సార్ కూడా వుంటుంది కాబట్టి వాళ్లు అన్నీ తరిచి చూసే బయటకి పంపుతారని ఆశించవచ్చు. కాని, అసలు సమస్య ఎక్కడంటే ఫ్రాన్స్ లో ప్రవక్త బొమ్మ ఒక మ్యాగజైన్ పైన అచ్చేస్తే కాల్పులు జరిగాయి. ప్రాణాలు పోయాయి. కాని, అంతటి దారుణమైన పరిణామాలు హిందువుల విషయంలో జరగవు. రాజ్ పుత్ లకు రాణి పద్మావతి ఆరాధ్య దైవం లాంటిది. ఆమె వేలాది మంది అంతః పుర స్త్రీలతో కలిసి అల్లా వుద్దీన్ ఖిల్జీకి దక్కకుండా ఆగ్నికి ఆహుతి అయింది. దీన్నే జౌహర్ అంటారు. ఈ సంప్రదాయంపై రాజస్తాన్ లో బోలెడన్ని చారిత్రక ఆధారాలున్నాయి. అలాంటి రాజ్ పుత్ ల జాతి ఆత్మగౌరవానికి సంబంధించిన కథనంపై సంజయ్ లీలా బన్సాలీ సృజనాత్మక స్వేచ్ఛ తీసుకోవటం వివాదానికి అసలు కారణం. రాజ్ పుత్ లు అనుమానిస్తున్నట్టు రాణి పద్మావతి, ఖిల్జీల మధ్య శృంగార సన్నివేశాలు లేకుంటే ఎంతో మంచిది. కాని, బన్సాలీ బాలీవుడ్ మార్కు పాటలు, డ్యాన్సులు ఆ రెండు పాత్రల మధ్య కల్పిస్తే అది కోట్లాది రాజ్ పుత్ లను దారుణంగా గాయపరచటమే అవుతుంది. హిందూ సమాజం సినిమాలు, పుస్తకాలు, బొమ్మలు వంటి వాటి మీద తీవ్రంగా ప్రతిఘటించదు. అందుకే, ఎప్పటికప్పుడు రాముడిపై విమర్శలు, దేవతల నగ్న చిత్రాలు, హిందూ మతాన్ని టార్గెట్ చేసే సినిమాలు వస్తూనే వుంటాయి. కాని, అలాంటి సందర్భాల్లో ఎవరో కొందరు బౌతిక దాడులకి తెగబడితే హిందూ టెర్రరిజమ్ అనే పదాల్ని సృష్టించి వాడుకలో పెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడులు చేస్తే టెర్రరిజమ్ హాజ్ నో రిలీజియన్ అని చెప్పే మేదావులే సంజయ్ బాన్సాలీపై చేయి పడగానే హిందూ ఉగ్రవాదులు అనేస్తున్నారు. అనురాగ్ కశ్యప్ లాంటి దర్శకుడు రెచ్చిపోయి ట్వీట్ చేశాడు. బాలీవుడ్ మొత్తం బాన్సాలీ వెనుకే నిలబడింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అయితే తన పేర్లోంచి రాజ్ పుత్ అనేది తీసేస్తానన్నాడు. ఈ ఓవర్ రియాక్షన్ సమస్యని మరింత జటిలం చేస్తున్నాయి. బన్సాలీపై దాడిని ఖండించి, న్యాయం కోరితే సరిపోతుంది. కాని, బాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్మాదంగా ట్వీట్స్ చేస్తున్నారు...  ప్రజాస్వామ్య దేశంలో సినిమాకు, సినిమా వాళ్లకు ఎంత స్వేచ్ఛ వుంటుందో అంతే బాధ్యత కూడా వుంటుంది. దాన్ని వాళ్లు గుర్తించి ఒక వర్గాన్ని రెచ్చిగొట్టే విధంగా పదే పదే ప్రవర్తించకుంటే హుందాగా వుంటుంది...        

కొత్త రాష్ట్రం సందట్లో... హోదా సడేమియాలు!

అనగనగా ఓ స్వామీజీ దొంగతనం మహాపాపం అన్న అంశంపై గొప్పగా ప్రవచనం ఇస్తున్నారు! వేలాది మంది తన్మయంగా విన్నారు! ఉపన్యాసం పూర్తయ్యాక బయటకి వచ్చి చూసుకుంటే చాలా మంది జేబుల్లోని పర్సులు మాయం అయ్యాయట! అక్కడ స్వామి వారు దొంగతనం చెడ్డ పని అని చెబుతోంటే... ఇక్కడ దొంగలు తమ చేతివాటం చూపారన్నమాట! నవ్యాంధ్రలో పరిస్థితి సదరు స్వామీ జీ సభలోలాగే వుంది! ఒకవైపు జనం కొ్త్తగా రాష్ట్రం ఏర్పడటం వల్ల వచ్చిన ఇబ్బందులన్నీ భరిస్తూ వుంటే... వెనక నుంచి తమ పని తాము చేసుకుపోతున్నారు ఆరితేరిన వారు! పైగా ఈ మొత్తం మోసానికి ప్రత్యేక హోదా ఉద్యమం అంటూ మాంచి గ్లామరస్ పేరు తగిలించారు. పదే పదే యువతను బురదలో దూకమంటూ గావు కేకలు పెడుతున్నారు... అక్కడెక్కడో జల్లికట్టు ఉద్యమం జరగగానే, ఇక్కడా, మోకాళ్లలో ఆలోచనలు మొదలయ్యాయి. అక్కడ బీచ్ పక్కన జనం కూడారు కాబట్టి ఇక్కడా ఓ బీచ్ వెదికారు. వైజాగ్ కు రమ్మన్నారు. మౌనపోరాటం అన్నారు. కొవ్వుత్తుల ప్రదర్శనన్నారు. హోదా రావాల్సిందేనన్నారు. కాని, జనానికి పిలుపునిచ్చిన వారు చెప్పందేంటంటే, జల్లికట్టు అమలు చేసుకోటానికి ఒక ఆర్డినెన్సు, ఒక బిల్లు చాలు. కాని, ప్రత్యేక హోదా అసాధ్యం. ఏపీకే కాదు ఏ రాష్ట్రానికి ఇకపై హోదాలుండవని కేంద్రం తేల్చేసింది. అయినా ఆనాడు వెంకయ్య అడిగాడు, మన్మోహన్ ఇచ్చాడు అంటూ రెచ్చగొడుతున్నారు మన హీరోలు, పొలిటికల్ హీరోలు! ప్రత్యేక హోదా ఇవ్వగలిగే అవకాశం వుంటే మోదీ సర్కార్ ఎప్పుడో ఇచ్చేది. కాని, ప్లానింగ్ కమీషన్ పోయి నీతి ఆయోగ్ వచ్చిన ప్రస్తుత తరుణంలో ప్రత్యేక హోదా గత చరిత్రే. ఇప్పుడు హోదా వున్న రాష్ట్రాలకి కూడా ముందు ముందు పోనుంది. ఇక హోదా ఇచ్చి తీరాల్సిందే అంటోన్న పవన్ , జగన్ ఆంధ్రా జనాలకి మరో వివరణ కూడా ఇచ్చుకోవాలి. ధశాబ్దాలుగా స్పెషల్ స్టేటస్ అనుభవిస్తున్న జమ్మూ, కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు ఏం అభివృద్ధి సాధించాయి? అక్కడికి పెట్టుబడులు ఎందుకు పోటెత్తటం లేదు? అలాగే, హోదా ఇవ్వకున్నా ప్యాకేజ్ వల్ల అనేక లాభాలు కలుగుతున్నాయి. వాట్ని కూడా వద్దని భీష్మించుకుంటే ఆ నష్టం ఎవరు పూడుస్తారు? హోదా ఇవ్వకుండా, ప్యాకేజ్ కూడా ఇవ్వకుంటే కేంద్రాన్ని ఎవరైనా ఏం చేయగలరు? ప్రత్యేక హోదా లాభాలు, సాధ్యాసాధ్యాల గురించి జనంలో స్పష్టమైన అవగాహన తీసుకురాకుండా సముద్ర తీరాన సందడి చేద్దామంటే వీలు కాదు. అంతకంటే మించీ నిరంతరం రాష్ట్రం గురించి మాట్లాడకుండా వున్నట్టుండీ ఊడిపడి ఉద్యమం చే్ద్దామంటే కూడా కుదరదు. వైజాగ్ లో జల్లికట్టు తరహా వీర పోరాటం అన్న పవన్ గాని, జగన్ గాని ఇప్పటికీ హైద్రాబాద్ లోనే వుంటున్నారు. ఏపీలో స్థిరపడిందీ లేదు. అమరావతిలో మకామూ లేదు. ఈ యువ నాయకులిద్దరూ యువతనైతే బీచ్ కి రమ్మన్నారుగాని తాము మాత్రం పూర్తి స్థాయిలో నవ్యాంధ్రకు రావటం లేదు. మరో వైపు, పవన్ కేవలం కేంద్రానిదే తప్పనట్టుగా మాట్లాడటం, జగన్ చంద్రబాబుది మాత్రమే నేరమన్నట్టు మాట్లాడటం కూడా వీళ్ల చిత్తశుద్దిని తేటతెల్లం చేస్తాయి. హోదా తేవటంలో ఎన్డీఏలో భాగస్వామి అయిన టీడీపీ విఫలమైందని పవన్ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా అనలేకపోయాడు. అదే రీతిలో జగన్ ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం మోదీ తప్పని ధైర్యంగా చెప్పలేకపోయాడు. ఇందులో ఎవరి ఇబ్బందులు వారివి! జనసేన పార్టీతో వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున రంగంలోకి దిగుదామని అనుకుంటోన్న పవన్ హోదా నినాదంతో జనంలో వుంటున్నాడు. కాని, పవన్ లాగే అప్పుడప్పుడూ ఉద్యమించే సినిమా వాళ్లు, మేధావులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు... ఎవ్వరూ కేంద్రంపై నిజంగా సీరియస్ గా వున్నట్టు కనిపించదు. తమకు వీలైనప్పుడు , ఖాళీ సమయం దొరికినప్పుడు హోదా అంటూ హోరు సృష్టిస్తున్నారు. మళ్లీ వారం తరువాత అంతా నిశ్శబ్దమే! ఇక పవన్ కంటే కాస్త బెటర్ గా హైద్రాబాద్ వదిలి వైజాగ్ ఎయిర్ పోర్ట్ దాకా వెళ్లిన జగన్ తనకు రాష్ట్ర హోదా కంటే స్వంత హోదానే ఎక్కువని చెప్పకనే చెప్పేశాడు! ఎయిర్ పోర్ట్ లో తానే కాబోయే సీఎం అంటూ బెదిరింపుకి దిగి ప్రత్యేక హోదా అసలు కారణమని కాదని తేల్చేశాడు! పవన్, జగన్ అభిమానులు తమ నేతలు హోదా రాదని తెలిసి కూడా మభ్యపెడుతున్నారని అంటే ఒప్పుకోకపోచ్చు. కాని, వారిద్దరికి నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే దాకా మీడియా ముందు వుండటానికి ఇది గొప్పగా ఉపయోగపడుతోంది. అలాగే, ప్యాకేజీకి ఒప్పుకొని ముందుకు సాగిపోతున్న చంద్రబాబు అనివార్య పరిస్థితి కూడా వారికి కలిసి వస్తోంది. సీఎం ప్యాకేజీ కూడా వద్దని మొండికేస్తే వచ్చేది కూడా పోతుంది రాష్ట్రానికి. అందుకే, ఎన్డీఏలోంచి బయటకి రావటం లేదు టీడీపీ. ఇటువంటి పరిస్థితుల్లో సహజంగానే ప్రతిపక్షాలకి కావాల్సినంత పని దొరుకుతుంది. హీరో శివాజీ ఉద్యమాలు మొదలు కేవీపీ ప్రవేశ పెట్టే ప్రైవేట్ బిల్లుల వరకూ అన్నీ ఈ కోవలోకే వస్తాయి. కాని, ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం అయిదేళ్లకోసారి జనం చేతిలోనే వుంటుంది. హోదా కోసం హోరు సృష్టిస్తున్న ఎవరెవరి హోదా ఏంటో ఓటర్లే నిర్ణయిస్తారు!       

శరణమంటోన్న ఏడు దేశాల ముస్లిమ్ లపై... రణమంటోన్న ట్రంప్!

  ట్రంప్ రానూ వచ్చాడు. పని మొదలు పెట్టాడు కూడా. కాని, ఇప్పటికీ చాలా మందికి ట్రంప్ ఇన్ వైట్ హౌజ్ అనే సత్యాన్ని జీర్ణించుకోటానికి సాద్యం కావటం లేదు! అసలు ఆయన తన స్వంత పార్టీలోనే నెగ్గుకు రాడని భావించిన వారు ఇవాళ్ల ఆయన అమెరికాని శాసిస్తుండటం, పనిలో పనిగా ప్రపంచాన్ని తనదైన స్టైల్లో ప్రభావితం చేస్తుండటం తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో ఫేస్బుక్ ఓనర్ మార్క్ జూకర్ బెర్గ్ చేరాడు! ట్రంప్ ఎన్నికలప్పుడు చెప్పిన మాటల్లో ప్రధానమైనవి ... మెక్సికో సరిహద్దులో గోడ. కొన్ని దేశల ముస్లిమ్ వలస జనం రాకుండా నిషేధం. ఈ రెండూ చేసేశాడు డొనాల్డ్. అదే ఇప్పుడు చాలా మందికి వెలక్కాయలా వుంది. మెక్సికో దేశాన్ని గట్టి కంట్రోల్ పెడతానన్న ట్రంప్ గోడ నిర్మాణం గురించి నానా హడావిడి చేస్తున్నాడు. అది చాలదన్నట్టు ఇరాన్, ఇరాక్, లిబియా, సిరియా లాంటి ఇస్లామిక్ దేశాల నుంచి అమెరికాకి వలస వచ్చే వారిపై నిషేదం విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశాడు!   ట్రంప్ ని మొదట్నుంచీ ముస్లిమ్ వ్యతిరేకిగా భావిస్తోన్న లిబరల్ అమెరికన్స్ కి ఇప్పుడు సీన్ క్లియర్ గా అర్థమైపోయింది. వారు భయపడ్డంతా నిజం చేస్తున్నాడు బిలియనీర్ బిజినెస్ మ్యాన్. అందుకే, ఫేస్బుక్ సీఈవో మార్క్ జూకర్ బెర్గ్ తన టైమ్ లైన్ పై అభిప్రాయం పంచుకున్నాడు. అమెరికా అంటేనే వలస వచ్చిన జనాల దేశమనీ... అలాంటిది ట్రంప్ కొత్తగా వలస వచ్చే వారిపై నిషేధాలు విధించటం తప్పని ఆయన అన్నాడు. ఎవరి వల్ల భద్రతకు భంగం కలుగుతుందో... వార్నీ గుర్తించాలి కానీ... అందర్నీ ఒకేగాటన కట్టి అమెరికాలోకి రానీయకపోవటం ప్రమాదకరం అన్నాడు. తన ముత్తాతలు ఆస్ట్రేలియా, జర్మనీ, పోలాండ్ నుంచి వచ్చారని, తన భార్య తల్లిదండ్రులు చైనా, వియత్నామ్ ల నుంచి వలస వచ్చారనీ చెప్పుకొచ్చాడు. ఒకవేళ అప్పుడే వలసలపై నిషేధం విధించి వుంటే తాము అమెరికాలో వుండే వారమే కాదని జూకర్ బెర్గ్ అన్నాడు! మార్క్ జూకర్ బెర్గ్ ఆదర్శవాదం బాగానే వుంది కాని ట్రంప్ ఎన్నికలో కీలకమైన హామీల్లో వలసల్ని నిరోధించటం కూడా ఒకటి. ఆయన తెగించి ముస్లిమ్ లను లోనికి రానివ్వనని అనటంతోనే ఆయన ఓటర్లు తనకి ఓట్లు వేశారు. ఇప్పుడు ట్రంప్ ఆ పని చేయకపోతే వారు అతడ్ని క్షమించరు. అందుకే, ట్రంప్ రోజుకో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో కలకలం రేపుతున్నాడు. ముందు ముందు ఈ చర్యల ఫలితం బాగున్నా, బాగాలేకపోయినా తీవ్రంగా వుండటం మాత్రం గ్యారెంటీ!   

మోదీని వెటకారం చేసే తొందర్లో యూఏఈ రాజకుమారుడ్నీ వదల్లేదు! 

పచ్చకామెర్ల సామెత ఒకటుంటుంది తెలుగులో. అది మనందరికీ తెలిసిందే. కాని, అసదుద్దీన్ ఓవైసీకి తెలుసో లేదో! ఎందుకంటే, అది ఆయనకి సూటైనంతగా మరెవరికీ సూట్ కాదు. ఆయనకు లోకమంతా ఆకుపచ్చగానే కనిపిస్తుంది. లేదంటే, ఆకుపచ్చ రంగుకి ఏదో పెను ప్రమాదం సంభవించినట్టు కాషాయ రంగులో కనిపిస్తుంది. ఇదీ మన హైద్రాబాద్ నవాబ్ గారి పరిస్థితి...  హైద్రాబాద్ లోనే ఎంఐఎం ఇప్పటి వరకూ ఓల్డ్ సిటీ దాటి న్యూ సిటీలోకి రాలేకపోయింది. కాని, ఆ మధ్య మహారాష్ట్ర ఎన్నికల్లో వచ్చిన కొద్దిపాటి విజయం తరువాత ఓవైసీ ఓవర్ గా ఎగ్జైట్ అవుతున్నారు. ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా తన గాలిపటం గుర్తు వేసుకుని వాలిపోతున్నాడు. బీహార్లో అదే ప్రయత్నం చేస్తే మనోడి గాలిపటం అక్కడి నితీష్, లాలూ ప్రసాద్ ల మాంజాల కోతని తట్టుకోలేకపోయింది. ఇప్పుడు యూపీలో ఎంఐఎం హంగామా మొదలైంది...  ఉత్తర్ ప్రదేశ్ లో భారీగా ముస్లిమ్ ఓటర్లు వుండటంతో ఓవైసీ పార్టీకి మంచి అవకాశం దొరికింది పోటీ చేయటానికి. పైగా అది ప్రజాస్వామ్య దేశంలో తప్పు కూడా కాదు. కాని, సమస్యల్లా ఓవైసీ తన ఓవర్ ఉత్సాహంతో ఏదేదో మాట్లాడేయటమే ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఆయన ఎప్పటిలాగే యూపీలో ఓ సభలో మాట్లాడుతూ మోదీని విమర్శించాడు. అందులో కొత్తేం లేదు కాని... ఈ సారి అసదుద్దీన్ ఎంచుకున్న అంశమే వివాదాస్పదంగా మారింది. తన ఓటు బ్యాంకు రాజకీయాలకు ఏకంగా అబుదాబీ నుంచి వచ్చిన గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథి యూఏఈ క్రౌన్ ప్రిన్స్ నే వాడుకున్నాడు! తన ఉపన్యాసం వినటానికి భారీగా పోగైన యూపీ ముస్లిమ్ ఓటర్లు ముందు ఓవైసీ మోదీని వెటకారం చేశాడు. ఆయన చేతులు ఉల్లాసంగా ఊపుతూ యువరాజుకి స్వాగతం పలికాడనీ, అది యోగా చేసినట్లు అనిపించిందని సెటైర్ వేశాడు. జనం చప్పుట్లు కొట్టడంతో రెచ్చిపోయి యూఏఈ రాజకుమారుడ్ని దాడి వాలా అన్నాడు. అంటే, గడ్డం వున్న ఆయన్ని... మోదీ తెరిచిన చేతులతో ఆలింగనం చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. కాని, విదేశం నుంచి వచ్చిన గడ్డం పెంచుకున్న వాడ్ని హత్తుకున్న ప్రధాని దేశంలోని గడ్డపోళ్లని ఎందుకు వాటేసుకోడని ప్రశ్నించాడు! మొత్తం మీద మోదీ ఈ దేశ ముస్లిమ్ లను వివక్షకు గురి చేస్తున్నాడని మరోసారి పాత ముచ్చటే చెప్పాడు ఓవైసీ...  మోదీ గురించి నెగటివ్ గా మాట్లాడటం వరకూ ఓకే. కాని, విదేశాల నుంచి వచ్చిన వీవీఐపీ సెలబ్రిటీని పట్టుకుని గడ్డం పెంచుకున్నవాడు అనటం ఏంటి? పైగా పాకిస్తాన్ కు మిత్ర దేశంగా వున్న అబుదాబీ మెల్లగా మనవేపు మొగ్గు చూపుతుంటే ఎంపీ అయినా ఓవైసీ వెటకారంగా మాట్లాడటం ఏంటి? యూఏఈలోని బుర్జ్ ఖలీఫాపై గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకం రంగుల్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఇది కొత్త పుంతలు తొక్కుతున్న భారత్, యూఏఈ సంబంధాలకు గొప్ప తార్కాణం. మరి ఇటువంటి సందర్భంలో ఓవైసీ చౌకబారు ఓటు బ్యాంకు మాటలు దేనికి సంకేతం? పాకిస్తాన్ కు పరోక్షంగా సాయపడటం తప్ప ఓవైసీ సాధించింది ఏముంది?  2002 నుంచీ మోదీని ముస్లిమ్ వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్న వాళ్లలో ఓవైసీ ఒకరు. అదే పంథా ముందు ముందు కొనసాగించినా ఫర్లేదు కాని ... అంతర్జాతీయంగా దేశానికి చెడ్డ పేరు తెచ్చే ప్రమాదకర విమర్శలు ఆయన మానుకుంటే చాలా మంచిది!      

ఉద్యమాల్లో... దేశ విద్రోహ ఊసరవెల్లులు!

  జల్లికట్టు... సంక్రాంతి పండగ అయిపోగానే యావత్ దేశం దృష్టిని  ఆకర్షించిన ఉద్యమం ఇది. తమిళ యువత స్వచ్ఛందంగా మెరీనా బీచ్ కి వచ్చి ఉద్యమాన్ని పొటెత్తించారు. అది చూసి ఇప్పుడు మన దగ్గర కూడా పవన్ , జగన్ హోదా కావాలంటూ ఫూల్ జోష్ లోకి వచ్చారు. అటు కర్ణాటకలో మంగళూర్ జనం తమ సంప్రదాయ క్రీడ కంబళ పై నిషేధం ఎత్తి వేయాలని సమరానికి దిగారు! అంతే కాదు, మన హైద్రాబాద్ ఎంపీ ఓవైసీ అయితే కోర్టు యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలని తీర్పు ఇస్తే జల్లికట్టు తరహాలోనే ముస్లిమ్ లు ఉద్యమిస్తారని వారెంట్ ఇచ్చేశాడు! మొత్తానికి దేశంలో ఎవర్ని చూసినా, ఎక్కడ చూసినా జల్లికట్టు జగడం గురించే ప్రస్తావన. దాని నుంచే ప్రేరణ!   కోర్టు తీర్పుపై ఆగ్రహంతో తమిళ జనం ఊగిపోవటం, కమల్ , రజినీ లాంటి స్టార్స్ కూడా జల్లికట్టుకు మద్దతు పలకటం అమాంతం ఆవేశాలు రగిల్చింది. పన్నీర్ సెల్వం ప్రభుత్వం కూడా గొడవెందుకని ఆర్జినె్న్స్ , బిల్లూ తెచ్చింది. కాని, పైకి జన విజయంలా కనిపిస్తోన్న జల్లికట్టుపై మొండిపట్టు ఉద్యమం లోలోన చాలా పెద్ద కుట్రే అని మెల్లమెల్లగా తెలుస్తోంది. మెరీనా బీచ్ ను సామాన్య జనం ముంచెత్తటానికి తమిళ పార్టీలు ఏవీ కారణం కావు. అయినా అక్కడికి వేలాదిగా, లక్షలాదిగా ప్రజలు వచ్చేశారు. వాళ్ల మధ్యలోనే సంఘ విద్రోహ శక్తులు, దేశద్రోహులు కూడా చొరబడ్డారని ఇప్పుడు నిఘా వర్గాలు అంటున్నాయి. సాక్షాత్తూ తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వమే అసెంబ్లీలో ఈ మాట ఒప్పుకున్నారు. కొందరు ఉసామా బిన్ లాడెన్ బొమ్మలు వాహనాలపై ప్రదర్శిస్తూ ర్యాలీలో పొల్గొనగా, మరికొందరు ప్రత్యేక తమిళ దేశం కావాలనీ, ఎల్టీటీఈ ప్రభాకరన్ మహానేత అని నినాదాలు చేశారట! ఇలాంటి ముసుగు వేసిన దుర్మార్గులే ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చే ప్రయత్నం కూడా చేశారు. గవర్నమెంట్ ఆర్డినెన్స్, బిల్లు తీసుకొచ్చాక కూడా వెనక్కి తగ్గకుండా ఇంకా కొనసాగించే ప్రయత్నం చేశారు. కావేరీ సమస్య, ముళ్ల పెరియార్ డ్యాం సమస్య కూడా పరిష్కరించాలని బీచ్ లో బైటాయించే కుట్ర చేశారన్నారు పన్నీర్ సెల్వం...   సోషల్ మీడియా పుణ్యమాని జనం ఏదో ఒకచోట గుమికూడటం ఇప్పుడు చాలా ఈజీ అయింది. అలాగే, మీడియా ప్రచారం వల్ల ఏది జరిగినా ముందుకన్నా సమాచారం వేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా నిర్భయ ఆందోళనలు మొదలు జల్లికట్టు కలకలం దాకా అన్నీ ప్రభుత్వాలకి సవాలుగా మారుతున్నాయి. ఇలాంటి ఉద్యమాలు ప్రజాగ్రహానికి సంకేతం కావొచ్చు. ప్రజాస్వామ్యంలో సరైనవే కావొచ్చు. కాని, దేశ ద్రోహ ముఠాలు సామాన్య జనం మధ్యలో చేరితే అది ఎంత మాత్రం అంగీకారం కాదు. మరీ ముఖ్యంగా, దేశ ఐక్య తని దెబ్బతీసే ఉగ్రవాదులు, వేర్పాటు వాదులు ఎక్కడ వున్నా అందరం వ్య తిరేకించాల్సిందే. ఎందుకంటే, మన భాషా, సంస్కృతి, ప్రాంతీయ ఉద్యమాలన్నిటికి భారతదేశ భద్రతే ప్రధానం. అది చెక్కు చెదరకుండా వుంటేనే ఏ ఉద్యమానికైనా అర్థం వుంటుంది. అలా కాకుండా దేశం ఉపద్రవం పాలైతే మిగతా చిన్నా చితక ఉద్యమాలకు  విలువే వుండదు. దీన్ని అర్థం చేసుకుని ముందు ముందు జనాన్ని రోడ్లపైకి రమ్మని పిలుపునిచ్చే నేతలు, సెలబ్రిటీలు , ఉద్యమకారులు అంతా జాగ్రత్తగా వుండాలి. మరో వైపు నిఘా సంస్థలు కూడా సోషల్ మీడియా శకంలో గతంలో కంటే మరింత చురుగ్గా వుండాలి. పరిస్థితి చేజారిపోయాక నియంత్రించటం హింసాత్మక పద్ధతులకి దారి తీస్తుంది..

ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే.... మోదీ పరిస్థితి ఇదీ!

నరేంద్ర మోడీ... బహుశా ఇప్పటి వరకూ ఇలాంటి ప్రధాని భారతశానికి లేనేలేరనే చెప్పొచ్చు! కారణం ఆయన అంత గొప్పవాడని కాదు. కాకపోతే, ఆయనకున్నంత బలమైన మద్దతు, బలమైన వ్యతిరేకత రెండూ ఎవ్వరికీ లేవనిపిస్తుంది చరిత్రలో! నెహ్రు, ఇందిరా లాంటి ఛరిష్మా కలిగిన ప్రధానులు గతంలో వున్నప్పటికీ కాంగ్రెస్ కు బలమైన ప్రత్యర్థులు లేని కాలమది. అలాగే, మీడియా ఇప్పటిలా విపరీతంగా యాక్టివ్ గా వున్న కాలం కూడా కాదు. ఇక సోషల్ మీడియా చర్చ అయితే అప్పట్లో వుండే అవకాశమే లేదు. కాని, మోదీ ఇన్ని వున్నా.. వాటన్నిట్ని తన మంచికే ఉపయోగించుకుని దేశంలోని మిగతా అందరు రాజకీయ నేతలకంటే ముందంజలో వుంటున్నాడు. తాజాగా వెలువడ్డ ఇండియా టుడే మూడాఫ్ ద నేషన్ సర్వే ఫలితాలు చూస్తే మనకు ఆ విషయం తెలిసిపోతుంది!     ఇప్పటి వరకూ మనకున్న గొప్ప నేతలకి అందరికీ అభిమానులు వుండేవారు. కాని, మోదీ ఏకంగా భక్తుల్ని సంపాదించుకున్నాడు. అందుకే, పార్లమెంట్ ఎన్నికల్లో స్వంత మెజార్టీతో పీఠం చేజిక్కించుకున్నాడు. అయితే, తాజా సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మోదీ మ్యాజిక్ తో 2014లో కంటే ఎక్కువ సీట్లు వస్తాయట. స్వంత మెజార్జీ 273సీట్లు సరిపోతాయి. కాని, బీజేపికి 300సీట్లు మోదీ సాధించి పెట్టిగలడని ఇండియా టు డే లెక్కగట్టింది!     బీజేపి ప్రభుత్వానికి సీట్లు గతంలో కంటే ఎక్కువ రావటానికి ప్రధాన కారణాలు మోదీ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలే! ఇంతకు ముందు ఏ ప్రధాని చేయని విధాంగా సర్జికిల్ స్ట్రైక్స్ చేయించిన నమో అంటే జనం గతంలో కంటే ఎక్కువ అభిమానం చూపుతున్నారట. సర్వేలో ప్రశ్నించిన వారందరిలో మొత్తం 58శాతం మంది పాకిస్తాన్ కు సరైన గుణపాఠం నేర్పామని భావించారట!       సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో బద్ధ శత్రువు పాక్ వుంది కాబట్టి జనం మోదీ వెంట నిలిచారనుకుంటే.. డీమానిటైజేషన్ కు సంబంధించి కూడా ప్రధాని ప్రతిపక్షాలపై పై చేయి సాధించారు. ఆయన చారిత్రక నోట్ల రద్దు నిర్ణయానికి 45శాతం మంది మద్దతు పలికారు. దాని వల్ల దేశం బాగుపడుతుందని 97నియోజక వర్గాల్లోని జనం అభిప్రాయపడ్డారు. ఇక ప్రధానిగా కూడా మోదీనే ఫస్ట్ ప్లేస్ లో వున్నారు. 65 శాతం మంది నరేంద్ర మోదీనే మళ్లీ పీఎం కావాలని కోరుకున్నారు. కేవలం 28శాతం మంది మాత్రమే రాహుల్ కి ఓకే అన్నారు.     సర్జికల్ స్ట్రైక్స్ నుంచి స్వచ్ఛ్ భారత్ దాకా , డీమానిటైజేషన్ నుంచి డిజిటల్ ఇండియా దాకా నమో నిర్ణయాలన్నిటికి పెద్ద ఎత్తున జనం నమోన్నమః అంటుండటం చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్డీఏకు ఢోకా లేదని క్లియర్ అవుతోంది. త్వరలో జరిగే ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా ఎన్నికల్లో కూడా కమలం వికసిస్తే ముందు ముందు మోదీ దూకుడు మరింతగా చూడవచ్చు!

పవన్ తన శత్రువులకి తానే అస్త్రాలందిస్తున్నాడా?

పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రత్యేక కళ్యాణ్ అయిపోయాడు! అసలు రాష్ట్ర విభజన సమయంలో ఎవ్వరూ పట్టించుకోని ప్రత్యేక హోదాను వెంకయ్య నాయుడు బలంగా ప్రస్తావించారు. ఎలాగో మన్మోహన్ చేత ఒప్పించి హామీ తీసుకున్నారు. తీరా ఇప్పుడు ఆ రోజు ఆయన ప్రయోగించిన మంత్రమే ... ఆయన మీదే తిరగబడుతోంది! ఇచ్చేద్దామంటే హోదా ఇచ్చే పరిస్థితులు ఢిల్లీలో లేవు. ఊరుకుందామంటే అమరావతిలో జనం మర్చిపోయేలా లేరు. ఈ స్థితికి ప్రధాన కారణం , ఒక విధంగా, పవన్ కళ్యాణ్ అని కూడా చెప్పుకోవచ్చు! పదే పదే హోదా నిప్పుని రాజేస్తున్నాడు జనసేనాని! రాబోయే ఎన్నికల వరకూ ఆయన జనాల్లో వుండటానికి ప్రత్యేక హోదా కంటే లాభసాటి అంశం మరొకటి లేదు. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకీ హోదా విషయంలో పవన్ను గట్టిగా ఎదుర్కొనే ఛాన్స్ కూడా లేదు..     ప్రత్యేక హోదా విషయంలో జగన్ కూడా పవన్ తో పాటూ క్రెడిట్ కొట్టేయాలని తాపత్రయపడుతున్నా సినిమా గ్లామర్ వల్ల పవన్ ఎక్కువ ఎంకరేజ్ మెంట్నే ఎంజాయ్ చేస్తున్నాడు. మీడియా వద్దన్నా పబ్లిసిటీ చేసి పెడుతోంది. యూత్ కూడా అవలీలగా ఆకర్షితులవుతున్నారు. కాని, సమస్యల్లా పవర్ స్టార్ మాటలు, వ్యూహంతోనే వస్తోంది. ఆయన ఏ క్షణం ఏం ట్వీట్ చేస్తాడో, ఎవర్నిటార్గెట్ చేస్తాడో అర్థం కాని పరిస్థితి తయారవుతోంది. పైగా వ్యక్తిగత విమర్శలతో ప్రత్యర్థులకి నోరు తెరిచే మంచి వెసులుబాటు అందిస్తున్నాడు. ఇందుకు ఆయన తాజా ప్రెస్ మీటే ఉదాహరణ...     పవన్ టీడీపీ ఎంపీ రాయపాటిని ఘాటుగానే విమర్శించాడు. సుజనా  చౌదరిని కూడా టార్గెట్ చేశాడు. వాళ్లు బ్యాంకులకి అప్పులు ఎగ్గొట్టారనీ, తమ వ్యాపార లాభాల కోసం రాష్ట్ర సంక్షేమాన్ని పక్కన పెడుతున్నారని అన్నాడు. దీనికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన రాయపాటి తమ సంస్థ బ్యాంక్ లకు అప్పు పడి వుందే తప్ప ఎగ్గొట్టలేదని తేల్చారు. పైగా తమకు కాంట్రాక్ట్ వచ్చింది కాంగ్రెస్ హయంలోనే కానీ, ఎన్డీఏ టైంలో కాదని చెప్పారు. మొత్తంగా పవన్ విమర్శల్ని తిప్పికొట్టి ఆయన్ని కార్నర్ చేశారు. ఇక పవన్ , రామ్  గోపాల్ వర్మల మధ్య కూడా పర్సనల్ వార్ మొదలైంది. ఎప్పుడూ పవన్ గురించి ఏదేదో ట్వీట్ చేసే రాము వైజాగ్ ఆర్కే బీచ్ ఉద్యమానికి ముందు రోజు పవర్ స్టార్ జిందాబాద్ అన్నాడు. తరువాతి రోజు మాత్రం పవన్ ప్రత్యక్షంగా వైజాగ్ కి రానేలేదని విమర్శించాడు. రామూ ఇలా ట్విట్టర్ లో పవన్ని మెచ్చుకోవటం, తిట్టటం కొత్తేం కాదు. కాని, ఈసారి పవన్ వాటిపై స్పందించటమే కొత్త కలకలం రేపింది...     ఎప్పుడూ వర్మని పట్టించుకోని పవన్ ఈ సారి మాత్రం ఆయన విమర్శలపై స్పందించాడు. కాని, ఆయన వేసిన ప్రశ్నకి జవాబు చెప్పకుండా వ్యక్తిగత అంశాలు మాట్లాడి పవన్ కాస్త పొరపాటే చేశాడు. పెళ్లైన కూతురున్న వర్మ పోర్నోగ్రఫీ చూస్తానని చెబుతాడు. ఆయన గురించి నేనేం మాట్లాడాలి అన్నాడు. ఇలా మాట్లాడటం ఆర్జీవీకి మంచి సందు దొరికేట్టుగా చేసింది. నేను ఆయన మూడు పెళ్లిల్ల గురించి ఎప్పుడూ మాట్లాడలేదంటూనే వర్మ కూడా పర్సనల్ విషయం పరోక్షంగా ప్రస్తావించాడు. ఆయన అలా మాట్లాడటం పూర్తిగా పవన్ చేసిన కామెంట్స్ వల్లేనని అందరూ ఒప్పుకుంటారు. పవన్ రామూ కూతుర్ని, పోర్నోగ్రఫిని చర్చలోకి తేవాల్సింది కాదు!     పవన్ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని , టీడీపీ ప్రభుత్వాన్ని అద్భుతంగా కార్నర్ చేస్తున్నాడు. కాకపోతే, ఆ క్రమంలో ఆయన చేసే కామెంట్స్ జాగ్రత్తగా చేస్తే బావుంటుంది. సాధ్యమైనంత వరకూ వ్యక్తిగత ఆరోపణలు చేయకుండా వుంటే బెటర్. అలాగే, ఉత్తరాది, దక్షిణాది అంటూ మాట్లాడటం, ఎంతకైనా తెగిస్తాం, వుంటే వుంటాం, పోతే పోతాం లాంటి ఆవేశపూరిత డైలాగ్స్ ఆయన స్థాయిలో వున్న వ్యక్తి నుంచి ఎంతైనా బాగోవు. పవన్ దీర్ఘ కాలం సాగే పంథాలో తనకు ప్రత్యర్థులు అనుకున్న వార్ని ఓపిగ్గా టార్గెట్ చేయాలి. అంతే తప్ప ఎంతగా ఆవేశపడి నోరు జారితే అంతగా ఆయన శత్రువులకి పైచేయి సాధించే అవకాశం దొరుకుతుంది....

కవిత కాళ్ల దగ్గర..మోకాళ్లపై కూర్చొన్న ఐఏఎస్

పవర్‌లో ఉన్న వారికి వంగి వంగి సాష్టాంగ నమస్కారం చేసేందుకు చోటా మోటా నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు పోటీ పడుతుంటారు..అధికార గణం కూడా ఇందుకు  మినహాయింపు కాదు..అయితే బయటకు మాత్రం ఈ విషయం తెలియకుండా జాగ్రత్తగా మెయింటెన్ చేస్తుంటారు.ఈ జాబితాలో సాధారణ అధికారులే కాదు ఐఏఎస్‌ అధికారులు కూడా ఉన్నారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండే ఐఏఎస్‌లు రాజకీయ నాయకుల చెప్పు చేతల్లో, వారి కాళ్ల దగ్గర మాత్రం ఉండకూడదు..     ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగిన గణతంత్ర దినోత్సవం సాక్షిగా ఇద్దరు అధికారులు ఐఏఎస్‌ల పరువు తీశారంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ శరత్ మాట్లాడుతూ జగిత్యాల 'ఖిల్లా’లో తొలి గణతంత్ర వేడుకలను నిర్వహించే అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారికి.. శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా అనడంతో సభలో కలకలం రేగింది.     ఇది జరిగిన కాసేపటికే మెట్‌పల్లి సబ్‌ కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఏకంగా గ్యాలరీలో ఉన్న సీఎం కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత దగ్గరికి వెళ్లి ఆమె ముందు మోకాళ్ల మీద కూర్చోని ముచ్చటించడంతో వేదికపై ఉన్న వారు, ప్రజలు అవాక్కయ్యారు. దీంతో నిన్న మొత్తం కలెక్టర్ శరత్..సబ్ కలెక్టర్ ముషర్రఫ్ అలీ వ్యవహారంపైనే అంతా చర్చించుకున్నారు. ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల్లా మారిపోయి ఐఏఎస్‌ అన్న పేరుకు తలవంపులు తీసుకొచ్చారంటూ కొందరు విమర్శిస్తున్నారు.

తల్లి కోసం తల్లడిల్లిన తనయుడి కథ....

    పద్మాలు బురదలో పుడతాయి! అయినా ఆ బురదంటిన పద్మాలకున్న ప్రత్యేకత మరే పుష్పాలకీ వుండదు! ఏటా ఇచ్చే పద్మా అవార్డుల వ్యవహారం కూడా అంతే! పద్మా అవార్డులు ఇచ్చేది బురద లాంటి రాజకీయాల నేపథ్యంలో. అయినా మరే ప్రైవేట్ అవార్డుకు లేనంతటి విలువ పద్మ శ్రీలు, పద్మ భూషణ్ లు, పద్మ విభూషణ్ లకు వుంటుంది. కాని, గత కొన్ని సంవత్సరాలుగా మన పద్మాలకు లాబీయింగ్ బురద మరీ దారుణంగా అంటుకుంటోంది. పద్మా అవార్డులు ప్రకటించగానే సదరు ప్రభుత్వం అవ్వి ఎందుకు, ఎవరికి, ఎటు నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా కట్టబెట్టిందో ఇట్టే చెప్పేయొచ్చు. బాలీవుడ్ నుంచి క్రికెట్ వరకూ అన్ని రంగాల్లోని తమ వారందరికీ ఉదారంగా పద్మాలు పంచి ఇప్పించుకునే వారు పలుకుబడి కలిగిన వారు! అందుకే, ఇప్పటికి కొందరు నిజమైన దేశ సేవకులకి కనీసం పద్మ శ్రీ కూడా రాలేదా అని మనం ఆశ్చర్యపోతుంటాం. అదే సమయంలో, ఈ మహానుభావుడికి కూడా పద్మా అవార్డు అంటగట్టేశారా.. అని నిర్లిప్తతకు గురవుతుంటాం. కాని, ఎట్టకేలకు ఈ సారి పద్మా అవార్డుల పంపకం కొత్త ఒరవడికి దారి తీసింది! ప్రభుత్వ పద్మాల్లోని గుర్తింపు పుప్పొడి... అర్హులైన భ్రమరాలకే దక్కింది! మోదీ సర్కార్ పద్మా అవార్డుల ప్రదానోత్సవాన్ని వినోదంగా కాక వినూత్నంగా మార్చింది. సిఫారసుల ద్వారా, లాబీయింగ్ ల ద్వారా కాకుండా జనాన్నే అర్హులైన వార్ని నామినేట్ చయమని కోరింది. పద్మాన్ని వెదక్కుంటూ పలుకుబడి గల వారు పరుగులు తీయటం కాకుండా... పద్మమే తనని పట్టుకోవటానికి అర్హులైన వార్ని అన్వేషిస్తూ బయలుదేరింది. దాని ఫలితమే ఈ సారి పద్మా అవార్డ్ లు పొందిన 89 మందిలో అత్యధికులు జనానికి ఎక్కువగా తెలిసిన వారు కాకపోవటం! మీడియా వార్ని చూసి వెర్రిక్కిపోకపోవటం! పాప్యులారిటీలో వారు తక్కువైనా... పాతాళం నుంచీ భ్రష్టుపట్టిన మన వ్యవస్థని నిశ్శబ్ధంగా సంస్కరిస్తూ వస్తున్న వారు. అందుకే, మోదీ సర్కార్ వాళ్ల పేర్లను అమోదించి శుభ సంప్రదాయానికి నాంది పలికింది. పద్మ శ్రీలు అందుకున్న ఈ యేటి శ్రీమంతుల్లో మన తెలుగు వాడు చింతకింది మల్లేశం. ఆయన ప్రస్థానం వింటే అతడ్ని వరించిన పద్మ శ్రీ ఎంతగా ధన్యత పొందిందో మనకు అర్థం అవుతుంది. అసలు ఎవరినైనా ఈ భూమ్మీద ఆవిష్కరించేది ఎవరు? అమ్మా! అమ్మే మనల్నందర్నీ ప్రపంచంలోకి తెస్తుంది. అలా తనని ఆవిష్కరించిన అమ్మ కోసం మల్లేశం తానో ఆవిష్కరణ చేశాడు. ఆయన ఏడేళ్లు కష్టపడి కనుగొన్న ఆ యంత్రం ప్రపంచ ప్రసిద్ధి చెందుతుందని ఆయన బహుశా అనుకుని వుండకపోవచ్చు. తనకి పద్మ శ్రీ అవార్డ్ తెచ్చిపెడుతుందని కూడా ఊహించి వుండకపోవచ్చు. కాని, ఒకప్పుడు అర్ధాంతరంగా స్కూల్ కూడా మానేసిన ఈ మల్లేశం తన అమ్మ పడుతున్న కష్టం చూసి చలించిపోయి సవాలుతో మల్ల యుద్ధం చేశాడు. చేనేత కార్మికులకి ఎంతో ఉపయోగకరమైన ఆసు యంత్రం తయారు చేశాడు....  ఆసు యంత్రం అంటే చీరలు తయారు చేసేటప్పుడు దారం ఆసుపోయటానికి ఉపయోగించే యంత్రం. మల్లేశం చిన్నతనంలో అతడి తల్లి రోజంతా ఆసు పోస్తుండేది. అంటే దారాన్ని మగ్గంపై అటు ఇటు తిప్పుతూ జాగ్రత్తగా చుట్టటం. రోజుకి 18వేల సార్లు, అంటే దాదాపు 25కిలో మీటర్ల మేర దారం చుట్టాల్సి వచ్చేది. ఇలా చేయటం వల్ల మల్లేశం తల్లి వేళ్లు నొప్పి పెడుతూ, భుజం పట్టేసి, కళ్ల చూపు మందగించి దారుణమైన ఇబ్బంది పడేది. ఆమె కాదు నేత కార్మికుల కుటుంబాల్లో ఇలా ఎందరో స్త్రీలు ఆసు పోస్తూ ఆయుష్షు ఖర్చు చేసుకునేవారు! చింతకింది మల్లేశం ఎందరో కొడుకుల్లాగే తన తల్లి కష్టాన్ని చూసి చింతించాడు. కాని, అక్కడితో ఆగకుండా ఆమె బాధ తగ్గించేందుకు సంకల్పం చేసుకున్నాడు. హైద్రాబాద్ వచ్చి పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఆసు పోయటానికి మెషిన్ సిద్ధం చేశాడు. అదీ అత్యాధునిక హంగులతో సామాన్య చేనేత కార్మికులు కొనలేనంత ఖరీదైందిగా కూడా తయారు చేయలేదు. ఏడేళ్లు కృషి చేసి పాతిక వేల రూపాయలతోనే యంత్రం సిద్ధం చేశాడు. దాని ఫలితమే... ప్రతీ రోజు 8గంటలు ఆసు పోయటానికి వెచ్చించాల్సిన మల్లేశం తల్లి లక్ష్మీ .... గంటన్నరలో రెండు చీరలు తయారు చేసేసేది. అదీ ఇతరత్రా పనులు చూసుకుంటూ ఏ ఒత్తిడి లేకుండా...  మల్లేశం తాను తల్లి కోసం తయారు చేసిన ఆసు యంత్రానికి ఆమె పేరే పెట్టుకున్నాడు. లక్ష్మీ యంత్రం అనే అన్నాడు. కాని, తాను చేసిన ఆవిష్కరణని లక్ష్మీ కటాక్షానికి మార్గంగా మాత్రం చూడలేదు. ఇప్పటికీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా యంత్రాలు తయారు చేస్తూ వేలాది మంది నేత కార్మికులకి తక్కువ ధరలో అందిస్తున్నాడు. అలా కాకుండా ఆయన తన యంత్రాన్ని కమర్షియల్ గా అమ్ముకుని వుంటే లక్షల్లో ఆదాయం వచ్చేది. అలా చేయకుండా పాతిక వేల యంత్రాన్ని 13వేలకే నేతన్నలకి అందిస్తున్నాడు! ఆవిష్కరణ చేయటం కన్నా ఎక్కువగా... మల్లేశంలోని ఈ సామాజిక బాధ్యతే ఆయనకి పద్మా అవార్డు దక్కేలా చేసింది! ఫోర్బ్స్ జాబితాలో కూడా చోటు దక్కేలా చూసింది! తెలంగాణలోని యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలో వున్న మారుమూల  శారాజీపేటకు చెందిన మల్లేశం కేవలం ఒక వస్త్రాలు నేసే యంత్రాన్ని కనుగొనలేదు. తనకు దక్కిన పద్మ శ్రీ సాక్షిగా... కాలమనే మగ్గంపై... దేశాభివృద్ధిని నేసే యంత్రాన్ని సిద్ధం చేశాడు! ఇలాంటి అమ్మ కోసం తపించే వారే... భరతమాతని కూడా సగర్వంగా నిలిపేది! 

ట్వీటు కాదు... నీ ఫైటు చూపించు ప‌వ‌న్‌..?

ఈమ‌ధ్య ట్విట్టర్ల‌లో అల‌జ‌డి రేపుతున్న రాజ‌కీయ నాయ‌కుడు ఎవ‌రంటే.. ఎవ్వ‌రైనా స‌రే - ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరే చెప్పాలి. మైకు ప‌ట్టుకోవ‌డం కంటే ట్వీట్ల కోసం కీ బోర్డుని ప‌ట్టుకొన్న‌దే ఎక్కువాయన‌. కానీ ఆ ట్వీట్లు మాత్రం ర‌స‌వ‌త్త‌రంగా ఉంటాయి. ఎవ‌రికి త‌గ‌లాలో వాళ్ల‌కే త‌గులుతాయి. జ‌నంలో, అభిమానుల్లో కావ‌ల్సినంత ఉత్తేజం వ‌స్తుంది. కానీ ఏం లాభం..?? అవ‌న్నీ చ‌ప్పున చ‌ల్లారి పోతుంటాయి. ఉద‌యం లేవ‌గానే మ‌రో ట్వీటు.. ఆన‌క ఇంకోటి.. అలా ట్వీట్లాయనం సాగిస్తున్నాడు ప‌వ‌న్‌. తాజాగా ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం గురించి ఎడ‌తెరిపి లేకుండా ట్వీట్లు చేస్తున్నాడు. విశాఖ‌బీచ్ కేంద్రంగా న‌డుస్తున్న ఉద్య‌మానికి ప‌వ‌న్ ట్వీట్లు ఒక ర‌కంగా ఆజ్యం పోశాయ‌నే చెప్పొచ్చు.      ఆంధ్రా జ‌నం విశాఖ‌వైపు చూడ్డానికి ప‌వ‌న్ ట్వీట్లు ప్ర‌ధాన కార‌ణ‌మ‌య్యాయి. అంతా బాగానే ఉంది. ఇప్పుడు విశాఖ‌లో నిర‌స‌న‌కు ప‌వ‌న్ వ‌స్తాడా, రాడా అనేది అనుమానంగా మారింది. వ‌స్తున్నా... అంటూ వ‌వ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌క‌టించ‌లేదు. అంటే ఈసారీ ట్వీట్ల‌తోనే స‌రిపెడుతున్నాడా?  ఫైట్ చేయ‌డానికి రాడా??  ఈసారీ ప‌వ‌న్ మొహం చాటేస్తాడా?  యువ‌త‌ర‌మంతా త‌మ శ‌క్తి కూడ‌బెట్టుకొని...విశాఖ తీరంలో స‌ముద్ర హోరుని మ‌రిపించేలా నినాదాలు అందించేందుకు స‌మాయాత్తం అవుతోంటే... ప‌వ‌న్ ఏసీ గ‌దుల్లో కూర్చుని ట్వీట్ల‌తో కాల‌క్షేపం చేస్తాడా?       ఇప్ప‌టి వ‌ర‌కూ ఇదే జ‌రిగింది. ఇక‌పై కూడా ప‌వ‌న్ ట్వీట్ల‌తో ప‌రిపెట్టేస్తానంటే కుద‌ర‌దు. ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా రాద‌న్న‌ది నిజం. నిజంగా ప‌వ‌న్ మాట‌ల్లో నిజాయ‌తీ ఉంటే, ప‌వ‌న్ నిజంగానే టీడీపీకీ అటు బీజేపీకి తొత్తు కాక‌పోతే... ఇప్పుడైనా జ‌నంలోకి రావాలి. ట్వీట్లు వ‌దిలి రియ‌ల్ ఫైట్ చూపించాలి.  ట్వీట్ల‌కు ఎక్కువ - పోరాటాల‌కు త‌క్కువ అన్న‌ట్టు హైద‌రాబాద్లోనే ఉండిపోతే... ఆంధ్ర జాతే కాదు.. యావ‌త్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ కూడా ప‌వ‌న్‌ని క్ష‌మించ‌రు గాక క్ష‌మించరు. రాష్ట్రానికి కేంద్రం స్పెష‌ల్ స్టేట‌స్ ఇవ్వ‌కుండా ఎంత అన్యాయం చేసిందో.. ప‌వ‌న్ కూడా అంతే అన్యాయం చేసిన‌ట్ట‌వుతుంది. ఈ నిజం ప‌వ‌న్ తెలుసుకొని.. ఉద్య‌మంలో పాల్గొంటే.. ముందుండి న‌డిపిస్తే అప్పుడే ప‌వ‌న్ నిజ‌మైన ప్ర‌జా నాయ‌కుడిగా ఎదిగిన‌ట్టు. మ‌రి ప‌వ‌న్ వ‌స్తాడా?  రాడా?  చూద్దాం. 

రాజ్యాంగం గురించి ఈ 15విశేషాలు చాలా మందికి తెలియకపోవచ్చు! 

  1. రాజ్యాంగం మూల ప్రతిని ఎవరు రాశారో తెలుసా? ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా అనే ఆయన స్వదస్తూరీతో అందంగా గ్రంథస్తం చేశారు. దాంట్లో ప్రతీ పేజీని శాంతినికేతన్ కు చెందిన కళకారులు అందంగా తీర్చిదిద్దారు! 2.హిందీలో, ఇంగ్లీషులో రాయబడ్డ భారత రాజ్యాంగం మూల  ప్రతుల్ని పార్లమెంటు లైబ్రెరీలో భద్రపరిచారు. అక్కడ వాట్ని ప్రత్యేకంగా హీలియం నింపిన పెట్టెల్లో సంరక్షిస్తుంటారు! 3. 448ఆర్టికల్స్, 12షెడ్యూల్స్ తో మొత్తం 25విభాగాలుగా వున్న మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దది! 4. రాజ్యాంగం రాయటానికి సరిగ్గా 2సంవత్సరాల 11నెలల 18రోజులు పట్టింది. డిసెంబర్ 9, 1946న మొదటి సారి రాజ్యాంగ రచన కోసం సభ్యులంతా సమావేశమయ్యారు.  5. రాజ్యాంగ రచన పూర్తయ్యాక అనేక చర్చల తరువాత మొత్తం 2వేల మార్పులు చేశారు అమోదానికి ముందు! 6. రాజ్యాంగం తుది రూపు దాల్చింది 26నవంబర్ 1949న. ఆ తరువాత రెండు నెలలకి, అంటే, 26జనవరి 1950న రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చింది. అదే నేడు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం! 7. చేతి వ్రాతతో రాసిన మూల రాజ్యాంగ గ్రంథంపై రాజ్యాంగ సభలోని మొత్తం 284 మంది సంతకాలు చేశారు. వారిలో 15మంది స్త్రీ సభ్యులు కూడా వున్నారు. 24జనవరి 1950న ఇది జరిగింది. ఈ సంతాకాల తరువాత రెండు రోజులకి, 26జనవరి 1950న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 8. భారత రాజ్యాంగ నిర్మాతలు ప్రపంచంలోని అనేక రాజ్యాంగాల నుంచి వివిధ అంశాలు తీసుకున్నారు. ప్రేరణ పొందారు. అందుకే, ఇంగ్లీషులో మన కాన్ స్టిట్యూషన్ని బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అంటుంటారు! 9. పంచవర్ష ప్రణాళికల గురించిన ప్రేరణ సోవియట్ రష్యా నుంచి స్వీకరించటం జరిగింది. అలాగే, ఆదేశిక సూత్రాలు అన్న అంశం ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. 10. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్నవి మన రాజ్యాంగపు ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు. ఈ ఆదర్శాల్ని ఫ్రెంచ్ విప్లవం నుంచి గ్రహించారు.  11. భారత రాజ్యాంగానికి వున్న ఉపోద్ఘాతానికి అమెరికా రాజ్యాంగంలో వున్న ప్రియాంబుల్ ప్రేరణ. అందులో లాగే '' WE THE PEOPLE ''అంటూ మొదలవుతుంది ప్రియాంబుల్ ఆఫ్ ఇండియా.  12. భారత రాజ్యాంగం పౌరులందరికీ ఇచ్చిన ప్రాథమిక హక్కులు కూడా అమెరికా రాజ్యాంగం నుంచే మన రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించారు. 13. 1978కి ముందు ఆస్తి హక్కు కూడా ప్రాథమిక హక్కుగా వుండేది. కాని, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని ప్రాథమిక హక్కుల జాబితాలోంచి తొలగించారు. 14. 67ఏళ్ల సుదీర్ఘ కాలంలో ప్రపంచపు అతి పెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగం వంద సార్లకు పైగా సవరించారు. అయినా కూడా మూలంలోని ముఖ్య ఉద్దేశాలు తప్పుదోవ పట్టకుండా జాగ్రత్తపడుతూ వచ్చాం. ఇంత విజయవంతంగా అమల్లో వున్న రాజ్యాంగాలు చాలా తక్కువ! 15. భారత రాజ్యాంగానికి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన కాలంలో తీవ్ర ప్రమాదం ఏర్పడింది. కాని, ప్రజలు, ప్రతిపక్షాల ఉధృత ఉద్యమాలతో మళ్లీ ప్రజాస్వామ్యం స్థిరంగా నిలబడగలిగింది.                 

'వాళ్ల'ని నమ్ముకున్న 'బాబు' నష్టపోతున్నారా?

ఎవ్వరూ ఓడించలేని భీష్ముడి బలహీనత శిఖండి! ద్రోణచార్యుడి బలహీనత కొడుకు అశ్వత్థామ! దుర్యోధనుడి చావుకి కారణం అతడి తొడ! కర్ణుడికి బోలెడు శాపాలు! ఇలా ఒక్కొక్కరికీ ఒక్కోటి వుంటుంది! ఇంతకీ ఇప్పుడు ఈ మహాభారతం ఎందుకంటారా? ఏం లేదు, నవ్యాంధ్ర కురుక్షేత్రంలో ఒంటి చేత్తో యుద్ధం చేస్తున్న మన సీఎం చంద్రబాబు అద్భుతంగా గెలిచే అవకాశం వున్నా ఒకప్పటి స్వంత బలహీనతతోనే మళ్లీ ఎన్నికల పద్మవ్యూహంలో చిక్కుకోనున్నారు అంటున్నారు విశ్లేషకులు! అందుక్కారణం తాజాగా చెలరేగిన వంశధార ప్రాజెక్టు నిరసనలే....   బాబు ఒకప్పుడు సమైక్యాంధ్రను తొమ్మిదేళ్లు గొప్పగా ఏలారు. బిల్ క్లింటన్ను భాగ్యనగరానికి రప్పించి సంచలనం సృష్టించారు. కాని, అలా ఒక వెలుగు వెలిగిన ఈ చంద్రుడు ఒకే ఒక్క కారణంతో ప్రతిపక్షంలో అమావాస్య చవిచూడాల్సి వచ్చింది. అదే పార్టీ నేతల్ని , కార్యకర్తల్ని కాకుండా అధికారుల్ని నమ్ముకోవటం! అప్పట్లో చంద్రబాబు ఏ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులపై ఆధారపడేవారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో సారి అలానే జరుగుతోందంటూ వాపోతున్నారు పార్టీలోని కింది స్థాయి నేతలు, ఇతరులు...   వంశధార ప్రాజెక్టుకు సంబంధించి జరగిన గొడవల్నే తీసుకుంటే ... ఎవరికైనా ఆశ్చర్యం, ఆందోళన కలుగుతాయి. ఏకంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి నిరసనకారులకి క్షమాపణ చెప్పారు. తాను ఎప్పుడో నష్టపరిహారం ఇవ్వమని చెప్పాననీ, అయినా అది అందనందుకు సారీ అని చెప్పారు బాబు! మరి రైతులకి సమయానికి డబ్బులు ఇవ్వకుండా రచ్చకంతటికీ కారణమైంది ఎవరు? అధికారులే!   శ్రీకాకుళంలో వంశధార ప్రాజెక్ట్ ని వేగంగా పూర్తి చేయాలని భావించిన చంద్రబాబు పోయిన సంవత్సరమే భూములు ఇచ్చిన రైతులకి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. అయినా అప్పట్నుంచీ ఇప్పటి దాకా, గత ఆరేడు నెలలుగా పైసా ఇవ్వలేదు జిల్లా కలెక్టర్ , ఇతర అధికారులు. పోనీ అక్కడ్నుంచి క్యాబినేట్లో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడన్నా చొరవ చూపారా అంటే అదీ లేదు. ఆయన కూడా కలెక్టర్, అధికారుల లాగే జనం గోడు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి ఇచ్చేయమని చెప్పిన నష్ట పరిహారాన్ని బ్యాంకుల్లో పడేలా చూడలేదు. ఫలితంగా సహనం నశించిన రైతులు ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తోన్న కంపెనీ ఆస్తులు తగలబెట్టి విధ్వంసానికి దిగారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పేదాకా విషయం వెళ్లింది...   వంశధార ప్రాజెక్ట్ కలకలం తరువాత చాలా మంది టీడీపీ నేతలు ఒకటే మాట చెబుతున్నారు. చంద్రబాబు మరోసారి అధికారులపై తీవ్రంగా ఆధారపడుతున్నారనీ, అందుకే వారు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఆయన పరిస్థితి విషమించక ముందే క్షేత్ర  స్థాయిలో నేతల్ని రంగంలోకి దింపితే ప్రజలకి నచ్చజెప్పటం తేలికవుతుందని అంటున్నారు. అలా కాకుండా మొత్తం అంతా అధికారుల చేతుల్లో పెట్టి, మంత్రులు పట్టించుకోక పరిస్థితి చేజారిపోయాక చేసేది ఏమీ వుండదంటున్నారు. బందరు పోర్టు కోసం జరిగిన భూ సేకరణ కూడా అధికారుల అలసత్వం వల్లే నానా యాగీ అయిందని చెబుతున్నారు.   ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి పనులు కోసం భూ సేకరణ అవసరం అయినప్పుడు ఆ బాధ్యత అధికారుల మీద కన్నా పార్టీ నేతల మీద పెడితే బావుంటుంది. ఈ విషయాన్ని చంద్రబాబు గ్రహించాలి. ఎందుకంటే, అధికారులు అయిదేళ్లకోకసారి జనం ముందుకి ఓట్ల కోసం వెళ్లరు. వారికి ప్రజల మెప్పు అవసరం లేదు. కాబట్టి సామరస్యంగా వ్యవహరిస్తారన్నా గ్యారెంటీ లేదు. కాని, రాజకీయ భవిష్యత్ కోరుకునే పార్టీ నేతలు తమ చుట్టూ వున్న స్వంత ప్రజలతో సాధ్యమైనంత స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తూ పని చక్కబెడతారు. అంతే కాదు, దీని వల్ల క్షేత్ర స్థాయిలో పార్టీ బలపడి జనంతో సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా వున్నాయి. సీఎంగారూ... పార్టీ అధ్యక్షుడిగా ఈ కోణంలోనూ కాస్త ఆలోచించండి!

సత్యసాయి గురించి అమెరికా ఎలా ఫీలైందో తెలుసా...

  ఈ మధ్య ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు పెట్టేస్తున్నారు! మనం ఏం చేస్తున్నా ఎక్కడ్నుంచి ఏ కెమెరా చూసేస్తందో అర్థం కాని పరిస్థితి. కాని, ఇప్పుడే కాదు ఎప్పుట్నుంచో ప్రపంచం మొత్తాన్ని ఓ కంట గమనిస్తోన్న సీక్రెట్ కెమెరా ఒకటుంది! అదేంటో మీకు తెలుసా? అమెరికా!   అమెరికన్ సీఐఏ దృష్టి పడని దేశం అంటూ ఈ భూమ్మీద లేదు ఆఫ్రికా పేద దేశాలు మొదలు అంటార్కిటికా మంచు జీవుల వరకూ అన్నీ, అందరూ అమెరికాకు అవసరమే. ఎవ్వర్నీ , దేన్నీ వదలకుండా తన ఏజెంట్లను పంపిస్తూ వుంటుంది అమెరికా. ఈ సీఐఏ ఏజెంట్లు మన ఇండియా లాంటి అతి పెద్ద దేశాన్నీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థని వదిలిపెడతారా? నో వే... అందుకు తాజా ఉదాహరణ కొన్ని డాక్యుమెంట్స్ రూపంలో బయటపడింది!   సీఐఏ మన దేశంపై దృష్టి పెడుతుందనేది బహిరంగ రహస్యమే. చైనా లాంటి కమ్యూనిస్ట్ కంట్రీలోనే దాని ఏజెంట్లు పని చేస్తుంటారంటారు. ఇక మన దగ్గర వుండటం ఆశ్చర్యం కాదు. అయితే, తాజాగా బయటపడ్డ పేపర్స్ లో అనూహ్యంగా సత్య సాయిబాబా పేరు వుంది! 1990 కాలం నాటి ఈ డాక్యుమెంట్స్ లో బాబా ప్రభావం తీవ్రంగా వుందని సీఐఏ ఏజెంట్ అమెరికాలోని హెడ్ క్వార్డర్స్ కి నివేదిక పంపాడు. సత్యసాయి చుట్టూ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతులైన భక్తులు పోగవుతున్నారని ఆయన అన్నాడు. దీని వల్ల ఒక కొత్త మతమే ఏర్పడ్డా ఆశ్చర్యం లేదని చెప్పాడు!   పుట్టపర్తిలో సత్యసాయి అన్ని మతాల వార్నీ ఆకర్షించటం మనకు తెలిసిందే. మతాలకతీతంగా సరికొత్త మతం ఆవిర్భవించవచ్చనే సీఐఏ కూడా అభిప్రాయపడింది. సత్యసాయి మహిమలు కూడా రచయిత చెప్పుకొచ్చాడు నివేదికలో. ఆయన ఆభరణాలు, విభూతి లాంటివి గాల్లోంచి తీయటం, లింగాలు సృష్టించటం లాంటివి చేస్తూ భక్తుల్ని ఆకర్షిస్తున్నారని అన్నాడు.అయితే, అదే నివేదికలో బాబా మహిమలు నిజం కాదని కాల క్రమంలో తేలితే కొత్త మతం మొత్తానికి మొత్తంగా కుప్పకూలవచ్చని కూడా చెప్పబడింది! చివరకు, ఇంచుమించూ అలాంటిదే జరిగింది. పుట్టపర్తి ఇప్పుడు ఒకప్పటిలా వెలిగిపోవటం లేదు...   కేవలం సత్యసాయి మీదే కాదు 1940 నుంచి దాదాపు అయిదు దశాబ్దాలు అమెరికా ఇండియాపై ఎలా నిఘా పెడుతూ వచ్చిందని తెలిపే అనేక అంశాలు ప్రస్తుతం బయటపడ్డ డాక్యుమెంట్స్ లో వున్నాయి! మరి ప్రస్తుతం సీఐఏ మన దేశంలో దేన్ని గమనిస్తోందో!

ఒక జాతీయ ప్రాంతీయ పార్టీ కథ! 

మన దేశంలో పార్టీలు రెండు , మూడు రకాలు... జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీలు వగైరా వగైరా. మనం ఏ పేరుతో పిలుచుకున్నా ఒక్క ఎంపీ సీటు సాధించే పార్టీలు మొదలు 273 సీట్లు స్వంతంగా సాధించే పార్టీల వరకూ అన్నీ మన దేశంలో వున్నాయి. అయితే, ఎన్ని వున్నా అతి పురాతన ఇండియన్ పార్టీ అయిన కాంగ్రెస్ ప్రత్యేకతే వేరు! ఒకప్పుడు అది మాత్రమే జాతీయ పార్టీ. తరువాత ఎన్నో జాతీయ పార్టీలు వచ్చినా తన సత్తా చాటుతూ వచ్చింది. కాని, ఇప్పుడు 44మంది ఎంపీలున్న ఒక జాతీయ ప్రాంతీయ పార్టీగా మారిపోయింది! ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో అదే విశేషంగా, విషాదంగా మారింది... రామచంద్ర గుహ అనే చరిత్రకారుడు కాంగ్రెస్ పక్షపాతిగా పేరుపడ్డ మేధావి. గాంధీ, నెహ్రులకు వీరాభిమాని అయిన ఆయన నేతాజీ జయంతి సందర్భంగా కోల్ కతాలో మాట్లాడాడు. అక్కడ ఆయన కాంగ్రెస్ గురించి ఏమన్నాడో తెలుసా? 2019లోనే కాదు 2024లో కూడా కాంగ్రెస్ మోదీ సర్కార్ ను ఓడించటం కాని పని అన్నాడు. అంతే కాదు, కాంగ్రెస్ పతనం ఇంకా కొన్నాళ్లు ఆలస్యమవ్వచ్చేమో కాని అది అనివార్యం అని కూడా జోస్యం చెప్పాడు! ఈ మాటలన్నీ అన్నది కాంగ్రెస్ మనిషిగా పేరుబడ్డ వ్యక్తే! బీజేపీ అభిమానో, ఆరెస్సెస్ మద్దతుదారో కాదు...  రామచంద్ర గుహ చెప్పినట్టు నిజంగానే కాంగ్రెస్ ఇప్పుడు జాతీయ స్థాయి ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. సాధారణంగా ప్రాంతీయ పార్టీలకు ఒకే రాష్ట్రంలో ఎంపీలు , ఎమ్మేల్యేలు వుంటారు. కాంగ్రెస్ కు కాస్త భిన్నంగా మణిపూర్ నుంచి కర్ణాటక వరకూ దేశ వ్యాప్తంగా అక్కడక్కడా ఎమ్మెల్యేలు , ఎంపీలు వున్నారు. అంతే తేడా. కాని, ఖచ్చితంగా లెక్కవేస్తే అన్నా డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీల కంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పెద్ద బలంగా ఏం లేదు. పార్లమెంట్లో అయితే కాంగ్రెస్ ది, అన్నా డీఎంకే, టీఎంసీలది ఇంచుమించూ సమాన స్థితి! అంతకంతకూ కొడగడుతోన్న కాంగ్రెస్ పార్టీకి తాజా నిదర్శనం యూపీలో పొత్తు.దేశంలోని అతి పెద్ద రాష్ట్రంలో 400సీట్లకుగానూ హస్తం పార్టీ పోటి చేస్తోంది 100మాత్రమే! అంటే ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్ వాదికి తోకగా వుండటానికి ఒప్పుకున్నట్టే అన్నమాట.సమాన హోదాతో  పొత్తు అయితే రెండు వందల సీట్లకు పైగా కాంగ్రెస్ పోటీ చేయాలి. కాని, అలాంటి పప్పులేం ఉడకవని అఖిలేష్ ఖరాఖండిగా చెప్పేశాడు! అసలు పొత్తే అక్కర్లేదన్నట్టు తన మానాన తాను అభ్యర్థుల్ని ప్రకటించేశాడు. దీంతో ఒంటరి పోరు చేస్తే అసలుకే మోసం అనుకున్న చేయి గుర్తు పార్టీ కాళ్ల బేరానికి వచ్చింది. ప్రియాంక రంగంలోకి దిగి మాట్లాడితే వంద సీట్లకు పొత్తు ఓకే అయింది! ఒకప్పుడు కాంగ్రెస్ తో ఇతర పార్టీలు పొత్తు పెట్టుకునేవి. ఇప్పుడు కాంగ్రెస్సే వివిధ పార్టీలతో పొత్తుకు తహతహలాడుతోంది. కాంగ్రెస్, లెఫ్టు పార్టీలు బీజేపి తప్ప మిగతా అన్ని పార్టీలతో జత కట్టి కాలం నెట్టుకొస్తున్నాయి. ఈ పొత్తులే లేకపోతే జాతీయ పార్టీలుగా చెలామణి అవుతోన్న కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడో ప్రమాదంలో పడేవి! ఇక క్రమంగా అంతరిస్తోన్న కాంగ్రెస్ దయనీయ పరిస్థితి ఆ పార్టీ నేతల మాటల్లోనే తెలిసిపోతోంది కూడా. ఉత్తర్ ప్రదేశ్ లో పొత్తు వర్కవుట్ కావటానికి ప్రియాంక కారణం అంటూ పెద్ద పెద్ద నేతలు పొగడ్తలు కురిపిస్తున్నారు. గాంధీల కారణంగా అధికారంలోకి రావటం మాట అటుంచి పొత్తులు కూడా అంత ఈజీగా కుదరని గడ్డు కాలం దాపురించింది. రాహుల్ వల్ల ఏమీ అవ్వకపోవటంతో ప్రియాంక రంగంలోకి దిగి అఖిలేష్ ను ఒప్పించిందనేది ఉత్తర్ ప్రదేశ్ లో బహిరంగ రహస్యం! బీహార్ ఎన్నికల్లో కూడా పైకి బీజేపి ఓడినట్టు కనిపించినా అసలు నష్టం కాంగ్రెస్ కి జరిగింది. అక్కడ కూటమిలో ముఖ్యమంత్రి తాలూకూ పార్టీ అయిన జేడీయూ ప్రధాన పార్టీ. కనీసం రెండవ పార్టీగా కూడా కాంగ్రెస్ లేదు. లాలూ ప్రసాద్ ఆర్జేడీ తరువాతి స్థానంలో కూటమిలో మూడో పార్టీగా సెటిలైంది! రాష్ట్రాల్లో అంతకంతకూ తోక పార్టీగా మారుతోన్న కాంగ్రెస్ ఇక మీదట కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అసాద్యమే. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప కాంగ్రెస్ గత వైభవం తిరిగి సాధించటం సాద్యం కాదు...       

ఉత్తరాది మీదకి వీస్తున్న దక్షిణాది ఉగ్ర పవనం!

మన సమాజంలో ఎందరో మేధావులు వుంటారు. ఒక్కో రంగంలో నిష్ణాతులైన వారు కూడా వుంటారు. వారందర్నీ వదిలేసి ఏదైనా చెప్పించాల్సి వస్తే ప్రభుత్వాలు సినిమా హీరోల దగ్గరికి పరుగుతీస్తాయి. ఎందుకని? సిగరెట్ కాల్చొద్దని చెప్పాలన్నా, స్వచ్ఛ్ భారత్ కోసం పాటుపడమని చెప్పాలన్నా... ఇలా ఏ పిలుపునివ్వాలన్నా సినిమా వాళ్లే కావాలి. కారణం వాళ్లకు జనంలో వుండే ఫాలోయింగ్! ఇక కమర్షియల్ యాడ్స్ సంగతైతే సరే సరి. సినిమా హీరోస్, హీరోయిన్స్ కి కోట్లు గుమ్మరించి తమ ప్రకటనలు చేయించుకుంటాయి కంపెనీలు. జనం మీద సినిమా వాళ్ల ప్రభావం అంతగా వుంటుంది... తెలుగు సినిమా సెలబ్రిటీల విషయానికొస్తే పవన్ ఖచ్చితంగా బోలెడు ఫాలోయింగ్ వున్న నటుడు. పవర్ స్టార్ పవర్ మనకు తెలియంది కాదు. అందుకే, గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపి పవన్ మద్దతు కోరి గట్టెక్కాయి. ఆయన సాయం కూడా చంద్రబాబు, మోదీ జంటకి కలిసొచ్చిందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. కాని, రెండు వైపుల పదునైన కత్తి లాంటి తన ఇమేజ్ ని, ఫాలోయింగ్ ని పవన్ కేర్ ఫుల్ గానే వాడుతున్నాడా? మరీ ముఖ్యంగా, ప్రత్యేక హోదా విషయంలో ఆయన స్పీచ్ లు, మాటలు, ట్వీట్స్ కొన్ని సార్లు ఆందోళనకరంగా వుంటున్నాయి...  ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనటంలో ఎలాంటి సందేహం లేదు. దాని కోసం పోరాటం చేయటం కూడా సబబే. కాని, మొదట్నుంచీ హోదా కావాలని డిమాండ్ చేస్తోన్న పవన్ మాత్రం తాజాగా వైజాగ్ నిరసనలకు మద్దతు పలికాడు. అందులో భాగంగా ట్వీట్స్ చేస్తూ ఉత్తరాది, దక్షిణాది చర్చ తీసుకొచ్చాడు. జనవరి 26న మౌన పోరాటం తలపెట్టిన యువతకి పవన్ అండగా నిలిచాడు. కాని, హోదా ఇవ్వాల్సింది ఢిల్లీ ప్రభుత్వం కాబట్టి ఉత్తరాది నాయకుల్ని టార్గెట్ చేశాడు...  మన దేశంలో ఇప్పటికే అనేక విబేదాలు, విద్వేషాలు వున్న మాట నిజం. మతం, కులం, ప్రాంతం, భాష వంటి అనేక కారణాలతో నిత్యం కొట్టుకు ఛస్తుంటారు భారతీయులు. వీటికి తోడు ఇప్పుడు ఉత్తరాది, దక్షిణాది భేదం తీసుకురావటం ఎందుకు అంటున్నారు కొందరు విమర్శకులు. హోదా ఇస్తామని ఇవ్వకపోవటం మోదీ సర్కార్ తప్పిదమే. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో నిజంగా లేనే లేనటువంటి ఉత్తరాది, దక్షిణాది ఫీలింగ్ ని జనాల్లో సృష్టించటం అనవసరం అంటున్నారు. అసలు ఢిల్లీ ప్రభుత్వాలు ఈ మధ్య కాలంలో దక్షిణాది రాష్ట్రాలకే కాదు ఉత్తరాది రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఇచ్చిందేం లేదు. నీతి ఆయోగ్ వచ్చాక దేశంలో ఎక్కడా ప్రత్యేక హోదా ఇవ్వటం అంటూ జరగదని చెబుతున్నారు. అయినా కూడా ఈ విషయంలో పవన్ ఉత్తరాది నాయకులు దక్షిణాదిని చులకనగా చూస్తున్నారని అనటం, పెద్దగా లాజికల్ కాదు... అప్పట్లో హిందీ వ్యతిరేక ఉద్యమాలు తమిళనాడులో జరగినప్పుడు ద్రవిడ, ఆర్య విభేదాలు పాటిస్తూ గొడవలు జరిగాయి. తరువాత క్రమక్రమంగా నార్త్, సౌత్ పీలింగ్ సమసిపోయింది. ఎక్కడో కొద్దిపాటి పక్షపాతం కొందరిలో వుందేమోగాని ఉత్తరాది నేతల వల్ల దక్షిణాది నష్టపోయేంత దారుణంగా మాత్రం పరిస్థితి లేదు.గ్లోబలైజేషన్ మొదలయ్యాక అయితే బోలెడు మంది తెలుగు వారు ఐటీ ఉద్యోగాల కోసం ఢిల్లీ, పూణే, ముంబై లాంటి నగరాల్లో మకాం వేశారు. ఎవ్వరికీ ఎక్కడా ఇబ్బందులు వుండటం లేదు. అంతే కాదు, పవన్ మాదిరిగా ఉత్తరాది, దక్షిణాది అంటూ ఆరోపణలు చేయటం కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణల్లో మనకు కనిపించవు. మరి పవన్ ఎందుకు ఈ విధంగా కొ్త్త విభేదం సృష్టించేలా మాట్లాడుతున్నాడు? బహుశా ఆయనకి సలహా ఇస్తున్న వారేమైనా తప్పుడు మాటలు చెబుతండవచ్చు.    భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న పవన్ మరీ ముఖ్యంగా యువతని దృష్టిలో పెట్టుకుని బాధ్యతయుతంగా మాట్లాడితే బావుంటుంది. ఆయన ఉద్దేశం ఏదైనా ఆంధ్రాలోని యూత్ కు నార్త్, సౌత్ విషయంలో లేనిపోని అపొహలు ఏర్పడితే అది దీర్ఘ కాలంలో మంచిది కాదు. పవర్ స్టార్ హోదాపైనే దృష్టి పెట్టి విమర్శలు చేస్తే బావుంటుందంటున్నారు విమర్శకులు...   

అక్కడ పందెం... ఇక్కడ పంతం!

మామూలుగా తమిళ సినిమాలు తెలుగులో రీమేక్ చేయటం మనం చూస్తుంటాం! ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే తమిళ ఉద్యమం కూడా మన నేటివిటికీ తగ్గట్టు రీమేక్ అవుతున్నట్టు కనిపిస్తోంది! అక్కడ చెన్నై. ఇక్కడ వైజాగ్. అక్కడ మెరీనా బీచ్. ఇక్కడ ఆర్కే బీచ్. అక్కడ యూత్. ఇక్కడా యూతే. ఇక ఒకే ఒక్క డిఫరెన్స్... అక్కడ జల్లికట్టు. ఇక్కడ ప్రత్యేక హోదా కోసం పట్టు! మిగతాదంతా సేమ్ టూ సేమ్! ఆంధ్రా జనం సీరియస్ గా తీసుకుని ప్రత్యేక హోదా కావాలంటుంటే తమిళ రీమేక్ సినిమాతో పోల్చటం ఏంటని ఎవరికైనా కోపం రావచ్చు. అయితే ఇక్కడ ఉద్దేశం ఉద్యమాన్ని వెటకారం చేయటం కాదు. కాని, ఉద్యమం ఆచరణ విషయంలోనే అనేక సందేహాలు కలుగుతున్నాయి. సోషల్ మీడియాలో అలా అలా పుట్టిన పిలుపు జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు కార్యరూపం దాల్చనుంది. మరి గణతంత్ర ఉద్యమానికి రణతంత్రం నడిపేది ఎవరు? ఎవరు లేకుండా స్వచ్ఛందంగా నిరసనలు జరగడం అంత తేలికేనా? తమిళనాడులో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా చర్చ జరగకుండానే సైలెంట్ గా ముంచుకొచ్చేసింది సునామీ. అందుకే, ప్రభుత్వం అలెర్ట్ అవ్వలేకపోయింది. సంక్రాంతి పూర్తికాగానే తమిళ జనం ఒక్క పెట్టున మెరీనా బీచ్ ని ముంచేశారు. కాని, ఇప్పుడు ఆంద్రాలో పరిస్థితి అలా లేదు. జనవరి 26న జనం పొటెత్తపోతున్నారని గవర్నెమంట్ కి తెలిసిపోయింది. కంట్రోల్ చేసే ఏర్పాట్లు చేసుకోకుండా వుంటుందా? కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రాలోని టీడీపీ గవర్నెమెంట్ పై తగిన ఒత్తిడి తేకుండా వుంటుందా? ఇటు జనం హోదా కోసం పట్టుబడితే, అటు సర్కార్ వాళ్లని వెనక్కి పంపే ప్రయత్నం చేస్తే సంఘర్షణ తప్పదు. ఇప్పుడు చెన్నైలో చెలరేగుతున్న హింస లాంటిదే వైజాగ్ లోనూ మనం చూడాల్సి రావచ్చు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగదని భరోసా ఎవరు ఇస్తారు? వచ్చిన యువతని నియంత్రించే నాయకులు ఎవరు? ట్విట్టర్ లో మద్దతు పలుకుతున్న పవన్ కళ్యాణ్ సహా తెలుగు హీరోలందరూ ఏ మేర ఉద్యమంలో పాల్గొంటారు? వారు చెప్పినా రోడ్లపైకి వచ్చిన జనం అసలు వింటారా? తెలంగాణ ఉద్యమం సమయంలో ఇలాగే ఉద్యమం మొదలై చివరకు ట్యాంక్ బండ్ పై విగ్రహాలు నేలకూలటం మనం చూశాం. అలాంటి ఉద్రిక్త పరిస్థితులు రాకుండా శాంతియుతంగా ప్రత్యేక హోదా ఉద్యమం జరగాలి. అప్పుడే కేంద్రంపై సరైన ఒత్తిడి పని చేస్తుంది. లేదంటే హింసాత్మక సంఘటనలు కారణంగా చూపి అణిచివేసే అవకాశాలే ఎక్కువ. ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన ఆంధ్రా జనం మరో కోణం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటికే హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం నక్సల్స్ పని అయ్యి వుండవచ్చని అనుమానిస్తున్నారు. రేపు పెద్ద ఎత్తున్న వైజాగ్ బీచ్ లో జనం చేరితే అక్కడికి సంఘ విద్రోహ శక్తులు చేరుకోవని గ్యారెంటీ ఏంటి? అసలు ఇలాంటి సాధ్యాసాధ్యాలు కాకుండా మూలానికి వెళితే... ఒక్క ప్రశ్న మనకు బలంగా ఎదురవుతుంది. జల్లికట్టు తమిళులకు భావోద్వేగాలకు సంబంధించిన సాంస్కృతిక అంశం. అందుకే, వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్ ద్వారా సుప్రీమ్ తీర్పును పక్కకు పెట్టే ప్రయత్నాలు చేశాయి. కాని, ప్రత్యేక హోదా పూర్తిగా ఆర్దిక అంశం. ఇక పై దేశంలోని ఏ రాష్ట్రానికీ హోదా వుండదని పార్లమెంట్ సాక్షిగా తేలిపోయాక ఢిల్లీ ప్రభుత్వం దిగి వస్తుందా? దీనిపై ఉద్యమకారులు లోతుగా ఆలోచించుకుని ముందుకు కదలాలి. ఎందుకంటే, రానున్నది విద్యార్థులకి అమూల్యమైన పరీక్షల కాలం. ఆ సమయంలో ఎంతో కష్ట సాధ్యమైన హోదా అంశాన్ని నెత్తికెత్తుకొని యువతని, విద్యార్థుల్ని రోడ్లపైకి తేవటం అనేక విధాల నష్టదాయకమే...

తక్షణం యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలంటోన్న తస్లీమా!

  జల్లికట్టు అనుకూల ఉద్యమాలు హిందూత్వవాదులకి చెంపపెట్టు! భవిష్యత్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలని చూస్తే అదే విధంగా బుద్ది చెబుతారు! ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? భారత పార్లమెంట్లో ఎంపీగా వెలిగిపోతోన్న హైద్రాబాదీ వీరుడు అసదుద్దీన్ ఓవైసీ. స్వయంగా బారిష్టర్ చదివిన ఆయన ఇంచుమించూ కోర్టు తీర్పు ఇచ్చినా తాము పట్టించుకోమన్నట్టు మాట్లాడాడు! ఓవైసీ ఉమ్మడి పౌరస్మృతికి నో చెబితే తాజాగా తస్లీమా నస్రీన్ మాత్రం అర్జెంట్ గా అమల్లోకి తేవాలని కోరింది! ఇస్లామ్ కి వ్యతిరేకంగా తాను రాసిన కవితలు, పుస్తకాల వల్ల ప్రస్తుతం ఆమె మాతృదేశం బంగ్లాదేశ్ ను విడిచి భారత్ లో వుంటోంది. గత ఇరవై ఏళ్లుగా ఇండియా, స్వీడన్, అమెరికా, యూరప్ లలో తస్లీమా తల దాచుకుంటుంది. అందుకు కారణం, ఆమె ఇస్లామ్ ను విమర్శించటమే. ఆ మతంలో వ్యవస్థాగతంగా స్త్రీలపై జరుగుతోన్న అరాచకాన్ని ప్రశ్నించటమే. తస్లీమాపై బంగ్లాదేశ్, ఇండియాల్లోని ఇస్లామిక్ ఛాందసవాదులు తీవ్ర ఆగ్రహంతో వున్నారు. ఫత్వాలు జారి చేసి ఆమె ప్రాణాలకే ముప్ప తల పెట్టారు. అందుకే ఆమె ఏళ్ల తరబడి విదేశీ ప్రభుత్వాల రక్షణలో సమయం వెళ్లదీస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న జైపూర్ లిటరరీ ఫెస్టివల్ లో అనూహ్యంగా తస్లీమా ప్రత్యక్షమైంది. ఆమె ఇంటర్వ్యూ గురించి నిర్వాహకులు ఎక్కడా ప్రచారం చేయలేదు. దాని వల్ల ఏ గొడవా లేకుండా తస్లీమా ఇంటర్వ్యూ జరిగింది. అందులో భాగంగా ఆమె భారత్ కి అర్జెంట్ గా యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరమన్నారు. హిందూ స్త్రీలు తప్పనిసరి అయితే స్వేచ్ఛగా తమ భర్తలకి విడాకులు ఇస్తున్నారనీ, ఆస్తిలో కూడా వాటా పొందుతున్నారని, ముస్లిమ్ మహిళలు మాత్రం అలాంటి హక్కులు లేకుండా అణిచివేయబడుతున్నారని ఆమె అన్నారు. ఇస్లామ్ లో ఆడవారి పరిస్థితి మెరుగుపడాల్సి వుందని వ్యాఖ్యానించారు. కాని, అలా జరగటం ముస్లిమ్ మత ఛాందసవాదులకి ఇష్టం లేదన్నారు. యానిఫామ్ సివిల్ కోడ్ ను సమర్థించిన తస్లీమా నస్రీన్ సెక్యులరిజమ్ పై కూడా కామెంట్స్ చేశారు. ఇస్లామిక్ మత చాందసవాదుల్ని వెనకేసుకు రావటం లౌకికవాదం అనిపించుకోదని ఆమె అన్నారు. ఈ అభిప్రాయాలన్నీ సహజంగానే ముస్లిమ్ నేతలకి, మత గురువులకి కోపం తెప్పిస్తాయి. కాని, తస్లీమా లాంటి అభిప్రాయమే చాలా మంది మితవాద, ఆధునిక ముస్లిమ్ లలో బలంగా వుంది. కాని, దాడులకి భయపడి, ఓటు బ్యాంక్ రాజకీయ నేతల మద్దతు కూడా లభించదనీ వారు మిన్నకుండిపోతున్నారు.  ప్రస్తుతం సుప్రీమ్ కోర్టులో విచారణలో వున్న యూనిఫామ్ సివిల్ కోడ్ అంశం త్వరలోనే తేలనుంది. కోర్టు అందరికీ ఒకే చట్టం వర్తించాలని తీర్పునిస్తే పెద్ద రగడే జరిగే అవకాశం వుంది. ఈ సమయంలో తస్లీమా మద్దతు యూనిపామ్ సివిల్ కోడ్ కోరుతున్న వారికి పెద్ద బలంగా మారే అవకాశం వుంది.