తల్లి కోసం తల్లడిల్లిన తనయుడి కథ....
posted on Jan 27, 2017 @ 12:13PM
పద్మాలు బురదలో పుడతాయి! అయినా ఆ బురదంటిన పద్మాలకున్న ప్రత్యేకత మరే పుష్పాలకీ వుండదు! ఏటా ఇచ్చే పద్మా అవార్డుల వ్యవహారం కూడా అంతే! పద్మా అవార్డులు ఇచ్చేది బురద లాంటి రాజకీయాల నేపథ్యంలో. అయినా మరే ప్రైవేట్ అవార్డుకు లేనంతటి విలువ పద్మ శ్రీలు, పద్మ భూషణ్ లు, పద్మ విభూషణ్ లకు వుంటుంది. కాని, గత కొన్ని సంవత్సరాలుగా మన పద్మాలకు లాబీయింగ్ బురద మరీ దారుణంగా అంటుకుంటోంది. పద్మా అవార్డులు ప్రకటించగానే సదరు ప్రభుత్వం అవ్వి ఎందుకు, ఎవరికి, ఎటు నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా కట్టబెట్టిందో ఇట్టే చెప్పేయొచ్చు. బాలీవుడ్ నుంచి క్రికెట్ వరకూ అన్ని రంగాల్లోని తమ వారందరికీ ఉదారంగా పద్మాలు పంచి ఇప్పించుకునే వారు పలుకుబడి కలిగిన వారు! అందుకే, ఇప్పటికి కొందరు నిజమైన దేశ సేవకులకి కనీసం పద్మ శ్రీ కూడా రాలేదా అని మనం ఆశ్చర్యపోతుంటాం. అదే సమయంలో, ఈ మహానుభావుడికి కూడా పద్మా అవార్డు అంటగట్టేశారా.. అని నిర్లిప్తతకు గురవుతుంటాం. కాని, ఎట్టకేలకు ఈ సారి పద్మా అవార్డుల పంపకం కొత్త ఒరవడికి దారి తీసింది! ప్రభుత్వ పద్మాల్లోని గుర్తింపు పుప్పొడి... అర్హులైన భ్రమరాలకే దక్కింది!
మోదీ సర్కార్ పద్మా అవార్డుల ప్రదానోత్సవాన్ని వినోదంగా కాక వినూత్నంగా మార్చింది. సిఫారసుల ద్వారా, లాబీయింగ్ ల ద్వారా కాకుండా జనాన్నే అర్హులైన వార్ని నామినేట్ చయమని కోరింది. పద్మాన్ని వెదక్కుంటూ పలుకుబడి గల వారు పరుగులు తీయటం కాకుండా... పద్మమే తనని పట్టుకోవటానికి అర్హులైన వార్ని అన్వేషిస్తూ బయలుదేరింది. దాని ఫలితమే ఈ సారి పద్మా అవార్డ్ లు పొందిన 89 మందిలో అత్యధికులు జనానికి ఎక్కువగా తెలిసిన వారు కాకపోవటం! మీడియా వార్ని చూసి వెర్రిక్కిపోకపోవటం! పాప్యులారిటీలో వారు తక్కువైనా... పాతాళం నుంచీ భ్రష్టుపట్టిన మన వ్యవస్థని నిశ్శబ్ధంగా సంస్కరిస్తూ వస్తున్న వారు. అందుకే, మోదీ సర్కార్ వాళ్ల పేర్లను అమోదించి శుభ సంప్రదాయానికి నాంది పలికింది.
పద్మ శ్రీలు అందుకున్న ఈ యేటి శ్రీమంతుల్లో మన తెలుగు వాడు చింతకింది మల్లేశం. ఆయన ప్రస్థానం వింటే అతడ్ని వరించిన పద్మ శ్రీ ఎంతగా ధన్యత పొందిందో మనకు అర్థం అవుతుంది. అసలు ఎవరినైనా ఈ భూమ్మీద ఆవిష్కరించేది ఎవరు? అమ్మా! అమ్మే మనల్నందర్నీ ప్రపంచంలోకి తెస్తుంది. అలా తనని ఆవిష్కరించిన అమ్మ కోసం మల్లేశం తానో ఆవిష్కరణ చేశాడు. ఆయన ఏడేళ్లు కష్టపడి కనుగొన్న ఆ యంత్రం ప్రపంచ ప్రసిద్ధి చెందుతుందని ఆయన బహుశా అనుకుని వుండకపోవచ్చు. తనకి పద్మ శ్రీ అవార్డ్ తెచ్చిపెడుతుందని కూడా ఊహించి వుండకపోవచ్చు. కాని, ఒకప్పుడు అర్ధాంతరంగా స్కూల్ కూడా మానేసిన ఈ మల్లేశం తన అమ్మ పడుతున్న కష్టం చూసి చలించిపోయి సవాలుతో మల్ల యుద్ధం చేశాడు. చేనేత కార్మికులకి ఎంతో ఉపయోగకరమైన ఆసు యంత్రం తయారు చేశాడు....
ఆసు యంత్రం అంటే చీరలు తయారు చేసేటప్పుడు దారం ఆసుపోయటానికి ఉపయోగించే యంత్రం. మల్లేశం చిన్నతనంలో అతడి తల్లి రోజంతా ఆసు పోస్తుండేది. అంటే దారాన్ని మగ్గంపై అటు ఇటు తిప్పుతూ జాగ్రత్తగా చుట్టటం. రోజుకి 18వేల సార్లు, అంటే దాదాపు 25కిలో మీటర్ల మేర దారం చుట్టాల్సి వచ్చేది. ఇలా చేయటం వల్ల మల్లేశం తల్లి వేళ్లు నొప్పి పెడుతూ, భుజం పట్టేసి, కళ్ల చూపు మందగించి దారుణమైన ఇబ్బంది పడేది. ఆమె కాదు నేత కార్మికుల కుటుంబాల్లో ఇలా ఎందరో స్త్రీలు ఆసు పోస్తూ ఆయుష్షు ఖర్చు చేసుకునేవారు!
చింతకింది మల్లేశం ఎందరో కొడుకుల్లాగే తన తల్లి కష్టాన్ని చూసి చింతించాడు. కాని, అక్కడితో ఆగకుండా ఆమె బాధ తగ్గించేందుకు సంకల్పం చేసుకున్నాడు. హైద్రాబాద్ వచ్చి పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఆసు పోయటానికి మెషిన్ సిద్ధం చేశాడు. అదీ అత్యాధునిక హంగులతో సామాన్య చేనేత కార్మికులు కొనలేనంత ఖరీదైందిగా కూడా తయారు చేయలేదు. ఏడేళ్లు కృషి చేసి పాతిక వేల రూపాయలతోనే యంత్రం సిద్ధం చేశాడు. దాని ఫలితమే... ప్రతీ రోజు 8గంటలు ఆసు పోయటానికి వెచ్చించాల్సిన మల్లేశం తల్లి లక్ష్మీ .... గంటన్నరలో రెండు చీరలు తయారు చేసేసేది. అదీ ఇతరత్రా పనులు చూసుకుంటూ ఏ ఒత్తిడి లేకుండా...
మల్లేశం తాను తల్లి కోసం తయారు చేసిన ఆసు యంత్రానికి ఆమె పేరే పెట్టుకున్నాడు. లక్ష్మీ యంత్రం అనే అన్నాడు. కాని, తాను చేసిన ఆవిష్కరణని లక్ష్మీ కటాక్షానికి మార్గంగా మాత్రం చూడలేదు. ఇప్పటికీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా యంత్రాలు తయారు చేస్తూ వేలాది మంది నేత కార్మికులకి తక్కువ ధరలో అందిస్తున్నాడు. అలా కాకుండా ఆయన తన యంత్రాన్ని కమర్షియల్ గా అమ్ముకుని వుంటే లక్షల్లో ఆదాయం వచ్చేది. అలా చేయకుండా పాతిక వేల యంత్రాన్ని 13వేలకే నేతన్నలకి అందిస్తున్నాడు! ఆవిష్కరణ చేయటం కన్నా ఎక్కువగా... మల్లేశంలోని ఈ సామాజిక బాధ్యతే ఆయనకి పద్మా అవార్డు దక్కేలా చేసింది! ఫోర్బ్స్ జాబితాలో కూడా చోటు దక్కేలా చూసింది!
తెలంగాణలోని యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలో వున్న మారుమూల శారాజీపేటకు చెందిన మల్లేశం కేవలం ఒక వస్త్రాలు నేసే యంత్రాన్ని కనుగొనలేదు. తనకు దక్కిన పద్మ శ్రీ సాక్షిగా... కాలమనే మగ్గంపై... దేశాభివృద్ధిని నేసే యంత్రాన్ని సిద్ధం చేశాడు! ఇలాంటి అమ్మ కోసం తపించే వారే... భరతమాతని కూడా సగర్వంగా నిలిపేది!