రాజ్యాంగం గురించి ఈ 15విశేషాలు చాలా మందికి తెలియకపోవచ్చు!
posted on Jan 25, 2017 @ 4:20PM
1. రాజ్యాంగం మూల ప్రతిని ఎవరు రాశారో తెలుసా? ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా అనే ఆయన స్వదస్తూరీతో అందంగా గ్రంథస్తం చేశారు. దాంట్లో ప్రతీ పేజీని శాంతినికేతన్ కు చెందిన కళకారులు అందంగా తీర్చిదిద్దారు!
2.హిందీలో, ఇంగ్లీషులో రాయబడ్డ భారత రాజ్యాంగం మూల ప్రతుల్ని పార్లమెంటు లైబ్రెరీలో భద్రపరిచారు. అక్కడ వాట్ని ప్రత్యేకంగా హీలియం నింపిన పెట్టెల్లో సంరక్షిస్తుంటారు!
3. 448ఆర్టికల్స్, 12షెడ్యూల్స్ తో మొత్తం 25విభాగాలుగా వున్న మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దది!
4. రాజ్యాంగం రాయటానికి సరిగ్గా 2సంవత్సరాల 11నెలల 18రోజులు పట్టింది. డిసెంబర్ 9, 1946న మొదటి సారి రాజ్యాంగ రచన కోసం సభ్యులంతా సమావేశమయ్యారు.
5. రాజ్యాంగ రచన పూర్తయ్యాక అనేక చర్చల తరువాత మొత్తం 2వేల మార్పులు చేశారు అమోదానికి ముందు!
6. రాజ్యాంగం తుది రూపు దాల్చింది 26నవంబర్ 1949న. ఆ తరువాత రెండు నెలలకి, అంటే, 26జనవరి 1950న రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చింది. అదే నేడు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం!
7. చేతి వ్రాతతో రాసిన మూల రాజ్యాంగ గ్రంథంపై రాజ్యాంగ సభలోని మొత్తం 284 మంది సంతకాలు చేశారు. వారిలో 15మంది స్త్రీ సభ్యులు కూడా వున్నారు. 24జనవరి 1950న ఇది జరిగింది. ఈ సంతాకాల తరువాత రెండు రోజులకి, 26జనవరి 1950న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
8. భారత రాజ్యాంగ నిర్మాతలు ప్రపంచంలోని అనేక రాజ్యాంగాల నుంచి వివిధ అంశాలు తీసుకున్నారు. ప్రేరణ పొందారు. అందుకే, ఇంగ్లీషులో మన కాన్ స్టిట్యూషన్ని బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అంటుంటారు!
9. పంచవర్ష ప్రణాళికల గురించిన ప్రేరణ సోవియట్ రష్యా నుంచి స్వీకరించటం జరిగింది. అలాగే, ఆదేశిక సూత్రాలు అన్న అంశం ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు.
10. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్నవి మన రాజ్యాంగపు ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు. ఈ ఆదర్శాల్ని ఫ్రెంచ్ విప్లవం నుంచి గ్రహించారు.
11. భారత రాజ్యాంగానికి వున్న ఉపోద్ఘాతానికి అమెరికా రాజ్యాంగంలో వున్న ప్రియాంబుల్ ప్రేరణ. అందులో లాగే '' WE THE PEOPLE ''అంటూ మొదలవుతుంది ప్రియాంబుల్ ఆఫ్ ఇండియా.
12. భారత రాజ్యాంగం పౌరులందరికీ ఇచ్చిన ప్రాథమిక హక్కులు కూడా అమెరికా రాజ్యాంగం నుంచే మన రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించారు.
13. 1978కి ముందు ఆస్తి హక్కు కూడా ప్రాథమిక హక్కుగా వుండేది. కాని, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని ప్రాథమిక హక్కుల జాబితాలోంచి తొలగించారు.
14. 67ఏళ్ల సుదీర్ఘ కాలంలో ప్రపంచపు అతి పెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగం వంద సార్లకు పైగా సవరించారు. అయినా కూడా మూలంలోని ముఖ్య ఉద్దేశాలు తప్పుదోవ పట్టకుండా జాగ్రత్తపడుతూ వచ్చాం. ఇంత విజయవంతంగా అమల్లో వున్న రాజ్యాంగాలు చాలా తక్కువ!
15. భారత రాజ్యాంగానికి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన కాలంలో తీవ్ర ప్రమాదం ఏర్పడింది. కాని, ప్రజలు, ప్రతిపక్షాల ఉధృత ఉద్యమాలతో మళ్లీ ప్రజాస్వామ్యం స్థిరంగా నిలబడగలిగింది.