ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే.... మోదీ పరిస్థితి ఇదీ!
posted on Jan 27, 2017 @ 3:56PM
నరేంద్ర మోడీ... బహుశా ఇప్పటి వరకూ ఇలాంటి ప్రధాని భారతశానికి లేనేలేరనే చెప్పొచ్చు! కారణం ఆయన అంత గొప్పవాడని కాదు. కాకపోతే, ఆయనకున్నంత బలమైన మద్దతు, బలమైన వ్యతిరేకత రెండూ ఎవ్వరికీ లేవనిపిస్తుంది చరిత్రలో! నెహ్రు, ఇందిరా లాంటి ఛరిష్మా కలిగిన ప్రధానులు గతంలో వున్నప్పటికీ కాంగ్రెస్ కు బలమైన ప్రత్యర్థులు లేని కాలమది. అలాగే, మీడియా ఇప్పటిలా విపరీతంగా యాక్టివ్ గా వున్న కాలం కూడా కాదు. ఇక సోషల్ మీడియా చర్చ అయితే అప్పట్లో వుండే అవకాశమే లేదు. కాని, మోదీ ఇన్ని వున్నా.. వాటన్నిట్ని తన మంచికే ఉపయోగించుకుని దేశంలోని మిగతా అందరు రాజకీయ నేతలకంటే ముందంజలో వుంటున్నాడు. తాజాగా వెలువడ్డ ఇండియా టుడే మూడాఫ్ ద నేషన్ సర్వే ఫలితాలు చూస్తే మనకు ఆ విషయం తెలిసిపోతుంది!
ఇప్పటి వరకూ మనకున్న గొప్ప నేతలకి అందరికీ అభిమానులు వుండేవారు. కాని, మోదీ ఏకంగా భక్తుల్ని సంపాదించుకున్నాడు. అందుకే, పార్లమెంట్ ఎన్నికల్లో స్వంత మెజార్టీతో పీఠం చేజిక్కించుకున్నాడు. అయితే, తాజా సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మోదీ మ్యాజిక్ తో 2014లో కంటే ఎక్కువ సీట్లు వస్తాయట. స్వంత మెజార్జీ 273సీట్లు సరిపోతాయి. కాని, బీజేపికి 300సీట్లు మోదీ సాధించి పెట్టిగలడని ఇండియా టు డే లెక్కగట్టింది!
బీజేపి ప్రభుత్వానికి సీట్లు గతంలో కంటే ఎక్కువ రావటానికి ప్రధాన కారణాలు మోదీ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలే! ఇంతకు ముందు ఏ ప్రధాని చేయని విధాంగా సర్జికిల్ స్ట్రైక్స్ చేయించిన నమో అంటే జనం గతంలో కంటే ఎక్కువ అభిమానం చూపుతున్నారట. సర్వేలో ప్రశ్నించిన వారందరిలో మొత్తం 58శాతం మంది పాకిస్తాన్ కు సరైన గుణపాఠం నేర్పామని భావించారట!
సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో బద్ధ శత్రువు పాక్ వుంది కాబట్టి జనం మోదీ వెంట నిలిచారనుకుంటే.. డీమానిటైజేషన్ కు సంబంధించి కూడా ప్రధాని ప్రతిపక్షాలపై పై చేయి సాధించారు. ఆయన చారిత్రక నోట్ల రద్దు నిర్ణయానికి 45శాతం మంది మద్దతు పలికారు. దాని వల్ల దేశం బాగుపడుతుందని 97నియోజక వర్గాల్లోని జనం అభిప్రాయపడ్డారు. ఇక ప్రధానిగా కూడా మోదీనే ఫస్ట్ ప్లేస్ లో వున్నారు. 65 శాతం మంది నరేంద్ర మోదీనే మళ్లీ పీఎం కావాలని కోరుకున్నారు. కేవలం 28శాతం మంది మాత్రమే రాహుల్ కి ఓకే అన్నారు.
సర్జికల్ స్ట్రైక్స్ నుంచి స్వచ్ఛ్ భారత్ దాకా , డీమానిటైజేషన్ నుంచి డిజిటల్ ఇండియా దాకా నమో నిర్ణయాలన్నిటికి పెద్ద ఎత్తున జనం నమోన్నమః అంటుండటం చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్డీఏకు ఢోకా లేదని క్లియర్ అవుతోంది. త్వరలో జరిగే ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా ఎన్నికల్లో కూడా కమలం వికసిస్తే ముందు ముందు మోదీ దూకుడు మరింతగా చూడవచ్చు!