వివాదపు నిప్పులో... ట్వీట్ల ఉప్పేస్తున్నారు!
posted on Jan 30, 2017 @ 4:15PM
సంజయ్ లీలా బన్సాలీపై దాడి జరిగింది. ఆయన తీస్తున్న రాణి పద్మావతీ చిత్రం షూటింగ్ టైంలో కొందరు రాజ్ పుత్ లు వెళ్లి గొడవ చేశారు. ఆ క్రమంలోనే వాళ్లలో ఒకరు బన్సాలీపై చేయి చేసుకున్నారు. అయితే, అదే సమయంలో సంజయ్ లీలా బన్సాలీ సెక్యురిటీ సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారని కూడా అంటున్నారు. ఏదీ ఏమైనా, ఒక దర్శకుడు అన్ని పర్మిషన్లు తీసుకుని చట్ట ప్రకారం షూటింగ్ చేస్తుంటే అక్కడికి వెళ్లి దౌర్జన్యం చేయటం ఖండించాల్సిన విషయం. ఆ పని చేసిన కర్ణి సేన అనే రాజ్ పుత్ సంఘం వారు శిక్షార్హులే...
సంజయ్ పై దాడిని ఖండించిన మనం రాజ్ పుత్ లు చెబుతున్నది ఏంటో కూడా వినాలి. వారు ఎంచుకున్న పద్ధతి తప్పైనా వారు ఆందోళన చెందుతోన్న కోణం తీవ్రమైనదే. సంజయ్ లీలా బన్సాలీ తన సినిమాలో రాజ్ పుత్ రాణి పద్మావతిగా దీపికా పదుకొనే నటిస్తుందని చెప్పాడు. అప్పుడు ఎవ్వరూ ఆందోళన చేయలేదు. తరువాత ఆయన తన రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ చిత్రాల హీరో రణవీర్ సింగ్ ని కూడా లిస్ట్ లో చేర్చాడు. దీపికా, రణవీర్లు హీరో, హీరోయిన్స్ అని కూడా ప్రచారం జరిగింది. కాని, సినిమాలో రణవీర్ చేస్తోన్న పాత్ర అల్లావుద్దీన్ ఖిల్జీ! అంటే, పద్మావతి, ఖిల్జీల మద్య రొమాన్స్ వుంటుందనే కదా అర్థం? దాడి జరిగినా కూడా ఇప్పటి వరకూ అల్లా వుద్దీన్ ఖిల్జీ, పద్మావతీ మధ్య రొమాన్స్ వుండదని సంజయ్ చెప్పలేదు...
కార్టూన్ వేయటం దగ్గర్నుంచీ సినిమా తీయటం వరకూ అన్నీ భావ ప్రకటనా స్వాతంత్ర్యం కిందకే వస్తాయి. కాబట్టి బన్సాలీ తన సినిమాలో ఏమి చూపించినా తప్పు పట్టటానికి లేదు. చివర్లో సెన్సార్ కూడా వుంటుంది కాబట్టి వాళ్లు అన్నీ తరిచి చూసే బయటకి పంపుతారని ఆశించవచ్చు. కాని, అసలు సమస్య ఎక్కడంటే ఫ్రాన్స్ లో ప్రవక్త బొమ్మ ఒక మ్యాగజైన్ పైన అచ్చేస్తే కాల్పులు జరిగాయి. ప్రాణాలు పోయాయి. కాని, అంతటి దారుణమైన పరిణామాలు హిందువుల విషయంలో జరగవు. రాజ్ పుత్ లకు రాణి పద్మావతి ఆరాధ్య దైవం లాంటిది. ఆమె వేలాది మంది అంతః పుర స్త్రీలతో కలిసి అల్లా వుద్దీన్ ఖిల్జీకి దక్కకుండా ఆగ్నికి ఆహుతి అయింది. దీన్నే జౌహర్ అంటారు. ఈ సంప్రదాయంపై రాజస్తాన్ లో బోలెడన్ని చారిత్రక ఆధారాలున్నాయి. అలాంటి రాజ్ పుత్ ల జాతి ఆత్మగౌరవానికి సంబంధించిన కథనంపై సంజయ్ లీలా బన్సాలీ సృజనాత్మక స్వేచ్ఛ తీసుకోవటం వివాదానికి అసలు కారణం. రాజ్ పుత్ లు అనుమానిస్తున్నట్టు రాణి పద్మావతి, ఖిల్జీల మధ్య శృంగార సన్నివేశాలు లేకుంటే ఎంతో మంచిది. కాని, బన్సాలీ బాలీవుడ్ మార్కు పాటలు, డ్యాన్సులు ఆ రెండు పాత్రల మధ్య కల్పిస్తే అది కోట్లాది రాజ్ పుత్ లను దారుణంగా గాయపరచటమే అవుతుంది.
హిందూ సమాజం సినిమాలు, పుస్తకాలు, బొమ్మలు వంటి వాటి మీద తీవ్రంగా ప్రతిఘటించదు. అందుకే, ఎప్పటికప్పుడు రాముడిపై విమర్శలు, దేవతల నగ్న చిత్రాలు, హిందూ మతాన్ని టార్గెట్ చేసే సినిమాలు వస్తూనే వుంటాయి. కాని, అలాంటి సందర్భాల్లో ఎవరో కొందరు బౌతిక దాడులకి తెగబడితే హిందూ టెర్రరిజమ్ అనే పదాల్ని సృష్టించి వాడుకలో పెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడులు చేస్తే టెర్రరిజమ్ హాజ్ నో రిలీజియన్ అని చెప్పే మేదావులే సంజయ్ బాన్సాలీపై చేయి పడగానే హిందూ ఉగ్రవాదులు అనేస్తున్నారు. అనురాగ్ కశ్యప్ లాంటి దర్శకుడు రెచ్చిపోయి ట్వీట్ చేశాడు. బాలీవుడ్ మొత్తం బాన్సాలీ వెనుకే నిలబడింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అయితే తన పేర్లోంచి రాజ్ పుత్ అనేది తీసేస్తానన్నాడు. ఈ ఓవర్ రియాక్షన్ సమస్యని మరింత జటిలం చేస్తున్నాయి. బన్సాలీపై దాడిని ఖండించి, న్యాయం కోరితే సరిపోతుంది. కాని, బాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్మాదంగా ట్వీట్స్ చేస్తున్నారు...
ప్రజాస్వామ్య దేశంలో సినిమాకు, సినిమా వాళ్లకు ఎంత స్వేచ్ఛ వుంటుందో అంతే బాధ్యత కూడా వుంటుంది. దాన్ని వాళ్లు గుర్తించి ఒక వర్గాన్ని రెచ్చిగొట్టే విధంగా పదే పదే ప్రవర్తించకుంటే హుందాగా వుంటుంది...