అవినీతి రోగానికి... మోదీ (స్టింగ్) ఆపరేషన్!

నోట్లు రద్దు చేసి, మోదీ దారిన పోయే కంపను నెత్తిన వేసుకున్నారా? నల్లధనం పనిపట్టడం, దొంగ నోట్లు అరికట్టడం మాట అటుంచి కొత్త అవినీతికి ఈ డీమానిటైజేషన్ ద్వారాలు తీసిందా? అవుననే అంటున్నారు చాలా మంది! అందుకు బలమైన సాక్ష్యాలు కూడా లేక పోలేదు. టీటీడీ బోర్డ్ మెంబర్ శేఖర్ రెడ్డి కోట్లాది రూపాయాల కొత్త నోట్లతో పట్టుబడ్డాడు. ఢిల్లీలో ఓ లాయర్ కూడా అట్ట పెట్టెల్లో కొత్త నోట్ల కట్టల్ని దుర్మార్గంగా దాచి పెట్టాడు. ఇలా దేశమంతా గందరగోళంగా మారిపోయింది! దీనికంతటికీ కారణం మోదీ అనాలోచితంగా చేసిన పెద్ద నోట్లే రద్దేనంటున్నారు విమర్శకులు...  నవంబర్ 8న నరేంద్ర మోదీ 500, 1000 నోట్లు చెల్లవూ అంటే అంతా హ్యాపీగా పీలయ్యారు. కాని, నెల గడిచిపోయినా ఇంకా బ్యాంక్ లు, ఏటీఎంల వద్ద క్యూలు అలాగే వుండే సరికి చాలా మంది మోదీకి మద్దతు ఉపసంహరిస్తున్నారు. నోట్ల రద్దు మంచి కన్నా చెడు ఎక్కువ చేసిందని డిసైడ్ అయిపోతున్నారు. కాని, ప్రధాని మాత్రం జరిగిన అరాచకాన్ని అరికట్టే పనుల్లో వున్నట్టు కనిపిస్తుంది. అందుకోసం, గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వమూ చేయని పనులకి ఇప్పటి మోదీ సర్కార్ సిద్ధపడుతోంది. గవర్నమెంటే స్టింగ్ ఆపరేషన్లు చేయించి అవినీతి అనకొండల్ని అడ్డంగా పట్టేస్తోంది! అవినీతిపరులు, ఆక్రమార్కులు కొత్త నోట్లు ఎలా సంపాదిస్తున్నారు? సామాన్యుడు లైన్లో నిలబడి ఒక్క రెండు వేల నోటు సాధించాలంటేనే పెద్ద సర్కాస్ చేయాల్సి వస్తోంది. కాని, నల్ల త్రాచులు మాత్రం కొత్త నోట్లని తమ పుట్టల్లో భద్రంగా బ్లాక్ చేసేస్తున్నాయి. దీనికి పూర్తి బాధ్యత బ్యాంకుల్లోని ఉన్నతాధికారులదే. వాళ్ల కక్కుర్తి లేకుండా కోట్లాది రూపాయల కొత్త నోట్లు ప్రైవేట్ వ్యక్తుల వద్దకి రావు. అందుకే, వారి మీదే స్టింగ్ ఆపరేషన్ చేయిస్తున్నారట మోదీ! దేశ వ్యాప్తంగా వున్న 625 పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ బ్రాంచీలపై నిఘా పెట్టిస్తే 425 బ్యాంకుల్లో ఆక్రమాలు జరిగినట్టు తేలిందట. చాలా మంది బ్యాంక్ మ్యానేజర్లు తమ కమీషన్ కోసం దేశ భవిష్యత్తుతోనే ఆటలాడుకున్నారు. అంతే కాదు, బలిసినోళ్లకి అప్పన్నంగా కొత్త నోట్లు ఇచ్చి బక్కటోళ్లకి నరకం కనిపించేలా చేశారు. ఇప్పుడు వాళ్లంతా స్టింగ్ లో ఇరుక్కుని రింగులో నిలబడ్డారు. వేటు కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు... సాధారణంగా ఎవరెవరో ప్రభుత్వంపై, ప్రభుత్వ పెద్దలపై స్టింగ్ ఆపరేషన్లు చేస్తుంటారు. కాని, ఈసారి సర్కారే స్టింగ్ సంధించింది. కొత్త నోట్లతో సరికొత్త అవినీతికి పాల్పడ్డ ఎంత మందిపై చర్య తీసుకుంటారో చూడాలి. కాకపోతే, కోట్లాది సామాన్య జనం కష్టాలకు కారణమైన వాళ్లందర్నీ అత్యంత కఠినంగా మాత్రం శిక్షించాల్సిందే...   

ఇక్కడ వైఎస్.. అక్కడ జయ.. అప్పుడు కర్నూల్.. ఇప్పుడు చెన్నై! 

చెన్నై చిగురుటాకులా వణికిపోతోంది. కారణం తుఫాన్! వార్ధ భూతం తమిళనాడు రాజధానిని వరదలై ముంచేస్తోంది. అయితే, కేవలం కొన్ని రోజుల క్రితమే తమిళనాడులో ఏ విషాదం చోటు చేసుకుందో మనకు తెలుసుగా? అమ్మ అంతిమ యాత్ర మెరీనా బీచ్ వరకూ కొనసాగింది! ఇప్పుడు అదే బీచ్ అల్లకల్లోలంగా మారిపోయింది! తుఫాన్ తో అలలు ఎగిసిపడుతూ జయ కోసం ఆరాటపడుతున్నట్టు వున్నాయి! కాని, అవే అలలు అనేక అనుమానాలకి దారి తీస్తున్నాయి కూడా...  జయ మరణానికి, వార్ధ తుఫాన్ కి సంబంధం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. కాని, సోషల్ మీడియాతో సహా చాలా మంది చాలా చోట్లా మాట్లాడుకుంటున్న ఆసక్తికర విషయం ఒకటి వుంది. అదేంటంటే, గతంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ దురదృష్ఠకర రీతిలో మరణించారు. సెప్టెంబర్ 2న ఆయన చనిపోయాక నెల తిరక్కుండానే కుంభవృష్ఠి కురిపింది తెలుగు నేలపై. దాని కారణంగా కర్నూల్ మొత్తం నీట మునిగింది. పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లు కూడా కట్టలు తెంచుకుని ఊళ్లని ముంచేస్తాయేమో అని అంతా భయపడాల్సి వచ్చింది! వైఎస్ తరువాత ఇప్పుడు జయలలిత కూడా పదవిలో వుండగానే మరణించింది. ఆమె మృతి కూడా అందర్నీ షాక్ కి గురి చేసింది. కాకపోతే, విభ్రాంతికరంగా వైఎస్ చనిపోయాక వచ్చినట్టే ఇప్పుడు వరదలు చెన్నైని ముంచెత్తుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రుల హఠాన్మరణం, తరువాత ఇలా వరదలు రావటం యాదృచ్ఛికమేనా? అంతేనంటున్నారు చాలా మంది. కాని, దీనికి ఏదో అలౌకిక కారణం తప్పకుండా వుండి తీరుతుందంటున్నారు మరి కొంత మంది. ఇక అమ్మ అభిమానులైతే తమలాగే ప్రకృతి కూడా విలపిస్తుందంటున్నారు! వైఎస్ మృతి, తరువాత వరదలు, జయలలిత మృతి, ఇప్పుడు వెంటనే భీకర తుఫాను... ఇదంతా కష్టా కాలం. తెలుగు ప్రజల్లాగే తమిళులు కూడా ఈ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుందాం. అలాగే, వార్ధ అతి తక్కువ నష్టంతో తీరం దాటిపోవాలని ఆశిద్దాం...   

ఆ విగ్రహం కదిలించటమే... జయను కబళించిందా? 

  జయలలిత మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఒకవైపు ఆమెపై విష ప్రయోగం లాంటివి జరిగాయేమో అంటున్నారు కొందరు. శశికళే కారణమనే వారు మరికొందరు. నేరుగా ప్రధానికే లేఖలు రాసి మరీ జయ మృతి వెనుక రహస్యాలు బయట పెట్టాలని కూడా కోరుతున్నారు. ఇలాంటి అనుమానాస్పద స్థితిలో మరో ప్రచారం కూడా తాజాగా మొదలైంది. అయితే ఇందులో నేరుగా దేవాధిదేవుడు శివుడ్నే ఇన్వాల్వ్ చేస్తున్నారు. అమ్మ అభిమానులు కూడా ఆమె మరణానికి కారణం మహేశ్వరుడే అనుకుంటున్నారు! జయ గుండెపోటుతో చనిపోయింది కదా... మధ్యలో ఈ పరమ శివుడి యాంగిల్ ఏంటి అంటారా? ఆ విషయం తెలియాలంటే మనం కంచికి వెళ్లాలి. అక్కడ ఏకాంబరనాథర్ మందిరం వుంటుంది. గర్భ గుడిలో ప్రధాన మూర్తి మట్టితో చేయబడి వుంటుంది. అందుకే, శివుడి పంచభూత లింగ క్షేత్రాల్లో దీన్ని పృథ్వీ క్షేత్రం అంటారు. లింగాన్ని పృథ్వీ లింగం అంటారు. కాని, ఈ మధ్య కంచిలోని ఏకాంబరనాథర్ ఆలయ మూల మూర్తికి కొంత నష్టం జరిగింది. అలా భిన్నమైన విగ్రహం వుండకూడదంటూ ఆలయ నిర్వాహకులు మార్చేశారు. కాని, చరిత్రకందని కాలం నాటి ఆ విగ్రహం పూర్తిగా తీసేయటం తప్పని పండితులు అంటున్నారట. వేల ఏళ్ల నాటి ఆ విగ్రహానికి మరమ్మత్తులు చేసి పునః ప్రతిష్ఠించాల్సిందని చెబుతున్నారు. కాని, డిసెంబర్ 5వ తేదీనే కొత్త విగ్రహ ప్రతిష్ఠ జరిగిపోయింది...  కొత్తగా విగ్రహం ప్రతిష్ఠించటం, అదే రోజున జయ అమాంతం మరణించటం ఇప్పుడు తమిళనాడులో అందర్నీ అనుమానాలకి గురి చేస్తోంది. ఏ కాలం నాటితో అయిన విగ్రహాన్ని తీసేయాల్సింది కాదంటున్నారు అభిమానులు. ఇందులో నిజానిజాలు ఎంతోగాని ఇప్పుడు చేయగలిగింది కూడా ఏం లేదు...    

జయలలిత గురించి రజినీ అప్పుడెందుకలా మాట్లాడాడు?

  జయలలిత, రజినీకాంత్ కలిసి నటించలేదు. సినిమా రంగంలో ఇద్దరిదీ వేరు వేరు శకం. రజినీ ఎదుగుతుండగానే జయలలిత రాజకీయాల్లోకి వచ్చేసింది. ఆమె తమిళనాడు సీఎంగా చెన్నైని ఏలుతుంటే... రజినీకాంత్ క్రమంగా తలైవా అయిపోతూ టీనగర్ ని పరిపాలించాడు. అయితే, ఆమె మృతి తరువాత రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జయని రాజకీయాల్లో నేరుగా ఏనాడూ ఢీకొట్టని సూపర్ స్టార్ ఆమె ఓటమికి మాత్రమే తానే కారణమన్నాడు!  1996లో జయలలిత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. ఆమె పార్టీ అన్నాడీఎంకేకు అతి తక్కువ సీట్లు వచ్చాయి. కరుణానిధి సారథ్యంలోని డీఎంకేకి అధికారం లభించింది. దీనికి కారణం, జయ గెలిస్తే తమిళనాడుని ఆ దేవుడు కూడా కాపాడలేడని... రజినీ చేసిన వ్యాఖ్యలే అంటారు చాలా మంది! ఇంత వరకూ రజినీకాంత్ ఎప్పుడూ ఆ సంగతి ప్రస్తావించలేదు. ఆయన స్టేట్మెంట్ చేసిన మాట వాస్తవమే అయినా జయ తన కామెంట్ వల్లే ఓడిపోయిందని మాత్రం ఏనాడూ అన్నలేదు. కాని, జయలలిత సంతాభ సభలో రజినీకాంత్ ఆ విషయం గుర్తు చేసుకున్నారు.  1996లో జయలలిత పార్టీ ఓటమికి తాను కారణమైనప్పటికీ తరువాత ఆమె మహానేతగా ఎదిగారని రజినీ కీర్తించారు. జనం అభిమానం సంపాదించుకుని అమ్మగా అవతరించారని అన్నారు. మొత్తానికి ఎప్పుడూ డిస్కస్ తన  1996నాటి కామెంట్ గురించి మాట్లాడి రజినీ కొత్త థియరీలకి ఛాన్స్ ఇచ్చారు! ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇంత కాలం జనం భావించినంత అసాధ్యమేం కాకపోవచ్చు!  

ప్లాస్టిక్ కి 'లక్ష్మీ కళ' రాబోతోంది! 

గత నెల రోజులుగా అందరి ముఖాలు వెలవెలబోవటానికి కారణం ఏంటి? కరెన్సీ కటకటే! పదులు, ఇరవైలు, యాభైలు, వందలు లేక వేల కష్టాలుపడుతున్నారు జనం! అటు ప్రభుత్వం కూడా తనకు చేతనైనంత చేస్తూనే వుంది. అయితే, 2వేల నోటుగాని, వచ్చి వెళ్లిపోయిన 500 నోటుగాని జనం ఆరాటాన్ని తీర్చలేకపోతున్నాయి. బ్యాంకులు, ఏటీఎంలు కిటకిటలాడిపోతున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి?  ఇప్పటికిప్పుడు భారతీయుల నోట్ల కష్టాలు తీరకపోవచ్చు. కొన్ని నెలల్లో అంతా సద్దకుంటుందని చాలా మంది ఆశిస్తున్నారు. అయితే, ఇప్పడు చాలా మంది చిన్న నోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. పది, ఇరవై, యాభై, వంద ... ఎంత త్వరగా వస్తే అంత హ్యాపీగా వుంటుందంటున్నారు. అందుకే, మోదీ సర్కార్ ఒక వినూత్న ఆలోచనను కార్యరూపంలో పెడుతోంది! అదే ప్లాస్టిక్ మనీ!  ప్లాస్టిక్ మనీ అంటే పేపర్ కి బదులు ప్లాస్టిక్ ని గాని, పాలిమర్స్ ని గాని వాడుతూ తయారు చేసే కరెన్సీ. ఈ ఐడియా మరీ కొత్తదేం కాదు. ఆస్ట్రేలియాలోనైతే ఆల్రెడీ మొత్తమంతా ప్లాస్టిక్ నోట్లే! ఇంకా అనేక దేశాల్లో ప్లాస్టిక్ డబ్బులు చకచకా వాడేస్తున్నారు. ఆస్ట్రేలియాలో 1970లలో మొదలు పెట్టి మెల్లగా అన్ని నోట్లూ ప్లాస్టిక్ లోకి మార్చేశారు. ఇప్పుడు మన దేశంలోనూ అదే చేయబోతున్నారట. పెద్ద నోట్ల కంటే ముందుగా చిన్న డినామినేషన్స్ ని ప్లాస్టిక్ లో అచ్చేయబోతున్నారు. అయితే, ఈ ప్లాస్టిక్ నోట్లు పేపర్ నోట్స్ అంత పకడ్బందీగానే వుంటాయి. ప్లాస్టిక్ నోటులో కూడా సెక్యురిటీ త్రెడ్ లాంటి అన్ని ఫీచర్స్ వుంటాయి. ఇంకా కొన్ని ఎక్స్ ట్రా ఫీచర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అందుకే, చాలా దేశాలు ప్లాస్టిక్ జిందాబాద్ అంటున్నాయి! ఇండియాలో మరి కొన్ని నెలల్లో రాబోతోన్న తళతళలాడే ప్లాస్టిక్ నోట్లు ముందుగా కొచ్చి, మైసూర్‌, జైపూర్‌, సిమ్లా, భువనేశ్వర్‌ నగరాల్లో అందుబాటులోకి వస్తాయట. హైద్రాబాద్, ముంబై లాంటి మహానగరాలకి ట్రయల్స్ అన్నీ అయ్యాక వస్తాయి. అంటే కొంచెం లేట్ అయ్యేలానే వున్నా ప్లాస్టిక్ మీన ఎంట్రీతో మార్కెట్ తీరే మారిపోనుంది! ఒక్కసారి అచ్చేస్తే , ప్లాస్టిక్ మనీ కనీసం 5ఏళ్లు చెక్కుచెదరకుండా వుంటుందట! అందువల్ల పేపర్ కరెన్సీ కంటే దీన్ని తయారు చేయటం చౌక అంటున్నారు ఎక్స్ పర్ట్స్...  ప్లాస్టిక్ నోట్లతో ఇప్పటికే ఆస్ట్రేలియా దొంగ నోట్ల బెడద నుంచి బయటపడింది. పాక్ లాంటి శత్రువుతో పోరాడుతోన్న మనం ఈ పరిష్కారం సాధ్యమైనంత త్వరగా వాడుకోవాలి.   

ఆ గుజరాతీ వల్లే... మోదీ నోట్లు రద్దు చేశాడట!

  హస్ముఖ్ అధియా... ఈ పేరు ఇలా సింపుల్ గా చెబితే మీరు గుర్తుపట్టకపోవచ్చు. కాని, మరో రూట్ లో ఈయన గురించి చెబితే ఠక్కున గుర్తిస్తారు! అదే డీమానిటైజేషన్! అవును... మోదీ నోట్ల రద్దు వెనుక అసలు వ్యక్తి హస్ముఖ్ అధియానే. ఇంతకీ మోదీ చేత 500, 1000 నోట్లు రద్దు చేయించిన ఈ ఘనుడు ఎవరు? ప్రధాని అతని మాటని ఎందుకని ధైర్యంగా నమ్మారు?  హస్ముఖ్ అధియా ఒక గుజరాతీ బ్యూరోక్రాట్. నమోకి ఇప్పుడు కాదు... ఆయన సీఎంగా వున్నప్పటి నుంచే నమ్మిన బంటూ. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అధియా ముఖ్యకార్యదర్శిగా పని చేశాడు. అదుగో, అప్పట్నుంచే ఆయనంటే నరేంద్రుడికి గురి కుదిరింది. ఆయన నిజాయితీ, సమర్థత ఆకట్టుకున్నాయి. వెంటనే, తాను ప్రధాని అయ్యాక హస్ముఖ్ ను ఢిల్లీకి రప్పించారు. జైట్లీ సారథ్యంలోని ఆర్దిక శాఖలోని కీలక పోస్ట్ లో కూర్చోబెట్టారు. కాని, అధియా జైట్లీనే కాదు నేరుగా పీఎంనే కలిసే వీలుంది. అలా జరిగిన డైరెక్ట్ మీటింగ్ లలోనే మోదీ నోట్ల రద్దు గురించి అధియాని అడిగి తెలుసుకున్నారట. అంతే కాదు, చాలా సీక్రెట్ గా ఆయన నాయకత్వంలో ఒక టీమ్ ను ఏర్పాటు చేసి తన నివాసంలో రెండు గదులు కేటాయించి గ్రౌండ్ వర్క్ చేయమన్నారట. నెలల తరబడీ హస్ముఖ్ అండ్ టీమ్ నోట్ల రద్దు అంశంపై పని చేస్తున్నా ఎవ్వరికీ తెలియలేదంటే ఎంత పకడ్బందీగా వ్యూహం పన్నారో అర్థం చేసుకోవచ్చు! నోట్ల రద్దు, దాని తరువాత వచ్చే పరిణామాలపై హస్ముఖ్ మొత్తం పూస గుచ్చినట్లు చెప్పాక నరేంద్ర మోదీ నవంబర్ 8న సెన్సేషనల్ డిసీషన్ ప్రకటించారు. ఆ తరువాత జరిగింది, జరుగుతోంది అంతా మనకు తెలిసిందే! అయితే, హస్ముఖ్ మీద మోదీకి ఎంత నమ్మకమంటే, ఆయన చెప్పిన విధంగా నోట్లు రద్దు చేయదలుచుకున్న ప్రధాని అంతకు ముందు క్యాబినేట్ మీటింగ్లో ఎలాంటి దుష్పరిణామాలు వచ్చినా నాది బాధ్యతంటూ ఇతర మంత్రులకి చెప్పారట! ఇక్కడ మరో కొసమెరుపు ఏంటంటే, ఏదైనా మీటింగ్లో నమో, హస్ముఖ్ చాలా కీలకమైన అంశాలు చర్చించాల్సి వస్తే గుజరాతీ భాషలో మాట్లాడేసుకుంటూ వుంటారట! మొత్తానికి... భాష, భావం రెండూ కలిసిన హస్ముఖ్... ముందు ముందు పీఎం చేత ఇంకెన్ని సంచలన నిర్ణయాలు చేయిస్తాడో!     

డిసెంబర్ 12న... బర్త్ డే 'పార్టీ' పెడతాడా? 

డిసెంబర్ 12... ఈ తేదీకి మనకైతే పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవచ్చు. కాని, తమిళనాడులో పండగే! కారణం... తలైవా పుట్టిన రోజు కావటమే! కాని, జాగ్రత్తగా గమనిస్తే గత కొన్ని సంవత్సరాలుగా యావత్ దక్షిణ భారతదేశం, ఆ మాటకొస్తే మొత్తం దేశమంతా డిసెంబర్ 12న రజినీ గురించి మాట్లాడుకుంటోంది! శివాజీ, రోబో లాంటి సినిమాల తరువాత సూపర్ స్టార్ ఇమేజ్ దావానలంలా వ్యాపించింది! ఆయన సినిమాతో పాటూ తమ సినిమా రిలీజ్ చేయటానికి బాలీవుడ్ బడా హీరోలు కూడా భయపడుతున్నారు! ఇతర భాషల వారికి రజినీ కేవలం హీరో. కాని, తమిళులకి, ఆయన అభిమానులకి మాత్రం తలైవా! అంటే, రారాజు. మరి సినిమాల్లో రాజుగా వెలిగిపోతోన్న రజినీకాంత్ నిజంగా చెన్నై సింహాసనాన్ని అధిష్ఠిస్తాడా? ఇప్పటి వరకూ చాలా సార్లు ఈ డిస్కషన్ వచ్చింది. రజినీ పొలిటికల్ ఎంట్రీ అంటూ ఎప్పుడూ హడావిడి జరిగినా చివరికి అంతా చల్లబడిపోతుంది. కాని, ఈ సారి డిసెంబర్ 12న ఆయన 66వ జన్మదినం చేసుకోబోతున్నాడు. అంతే కాదు, తమిళనాడు అమ్మలేని అనాథలా మారిపోయింది. కొద్ది రోజుల ముందే జయలలిత అస్తమించింది. మరి సూపర్ స్టార్ ఈ బర్త్ డేని ఏదైనా స్పెషల్ అనౌన్స్ మెంట్ చేసేందుకు ఎంచుకుంటాడా? ఇప్పుడు చాలా మంది జనంలో ఇదే ఇంట్రస్ట్ స్పస్టంగా కనిపిస్తోంది! అందుకు బలమైన కారణాలు కూడా లేకపోలేదు....  రజినీకాంత్ ఎప్పుడూ రాజకీయాలకు దూరమే. ఆయన ఒక్క మాట పార్టీలకు అధికారం సంపాదించి పెట్టగలగే అవకాశం వున్నా కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేదు. అందుకే, డీఎంకే, అన్నా డీఎంకే రెండూ ఆయనకు సమన దూరంలో వుంటాయి. కాని, ఇప్పుడు 66ఏళ్ల వయస్సులో రోబో 2.0 సినిమాలో నటిస్తున్న ఆయన ఇంకా ఎన్ని సినిమాలు చేస్తారు, చేయగలరు అనేది పెద్ద చర్చే. ఒకవేళ సినిమా కెరీర్ కి స్వస్తి పలికితే ఆయన నెక్స్ట్ టార్గెట్ ఏంటి? రజినీ చాలా ఈజీగా సీఎం పదవి కోరుకోవచ్చు. ఆయనకున్న సత్తాతో పాటూ ప్రస్తుతం వున్న తమిళ రాజకీయ పరిస్థితి కూడా సూపర్ గా సూటవుతుంది. అందుకే, రాజకీయ విశ్లేషకులు రజినీ రాజకీయ అరంగేట్రానికి ఇదే తగిన సమయం అంటున్నారు. బీజేపీలో చేరటం కాని, స్వంతంగా పార్టీ పెట్టడం కాని, ఏది చేసినా రజినీ వెంట తమిళులంతా నడుస్తారంటున్నారు! జయ చనిపోవటం, కరుణానిధి హాస్పిటల్లో వుండటం, శశికళ, పన్నీర్ సెల్వం, స్టాలిన్... వీళ్లెవరి మీదా జనాలకు విపరీత అభిమానం లేకపోవటం... ఇలా అనేక అంశాలు రజినీకి రాజకీయాల్లోకి రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. కాని, ఆయన మనసులో ఏముందో మాత్రం ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు. ఇక డిసెంబర్ 12న ఆయన సంచలన నిర్ణయం ప్రకటించే అవకాశాలు కూడా తక్కువే. రోబో 2.0 విడుదల వరకూ పొలిటికల్ హడావిడి ఏం చేయకపోవచ్చు! ఆ తరువాత కూడా ఏమీ చేయకుండా హిమాలయ పర్వతాలకి, తన గురువు వద్దకి వెళ్లిపోయినా వెళ్లిపోవచ్చు! ఆఫ్ట్రాల్, ఆయన మాటల్లోనే చెప్పుకుంటే... ఆ అరుణాచలం చెప్పాలి! ఈ అరుణాచలం చేయాలి!     

ఈ ప్రశ్నలకి జవాబుల్లోనే... అమ్మ అంతం దాగుంది! 

డిసెంబర్ 5తో ఒక శకం ముగిసింది. ఆ శకం పేరు జయలలిత! తమిళులకి అమ్మగా ఎంతో ప్రియమైన ఆమె ఈ నెల 5వ తేదీనే మరణించారా? లేక అంతకు ముందే చనిపోయారా? అసలు ఇంకా దారుణం ఏంటంటే... పురుచ్చి తలైవీ సహజంగానే తుది శ్వాస విడిచారా? లేక ఆమెపై ప్రాణాంతకమైన కుట్ర జరిగిందా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు చాలా చోట్ల చక్కర్లు కొడుతున్నాయి. అయితే, పెద్ద పెద్ద సెలబ్రిటీలు చనిపోయినప్పుడు ఇలాంటి అనుమానాలు, ఊహలు సహజమే. కాని, జయ విషయంలో ఆందోళన కలిగిస్తోన్న సంగతి ఏంటంటే... గౌతమి లాంటి ఒక స్టార్ కూడా ఏకంగా మోదీకి లెటర్ రాయటం. జయలలిత మృతిపై అనేక అనుమానాలున్నాయని, నివృత్తి చేయండని ఆమె కోరిందంటే... పరిస్థితి ఎంతలా విషమంగా వుందో అర్థం చేసుకోవచ్చు! జయలలిత 75 రోజుల హాస్పిటల్ కాలం ఆమె అభిమానులకి ఎంతో క్షోభ మిగిల్చింది. మామూలు జ్వరం అంటూ ఆపోలోకి వెళ్లిన అమ్మ తిరిగి సజీవంగా బయటకు రాలేదు. నేరుగా సమాధిలోకి వెళ్లిపోయింది. అంతలా ఆమె ఆరోగ్యం హఠాత్తుగా పాడైపోవటానికి కారణం ఏంటి? దీనికి సమాధానమిచ్చేవారే లేరు! అసలు కొందరైతే జయపైన స్లో పాయిజన్ ప్రయోగం జరిగిందని కూడా అంటున్నారు! అందుకే, క్రమంగా క్షీణించి చనిపోయారంటున్నారు....  అపోలో ఆసుపత్రి మొదటి రోజు నుంచి విడుదల చేసిన హెల్త్ బులిటెన్స్ లో జయలలితకు కేవలం జర్వం మాత్రమే అంటూ చెబుతూ వస్తోంది. మరి అంత చిన్న కారణంతో వైద్యం చేయించుకుంటూ వుంటే ఎవ్వర్నీ అనుమతించకపోవటం ఎందుకు? ఈ ప్రశ్నకీ సమాధానం లేదు! ఒక దశలో ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ కు జయను తరలించామని ఆపోలో వైద్యులు చెప్పారు. కాని, జనరల్ వార్డ్ కు వచ్చిన పేషంట్ హఠాత్తుగా సీరియస్ కండీషన్లోకి ఎలా జారిపోతారు? కొన్ని గంటల్లోనే ఎలా మరణిస్తారు? ఇది కూడా ఇప్పుడు తమిళ సామాన్య జనాల్ని పీడిస్తున్న ప్రశ్న. అంతే కాదు, 75రోజులు ఒక సీఎం తమ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ వుంటే... ఒక్క ఫోటో , వీడియో కూడా ఎందుకు విడుదల చేయలేదు? ఎవ్వర్నీ అనుమతించకపోవటమే కాక ఇలా ముఖ్యమంత్రిని అస్సలు బయటకి కనిపించనీయకపోవటం అనేక అనుమానాలు కలిగిస్తోంది! జయ హాస్పిటల్ లో వున్నప్పుడే ఒక తమిళ ఛానల్ తన ట్విట్టర్ అకౌంట్లో ఆమె మృతి చెందిందంటూ ప్రకటించింది. తరువాత దాన్ని తొలగించింది. కాని, అపోలో యాజమాన్యం దానిపై స్పందించలేదు. జయ బతికే వున్నారని నిరూపించే ఎలాంటి ప్రయత్నమూ వాళ్లు చేయలేదు. ఇక అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వంను ఎంచుకున్నారు. ఒకవేళ జయలలిత మరణం అందరి లాగే వారికి కూడా డిసెంబర్ 5న తెలిసి వుంటే... అంత త్వరగా అందరూ ఏకాభిప్రాయానికి వచ్చేసి పన్నీర్ ను ఎలా ఎంచుకోగలిగారు? అంటే, జయ ఇక లేరనే విషయం ఏఐఏడీఎంకే నేతలకు జనం కన్నా ముందే తెలుసా? జయ మిస్టిరియస్ డెత్ లో అన్నిటికంటే పెద్ద విషాదం ... ఆమె స్వంత కుటుంబ సభ్యులు ఎవ్వరూ చివరి రోజుల్లో ఆమె పక్కన లేకపోవటం! జయలలిత అన్న కూతురు దీపా జయకుమార్ అపోలో వద్దకొచ్చి లోనికి వెళతానంటే ఆమెను ఎంత మాత్రం అనుమతించలేదు. జయ మేనకోడలు దీపా తాను అనేక రహస్యాలు బయటపెడతానని ప్రకటించింది కూడా. అంటే, దీపా లాంటి జయ స్వంత కుటుంబ సభ్యులు లోనికి వస్తే విభ్రాంతికర విషయాలు బయటకి పొక్కుతాయని శశికళ లాంటి వారు భయపడ్డారా? జయ స్వర్గస్తురాలైన ఈ దశలోనైనా, ఆమె ట్రీట్ మెంట్ కు సంబంధించిన ఫోటోలు గాని, ఫుటేజ్ గాని బయట పెట్టేందుకు అపోలోకు వున్న అభ్యంతరాలేంటి? తప్పకుండా హాస్పిటల్ ఆధారాలు బయటపెట్టాలని నిబంధన ఏం లేకున్నా... జనంలో వున్న అనుమానాల దృష్ట్యా, ఆ పని చేస్తే బావుంటుందంటున్నారు చాలా మంది. అలాగే, గౌతమి రాసిన లేఖకు స్పందించి మోదీ చర్యలేమైనా తీసుకంటే కూడా నిజాలు బయటకి రావచ్చు! అది జరగాలని మనమూ కోరుకుందాం!            

చిల్లర సమస్య తీర్చలేక... అల్లరి పాలవుతోన్న ఏపీ పర్స్!

ఏపీ పర్స్ ... దీని గురించి మీరు విన్నారా? స్వయంగా చంద్రబాబే జనంలోకి తెచ్చారు ఈ మొబైల్ యాప్ ని! అందుక్కారణం, ప్రస్తుత డీమానిటైజేషన్ గందరగోళంలో ఇది ఎంతో మేలు చేస్తుందని ప్రచారం జరగటమే. ఇక జనం కూడా ఆసక్తిగా వెయిట్ చేశారనే చెప్పొచ్చు. ఒకవైపు చేతిలో చిన్న నోట్లు లేక, పెద్ద నోట్లు చెల్లక నెల రోజులుగా అంతా నానా తంటాలు పడుతున్నారు. అందుకే, ఆంద్రా ప్రభుత్వం మొబైల్ యాప్ తో మనీ ట్రాన్స్ ఫర్ అనగానే అందరికీ ప్రాణాలు లేచి వచ్చాయి. ఇది ఏటీఎంలు, బ్యాంక్ ల వద్ద పడిగాపుల్ని కొంతైనా తగ్గిస్తుందనుకున్నారు. కాని, తాజాగా విడుదలైన ఏపీ పర్స్ రివ్యూయర్స్ దగ్గర్నుంచీ తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఒట్టి ఖాళీ పర్సని చిరాకు పడుతున్నారు డౌన్ లోడ్ చేసుకున్న వారు...  నోట్ల రద్దుతో ఆన్ లైన్ కార్యకలాపాలు ఇప్పుడు అనివార్యం అయిపోయాయి. అదే సమయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాయి. తెలంగాణ ప్రభుత్వం టీఎస్ వాలెట్ అంటూ యాప్ ను తెచ్చే పనిలో వుండగానే ఏపీ గవర్నమెంట్ పర్స్ అంటూ ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఇక పై ఈజీగా కరెంట్ బిల్లు, మున్సిపల్ బిల్లు, బ్రాడ్ బ్యాండ్ బిల్లు లాంటి చెల్లింపులు చేసుకోవచ్చని అంతా భావించారు. హార్డ్ క్యాష్ లేక జనం పడుతోన్న హార్డ్ ట్రబుల్స్ తప్పుతాయనుకున్నారు. కాని, ఏపీ పర్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న ఇనీషియల్ యూజర్స్ అప్పుడే పెదవి విరుస్తున్నారు. అసలు ఇందులో ఏ చెల్లింపుకి కూడా డైరెక్ట్ ఛాన్స్ లేదని విమర్శిస్తున్నారు. ప్రతీది లింక్ ను పట్టుకుని వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం 28లింక్ లు దేనికది డౌన్ లోడ్, ఇన్ స్టాల్ చేసుకోవాల్సిందే. ఆ పని తాము ఏపీ పర్సు లేకుండా కూడా చేసుకుంటాం కదా అంటున్నారు! పర్స్ ఉపయోగించిన వారు అందులో ఏం లేదని చెప్పటమే కాక చంద్రబాబు దీని పై తగినంత దృష్టి పెట్టలేదని భావిస్తున్నారు. ఆయన స్వయంగా ఈ యాప్ ను వాడి చూడాల్సిందని అంటున్నారు. అప్పుడే ఇది టైమ్ వేస్ట్ వ్యవహారమని ఆయన గ్రహించే వారంటున్నారు. అసలు యాప్ ను డెవలప్ చేయటానికి ఉద్దేశించిన టీమ్ ఏ మాత్రం మనసు పెట్టలేదని అంటున్నారు. అందువల్లే ఏపీ పర్స్ ప్రచారమంతా ఓన్లీ హంగామాగా మిగిలిందంటున్నారు.  జనం రోజుల తరబడి బ్యాంక్ ల వద్ద, ఏటీఎంల కాళ్లు వణికేలా క్యూల్లో నిలబడుతున్నారు. అటువంటి సమయంలో వాళ్లని ఫ్రస్ట్రేట్ చేసేలా ఇలా ఖాళీ పర్సులు తీసుకురావటం నిజంగా బాధాకరమే. దీనికి ఎక్కడ జరిగిన లోపం కారణమో తెలుసుకుని... ఏపీ గవర్నమెంట్ వెంటనే తప్పుని సరిదిద్దుకోవాలి. ఎందుకంటే, స్వయంగా ముఖ్యమంత్రి ఈ యాప్ జనం చిల్లర సమస్యలు తీరుస్తుందని చెప్పాక కూడా ... అది ఫెయిలైతే చాలా ఇబ్బందికరంగానే వుంటుంది!   

సూసైడ్ నోట్ సుడిగాలిలో... గాలి!

  గాలి జనార్దన్ రెడ్డికి ఎదురు గాలి బలంగానే వీస్తోంది! దాదాపు నాలుగేళ్లు హైద్రాబాద్, బెంగుళూరు జైలల్లో వున్న ఆయన కూతురు పెళ్లి గ్రాండ్ గా చేసి కట్నాలు చెల్లించుకున్నాడు. కాకపోతే, కట్నాలు ఇచ్చుకుని కష్టాలు కొని తెచ్చుకున్నాడు. ఇప్పటికే దేశమంతా నోట్ల కటకట నడుస్తోన్న ఈ తరుణంలో ఆయన వందల కోట్ల వివాహం ఎలా చేశాడని అంతటా చర్చ నడుస్తోంది. ఎలా మైనింగ్ డాన్ కి బోలెడంత వైట్ మనీ, కొత్త నోట్లు వచ్చాయని మాట్లాడుకుంటున్నారు. కాని, తాజాగా బయటపడ్డ ఒక సూసైడ్ లెటర్ రాజకీయంగా పెద్ద గాలి దుమారమే లేపేలా కనిపిస్తోంది!  కర్ణాటకలోని అడ్మినిస్ట్రేటివ్ క్యాడర్ కు చెందిన ఆఫీసర్ భీమా నాయక్. ఈయన డ్రైవర్ రమేష్ గౌడ. ఆయన అత్యంత విషాదంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాని, పురుగుల మందు తాగి ప్రాణాలు పోగొట్టుకున్న గౌడ ఒక లెటర్ రాశాడు. అందులో గాలి జనార్దన్ రెడ్డి మనుషులు తనని చంపేస్తామని బెదిరించారని పేర్కొన్నాడు. అందుకు కారణం, కర్ణాటక ప్ర్రభుత్వ బ్యూరోక్రాట్ అయిన భీమా నాయక్ డ్రైవర్ గా తనకు తెలిసిన రహస్యాలేనన్నాడు. ఇంతకీ, రమేష్ గౌడకు తెలిసిన రహస్యం ఏంటి? సూసైడ్ నోట్ లోనే చెప్పాడు... గాలి తన కూతురు పెళ్లి సందర్భంగా వంద కోట్ల పాత నోట్లని కొత్త వాటితో మార్చేసుకున్నాడు. ఈ అక్రమ మార్పిడికి గవర్నమెంట్ అధికారి భీమా నాయక్ సహకరించాడు. ప్రతి ఫలంగా 20శాతం కమీషన్ తీసుకున్నాడు. అంతే కాదు, గాలి జనార్దన్ రెడ్డిని ఆయన వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పించమని కూడా కోరాడట. ఈ డీల్ వర్కవుట్ చేసుకునేందు కోసం జనార్దన్ రెడ్డి కర్ణాటక ఎంపీ శ్రీరాములుతో కలిసి భీమా నాయక్ ని అనేక సార్లు ఒక బెంగుళూరు హోటల్ లో కలిశాడట! రాజకీయంగా పెద్ద దుమారం రేపనున్న ఈ వంద కోట్ల వ్యవహారమంతా డ్రైవర్ రమేష్ గౌడ తన లెటర్ రాసి చనిపోయాడు. ప్రస్తుతం పోలీసులు రమేష్ తన చావుకు బాధ్యుడుగా పేర్కొన్న అధికారి భీమా నాయక్ పై కేసు నమోదు చేశారు. అయితే, ముందు ముందు ఇది గాలి మెడకు కూడా తప్పక చుట్టుకునే అవకాశమే వుంది. నాలుగేళ్లు జైల్లో వుండొచ్చిన ఆయన ప్రస్తుతం ఏ పార్టీలోనూ కొనసాగటం లేదు. బీజేపి ఆయన్ని అనేక కేసుల నేపథ్యంలో పార్టీ నుంచి బహిష్కరించింది....    

జయ... రజినీతో ఆ సినిమా ఎందుకు చేయనంది?

తమిళులు అమ్మ జయలలితని గౌరవంగా పురుచ్చి తలైవీ అంటారు! అయితే, ఆమెను తలైవీ అన్న జనం తలైవా అని ఎవర్ని అన్నారో తెలుసుగా? నన్ అదర్ ద్యాన్ సూపర్ స్టార్ రజినీకాంత్! ఆశ్చర్యకరంగా... ఈ తలైవా, తలైవీ ఇద్దరూ కర్ణాటకలోనే పుట్టారు. కాని, తమిళ సినిమా రంగాన్ని ఏలారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా ఇంకా కోలీవుడ్ ని శాసిస్తూనే వున్నాడు. కాని, జయ మాత్రం గ్లామర్ ప్రపంచం మీదుగా రాజకీయ రణరంగంలోకి వచ్చి అమ్మగా అవతరించి... తన మహా ప్రస్థానం పూర్తి చేసేసింది! కాని, ఇక్కడే రజినీ, జయలలితలకు సంబంధించిన ఒక హిస్టారికల్ ట్విస్ట్ వుంది! రజినీకాంత్, జయలలిత కలిసి నటించిన సినిమా ఒక్కటి కూడా లేదు. హీరో, హీరోయిన్స్ గా కాదు వేరు వేరు పాత్రల్లో కూడా వాళ్లు నటించిన కామన్ మూవీ అంటూ లేదు. కాని, చరిత్రలోకి తొంగి చూస్తే ఈ ఇద్దరు లెజెండ్స్ ఒక బ్లాక్ బస్టర్ మూవీ చేయాల్సింది. కాని, దురదృష్టవశాత్తూ అది వర్కవుట్ కాలేదు. ఈ విషయం ఇప్పుడు తెలియటానికి కారణం... జయ రాసిన 36ఏళ్ల నాటి ఒక లెటర్!  జయలలిత 1980 కాలంలో  సినిమాలు చేయలేదు. 82లో రాజకీయాల్లో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. అయితే, అప్పట్లోనే ఖాస్ బాత్ అనే పత్రిక ఒక వ్యాసం అచ్చేసింది. అందులో ఆమెకు మంచి ఆఫర్స్ తగ్గాయిపోయాయని, అందుకే సినిమాలు చేయటం లేదని అబిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన జయ ఎడిటర్ కి లెటర్ రాశారు. అందులో ఆమె ప్రత్యేకంగా 1980లోనే విడులైన సూపర్ హిట్ మూవీ బిల్లా గురించి డిస్కస్ చేసింది. ఆ సినిమా రజినీ హీరోగా జనం ముందుకొచ్చి కోలీవుడ్ ని ఊపేసింది! అటువంటి క్రేజీ ప్రాజెక్ట్ లో తనని హీరోయిన్ గా ఆ సినిమా దర్శకుడు బాలాజీ అడిగారని, తాను కాదన్నాకే శ్రీప్రియని హీరోయిన్ గా తీసుకున్నారని వివరించింది. అంతే కాదు, అమ్మ తనదైన స్టైల్లో ఆత్మ విశ్వాసం ఉట్టిపడేలా... ఆఫర్లు లేవన్నది ఒట్టి మాటని తీవ్రంగా ఖండించింది! జయలలిత కన్నుమూశాక బయటకొచ్చిన ఆమె లెటర్ రజినీకాంత్ తో చేయలేకపోయిన సినిమా గురించి ప్రపంచానికి తెలియజేసింది. ఒకవేళ  ఆ రోజు జయ బిల్లా సినిమాకి సై అని వుంటే మనకు మరో అద్భుతమైన కమర్షియల్ ఎంటర్టైనర్ లభించి వుండేది!           

వీధిలో అడుక్కునే అమ్మాయి విధి రాత మార్చేసింది!

  అడగందే అమ్మైనా పెట్టందంటారు! కాని, అడగకున్నా పెట్టే అమ్మ ... మా జయమ్మ అంటారు తమిళులు! జయలలితపై వాళ్ల అభిమానం మనకు తెలియంది కాదు. కాని, అంతటి అభిమానం పొందటం ఒక రాజకీయ నేతకు ఎలా సాధ్యమైంది? ఊరికే అమ్మ క్యాంటీన్లు, అమ్మ టీవీలు, మిక్సీల వల్ల వీలైందా? జయ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలానే ఉపయోగపడవచ్చు , కాని, అసలు కారణం వేరే వుంది. అదేంటో తెలియాలంటే, ముందు మనం తమిళనాడు వదిలి కర్ణాటకలోని మైసూర్ కు వెళ్లాలి... జయలలిత పుట్టింది మైసూర్ ప్రాంతంలో అయినా ఆమె తమిళురాలు. తమిళనాడులోనే అత్యధిక భాగం తన జీవితం గడిచింది. ఆ మైసూరులోనే ఒక అమ్మాయి వీధుల్లో అడుక్కుంటూ వుండేది చాన్నాళ్ల క్రితం! ఇప్పుడామె ఏం చేస్తోందా తెలుసా? లాయర్ గా కోర్టులో కేసులు వాదిస్తోంది! వినటానికే ఆశ్చర్యంగా వుంది కదా... ఒక భిక్షమెత్తుకునే అమ్మాయి లాయర్ అయిందంటే! అందుక్కారణం అమ్మ జయలలితే... జయ సీఎంగా వున్నప్పుడు నాగరత్న అనే ఒక తెలివైన కన్నడ విద్యార్థిని గురించి పేపర్లో పడింది. టెన్త్ లో ఆమెకు 65శాతం మార్కులు వచ్చాయి. కాని, అసలు విషాదకరమైన విశేషం ఏంటంటే... నాగరత్న చదువు మీద ఇష్టంతో పదో తరగతి పాసైనా వాళ్ల కుటుంబం అప్పట్లో వీధుల్లో అడుక్కునేది. ఎలాగో టెన్త్ వరకూ నెట్టుకొచ్చిన ఆ అమ్మాయి తరువాత చదువుకునే వీలు లేకుండా పోయింది. కాని, అప్పుడే అదృష్టం అమ్మ రూపంలో ఆమెను వెదుక్కుంటూ వచ్చింది! జయ ఆ అభాగ్యురాలి గురించి న్యూస్ పేపర్లో చూసిన వెంటనే కర్ణాటకలోని తమ పార్టీ నాయకుడిని పురమాయించింది. తరువాత అతను నాగరత్నను తీసుకుని జయలలిత వద్దకు రావటం, ఆమె లక్ష రూపాయల చెక్కు అప్పటికప్పుడు అందజేయటం, ముందు ముందు అయ్యే ఖర్చులు కూడా భరిస్తానని భరోసా ఇవ్వటం చకచకా జరిగిపోయాయి!  ఆ రోజు పదో తరగతి పాసైనా కూడా భిక్షమెత్తుకుని బతికే స్థితిలో వున్న మైసూర్ లోని నాగరత్నే ఇప్పుడు సక్సెస్ ఫుల్ లాయర్ గా కొనసాగుతోంది. అదంతా అమ్మ... పురుచ్చి తలైవీ భిక్షేనంటుంది ఆమె! నిజమే కదా... ఇలాంటి మంచి మనస్సు, వెంటనే ఆదుకునే గుణం వున్నాయి కాబట్టే జయ దిగ్విజయంగా తమిళనాడు మొత్తాన్నీ తన అభిమానులుగా మార్చేసుకోగలిగింది!   

జయలలిత సమాధి కావటానికి... కారణాలు ఇవే! 

ఫిబ్రవరీ 24, 1948... డిసెంబర్ 5, 2106! ఈ తేదీల మధ్య ఒక శకం ముగిసిపోయింది! జయలలిత తన ప్రస్థానం ముగించి మెరీనా బీచ్ లో డిసెంబర్ 6న సేద తీరింది! కాని, ఇప్పుడు చాలా మంది చర్చ ఆమె మరణం నుంచి అంత్యక్రియల వ్యవహారంపైకి మళ్లింది! పురుచ్చి తలైవీ మిగతా అన్ని విషయాల మాదిరిగానే ఆమె , ది ఎండ్ కూడా ఆసక్తి రేకిత్తిస్తోంది...  జయలలిత హిందువు. అంతే కాదు ఆమెది తమిళ అయ్యంగార్ కుటుంబం. అంటే, బ్రాహ్మణ వనిత అన్నమాట. మరి అటువంటప్పుడు అమ్మ అంత్యక్రియలు ఎలా జరగాలి? ఆమె పార్థివ దేహాన్ని వేద మంత్రాలతో దహనం చేయాలి. కాని, అలా చేయలేదు. అదే ఇప్పుడు ఎందరికో అనుమానం కలిగిస్తోంది! ఎందుకని తమిళ సీఎంని సమాధి చేసేశారు? దీనికి చాలా మంది చాలా సమాధానాలే చెబుతున్నారు... జయలలిత హిందువే అయినా ఆమెకు పెళ్లి అవ్వకపోవటం వల్ల దహనం చేయలేదని కొందరి అభిప్రాయం. కొన్ని కులాల వాళ్లు పెళ్లి కాని వార్ని సమాధి చేయటం సంప్రదాయంగా వస్తోంది. ఇక మరి కొందరి అభిప్రాయం ప్రకారం జయకు వారసుడంటూ ఎవరూ లేకపోవటంతో కూడా సమాధి చేయటానికి శశికళ మొగ్గు చూపిందంటున్నారు. సుధాకరన్ అనే అతడ్ని జయలలిత దత్తత తీసుకుని గ్రాండ్ గా మ్యారేజ్ చేసినప్పటికీ తరువాత అతడు జయతో కలిసి వుండలేదు. మిగతా కుటుంబ సభ్యులు కూడా ఎవ్వరూ జయ అంతి క్షణాల్లో ఆమె వద్ద లేరు. ఈ కారణల వల్ల కూడా జయలలితను సమాధి చేయాల్సి వచ్చిందట. వ్యక్తిగత కారణాలతోనే కాదు, సామాజికంగా కూడా తమిళుల్లో చాలా మంది పూడ్చి పెట్టే పద్ధతే పాటిస్తుంటారు. గత తమిళ సీఎంలు ఎవ్వర్నీ దహనం చేయలేదట. అందుకే, జయను కూడా ఆమె సినిమా, రాజకీయ గాఢ్ పాదర్ ఎంజీఆర్ సమాధి పక్కనే సమాధి చేశారట! ఏదీ ఏమైనా, జయలలిత జీవితంలో ప్రతీ అంశమూ వార్తల్లో నిల్చింది. అలాగే ఈ అంత్యక్రియల సంగతి కూడా హాట్ టాపిక్ అయింది...  

జ‌య ఆస్తుల‌న్నీ ఎవ‌రికి సొంతం?

దేశంలో అత్యంత సంప‌న్న సీఎమ్‌ల‌లో జ‌య‌ల‌లిత ఒక‌రు. జ‌య బ‌తికున్నంత కాలం విలాస‌వంత‌మైన జీవితం గ‌డిపారు. ఖ‌రీదైన కార్ల‌లో తిరిగారు. ఆమె ఆస్తుల విలువ అధికారికంగా రూ.117 కోట్లు. అన‌ధికారికంగా ఎంత ఉందో.. ఎవ్వ‌రికీ తెలీదు. జ‌య‌కు వార‌సులంటూ ఎవ‌రూ లేరు. మ‌రి ఆమె ఆస్తులు ఎవ‌రికి సొంతం??  అనే ప్ర‌శ్న మొద‌లైందిప్పుడు.  పోయెస్ గార్డెన్‌లో  ఉన్న జ‌య నివాసం విలువ దాదాపుగా రూ.50 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా. వీటితో పాటు ఓ డ‌జ‌ను ఖ‌రీదైన కార్లు, బంగారం, వ‌జ్రాలూ.. ఇలా సంప‌ద ఎంతో ఉంది.   ఇవ‌న్నీ ఎవ‌రికి చెందుతాయి??  జ‌య ఈ ఆస్తుల‌కు సంబంధించిన వీలునామా ఏమైనా రాశారా?  జ‌య ఆప్త‌మిత్రురాలు శ‌శిక‌ళ‌కు వీటి గురించి ఏమైనా తెలుసా??  ఇలా లెక్క‌లేని ప్ర‌శ్న‌లు ఎన్నో. హైద‌రాబాద్ శివార్ల‌లో జ‌య‌కు ఓ ద్రాక్ష తోట ఉంది. హైద‌రాబాద్‌లో ఓ ఖ‌రీదైన ఇల్లు కూడా ఉంది. ఇవ‌న్నీ ప‌ర్య‌వేక్షించేది ఎవ‌రు??  జ‌య తాలుకూ కొన్ని ఆస్తులు కోర్టు గొడ‌వ‌ల్లో ఉన్నాయి. అవన్నీ ఎవ‌రికి సొంతం అవుతాయి?  జ‌య చివ‌రి రోజుల్లో వీలునామా రాసే ఉంటారని, వాటికి సంబంధించిన లెక్క‌ల‌న్నీ శ‌శిక‌ళ‌కు బాగా తెలుస‌ని చెన్నై మీడియా ప్ర‌త్యేక క‌థ‌నాలు ప్ర‌చురిస్తోంది. జ‌య లోగొట్టు ఏంటో.. శ‌శిక‌ళ‌కే ఎరుక‌.

ఆమె మరణంతో తప్ప... అన్నిటితో గెలిచింది!

ఆమె విధితో పోరాడింది. విజయం సాధించింది! వీధుల్లో ప్రతిపక్ష రౌడీలతో పోరాడింది. విజయం సాధించింది! సినిమా రంగాన్ని జయించింది. రాజకీయ రణరంగంలో స్వైర విహారం చేసింది. పుట్టింది మొదలు అడుగడుగునా అపజయాన్ని అణిచేస్తూ అపర కాళికలా అవతరిస్తూ వచ్చింది. అయినా కోట్లాది తమిళ జనానికి ఆర్ద్రత నిండిన అమ్మై... అన్నీ తానైంది! శత్రువులకి నిద్దుర లేకుండా  చేస్తూనే... తనని నమ్మిన వారి కంటి నిండా నిద్దురైంది! కాని, జీవితంలో తొలిసారి ఓటమి అంగీకరించిన జయలలిత శాశ్వత నిద్దురలోకి జారుకుంది! డిసెంబర్ 5, సోమవారం నాటి మరణంతో తప్ప... ఆమె అన్నిటితో గెలిచింది! సెప్టెంబర్ నుంచీ చెన్నై అపోలో హాస్పిటల్ లోనే వుంటూ వచ్చిన జయలలిత తుది శ్వాస విడవటంతో తమిళనాడు కన్నీటి సముద్రమైపోయింది. ఆమె మరణ వార్త వెలువడ్డ మరుక్షణం నుంచీ  మెరీనా బీచ్ లో జయలలిత అంత్యక్రియలు పూర్తయ్యే దాకా జనం రోడ్లపై ఉప్పొంగారు. ఏడుస్తూనే అమ్మకు అంతిమ వీడ్కోలు పలికారు. ఒకవైపు తమిళ , జాతీయ మీడియా కవరేజ్, మరో వైపు రాష్ట్రపతి, ప్రధాని సహా వీవీఐపీల శ్రద్ధాంజలులతో దేశం మొత్తం చెన్నై వైపే దృష్ఠి సారించింది! రాజకీయ రంగ ప్రముఖులు, సినిమా వాళ్లు జయ అంతిమ దర్శనం కోసం క్యూలు కట్టారు. ఇక లక్షలాది సామాన్య జనం గురించైతే చెప్పగలిగేదే లేదు... తమిళ నేల కూడా అమ్మ అస్తమయంతో కన్నీరు మున్నీరైందా అన్నట్టు జనం వరదై ఉప్పొంగారు...  తమిళ చరిత్రలోనే అతి కొద్ది చారిత్రక ఘట్టాలతో పోల్చదగ్గ మహా జ్ఞాపకంగా సాగిన జయ మహాప్రస్థానం మెరీనా బీచ్ లో అంతమైంది. అడుగడుగునా జన సంధ్రం వీడ్కోలుతో ఆమె అంత్యక్రియలు సముద్ర తీరంలో ముగిశాయి. ఆమె రాజకీయ ప్రవేశానికి మూల కారకుడు, ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ సమాధి పక్కనే ఆమె సేద తీరారు. సినిమా రంగం, రాజకీయం రంగంల్లో కలిసి పయనించిన వారు మరో లోకంలోనూ తప్పక కలుసుకుంటారని అన్నా డీఎంకే అభిమానులు కన్నీటి పర్యంతం అవుతూ మనసుల్ని సమాధానపరుచుకున్నారు.  డిసెంబర్ 6, మంగళ వారం నాడు... ఒక శకం ముగిసింది! జయలలిత అనే దిగ్విజయ శకం!          

జయలలిత గురించి జయలలిత ఏమందో తెలుసా?  

జయలలిత మాటల్లో ప్రేమ అంటే....  '' అన్‌కండిషనల్‌ లవ్‌ అనేదే నిజమైన ప్రేమ, ఎలాంటి షరతులు లేని ప్రేమ! అలాంటి ప్రేమ ఉందంటే నేను నమ్మను''  తన ఫేవరెట్ క్రికెట్ స్టార్, బాలీవుడ్ హీరో గురించి...  ''నారీ కాంట్రాక్టర్‌ అంటే నాకు ఇష్టం, అతన్ని చూడ్డం కోసమే మ్యాచ్‌లకి వెళ్లేదాన్ని. తర్వాత షమ్మీ కపూర్‌ మీద ఓ బలమైన ఆకర్షణ. జంగ్లీ సినిమాను ఎన్నిసార్లు చూశానో.. అన్ని పాటలు నోటికి వచ్చేవి అప్పట్లో''  వాళ్ల అమ్మ గురించి అమ్మ ఏం చెప్పింది?  ''అమ్మ నన్ను వదిలి వెళ్లిపోతుందేమో అని, ఆమె చీర చెంగుని నా చేతికిచుట్టేసుకుని పడుకునే దాన్ని.. అమ్మ నన్ను వదిలి వెళ్లక తప్పని పరిస్థితుల్లో నా చేతికి చుట్టుకున్న తన చీరని విప్పి, వేరే చీరని కట్టుకుని, ఆ చీరను మా అత్తకు కట్టించి అలాగే నా పక్కన పడుకోమని చెప్పి వెళ్లేది.. పొద్దున లేచి చూస్తే మా అమ్మ చీరలో మా అత్త నా పక్కన పడుకుని కన్పించేది..''  పురుచ్చి తలైవీ మాటల్లో నాయకత్వం...   '' ఈ సమాజమే నాయకుడి జన్మకు కారణమవుతుందని నమ్ముతున్నా. ప్రతి మనిషిలోనూ అన్యాయాన్ని ప్రశ్నించే ఓ స్వభావం ఉంటుంది. ప్రతిస్పందించే ఒక నిజాయతీ ఉంటుంది. వాటిని ఎవరన్నా తట్టిలేపితే నాయకుడవుతాడు'' పురుచ్చితలైవీ మెచ్చిన పులిహోర... సినీ నటి సూర్యకాంతం షూటింగ్‌లకి ఏదో ఒక ఫుడ్‌ ఐటమ్‌ ఇంట్లో చేసుకొని వచ్చే వారు. అయితే ఆమె వండే పులిహోర అంటే జయకి చాలా ఇష్టం. ఒకరోజు షూటింగ్‌లో సూర్యకాంతం పులిహోర తీసుకొచ్చారు. పొద్దున షూటింగ్‌ మొదలైనప్పట్నుంచీ జయ కళ్లన్నీ ఆ పులిహోర మీదే. ఎప్పుడెప్పుడు బ్రేక్‌ ఇస్తారా.. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. బ్రేక్‌ రానే వచ్చింది. వెంటనే పులిహోర బాక్స్‌ తెరిచి ఆవురావురుమని తింటుంటే ఎక్కిళ్లు వచ్చాయి. వెంటనే నీళ్లిచ్చి ప్రేమగా తడ్తున్న సూర్యకాంతం వైపు జయ ప్రేమగా చూసింది. ''ఆ సమయంలో ఆమెలో అమ్మ కనిపించింది'' అని అమ్మ చెప్పేది తరువాతి కాలంలో! సూర్యకాంతమ్మ చనిపోయిన క్షణంలో...  సూర్యకాంతం చూపించిన మాతృప్రేమని మర్చిపోకుండా, పదిలంగా గుండెల్లో దాచుకుని, ఆమె ఇక లేరు అన్న వార్త తెలియగానే.. ఉన్న పనులన్నీ పక్కనపెట్టి ఆమె భౌతికకాయం వద్ద మౌనంగా, బాధగా గడిపిన సీఎం జయలలితను ఏమని వర్ణించగలం? ఆమె మాటల్లోనే అయితే, '' నా మనసుని కదిలించిన సంఘటనలను, మనషులనూ నేనెప్పటికీ మర్చిపోను. నాలో ఒకరి పట్ల ఉన్న ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, కృతజ్ఞత కానీ పోతాయి అంటే అది నా తుదిశ్వాసతోనే!'' విమర్శకుడికి పరామర్శ...  ఒకానొక సమయంలో జయని చో ఘాటుగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కానీ చోకి ఒంట్లో బాలేదంటే, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి ''యు విల్‌ కమ్‌ అవుటాఫ్‌ దిస్‌ వెరీసూన్‌'' అని అన్నారు. అదే నిజమైతే నాకు మరింత షాక్‌ అని చో బలహీనమైన స్వరంతో జోక్‌ వేశారు. జయ మాత్రం.. ''అలా అనకండి. మీకేం కాదు.'' అని ధైర్యం చెప్పారు. ఆ మాట ఏదో మాటవరసకి అన్నది కాదు. ఆమె మొహమాటం కోసం మనుషుల్ని చూడటం, మాట్లాడం చేయరని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా!  జీవితపు ప్రతీ మలుపులో ప్రతి ఒక్కర్నీ అనుగ్రహించిన అమ్మ...  ఒకరోజు జయలలిత తన నివాసమైన పోయస్‌ గార్డెన్‌లోకి రాగానే... సెక్యూరిటీని పిలిచి ''గార్డెన్‌కి రావటం కోసం తిరిగే మలుపులో ఓ కొట్టు ఉంటుంది. అక్కడ రోజూ ఓ ముసలాయన ఉంటాడు. రెండ్రోజుల్నించి చూస్తున్నా. కొట్టు మూసేసి ఉంది. అతనికి ఏమైందో కనుక్కోండి'' అని అదేశించారు. రెండు నిమిషాల్లోనే వార్తను మోసుకొచ్చారు సిబ్బంది. ముసలాయనకి జ్వరం, లేవలేకుండా ఉన్నాడు అని. వెంటనే ఆయన తరఫు వాళ్లని తీసుకురండని చెప్పడం... వాళ్లకి వైద్యం కోసం డబ్బు ఇవ్వడం క్షణాల్లో జరిగిపోయాయి. శత్రువుల నిరాశ... ఆమె ఆనందం!  ''జైలులో అడుగుపెట్టిన ఆ రోజుని నేను మరిచిపపోలేను. జీపులో ఎక్కుతున్నప్పుడే మానసికంగా ఏం ఎదురైనా స్వీకరించాలని సిద్ధపడే ఎక్కాను. చాలాకాలం మూతపడి ఉన్న పాత బిల్డింగ్‌ని నా కోసం గౌరవనీయులైన కరుణానిధి ప్రత్యేకంగా తెరిపించారు. లోపల దుమ్ము, ధూళి, ఎలుకలు, పందికొక్కులు, తేళ్లు, జెర్రులు... ఒక చిన్న జువాలజీ క్లాస్‌ తీసుకోవచ్చు అక్కడ. కటిక నేలమీద పడుకున్నాను. నెల్రోజులు గడిపాను. ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. రాలేదంటే నేను రానివ్వలేదని కాదు అర్థం. నిజంగానే రాలేదు. ఇలా నేను మారడానికి ఒకటే కారణం. మనల్ని అవతలి వారు వ్యక్తిగతంగా గాయపరిచినప్పుడు మనం బాధ పడతాం. ఈ బాధ ఎందుకు వస్తుంది అంటే... మన ముందు ఉన్న పరిస్థితిని మనం అంగీకరించకపోవడం వల్లే. నేను జైల్లో బాధపడితే చూడాలని అనుకున్నారు. సిబ్బందిని అడిగారట ఆమె ఏడుస్తోందా? అని. లేదు సార్‌ ఆమె ఏడవలేదు అని అంటే వాళ్లు నిరాశ చెందారని విన్నాను. నిజానికి వారి నిరాశ నన్ను ఆనందపరిచింది''  ఒక మామూలు అమ్మాయి... అమ్మగా అవతరించటమే... విధి! ''మన కోసం మనం బతకాలనుకున్నప్పుడు ఒకలా ఉంటాం. ఇతరుల కోసం మనం జీవించాలి అనుకున్నప్పుడు మనకే తెలియకుండా ఒక అనూహ్యమైన పరిణతిని పొందుతాం. మనం వూహించని విధంగా రూపాంతరం చెందుతాం. నేను ఇలా అవుతానని ముందే వూహించి ఉంటే బహుశా భయపడి వుండేదాన్నేమో. పార్టీలో చేరడమే మానుకునే దాన్నేమో. పార్టీలో చేరేనాటికి నేను మామూలు ఆడపిల్లని మరి. భయస్తురాల్ని కూడా. ఒక మామూలు అమ్మయి నుంచీ.. ఇలా మారటం నా డెస్టినీ''     

జయలలిత అనే కోమలవల్లి గురించి... మీకీ సంగతులు తెలుసా?

  మనం జయలలిత అంటోన్న పురుచ్చి తలైవీ అసలు పేరు కోమలవల్లి! తమిళనాడు ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన ఆమె పుట్టింది మాత్రం కర్ణాటకలో! జయలలితకు హైద్రాబాద్ లోని కొంపెల్లి ప్రాంతంలో ఫామ్ హౌజ్ వుందంటారు. అక్కడే ఆమె అప్పుడప్పుడూ సేద తీరేదట! నటిగా, రాజకీయ నాయకురాలిగా జయ అందరికీ తెలుసు. కాని, ఆమె అద్భుతంగా భరతనాట్యం కూడా వచ్చు. అయిదో ఏట నుంచే నృత్యం నేర్చుకుంది! సినిమాలంటే పెద్దగా ఇష్టం లేని జయలలిత తల్లి బలవంతం మీద 15ఏళ్ల వయస్సులో గ్లామర్ ప్రపంచంలోకి వచ్చింది. మొదటి సినిమాలో యంగ్ విడో క్యారెక్టర్ వేసింది. అయితే, అప్పటికి జయలలిత చదవుల్లో టాప్! మెట్రిక్ లో ఆమె స్టేట్ ర్యాంకర్! జయలలిత నిజమైన ఆశయం... లాయర్ అవ్వాలని! అందాల హీరోయిన్ గా తమిళుల చేత కవర్చి కన్ని అని పొగిడించుకున్న ఆమె మొదటి సినిమాకే ఏ సర్టిఫికెట్ వచ్చింది! దాంతో అప్పటికి 15ఏళ్లే వున్న జయ ఆ అడల్ట్స్ ఓన్లీ రేటింగ్ వచ్చిన సినిమా చూడలేకపోయింది! జయలలిత , శోభన్ బాబుల ప్రేమ గురించి అనేక కథనాలు ప్రచారంలో వున్నాయి. వాళ్ల లవ్ నిజమో కాదోగాని... కొందరైతే జయకు శోభన్ బాబుతో ప్రియ మహాలక్ష్మీ అనే కూతురు కూడా వుందంటారు. కాని, ఈ గాసిప్స్ కి ఎలాంటి ఆధారం వున్నట్టు కనిపించదు... ఇంగ్లీష్ పుస్తకాలు చదవటం అంటే జయలలితకు చాలా ఇష్టం. అంతే కాదు, ఆమె రచయిత్రి కూడా! ఎస్టరియర్ అనే తమిళ వీక్లీలో థాయ్ పేరుతో ఆమె రచనలు ప్రచురించేది! తమిళంలో ఆమె 85సినిమాలు చేసింది. అందులో 80సూపర్ హిట్! చాలా వరకూ సిల్వర్ జూబ్లీ సినిమాలు కూడా... తెలుగులో 28సినిమాలు చేసిన జయ హిందీలో ఇజ్జత్ అనే సూపర్ సక్సెస్ ఫుల్ మూవీ చేసింది! జయలలితకు ఒక అన్న. ఆయన పేరు జయకుమార్. 1995లో మరణించాడు.  తమిళనాడు తొలి మహిళా ప్రతిపక్ష నేత, రెండో మహిళా సీఎం జయలలితే! అంతే కాదు, 43ఏళ్లకే మొదటిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె... ఇప్పటి వరకూ అత్యంత పిన్న వయస్కురాలైన తమిళ సీఎం!  బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తండ్రి నవాబ్ అలీఖాన్ పటౌడీ అంటే జయలలితకు ఎక్కడలేని పిచ్చి. ఆయనను చూడటానికే క్రికెట్ మ్యాచ్ లకు వెళ్లేదట! జయ తన పెంపుడు కొడుకు పెళ్లిలో లక్షన్నర మందికి ఆతిథ్యం ఇచ్చింది! ఇది గిన్నిస్ రికార్డ్...  అమ్మ తన దత్త పుత్రుడి వివాహానికి 100కోట్లు ఖర్చు చేసిందని అప్పట్లో పుకార్లు వచ్చాయి. కాని, ఐటీ శాఖ 10కోట్లు ఖర్చు అయ్యాయని తేల్చింది...  జయలలిత జీవితంలో వరం, శాపం రెండూ ఆమె ప్రాణ స్నేహితురాలు శశికళే అంటారు చాలా మంది! శశికళతో ఆమె సాన్నిహిత్యంపై అనేక ప్రచారాలున్నాయి. అయితే, అదే శశికళని జయ ఒక దశలో దూరం పెట్టింది. అప్పుడే శశికళ కుట్ర చేసి స్లో పాయిజన్ ప్రయోగించిందంటారు పడని వారు! దీనికి ఎలాంటి ఆధారాలు లేకున్నా ఆ తరువాత నుంచే పురుచ్చి తలైవీ సంపూర్ణంగా ఏనాడూ కోలుకోలేదట! 1989లో అసెంబ్లీలోనే కరుణానిధి అనుచరుల చేతిలో  జయ ఘోర పరాభవానికి లోనయ్యారు.  1992లో కుంభకోణంలో ఆమె ప్రత్యేక పూజలు, స్నానాలు చేశారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 50మంది చనిపోయారు...  1992 సంవత్సరంలోనే అప్పటి గవర్నర్ చెన్నారెడ్డి తనతో అమర్యాదగా ప్రవర్తించాడని జయ ఆరోపించారు! 1996లో సుబ్రహ్మణ్యస్వామి కేసు పెట్టినప్పుడు బయటపడ్డ ఆస్తులు 66 కోట్లు. అయితే, అందరినీ ఆకర్షించినవి 12,000 చీరెలు, 30 కిలోల బంగారం, 2,000 ఎకరాల భూమి, 750 జతల చెప్పులు, 8 క్వింటాళ్ల వెండి…  1997లో ఆస్తుల జప్తు జరిగినప్పుడు, ఇక ఆభరణాలు ధరించనని ఒట్టు పెట్టుకుని, తిరిగి అధికారంలోకి వచ్చాకే 2011లో ధరించింది…  పాలనలో ఆమె నియంత. విమర్శలు చేసినా, వార్తలు రాసినా ఎడాపెడా పరువునష్టం కేసులు పెట్టించేది.   జయలలిత ముందు ప్రదర్శించాల్సిన విధేయత విషయంలో పాతకాలం చక్రవర్తుల రాజ వైభోగం కూడా దిగదుడుపే. అమ్మకు మంత్రులు, ఎమ్మెల్యేల పాదాభివందనాలు చాలా కామన్…  ఆమె కళ్లల్లోకి నేరుగా చూడొద్దనీ, బొకే ఇచ్చేసి, వెనక్కి తిరిగి వీపు చూపకుండా, వెనక్కి వెనక్కి నడిచిరావాలని గన్ మెన్ చెప్పేవారట… తమిళ సూపర్ స్టార్, అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ మొదట్లో జయను అనుమానించేవాడట. ఆమె ప్రతి కదలికపై నిఘా వేసి ఉంచేవాడట. వీడియో పార్లర్ నడుపుకునే శశికళను కూడా గూఢచర్యం కోసమే ఎంజీఆర్ జయలలిత వద్ద ఉంచాడట…  1982లో రాజకీయాల్లోకి వచ్చిన జయ 1983లో రాజ్యసభ సభ్యురాలైంది. కాని, వెంటనే  రాజకీయ జీవితాన్నిచ్చిన ఎంజీఆర్ కోపానికీ గురైంది… 1984లో ఎంజీఆర్ కు స్ట్రోక్ వచ్చి, అనారోగ్య సమస్యల్లో ఉంటే... ఈమె రాజీవ్ ను, గవర్నర్ ఖురానాను కలిసి తనను సీఎంను చేయమని అడిగిందంటారు!  1986లో ఎంజీఆర్ తో పడకపోవటంతో పోటీగా జయలలిత పెరవై అనే సమాంతర ఆర్గనైజేషన్ ను కూడా స్టార్ట్ చేసింది! ఎంజీఆర్ మరణం తరువాత తిరుగులేకుండా ఎదిగిన జయ 34ఏళ్లలో నాలుగు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు!   

జయలలిత జీవితంలో అత్యంత ముఖ్యమైనవి... ఈ పదే!

1. జయలలిత ప్రస్తుత బిరుదు పురచ్చి తలైవీ. కాని, ఆమె సినిమాల్లో గ్లామరస్ రోల్స్ చేస్తున్న సమయంలో ఆమెని కవర్చి కన్ని అనేవారు! 2. జయలలిత మొదటి సినిమా తెలుగు, తమిళం, కన్నడ కాదు... ఇంగ్లీష్! ఆమె 1961లో ఎపిస్టల్ అనే సినిమాలో నటించింది. 1966లో విడుదలైన ఆ సినిమా రూపొందించింది మాజీ రాష్ట్రపతి వివి గిరి కొడుకు శంకర్ గిరి. 3. గ్లామరస్ హీరోయిన్ గా దక్షిణాదిని మెస్మరైజ్ చేసిన జయలలిత నటీ కావాలని అస్సలు కోరుకోలేదు! లాయర్ అవ్వాలనుకునేది... 4. జయలలిత మొదటి భారతీయ భాషా చిత్రం ... బ్లాక్ బస్టర్ కన్నడ మూవీ చిన్నదా గొంబే. 5. జన్మతః తమిళ బ్రాహ్మణ అయ్యంగారైన జయలలిత... కర్ణాటకలోని మేల్ కొటే క్షేత్రంలో జన్మించారు! 6. 10ఏళ్ల వయస్సు నుంచీ తమిళనాడులోనే స్థిరపడిన జయ తనని తాను తమిళురాలిగానే భావించేది. ఆ విషయం సూటిగా ప్రకటించినందుకు ఆమెపై కన్నడ సంఘాలు 1970లలో నిరసనలకి దిగాయి. కాని, జయలలిత క్షమాపణ చెప్పేందుకు ససేమీరా అన్నారు... 7. 1973లో ఆమె చేసిన సూర్యగంధి సినిమాలో... స్వయంశక్తితో ఎదిగిన పరిణతి కలిగిన స్త్రీగా మెప్పించింది! 8. తరువాతి కాలంలో జయలలిత జీవితాన్నే మలుపు తిప్పిన యాక్టర్ కమ్ పొలిటీషన్, ఎంజీ రామచంద్రన్, మొట్ట మొదట ఆమెతో జోడీ కట్టడానికి వెనుకాడారు! ఆమె తనకంటే వయస్సులో చాలా చిన్నది కాబట్టి ఎంజీఆర్ జయను తన పక్కన హీరోయిన్ గా వద్దన్నారు! 9. జయలలితపై ఎలాంటి నమ్మకం లేకుండా మొదటి సినిమా చేసిన ఎంజీఆర్... తరువాత ఆమెతో 28సినిమాలు చేశారు! రాజకీయాల్లో కూడా జయను జయప్రదంగా ప్రవేశపెట్టింది ఆయనే! 10. ఎంజీ రామచంద్రన్ స్థాపించిన అన్నాడీఎంకే పార్టీలో 1982లో చేరారు పురుచ్చి తలైవీ. ఆ తరువాత ఆమె మొత్తం నాలుగు సార్లు తమిళనాడు సీఎం అయ్యారు!

జయలలిత శకం... ఏ సంవత్సరంలో ఏం జరిగింది?

1948: 24 ఫిబ్రవరిన కర్ణాటక రాష్ట్రపు  ఆనాటి మైసూర్ సంస్థానంలో మేల్ కొటే క్షేత్రంలో జన్మించారు. 1961: నటిగా సినిమా కెరీర్ ప్రారంభించారు. మొదటి సినిమా ఇంగ్లీష్ భాషలో నిర్మించిన ఎపిస్టల్! 1965: హీరోయిన్ గా మొదటి సినిమా సైన్ చేశారు... 1980: తన చివరి తమిళ సినిమా, నదియై తేడీ వందా కాదల్ లో నటించారు... 1982: ఎంజీఆర్ స్థాపించిన ఏఐఏడీఎంకే పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. కడలూర్ లో మొట్ట మొదటి బహిరంగ సభలో మాట్లాడారు! 1983:ఏఐఏడీఎంకే పార్టీ ప్రాపగాండా సెక్రెటరీగా నియమింపబడ్డారు. తిరుచందూర్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు... 1984: ఎంజీఆర్ తో వైరం ముదిరి దూరం పెరిగింది. అనేక పార్టీ పదవుల్నుంచీ తొలగించబడ్డారు... 1987: ఎంజీ రామచంద్రన్ మరణంతో పార్టీ రెండుగా చీలింది. ఒక వర్గం ఎంజీఆర్ భార్య జానకి రాంచంద్రన్ కు మద్దతు పలికితే ఇంకో వర్గం జయలలితకు అండగా నిలబడ్డారు... 1988: జానకీ రాంచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. కాని, 21రోజుల్లోనే రాష్ట్రం రాష్ట్రపతి పాలనలోకి వెళ్లిపోయింది... 1989: డీఎంకే పార్టీ తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. జానకీ రామచంద్రన్ ఏఐఏడీఎంకే పార్టీ నుంచి తప్పుకున్నారు. జయలలిత పార్టీలో తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. అదే సంవత్సరం డీఎంకే, అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు అంసెబ్లీ హాల్లో ఘర్షణ పడ్డారు. జయకు తీవ్రమైన అవమానం జరిగింది. ఆమె మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో కాలుమోపుతానని శపథం చేసి చినిగిన చీరతో వెళ్లిపోయారు... 1991: ఏఐఏడీఎంకే, కాంగ్రెస్ కూటమి డీఎంకేను మట్టి కరిపించింది. జయలలిత తొలిసారి సీఎం అయ్యారు... 1996: అన్నాడీఎంకే ఘోర పరాజయం పాలైంది. జయలలిత అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు. 48కేసులు ఆమె మీద, ఆమె స్నేహితురాలు శశికళ మీదా మోపబడ్డాయి... 2001: రెండోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఎన్నికయ్యారు. కాని, సుప్రీమ్ తీర్పుతో పదవి కోల్పోయారు. పన్నీర్ సెల్వమ్ అమ్మ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయ్యారు... 2003: ఎన్నికల్లో పాల్గొనేందుకు అనుమతి లభించటంతో ఆండిపట్టి నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచారు పురుచ్చి తలైవీ. మరో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2006: డీఎంకే కూటమి చేతిలో ఓడిపోయిన జయలలిత 2011వరకూ ప్రతిపక్ష నేతగా ఉన్నారు... 2011: మూడోసారి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన జయ ప్రాణ స్నేహితురాలు శశికళకు దూరం అవుతూ వచ్చారు... 2014: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో వంద కోట్ల ఫైన్, నాలుగేళ్ల జైలు శిక్షకి గురైన జయలలిత కటకటాలు లెక్క పెట్టాల్సి వచ్చింది... 2016: వరుసగా రెండోసారి, మొత్తంగా నాలుగోసారి జయలలిత ముఖ్యమంత్రిగా తమిళ ఓటర్ల చేత ఎన్నోకోబడ్డారు!