శశికళ ఆశలు... బూడిదలో పోసిన 'పన్నీర్'!

  సోషల్ మీడియాలో నిన్నటి వరకూ పన్నీర్ సెల్వం గురించి చాలా జోక్స్ షేరింగ్ అయ్యాయి! ముఖ్యంగా, ఆయన సిటీ బస్సులో లేడీస్ సీట్లో కూర్చున్న ప్రయాణికుడి లాంటివాడని చాలా మంది కామెడీ చేశారు! అందుకే, అమ్మ వచ్చినా, చిన్నమ్మ వచ్చిన లేచి నిలబడి కుర్చీ ఇచ్చేస్తుంటాడని కామెంట్ చేశారు! అది నిజమే కూడా! కాని, రాత్రికి రాత్రి సీన్ మొత్తం మారిపోయింది! పన్నీర్ సెల్వం శశికళ ఆశలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ గా మార్చే స్కెచ్ వేశాడు! తనలోనూ అవసరాన్ని బట్టి తెగించే రాజకీయ నేత వున్నాడని సిగ్నల్స్ ఇచ్చాడు...   అర్థ రాత్రి కావస్తోంటే తమిళనాడులో రాజకీయం కొత్త పుంతలు తొక్కింది. జయ బతికి వున్నప్పటి లాగే ఇప్పుడూ ఆమె చుట్టూనే పొలిటికల్ డ్రామా రన్ చేస్తున్నారు తమిళ నేతలు. శశికళ జయ సమాధి దర్శించుకుని తాను సీఎం అవుతానని ప్రకటిస్తే... పన్నీర్ అదే జయలలిత సమాధి వద్ద ధ్యానం చేసి మరీ తిరుగుబాటు ప్రకటించాడు. అమ్మ అత్మ తనని తమిళ ముఖ్యమంత్రిగా కొనసాగమన్నదని చెప్పుకొచ్చాడు. దీంతో శశికళకు, సీఎం పీఠానికి మధ్య మరో పెద్ద అడ్డంకిగా సెల్వం మారిపోయాడు!   శశికళ సీఎం అవ్వాలంటే ఎమ్మెల్యేల మద్దతు కావాలి. అది ఆమెకి పుష్కలంగా వుంది. కాని, లేనిదల్లా అదృష్టమే! ఒకవైపు జనంలో ఆమె పట్ల అంతగా సద్భావం లేకపోవటం, కేంద్రంలోని బీజేపి సర్కార్ కూడా శశికళ కంటే పన్నీర్ సెల్వాన్నే ఇష్టపడుతుండటం, అన్నిటికంటే మించి సుప్రీమ్ కోర్టులో చిన్నమ్మపై పెద్ద తీర్పు వేలాడుతూ వుండటం ఛేదించరాని చిక్కులుగా మారాయి. ఇక ఇప్పుడు పన్నీర్ సెల్వం తిరుగుబాటు శశికళ కన్నీరుకు మరింత కారణమైంది!   పన్నీర్ సెల్వం తన రాజీనామా వెనక్కి తీసుకుంటానని చెప్పినంత మాత్రాన శశికళకు పార్టీలో వున్న మద్దతు తుడిచి పెట్టుకుపోయేది కాదు. కాని, ఏ నిర్ణయం చెప్పకుండా ముఖం చాటేస్తున్న గవర్నర్ విద్యాసాగర్ రావుకి ఇది మంచి అవకాశం. పన్నీర్ తిరుగుబాటు కారణంగా చూపి ఆయన శశికళ చేత ప్రమాణ స్వీకారం చేయించకుండా వుండవచ్చు. అవసరమైతే బలనిరూపణ అంటూ కొంత కాలయాపన చేయవచ్చు. ఇంతలో అత్యున్నత న్యాయస్థానం తీర్పు రానే వస్తుంది! అందులోంచి శశికళ కళంకం లేకుండా బయటపడుతుందనే నమ్మకం ఆమెతో సహా దాదాపుగా ఎవరికీ లేదు.   ఇప్పటికే జయలలితకు ఎంతో నమ్మకస్థుడైన సెల్వంపై వేటు వేసింది శశికళ. పార్టీ పదవి నుంచి ఆయనను తొలగించింది. ప్రాథమిక సభ్యత్వం కూడా వుండదని చెబుతోంది. ఇవన్నీ కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చాక ఆమెకు ప్రజల్లో సానుభూతి తగ్గేలా చేస్తాయి. ఇప్పటికే ఆమె పట్ల అభిమానం అంతంత మాత్రం. మరో వైపు జయ మేనకొడలు, ఏఐఏడీఎంకే నేత పాండ్యన్, సెల్వం, నటి గౌతమి ... ఇలా చాలా మంది జయ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. స్టాలిన్ ది కూడా అదే మాట. ఇటువంటి నేపథ్యంలో కేంద్రం దర్యాప్తుకు ఆదేశిస్తే శశికళ చిక్కులు మరింత పెరిగిపోతాయి. మొత్తానికి ఒక్కో పరిణామం ఆమెను సీఎం కుర్చీకి దూర దూరంగా జరుపుకుంటూనే వస్తుంది తప్ప ఇప్పటికిప్పుడు సెక్రటేరియట్ కి దార్లు సుగమం అయ్యేలా కనిపించటం లేదు!   శశికళకు వ్యతిరేకంగా తీర్పు వచ్చాక కూడా ఎమ్మెల్యేలు ఆమె వెంటే వుంటామని అంటారా? అలా జరగటం అరుదు. మెల్లగా ప్లేటు ఫిరాయించే వారే ఎక్కువ. ఆ నమ్మకంతోనే పన్నీర్ సెల్వం బల పరీక్షకు సిద్ధం అంటున్నాడు. ఒకవేళ ఆయన బలనిరూపణ చేసుకోలేక పోతే... శశికళ జైలుకి వెళ్లాల్సి వస్తే ... ఎవరు సీఎం? ఇలాంటి గందరగోల పరిస్థితుల్లో డీఎంకే కోరుకుంటున్నట్టు గవర్నర్ పాలన వచ్చినా ఆశ్చర్యం లేదు. బీజేపికి కూడా రజినీకాంత్ పార్టీని అడ్డుపెట్టుకుని తమిళనాడు అసెంబ్లీలో కాలుపెట్టాలని మనసులో కోరిక వుంది. అందుకు, గవర్నర్ పాలన చక్కగా ఆరేడు నెలల సమయం ఇస్తుంది! పన్నీర్ సెల్వం లాంటి శశికళ వ్యతిరేక వర్గం బీజేపికి అండగా వుంటుంది..   ఇప్పటికైతే... తమిళ రాజకీయాలు అమీబాలాగా మారిపోయాయి! ఎప్పుడు ఏ రూపం తీసుకుంటాయో ఎవ్వరికీ తెలియదు!

ఎన్టీఆర్ సినిమాలో ' ఆ రెండు పాత్రల' గురించే జనం డిస్కషనంతా!

ఎన్టీఆర్... ఈ పేరు తెలుగు వారికి ఒక పదం కాదు! పరమార్థం! ఎన్టీఆర్ అంటే కొందరికి హీరో, మరి కొందరికి రాజకీయ నేత, ఇంకా కొందరికైతే అవతార పురుషుడు! అలాంటి విశిష్ట వ్యక్తి జీవితం ఆధారంగా సినిమా అంటే ఇంకేముంది? అదీ ఎన్టీఆర్ తనయుడు, శత చిత్ర కథానాయకుడు, బాలకృష్ణ నటిస్తారంటే ఇంక అభిమానుల ఆనందానికి హధ్దు వుంటుందా? ఇప్పుడు అదే జరుగుతోంది! నందమూరి ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా! ఒక నందమూరి అందగాడు మరో నందమూరి చారిత్రక జీవితం గురించి సినిమా చేయటం... నిజంగా అద్బుతమే!   ఎన్టీఆర్ గురించి సినిమా అంటే అందరూ ఆనందపడిపోతారు. కాకపోతే, అదే సమయంలో కొన్ని ప్రశ్నలు మాత్రం ఇప్పట్నుంచే రాజకీయ, సినిమా జీవుల్ని వేధిస్తూ వుంటాయి! ఎందుకంటే, నిమ్మకూరులో మొదలైన ఎన్టీఆర్ మహా ప్రయాణం చెన్నై మీదుగా హైద్రాబాద్ కి వచ్చింది. ఆయన సినీ రంగాన్ని ఏలినంత కాలం ఏ వివాదమూ లేదనే చెప్పాలి. ఒక మామూలు మధ్య తరగతి కుటుంబం నుంచీ ప్రతీ తెలుగు కుటుంబంలోనూ తానొక సభ్యుడిగా ఎదిగారు. ఇదంతా సినిమాగా చూపటం కష్టమైనా సాధ్యమనే చెప్పాలి! కాని, అసలు సమస్యంతా నటరత్న ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతోనే! ఆ తరువాత పరిణామాల్ని సినిమా తీయబోయే డైరెక్టర్ ఎలా చూపనున్నాడని జనం మాట్లాడుకుంటున్నారు!      టీడీపీ పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో అధికారం చేపట్టిన ఎన్టీఆర్ ఇందిరా గాంధీకి, కాంగ్రెస్ కు ఎదురు నిలిచారు. కాని, తరువాతి కాలంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మొదటి సారి సీఎం అవ్వగానే ఓ సారి పదవి గండం ఎదుర్కొన్నారు. ఈ ఘట్టంలో ఎవర్ని దోషులుగా చూపబోతున్నారనేది ఇంట్రస్టింగ్ అంశం! ఎందుకంటే, ఖచ్చితంగా ఆనాటి ప్రముఖ కాంగ్రెస్ నేతల్నే ఈ ఎపిసోడ్ లో విలన్స్ గా చేయాల్సి వుంటుంది. ఇక టీడీపీ చీలిక సమయంలో ప్రస్తుత ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబుది కీలక పాత్ర. ఆయన క్యారెక్టర్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలా చూపిస్తారన్నదీ ఆసక్తికర అంశమే!      ఎన్టీఆర్ గా నటిస్తానని చెబుతోన్న బాలకృష్ణకు చంద్రబాబు స్వయానా బావ. అలాగే, ఇప్పుడు ఆయన కొడుకు లోకేష్ బాలయ్యకు అల్లుడు కూడా! మరి సినిమాలో ఎన్టీఆర్ చంద్రబాబుల మధ్య సంఘర్షణని ఎలా చూపిస్తారు? ఇప్పుడు అందర్నీ తొలిచేస్తోన్న అతి పెద్ద ప్రశ్న ఇదే! అలాగే, బాలకృష్ణ, ఇతర నందమూరి కుటుంబ సభ్యులు ఎవ్వరూ పెద్దగా సత్సంబంధాలు పెట్టుకోని ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి. మహానటుడి జీవితపు చివరి అంకంలో ఆమె ప్రవేశించింది. ఆమె పాత్ర లేకుండా కూడా ఎన్టీఆర్ బయోపిక్ అసాధ్యమే. మరి ఆ పాత్రని దర్శకుడు ఎలా హ్యాండిల్ చేస్తాడో వేచి చూడాలి!  ప్రాక్టికల్ గా మాట్లాడుకున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు వున్నప్పటికీ బాలకృష్ణ తండ్రి జీవితం పై సినిమా చేస్తాననటం మెచ్చుకోదగిందే. గౌతమీ పుత్ర లాంటి సాహసవంతమైన చిత్రం చేసిన ఆయన మరోసారి అదే బాటలో సాహసం ప్రదర్శించటం అద్భుతం. కాకపోతే, ప్రస్తుతానికి ఈ ల్యాండ్ మార్క్ మూవీకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి... ఆయన ఈ కత్తి మీద సాము ఎలా చేస్తారో!

సీఎంకు ప్రాణగండమా? అందుకే, సెక్యురిటీ పెంచేశారా?

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రాణ గండం పొంచి వుందా? పరిస్థితులు చూస్తుంటే అలానే వుంది. అయితే, సీఎం భద్రతకు ముప్పు తీసుకొస్తోంది ఆయన వ్యక్తిగత ఆరోగ్య కారణాలు కావు. అంతకన్నా ప్రమాదకరమైన మావోయిస్టు కోణం నుంచి గండం వాటిల్లనుందంటున్నారు. అంతే కాదు, భారీగా భద్రత కూడా పెంపు చేశారు. ఇప్పటికే మావోయిస్టు ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి జెడ్ ప్లస్ క్యాటగిరి రక్షణ కట్టుదిట్టంగా వుంటుంది. కాని, ఈ మధ్య నక్సల్స్ కదలికలు అనుమానాస్పదంగా , ఆందోళనకరంగా మారటంతో కేసీఆర్ సెక్యురిటీ మరింత పెంచారు.    అటు ఆంధ్రప్రదేశ్ లోఒడిశా బార్డర్ లో మావోల కలకలం ఈ మధ్య చాలా ఎక్కువైంది. అలాగే తెలంగాణలో కూడా ఉత్తర ప్రాంత జిల్లాల్లో వామపక్ష తీవ్రవాదులు బలంగా సంచరిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే, ఆల్రెడీ ఆరు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలున్న సీఎం కాన్వాయ్ లో మరో మూడు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ యాడ్ చేశారు. ఒక అంబులెన్స్ కూడా వెంట వుంటుంది. ఇక ఇప్పటి దాకా సీఎం చుట్టూ వుండే జెడ్ ప్లస్ సెక్యురిటీలో ఇద్దరు డీఎస్పీలు వుండేవారు. కాని, వారికి తోడుగా మరో ఆరుగురు ఇన్ స్పెక్టర్లని నియమించారు. 36మంది కేంద్ర ఎన్ఎస్జీ భద్రతా సిబ్బందితో పాటూ రాష్ట్ర సెక్యురిటీ ఫోర్స్ నుంచి పన్నెండు మంది వుండేవారు. ఈ సంఖ్యని పదహారుకి పెంచారు.    సీఎం ఎక్కువగా గడిపే క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ వద్ద మొత్తం పది సెక్యురిటీ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌజ్ వద్ద రెండు నుంచి ఆరు సెక్యురిటీ పోస్ట్ లకు భద్రతను పెంచారు. అంతే కాదు, కేసీఆర్ గతంలో మాదిరిగా ఎప్పుడంటే అప్పుడు ఫామ్ హౌజ్ కి వెళ్లకపోవటం మంచిదని అధికారులు చెప్పారంటున్నారు. ముందస్తు సమాచారం ఇచ్చాకే బయలుదేరాలని వారు కోరారట.    ఈ హఠాత్ భద్రతా చర్యల్ని చూస్తుంటే ఇంటలిజెన్స్ వర్గాలకి మావోల కదలికలపై గట్టి సంకేతాలే అందినట్టు అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్ కౌంటర్లకి నక్సల్స్ లోలోన రగిలిపోతున్నారు... 

నేతాజీ చనిపోలేదా? 117ఏళ్ల ఆయన డ్రైవర్ నిజాముద్దీన్ నమ్మిన నిజమేంటి?

  '' నేతాజీ 1945లో విమాన దుర్ఘటనలో చనిపోలేదు! '' ఈ మాటలు మనం ఇప్పుడు కొత్తగా వింటున్నవి కాదు! దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ పదే పదే వినిపిస్తూనే వున్నాయి. కాని, నిన్న ఒక 117ఏళ్ల పెద్దాయన వారణాసిలో చనిపోయాడు. ఆయన కూడా ఇదే అనటమే ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది! ఇంతకీ ఆయనెవరో తెలుసా? నేతాజీ అనుంగు అనుచరుడు. పేరు నిజాముద్దీన్. బోస్ గురించి తన జీవితాంతం ఒకానొక పెద్ద నిజాన్ని మనసులోనే దాచుకున్న స్వాతంత్ర్య సమరయోధుడు!   నిజాముద్దీన్ తన సుదీర్ఘ జీవితంలో ఏనాడూ నేతాజీ మరణించాడంటే ఒప్పుకోలేదు! అంతే కాదు, మన దేశ ప్రభుత్వాలు ఎన్నిసార్లు కమిటీలు, కమీషన్లు వేసినా అన్నిటికి తనతో దాగిన నిజాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు నిజాముద్దీన్. కాని, ఆయన్ని ఏ సత్య శోధన బృందమూ పట్టించుకోలేదు. కాని, ఆయన చెప్పిన మాటలు మాత్రం బోస్ అభిమానులకి, భారతీయులందరికీ ఎంతో ఆసక్తి, ఆనందం కలిగిస్తాయి! దాదాపు నాలుగేళ్లు సుభాష్ చంద్రబోస్ తో కలిసి ఇండియన్ నేషనల్ ఆర్మీలో నిజాముద్దీన్ పని చేశాడు. అత్యంత సన్నిహితంగా ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతితో మసిలేవాడు. అయితే, 1945లో తైవాన్ లో విమానం కూలి నేతాజీ చనిపోయాడని చెబుతోన్న తేదీ తరువాత ... దాదాపు మూడు నెలలకి తాను సుభాష్ ని బర్మా బార్డర్ వద్ద కార్ లో దిగబెట్టానని నిజాముద్దీన్ చెప్పేవాడు. ఆ తరువాత ఉత్తర్ ప్రదేశ్ లో బోస్ చాలా ఏళ్లు గుమ్నామి బాబాగా సన్యాస జీవితం గడిపాడని కూడా అనేవాడు. నిజాముద్దీన్ మాటల్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కాని, 2015లో బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రహస్య డాక్యుమెంట్లు బయట పెట్టింది. వాటిల్లో నేతాజీ ప్లెయిన్ క్రాష్ లో చనిపోలేదని అనుమానం వ్యక్తం అయింది. నిజాముద్దీన్ ఆ సమయంలో తన వాదన నిజమైందని వాదించాడు!   నిజానికి ఒకప్పుడు చాలా ఏళ్లు బ్రిటీష్ వారి సేవలో సైనికుడిగా వున్న సైఫుద్దీన్ తరువాత నిజాముద్దీన్ గా పేరు మార్చుకున్నాడు. బోస్ పిలుపుతో ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరి గూఢచారిగా పని చేశాడు. అందుకే, పేరు మార్చుకోవాల్సి వచ్చింది. అయితే, నిజాముద్దీన్ 1945లో బోస్ ను సురక్షితంగా బర్మా బార్డర్ లోదించేసి తిరిగొచ్చాడు. అప్పట్నుంచీ 2017 ఫిబ్రవరీ 6 వరకూ ఉత్తర్ ప్రదేశ్ లోనే జీవించాడు. ఆయన విశ్వాసం ప్రకారం నేతాజీ కూడా గుమ్నామీ బాబాగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోనే శేష జీవితం గడిపాడు! ఇదంతా మనం ఎంతో కొంత నమ్మితీరాల్సిందే! ఎందుకంటే, నిజాముద్దీన్ నిస్వార్థంగా, నిజాయితీగా బోస్ వెంట నడిచిన స్వాతంత్ర్య సమర యోధుడు. పైగా జన్మతః ముస్లిమ్. ఆయనకు బోస్ ను హిందూ సాధువుగా జీవించాడని చెప్పటంలో ఎలాంటి స్వార్థం వుండే అవకాశం లేదు!   నిజాముద్దీన్ జీవిత కాల కోరిక నేతాజీ మరణం చుట్టూ అల్లుకున్న మిస్టరీ పొర తొలిగిపోవాలనీ! నిజం బయటకు రావాలని దురదృష్టవశాత్తూ 117ఏళ్లు జీవించిన నిజాముద్దీన్ తాను కోరిన , నమ్మిన నిజం వెలుగు చూడకుండానే కన్నుమూశాడు!

తెలుగు రైతుపై కన్నడ కాంట్రాక్టర్ పైశాచికం

పరిహారం పెంచండి అన్న పాపానికి తెలుగురైతును గాలిలో వేలాడదీశాడు కర్ణాటకకు చెందిన కాంట్రాక్టర్. అసలు వివరాల్లోకి వెళితే..అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకు అతి సమీపంలో ఉంటుంది. తుముకూరు జిల్లా మధుగిరి నుంచి పావగడకు ఓ హైటెన్షన్ లైను వేసే ప్రాజెక్ట్‌ను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించింది కర్ణాటక ప్రభుత్వం..ఈ నేపథ్యంలో దాని నిర్మాణం కోసం ఏపీ సరిహద్దు గ్రామాల మీదుగా 220 కేవీ టవర్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో మడకశిర మండలం మెళవాయి గ్రామ రైతు నబీరసూల్ పొలంలో కర్ణాటక విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా హైటెన్షన్ వైర్లు వెళుతున్న పొలాలకు చెందిన రైతులకు నష్టపరిహారం ప్రకటించారు.     అయితే నబీరసూల్ అనే రైతు తనకు తగిన నష్టపరిహారం దక్కలేదంటూ కుమారుడితో కలిసి పనులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. తగిన నష్టపరిహారం ఇవ్వకుండా పనులు చేయడానికి వీల్లేదంటూ తండ్రికొడుకులు ఇద్దరూ తీగలను పట్టుకున్నారు. ఈ దశలో కనీసం వారిని పట్టించుకోకుండానే జేసీబీతో వైర్లను లాగివేశారు.. దీంతో 15 అడుగుల ఎత్తు వరకు వైర్లను పట్టుకున్న తండ్రి ఇక శక్తి లేక వదిలివేయటంతో కింద పడిపోయాడు. అయితే కుమారుడు వన్నూర్‌సాబ్ మాత్రం తీగను పట్టుకుని 40 అడుగుల వరకు వెళ్లిపోయాడు..సుమారు 15 నిమిషాల పాటు గాల్లోనే వేళాడుతూ.."కాపాడండి..కాపాడండి" అంటూ ఆర్తనాదాలు చేసినా కర్ణాటక విద్యుత్ అధికారులు కానీ..కాంట్రాక్టర్ కానీ పట్టించుకున్న పాపాన పోలేదు.   అలా వేలాడి..వేలాడి కాసేపటికి అతను కూడా కిందపడిపోయాడు. అంత ఎత్తు నుంచి కింద పడటంతో అతని నడుముకు తీవ్ర గాయమైంది. వెంటనే స్పందించిన తోటి రైతులు వన్నూర్‌సాబ్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాజెక్ట్ పని పూర్తయిన తర్వాత తీరిగ్గా సర్వే చేసి పరిహారం అందిస్తామని కాంట్రాక్టర్ ప్రతినిధులు చెప్పడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక విద్యుత్తు శాఖతో మాట్లాడి రైతులకు న్యాయమైన పరిహారం ఇప్పిస్తామని పల్లె హామీ ఇచ్చారు.

పాత పదాలు... కొత్త అర్థాల... మోదీ డిక్షనరీ!

నరేంద్ర మోదీని షార్ట్ గా ఏమంటారు? నమో అనే కదా! అయితే, అందరూ నరేంద్ర మోదీని షార్ట్ గా నమో అంటే ఆయన ఇప్పటి వరకూ చాలా రకాల షార్ట్ ఫామ్స్ నే తన వంతుగా జనంలోకి వదిలారు! తాజాగా scam అంటే ఏంటో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సభలో చెప్పుకొచ్చారు. సమాజ్ వాది, కాంగ్రెస్, అఖిలేష్, మాయవతి అని ఫుల్ ఫామ్ ఇచ్చారు! దీనికి ప్రతిగా రాహుల్ కూడా తనదైన స్టైల్లో ఓ వివరణ ఇచ్చాడనుకోండి... కాని, మోదీ ఇలా చేయటం కొత్త కాదు. ఇంతకు ముందు ఆయన చాలా సార్లు ఇంగ్లీష్ పదాలకి, హిందీ పదాలకి డిఫరెంట్ మీనింగ్ ఇచ్చి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా, ప్రతిపక్షాల్ని షార్ట్ అండ్ స్వీట్ గా కార్నర్ చేశారు. అవేంటో కొన్ని చూసేద్దాం....    వికాస్ అనే హిందీ పదానికి మోదీ విద్యుత్, కానూన్, సడక్ అంటూ కొత్త అర్థం చెప్పారు. ఈ మూడు వుంటేనే వికాసం జరిగేది అంటూ జనానికి హామి ఇచ్చారు! ఇక ఎప్పుడూ తనపై విమర్శల గన్ను ఎక్కుపెట్టే అరవింద్ కేజ్రీవాల్ కి నమో ఇచ్చిన షార్ట్ ఫామ్ AK 49! ఇలా అనటానికి కారణం కేజ్రీవాల్ అప్పట్లో తొలిసారి ఢిల్లీ సీఎంగా 49రోజులు మాత్రమే పాలన చేసి రాజీనామా చేయటమే! ప్రధాని హిట్ లిస్ట్ లో కేజ్రీవాలే కాదు సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా కూడా వున్నాడు! ABCD అంటే ఏంటో చెబుతూ ఆయన ఆదర్శ్, భోఫోర్స్, కోల్, దామాద్ అన్నాడు! ఆదర్శ్, భోఫోర్స్, కోల్ అనేవి కుంభకోణాలు కాగా దామాద్ అంటే అల్లుడు! సోనియాకి అల్లుడుగా వాద్రా యూపీఏ హయాంలో స్కామ్ లు చేశాడని జనంలోకి సమర్థంగా తీసుకెళ్లగలిగారు!   పాకిస్తాన్ లో మూడు ఏకేలు జేజేలు అందుకుంటాయని కూడా ఓ సారి సెటైర్ వేశారు మోదీ! ఆ  ఏకేస్ ఏంటంటే.... ఏకే 47 గన్ను! ఏకే ఆంథొని అనే యూపీఏ కాలపు భారత రక్షణ మంత్రి! ఏకే 49గా పిలవబడే అరవింద్ కేజ్రీవాల్! సబ్ కా అనే హిందీ పదానికి మోదీ ఇచ్చిన వివరణ... సమాజ్ వాది, బహుజన్ సమాజ్ వాది, కాంగ్రెస్ పార్టీలని! ఈ మూడింటిని కలిపి, అంటే, సబ్కాను అంతం చేయాలని పిలుపునిచ్చారు! హిందీలో సబ్కా అంటే అందరూ అని అర్థం తెలిసిందేగా! బీజేపి తప్ప అందర్నీ తిరస్కరించండని ఆయన ఉద్దేశం...    ప్రతిపక్షాల్ని టార్గెట్ చేసే ఛమత్కారాలే కాదు... మోదీ అప్పుడప్పుడూ ఇతర పదాలకి కూడా కొత్త భాష్యాలు చెప్పారు. ఉదాహరణకి NDA అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్. అయితే, ఆయన ఇచ్చిన నేషనల్ డెవలప్ మెంట్ అలయెన్స్! అలాగే, JAM అంటే జన్ ధన్, ఆధార్, మొబైల్ అంటూ చెప్పుకొచ్చారు. డీమానిటైజేషన్ తరువాతి పరిణామాల్లో ఇలా అన్నారు. ఐటీ గురించి కూడా మోదీ ఛమత్కారంగా IT ప్లస్ IT ఈజ్ ఈక్వల్ టూ IT అన్నారు. అంటే, ఇండియన్ టాలెంట్ ప్లస్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ ఈక్వల్ టూ ఇండియా టుమారో!    మోదీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చాక ఇలా వాడిన సరికొత్త పదాలు, అర్థాలు, భాష్యాలు ఇంకా చాలానే వున్నాయి. వాట్ని వాడిన తరువాత జరిగిన ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు కూడా చాలా సార్లే వచ్చాయి. కాకపోతే, అప్పటికప్పడు మాత్రం స్పీచ్ వింటోన్న జనాల్లో కొత్త ఉత్సాహం రేకెత్తిస్తున్నాయి ఈ షార్ట్ ఫామ్స్ అండ్ ఫుల్ ఫామ్స్! మోదీ వాక్ చాతుర్యాన్ని చాటుతున్నాయి... 

ఆ రోడ్డు పేరు మార్చి... ఔరంగజేబు అన్న పేరు పెట్టారు! ఎందుకో తెలుసా?

అది ఢిల్లీ నడి బొడ్డులో ఒక రోడ్డు! పేరేంటో తెలుసా? డల్హౌసీ రోడ్! అవును, మనకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లైనా ఇంకా బ్రిటీషు వాడైన డల్హౌసీ పేరే వుండేది. కాని, ఎట్టకేలకు కాలం కలిసి వచ్చి పేరు మార్చారు. ఇప్పుడు నియంతలా పరిపాలించిన డల్హౌసీ పేరు కాక షిఖో మార్గ్ అంటారు ఆ రోడ్డుని! మరయితే ఈ షిఖో ఎవరు అంటారా?    దారా షిఖో.. ఈ పేరు సాధారణంగా మనం విని వుండి ఛాన్సే వుండదు. కాని, చరిత్ర తెలిసిన వారికి అతడెవరో బాగానే తెలుసు! మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు అన్న దారా షిఖో! అయితే, బ్రిటీషు వాడి పేరొద్దని మొఘల్ రాజులకు సంబంధించిన అంతగా పేరులేని ఈ షిఖోను నెత్తికెత్తుకోవటం దేనికి అని ఎవరికైనా డౌట్ రావచ్చు! కాని, ఇక్కడే అసలు ట్విస్ట్ వుంది. షాజహాన్ పెద్ద కొడుకైన దారా షిఖో విధి సహకరించి వుంటే మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యి వుండేవాడు. కాని, అలా జరగలేదు. అతడి తమ్ముడైన కర్కశ వీరుడు ఔరంగజేబు అతడ్ని మొదట బంధించి జైలులో పెట్టి చివరకు నిర్ధిక్షిణ్యంగా చంపించి వేశాడు!   దారా షిఖో పేరు విజయ్ చౌక్ కి దగ్గర్లోని డల్హౌసీ మార్గ్ కి పెట్టడానికి కారణం ఆయన షాజహాన్ కొడుకు, ఔరంగజేబు అన్న అవ్వటం మాత్రమే కాదు. ఆయన తన జీవితాంతం భారతదేశంలోని హిందూ, ముస్లిమ్ ల మధ్య సఖ్యత కోసం తపించాడు. ఎంతో కృషి చేశాడు. అందుకే, మోదీ సర్కార్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ చేత షిఖో మార్గ్ ఏర్పాటు చేయించింది! చరిత్రలో ఎన్నో లక్షల మందిని, ముఖ్యంగా, హిందూ, సిక్కు మతాల వాళ్లని చంపాడని పేరున్న ఔరంగజేబుకే ఢిల్లీలో ఒక రహదారి వున్నప్పుడు ఆయన చేతుల్లో చచ్చిపోయిన గొప్ప వీరుడు, దారా షిఖోకు మాత్రం ఎందుకు వుండకూడదు? ఇది నిజంగా అందరూ స్వాగతించాల్సిన పరిణామం!   

సినిమా క్యాసెట్లతో వచ్చింది... సినిమా స్టైల్లోనే ఎదిగింది!

శశికళ... శశికళ.. శశికళ... ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే కలకలం! జయలలిత స్నేహితురాలిగా నిన్న మొన్నటి వరకూ వార్తల్లో వున్న ఆమె ఇప్పుడు కాబోయే సీఎం! అమ్మ తరువాత చిన్నమ్మగా తమిళ ప్రజలకి మాతృ ప్రేమ పంచబోతోంది! కొందరు ఓకే అన్నా, కొందరు నాట్ ఓకే అన్నా, కొందరు అస్సలు కుదరదు అన్నా శశికళ తన రూట్లో తాను సెక్రటేరియట్ కి దారితీస్తోంది. అయితే, ఈ శశికళ ఎవరు? ఒకప్పుడు వీడియో క్యాసెట్లు అమ్ముకున్న ఆమె ఇవాళ్ల చెన్నై రాజకీయాల్లో వీరనారిగా ఎలా అవతరించగలిగింది? తెలుసుకుంటే ఆశ్చర్యకరం కలగకమానదు!   శశికళ తాత తంజావూరులో నాటు వైద్యుడు. ఆయన కొడుకు వివేకానందన్. అతనో ఆల్లోపతి మందుల దుకాణం నడిపేవాడు. అందుకే, శశికళ కుటుంబాన్ని తంజావూరులో ఇంగ్లీషు మందుల దుకాణం వాళ్లు అనేవారు. అలా మెడికల్ షాపు నడిపే వివేకానందన్ కి జన్మించిన ఐదో సంతానమైన శశికళ నటరాజన్ ను పెళ్లి చేసుకుంది. ఆయన తమిళనాడు ప్రభుత్వంలోని పౌర సరఫరాల శాఖలో అధికారి. అదే జయలలిత వైపుకి శశికళ అడుగులు పడేలా చేసింది!   జయలలిత అన్నాడీఎంకేలో చేరగానే ఆమెను రాజ్యసభ సభ్యురాలిని చేసిన ఎంజీఆర్ ప్రచార కార్యదర్శిగా కూడా నియమించారు. ఆ బాధ్యతల్లో భాగంగా జయలలిత కడలూరుకు వెళ్లింది. అక్కడ ఆమెకు స్థానిక కలెక్టర్ చంద్రలేఖతో పరిచయం ఏర్పడింది. తరువాత చంద్రలేఖే జయకు సహాయకురాలుగా నియమింపబడింది. అలా వారిద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగింది. కాని, తనకు తెలియకుండానే కలెక్టర్ చంద్రలేఖ ఓ చారిత్రక కలయికకి పునాది వేసింది! ఆమె తనకు అప్పటికే పరిచయం వున్న గవర్నమెంట్ అధికారి నటరాజన్ను, ఆయన భార్య శశికళను జయకు పరిచయం చేసింది. శశికళకు అప్పటికే వీడియో క్యాసెట్ల దుకాణం వుండటంతో జయలలిత ఆమెతో ఇంగ్లీషు సినిమాలు తెప్పించుకుని చూస్తూ వుండేది! అదే వారిద్దరి మధ్యా ప్రగాఢమైన అనుబంధానికి దారితీసింది! అసలు ఒక దశలో వాళ్లిద్దరూ ఓ గుడిలో దండలు మార్చుకుని పెద్ద దుమారమే రేపారు!   1989 వరకూ ఆషామాషిగా నడిచిన అమ్మ, చిన్నమ్మల ఫ్రెండ్ షిప్ అప్పట్నుంచీ కొత్త పుంతలు తొక్కింది. శశి ఏకంగా జయ ఇంట్లోకే మకాం మార్చింది. ఇద్దరూ ఒకర్ని వదిలి ఒకరు వుండటమే మానేశారు. జయలలిత తన రక్త సంబంధీకులందర్నీ దూరం పెట్టేసింది. శశికళే తన తోడు, నీడ అనుకుంది. శశికళ కూడా స్లోగా జయ జీవితాన్ని తన ప్రభావంతో నింపేసింది. ఆఖరుకు ఆమె ప్రఖ్యాత పోయెస్ గార్డెన్ ఇంట్లో పని వారు కూడా శశికళ భర్త ఊరైన మన్నార్ గుడి నుంచే వచ్చేవారు!   శశికళ పూర్తిగా జయ ప్రపంచంపై పట్టుబిగిస్తున్న కాలంలోనే ఎక్కడో బెడిసి కొట్టింది. అమాంతం పురుచ్చి తలైవీ ఆమెని, ఆమె కుటుంబాన్ని ఇంట్లోంచి గెంటేసింది. దీనికి కారణం అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి , ప్రస్తుత ప్రధాని అందించిన సమాచారమే అంటారు. జయకు తెలియకుండా ఆమె చుట్టూ శశికళ , ఆమె కుటుంబం గొయ్యి తోవుతున్నారని మోదీ చెప్పాడంటారు. ఆయనకు వున్న ఇంటలిజెన్స్ సమాచారాన్ని నమ్మిన జయలలిత శశికళ, ఆమె కుటుంబం ... ఉరఫ్ , మన్నార్ గుడి మాఫియాను పోయెస్ గార్డెన్ లోంచి బయటకు పంపింది.     కాని, మూడు నెలల్లోనే శశికళ కాళ్లు పట్టుకుని బతిమాలి తిరిగి స్నేహితురాలి పంచన చేరింది. అదే జయ చేసిన ఆఖరి తప్పని కొందరంటారు. ఆ విషయం ఎలా వున్నా శశికళ తిరిగి వచ్చాక క్రమంగా జయమ్మ ఆరోగ్యం క్షీణించింది. అపోలో హాస్పిటల్లో అంతిమ ఘడియలు గడిచిపోయాయి. అప్పుడు కూడా ఆమె పక్కన శశికళ తాను వుందే తప్ప ఎవ్వర్నీ దగ్గరకు రానీయలేదు! అమ్మ జీవితాన్ని చిన్నమ్మ శాసించిందా? చెప్పలేం. కాని, ఆమె జీవితాన్ని మాత్రం ఈమె ఖచ్చితంగా ప్రభావితం చేసింది! 

హనుమను పట్టుకోవాలని చూసిన సముద్ర రాక్షసి.... సైంటిస్టులకి దొరికిందా?

హనుమంతుడు సీతమ్మను అన్వేషిస్తూ లంకకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే! కాని, అలా వెళ్లేప్పుడు సింహిణి అనే ఒక రాక్షసని చంపాడని మీకు తెలుసా? సముద్రం మీద ఆంజనేయుడు ప్రయాణిస్తుంటే సింహిణి ఆయన నీడను పట్టుకుని లాగిందట. ముందుకు పోవటం ఇబ్బంది అయిన మారుతి కారణం గమనించి సింహిణి అంతు చూశాడు. తరువాత లంకకు దూసుకుపోయాడు. కాని, అసలు నీడను పట్టుకుని లాగిన ఆ రాక్షసి ఎవరై వుంటారు? తాజాగా బయటపడ్డ ఒక ఆశ్చర్యకర విషయం వింటే మనకు రామాయణంలోని సింహిణిపై కొంత క్లారిటి వచ్చే అవకాశం వుంది!   హనుమంతుడు సీతాన్వేషణ కోసం ప్రయాణించిన హిందూ మహాసముద్రంలోనే వుంది మారిషస్ దేశం. అయితే ఈ దీవుల సమూహం కొన్నాళ్ల కిందట కొందరు శాస్త్రవేత్తల్ని తీవ్రంగా ఆకర్షించింది! కారణం... ఇక్కడ మామూలుగా వుండాల్సిన గురుత్వాకర్షణ కంటే ఎక్కువ శక్తి వుండటమే! అంతే కాదు, మారిషస్ లో సైంటిస్టులకి జిర్కాన్ క్రిస్టల్స్ అనేవి కూడా దొరికాయి. ఆ పదార్థం అక్కడ ఏ విధంగానూ దొరకాల్సింది కాదు. మరి జిర్కాన్ క్రిస్టల్స్ మారిషస్ తీరానికి ఎలా వచ్చాయి? ఈ ప్రశ్నలతో మొదలైన అన్వేషణ, అధ్యయనం చివరకు ఆశ్చర్యకర సత్యాల వెల్లడికి దారి తీసింది!   మారిషస్ లో సాధారణం కంటే ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి వుండటానికి కారణం ఆ ద్వీపాల కింద మరో ఖండం వుండటమే అంటున్నారు నిపుణులు! ఆ ఖండం కింద వుండటం వల్లే జిర్కాన్ అనే పదార్థం క్రిస్టల్స్ గా మారి పైకి వచ్చిందంటున్నారు. భూమి లోపల జరిగే తీవ్రమైన వోల్కనిక్ చర్యల వల్ల ఇలా పైకి తన్నుకొస్తుందని చెబుతున్నారు. మారిషస్ కింద భాగంలో వుందంటోన్న ఈ ఖండానికి మారిషియా అనే పేరు కూడా పెట్టారు!   ఇప్పుడు మనం చూస్తోన్న ఏడు ఖండాల భూమండలం ఎప్పుడూ ఇలాగే వుండేది కాదని శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. గతంలో ఒక సూపర్ కాంటినెంట్ వుండేదని వారు అంటున్నారు. అది తరువాతి కాలంలో ఒత్తిడికి లోనై ముక్కలైందని భావిస్తున్నారు. అదే క్రమంలో ఈ మారిషియా ఖండం నీళ్లలో మునిగిపోయి వుండవచ్చు. బహుశా హనుమంతుడు సముద్ర లంఘణం చేస్తోంటే అతడ్ని బలంగా ఆకర్షించింది ఈ రహస్య ఖండం తాలూకూ శక్తే అయ్యి వుండవచ్చు! దాన్నే అప్పటి వారికి అర్థమయ్యేలా సింహిణి అనే రాక్షసగా వాల్మీకి వర్ణించి వుంటారు!

కరుణా, జయ, శశికళ... ముచ్చటగా మూడో నియంత!

సోషల్ మీడియాలో ఒక సెటైర్ భలే హుషారుగా చక్కర్లు కొడుతోంది! అదేంటంటే, సిటీ బస్సులో లేడీస్ రిజర్వ్ర్డ్ సీట్ లాంటి తమిళ సీఎం కుర్చీలో కూర్చున్న పన్నీర్ సెల్వం.... శశికళ రాగానే ''కూర్చోండి మేడమ్'' అంటూ పక్కకు తప్పుకున్నారట! ఇంతకు ముందు కూడా ఆయన జయలలిత తప్పుకోగానే కూర్చోటం, మళ్లీ ఆమె రాగానే గౌరవంగా పాదాభివందనం చేసి సీటు ఇచ్చేయటం మనకు తెలిసిందే! అందుకే, ఈ లేడీస్ సీట్ సెటైర్ రన్ అవుతోంది!     తమిళనాడు సీఎం సీటు లేడీస్ కి రిజర్వ్డ్ కాకపోవచ్చుగాని... నెక్స్ట్ చెన్నై క్వీన్ శశికళనే అని ఇప్పటికే రూఢీ అయిపోయింది. పన్నీర్ సెల్వం మరో సారి సెలవు పుచ్చుకుని ముఖ్యమంత్రి నుంచి మామూలు మంత్రి అయిపోయారు. ఇదే పరిస్థితి వేరే రాష్ట్రంలో అయితే పెద్ద రచ్చే అయ్యేది. ఉదాహరణకి బీహార్లో ఆ మధ్య జరిగింది గుర్తుందిగా? నితీష్ కుమార్ తాత్కాలికంగా పీఠం ఎక్కించిన మాంజీ ఏకు మేకయ్యాడు తరువాతి కాలంలో. నానా రభస జరిగింది. కాని, పన్నీర్ సెల్వం అలాంటి పేచీలు ఏమీ పెట్టకుండా అప్పట్లో జయ కోసం, ఇప్పుడు శశికళ కోసం అధికారాన్ని తృణప్రాయంగా వదిలేస్తూ వస్తున్నాడు. అది ఆయన గొప్పతనం అని కూడా చెప్పటానికి లేదు. ఎందుకంటే, ఆయన ముఖ్యమంత్రి కుర్చీని అంటి పెట్టుకుని వుందామన్నా అన్నాడీఎంకేలో ఆయన వెంట గట్టిగా నిలిచే ఎమ్మేల్యేలు దాదాపు లేరనే చెప్పాలి. అప్పుడు జయమ్మ అన్న వారు ఇప్పుడు చిన్నమ్మ అంటున్నారు. రాజకీయ అనుభవం, దక్షత, ప్రజల మద్దతు ఇలాంటివేవీ అన్నాడీఎంకే శాసన సభ్యులు పట్టించుకున్నట్టు లేదు. కేవలం చిన్నమ్మ పట్ల విధేయత మాత్రమే కనిపిస్తోంది. జనం తమకు ఓట్లు వేసేప్పుడు శశికళను చూసి వేశారా... అన్న చిన్న ఆలోచన కూడా వారికి రావటం లేదు!   అసలు తమిళనాడులో గడిచిన కొన్ని దశాబ్దాలుగా కొనసాగిన నియంతృత్వమే ఇవాళ్లీ ఈ పరిస్థితికి కారణం! అన్నాడీఎంకేలో జయలలితది ఉక్కు పిడికిలి. ఆమె తనకు విధేయంగా వున్నంత సేపూ అమ్మలానే వుండేది. కాని, ఎవరైనా సరే తనకు కొంచెం ఎదురుతిరిగినా జేజేమ్మఅయిపోయేది. అందుకే, కరుణానిధి మొదలు వైగో వరకూ అందరు గజగజలాడేవారు. రజినీకాంత్ మొదలు విజయ్ కాంత్, వడివేలు వరకూ అంతా విలవిలలాడేవారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా తమిళనాడులో ధైర్యంగా అమ్మకు ఎదురేగి నిలిచిన వారు ఎవ్వరూ లేరు. పార్టీ బయటే ఇలా వుంటే లోపల ఎలా వుంటుంది? మనకి ఒక్క పన్నీర్ సెల్వమ్ మాత్రమే తెలుసు. కాని, ఏఐఏడీఎంకేలో అందరికందరూ పన్నీరు డబ్బాలే! ఎవ్వరూ అప్పుడు జయకి, ఇప్పుడు శశికి ఎదురు తిరిగేవారు కాదు. తమిళ ఓటర్ల కన్నా వారికి పార్టీ అధినేత్రులే ముఖ్యం!     జయలలిత పార్టీనే కాదు కరుణానిధి పార్టీ కూడా తమిళనాడులో కర్కశత్వానికి పెట్టింది పేరు. కరుణ నీడలో ఆ పార్టీలో ఒక్కడంటే ఒక్కడు కూడా బలమైన నేతగా ఎదగలేదు! కరుణానిధి తన కుటుంబ సభ్యుల్ని తప్ప మరెవర్నీ కరుణించలేదు. పోనీ తన పిల్లల్నైనా పాప్యులర్ నేతలుగా మార్చాడా అంటే అదీ లేదు. స్టాలిన్ తో సహా ఆయన వారసులెవరూ సీఎం రేంజ్ అభ్యర్థులు కారు! డీఎంకేలోని మిగతా నేతల మాటైతే మాట్లాడుకోవటమే దండగ! కరుణానిధి బొమ్మ లేకుండా జనంలోకి వాళ్లు వెళితే పట్టించుకునే వాడే వుండనీ పరిస్థితి...      జయ, కరుణానిధి డిక్టేర్‌షిప్‌లు ఇప్పుడు దాదాపు అంతమైనట్టే. అమ్మ లేనేలేదు. తాతగారు మంచంపట్టారు. కనీసం ఇప్పుడైనా తమిళులకి దమ్మున్న నాయకత్వం లభిస్తుందా అంటే అలాంటి సూచనలేం కనిపించటం లేదు. శశికళ సీఎం కుర్చీ ఎక్కేస్తోంది కాని ఆమె మున్ముందు ఎంత వరకూ జనం మద్దతు సంపాదించుకుంటారో డౌటే! ఆమె ఇప్పటి వరకూ జయలలిత చెలికత్తెగా కొనసాగటం తప్ప సాధించింది ఏమీ లేదు. అలాగే, జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కూడా ప్రజల్లో ఆమోదం సంపాదించటం కష్టమే. ఎందుకంటే, ఆమెకు అమ్మతో రిలేషన్ షిప్ తప్ప ఇంకేం క్వాలిఫికేషన్ లేదు. మీడియా వారి హడావిడి తప్ప దీపాను జనం పట్టించుకుంటారనుకోవటం అత్యాశే! ఇక మిగిలింది రాజకీయాలంటే ఇష్టమో, కష్టమో తేల్చని రజినీకాంత్!   తలైవా తన  సినిమాల్లో ఎంతో ధైర్యంగా , ముక్కు సూటిగా మాట్లాడతాడు! కాని, నిజ జీవితంలోకి వచ్చే సరికి పాలిటిక్స్ గురించి ప్రతీసారీ డొంక తిరుగుడే! ఈ మధ్య మరోసారి తనకు పవర్ అంటే ఇష్టమే అంటూ కలకలం రేపాడు. అంతా హాహాకారాలు చేశాక... అబ్బే నేను చెప్పిన ఆధ్యాత్మిక శక్తి అంటూ వివరణ ఇచ్చాడు! అదేదో ముందే చెప్పొచ్చుగా? పొలిటికల్ ఎంట్రీ విషయంలో రజినీది ఎప్పట్నుంచో ఇదే దారి! అనుమానం, అయోమయం తప్ప మరేం వుండదు ఆయన స్ట్రాటజీలో!   పన్నీర్ సెల్వం, స్టాలిన్, దీపా జయకుమార్, రజినీకాంత్... ఇలా ఎన్ని పేర్లు చెప్పుకున్నా తమిళనాడుకు బలమైన సీఎం ఇప్పుడప్పుడే దొరకటం కష్టం. ఇక జనం మద్దతుతో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ వున్న మాస్ లీడర్ లభించటం ఇంకా కష్టం. కాబట్టే, అందరిలోకి తన ఎమ్మేల్యేలపై కాస్త పట్టున్న చిన్నమ్మ వేగంగా ముందుకు దూసుకువస్తోంది. ఆమె జయ, కరుణానిధి లాగా పాతుకుపోతే... మరో నియంతృత్వానికి బీజాలు పడ్డట్టే! 

నోట్ల రద్దుని మించిన సంచలన నిర్ణయం ముందుంది

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద ఉన్న విశ్వ ప్రియ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో డిజి ధన్ మేళాను కేంద్ర పట్టణాభివృద్ధి - గృహ నిర్మాణం - సమాచార ప్రసారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోట్ల రద్దుని మించిన సంచలన ప్రకటన చేయనున్నారని చెప్పారు.     మోడీ నోట్ల రద్దు గురించి ప్రకటన చేసినప్పుడు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయనీ, కానీ దాని వల్ల నల్లధనం బయటకి వచ్చిందని చెప్పారు. కొత్త నిర్ణయం కూడా వారిని ఇబ్బంది పెట్టినా అది సాధారణ జనాలకి లాభం చేకూరుస్తుందని వివరించారు.      నల్లధనం రూపంలో కొందరు ధనవంతులు, అవినీతిపరుల చేతుల్లోనే ధనం ఉండిపోయి ఉగ్రవాదం, వేర్పాటువాదం మరియు మాదక ద్రవ్యాలు వంటివి దేశ వినాశనానికి దారి తీయడానికి కారణ భూతాలవుతున్నాయని  చెప్పారు. ఈ నేపథ్యంలో మోడీ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుని పెద్ద నోట్ల చలామణికి చెక్ చెప్పి.. ఆర్థిక సమానత్వం దేశ ప్రజలందరికీ కల్పించే పని చేపట్టారని చెప్పారు.     కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రజలకి మంచి చేకూరే పనులు చేస్తున్నారని చెప్పారు. అయితే, మోడీ తదుపరి సంచలన ప్రకటన ఏంటో చెప్పకుండా, అవినీతిపరుల గుండెల్లో మరో బాంబు పేల్చారు వెంకయ్య!

హైదరాబాద్‌ మెట్రో ఆగిపోతుందా..?

హైదరాబాద్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఛార్మినార్, ట్యాంక్‌బండ్, సైబర్ టవర్స్..వాటితో పాటే ట్రాఫిక్ కూడా. ఇరుకైన రోడ్లకి తోడు, అడుగడుగునా సిగ్నల్స్..ఆ చక్ర వ్యూహంలో మనిషి ఇరుక్కుంటే ఎప్పటికి బయటకొస్తాడో..అసలు వస్తాడో రాడో కూడా తెలియదు. పొద్దున్న ఆఫీసుకు వెళ్దామని బయలుదేరితే..ఆఫీసులు వదిలే సమయానికి కూడా ఇంకా ట్రాఫిక్‌లోనే ఉంటాడు. ఇలాంటి వాటికి చెల్లు చీటి చెప్పేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలు‌ ప్రాజెక్ట్‌ను తెరమీదకు తీసుకువచ్చింది. అయితే కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లు తొలి నుంచి ఈ ప్రాజెక్ట్ వివాదాస్పదంగానే కొనసాగుతోంది. దాదాపు 72 కిలోమీటర్ల మేర ఆరు దశల్లో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్ట్ కోసం నగర ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.     రాష్ట్ర విభజన తర్వాత మెట్రో ఆగిపోతోందని...హైదరాబాద్ ప్రాధాన్యం నానాటికి తగ్గిపోతోందని..ఎల్‌ అండ్ టీ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిందని..మొత్తం ప్రాజెక్ట్ నుంచే కంపెనీ వైదొలుగుతోందంటూ ఊహాగానాలు వెల్లువెత్తాయి.. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు. అప్పటి నుంచి పనులు ఊపందుకున్నాయి..ట్రయల్ రన్‌లు విజయవంతమయ్యాయి...అంతా సాఫీగా సాగుతోంది అనుకుంటున్న దశలో ఇప్పుడు మరో ఉపద్రవం హెచ్‌ఎంఆర్‌ను చుట్టుముట్టింది.   దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మియాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో దాదాపు 900 ఎకరాల భూమికి సంబంధించిన యజమాని పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు..దీంతో అప్పటి ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనపరచుకుంది..ఆ భూమిలో దాదాపు 300 ఎకరాలను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు విక్రయించింది. అది సుమారు 200 ఎకరాలను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా వేసి ఇళ్ల స్థలాల కింద విక్రయించింది. మరో 100 ఎకరాలను హైదరాబాద్ మెట్రో రైలు కోసం ఎల్‌ అండ్ టీ సంస్థకు కేటాయించింది. ఇందులో మెట్రో అధికారులు తమ అవసరాల కోసం అతిపెద్ద డిపోను నిర్మించుకున్నారు. ఇప్పుడు ఇదే మెట్రో ప్రాజెక్ట్‌కు అవరోధంగా మారింది. ఆస్తి అసలు యజమాని పాకిస్థాన్‌కు వెళ్లేముందు ఈ భూమిని తమకు విక్రయించారంటూ కొందరు ప్రైవేట్ వ్యక్తులు చాలా ఏళ్ల కిందటే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో అప్పట్లోనే సుప్రీం దీనిని ప్రైవేట్ ఆస్తిగా నిర్థారించింది.     ఈ మొత్తం ఆస్తిని తమ ఆధ్వర్యంలోనే విక్రయించాలని ఆదేశించి.. తమ ప్రతినిధిగా పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డిని నియమించింది. సుప్రీం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన నరసింహారెడ్డి భూమి హద్దులను నిర్ణయించాల్సిందిగా రెవెన్యూ శాఖకు ఓ లేఖ రాశారు. దీంతో తెలంగాణ రెవెన్యూ శాఖలో కలకలం రేగింది. ఎందుకంటే అప్పటికే సదరు భూమిని అనేక సంస్థలకు కేటాయించడంతో ఏ విధంగా ముందుకు వెళ్లాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు అధికారులు. ఇది ఇలా ఉంటే అదే భూమిలో ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైల్‌కు చెందిన మియాపూర్ డిపో ఉంది..ఈ డిపోను వినియోగించుకోవాలంటే దీనిని కొనుగోలు చేయాల్సి వుంటుంది. అసలే ఆర్థిక భారంతో సతమతమవుతున్న మెట్రో రైలుకు తాజా పరిణామం మూలిగే నక్కపై తాటికాయ పడినట్లైంది. ఈపాటికే పరుగులు తీయాల్సిన మెట్రో రైలు రూట్ మార్పుతో కొంత ఆలస్యమవ్వగా..సుప్రీం ఆదేశంతో మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో మెట్రో త్వరగా వస్తుందని ఎదురుచూస్తున్న సామాన్యుడికి మరికొంత కాలం ట్రాఫిక్ కష్టాలు తప్పేలా లేవు. 

ట్రంప్... అమెరికా వాళ్ల కేసీఆర్?

  ట్రంప్ కు , కేసీఆర్ కు ఏంటి సంబంధం అంటారా? ఏ సంబంధమూ లేదు. కాని, వాళ్ల వ్యూహాలు మాత్రం చాలా దగ్గరగా వుంటాయి. అదే పెద్ద లింక్. ఇంతకీ విషయం ఏంటంటే... కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగదోయటానికి ఏం చెప్పేవారు? తెలంగాణని ఆంధ్రవాళ్లు దోచుకుంటున్నారని! ముఖ్యంగా, ఆంద్రా పాలకులపై ఆయన తోచినప్పుడల్లా ఒంటి కాలు మీద లేచేవారు. ట్రంప్ కూడా తన ప్రెసిడెన్షియల్ క్యాంపైన్ లో అదే రూల్ పాటించాడు. అమెరికా అంతటి అగ్రరాజ్యానికి కూడా ట్రంప్ అభద్రత నూరిపోశాడు. ఇండియన్స్ , చైనీస్, సింగపూర్ వాళ్లు, మెక్సికో జనాలు మన అవకాశాలు తన్నుకుపోతున్నారని ఒకటే ఉదరగొట్టాడు. కేసీఆర్ కూడా అచ్చం ఇలాగే చెలరేగిపోయే వారు తమ ఉద్యమ కాలంలో. అలాగే, ఆంధ్రుల పట్ల కేసీఆర్ విపరీత వాఖ్యలు చాలా సందర్భాల్లో పెద్ద రచ్చకి కారణం అయ్యేవి. డొనాల్డ్ ట్రంప్ ముస్లిమ్ ల మీదా , మెక్సికన్ల మీదా చేసిన కామెంట్స్ కూడా అలాగే వుంటాయి. అయిన దానికి, కాని దానికి అన్నిటికి ముస్లిమ్ లే కారణమంటాడు అమెరికా 45వ అధ్యక్షుడు! కేసీఆర్ తెలంగాణ గురించి మాట్లాడింది, ట్రంప్ అమెరికా గురించి మాట్లాడింది అంతా తప్పా? అస్సలు కాదు. వాళ్ల వాదనలో నిజం వుంది. అందుకే, కోట్లాది మంది ప్రత్యక్ష ఎన్నికల్లో వారి వెంట నిలిచారు. కేసీఆర్ కు రాష్ట్రాన్ని, ట్రంప్ కు అమెరికాని అప్పజెప్పారు. కాని, చాలా మందికి కేసీఆర్, ట్రంపుల్లో హర్ట్ చేసే విషయం ఏంటంటే... వాళ్లు ఆరోపణలు చేసే విధానం! పరమ దారుణమైన భాషని ప్రయోగించి తమ ప్రత్యర్థుల్ని, శత్రువుల్ని దెబ్బతీస్తారు ఇద్దరు! అది వాళ్ల వాక్చాతుర్యం అని అభిమానులు అంటే... పొగరని మిగతా వారు అంటుంటారు! తెలంగాణ జనం తరుఫున మాట్లాడిన కేసీఆర్ అధికారం చేపట్టారు. ట్రంపు కూడా అమెరికన్ల గురించి మాట్లాడి అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. కాని, కేసీఆర్ ఆంద్రా వాళ్లని వెళ్లగొట్టయే లేదు. హైద్రాబాద్ లో ఎవ్వరి మీదా దాడులు జరగలేదు. పై పెచ్చు ఆంధ్రా జనానికి కేసీఆరే ఇప్పుడు రక్షణగా వుంటానంటున్నారు! ట్రంపు కూడా స్వదేశంలోని ముస్లిమ్ లు భయపడవద్దనే చెబుతున్నాడు. కాని, విదేశాల నుంచి వచ్చే ముస్లిమ్ లకి మాత్రం చుక్కలు చూపించే ప్రయత్నం మొదలెట్టాడు. ఏడు దేశాల ముస్లిమ్ లని తొంభై రోజులు అగ్ర రాజ్యంలోకి రానిచ్చేది లేదని ఆర్డర్ వేశాడు. అంతే కాదు, అమెరికాలోకి ఎంటర్ అయ్యే మిగతా దేశాల మహ్మదీయులకి కూడా తీవ్రమైన చెకింగ్ లు తప్పకపోవచ్చు. పైగా ఇదంతా ట్రంప్ మార్కు దూకుడులో ట్రైలర్ మాత్రమే అంటున్నారు వైట్ హౌజ్ అధికారులు. ముందు ముందు ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకుంటాడని చెప్పుకొస్తున్నారు. ఒక్కసారి మనం కేసీఆర్ తెలంగాణ సెక్రటేరియట్ లోకి ఎంటరైన తొలి రోజులు గుర్తు చేసుకుంటే మనకు ఇలాంటి ట్రంపు మార్కు ఆర్డర్స్ చాలా గుర్తొస్తాయి. మరీ ముఖ్యంగా, సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఆయన పెద్ద కలకలమే రేపారు. అలాగే, విద్యార్థుల ఫీజు రీఎంబర్స్ మెంట్ వివాదం కూడా చాలా రోజులు సాగింది. ఫలాన సంవత్సరం కంటే ముందు తెలంగాణకి వచ్చిన వారు అనర్హులు అంటూ కేసీఆర్ హుకం జారీ చేశారు. తరువాత ఆ సంగతి కోర్టు దాకా వెళ్లింది. ట్రంప్ ఆజ్ఞల్ని కూడా అమెరికన్ కోర్టులో ప్రశ్నిస్తున్నారు ఆయన వ్యతిరేకులు కొందరు! ట్రంప్, కేసీఆర్ ల మధ్య పోలికల్లో మీడియాతో రిలేషన్ కూడా ఒకటి! ఆయనకీ, ఈయనకీ ఇద్దరికీ మీడియాలో పడలేదు పీఠం ఎక్కగానే. ఇప్పుడు కేసీఆర్ మీడియా సంబంధాలు ఒక కోలిక్కి వచ్చినట్టే కనిపిస్తున్నాయి. కాని, ట్రంప్ మాత్రం పబ్లిగ్గానే బెదిరిస్తున్నాడు పేపర్లు, ఛానల్స్ ని! జర్నలిస్టులకి సిగ్గేలేదంటూ విరుచుకుపడుతున్నాడు. తెలంగాణలో కేసీఆర్ రెండు ఛానల్స్ ని దాదాపు నిషేధించినంత పని చేసిన సంగతి అందరికీ తెలిసిందే!  ఉద్యమ సమయంలో కేసీఆర్ వ్యూహాత్మకంగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారనీ, అధికారంలోకి వచ్చాక ఆయన తీరు మారిందని కొంత మంది విశ్లేషిస్తుంటారు. అందులో కొంత నిజం లేకపోలేదు. కాని, ట్రంప్ మాత్రం ఎన్నికల్లో గెలిచాక కూడా దూకుడు ప్రదర్శిస్తున్నాడు. అయితే, ఇలా ఎంత కాలం ముస్లిమ్ సమాజాన్ని, మెక్సికన్లని, ఇండియా లాంటి దేశాల్నుంచి వచ్చిన వలస ఉద్యోగుల్ని, మరీ ముఖ్యంగా అమెరికాలోని తన వ్యతిరేకుల్ని తట్టుకుని నిలబడతాడో చూడాలి. పోను పోను తత్వం బోధపడితే ఆయన కూడా తన ట్రంపరితనం తగ్గించుకుంటాడని కొందరంటున్నారు!    

ఈ ఏడాది బడ్జెట్‌‌తో సామాన్యుడికి లాభమా..? నష్టమా..?

బడ్జెట్...మామూలు అర్థంలో ఆదాయాలు, వ్యయాల లెక్కలే..కానీ సగటు భారతీయుడి దృష్టిలో దాని లెక్క వేరు. ప్రభుత్వం ఏ వస్తువుల రేటు పెంచుతుందో..వేటి ధరలు తగ్గిస్తుందో..దేనిపై ఎంత పన్ను వసూలు చేస్తారోనని వెయ్యి కళ్లతో మార్చి 1 ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తారు. అయితే బూజు పట్టిన పాత కాలపు రాజకీయ పద్ధతులకు తెరదించుతూ..ఆధునిక రాజకీయాలకు తెర లేపుతూ నరేంద్రమోడీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌ను ఒక నెల ముందుకు జరిపింది. అంటే మార్చి 1 నుంచి ఫిబ్రవరి ఒకటికి.     ఎన్నో ఆశలు..ఆకాంక్షల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2017-18 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ సామాన్యుడిచే ప్రశంసలు అందుకుందా లేదా అన్నది పరిశీలిస్తే సమాధానం చెప్పలేం అనే మాటే వినిపిస్తుంది. ఈ సారి సామాన్యుడికి భారం పడకుండా పన్ను మినహాయింపు పరిధిని పెంచుతున్నట్లు జైట్లీ ముందే ప్రకటించారు..అన్నట్లుగానే బడ్జెట్‌లో ఆదాయపు పన్ను శ్లాబ్ రేట్లలో మార్పులు చేశారు.     అవేంటో ఒకసారి పరిశీలిస్తే: * వార్షికాదాయం 2.5 లక్షలు ఉంటే ఎలాంటి పన్ను లేదు. * రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయం గల వ్యక్తులకు ప్రస్తుతం ఉన్న 10  శాతం పన్నును 5 శాతానికి         తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. * ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్నులో అదనంగా 3 వేలు వెనక్కి * రూ.లక్ష వరకు ఆరోగ్య భీమా * రూ.50 లక్షల లోపు విలువైన గృహాల రుణంపై ( 35 లక్షల లోపు) అదనంగా రూ.50 వేలకు వడ్డీ మినహాయింపు * కొత్త విద్యా సంస్థలు, విద్యలో నాణ్యత పెంచేలా చర్యలు తీసుకుంటానన్నారు. * ఉన్నత విద్యకు ఆర్థిక సహాయ సంస్థ * ధ్రువపత్రాలకు డిజిటల్ డిపాజిటరీ * పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు     ఆదాయపు పన్ను మినహాయింపు అంటూ ఊరిస్తూనే నిత్యవసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు జైట్లీ. సిగరెట్లు, లగ్జరీ కార్లు, బైకులు, సరకు రవాణా, దిగుమతి చేసుకునే ఆభరణాలు తదితరాలపై సుంకాన్ని పెంచారు. వీటిలో ఆహార పదార్థాలు, పెట్రోలు, డీజిల్ వంటి నిత్యావసరాలు ఉన్నాయి. పన్ను మినహాయింపు పరిధిని పెంచి మాది ప్రజల ప్రభుత్వం అని జబ్బలు చరుచుకునే కంటే..నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా అదుపులో ఉండేలా గట్టి చర్యలు తీసుకుంటే సామాన్యుడికి అదే పదివేలు అని చెప్పవచ్చు.

ఆఫ్టర్ బడ్జెట్... కామన్ మ్యాన్ కండీషన్ ఏంటి?

  1. మీ వార్షిక ఆదాయం 3లక్షల కంటే తక్కువైతే ఎలాంటి పన్నూ వుండదు! 2. రెండున్నర లక్షల నుంచి అయిదు లక్షల మద్య సంవత్సర ఆదాయం వున్న వారు ఇక మీద 10 శాతానికి బదులు 5 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది!  3. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకి ఆ ఆదాయంపై పన్ను మినహాయింపు!  4. నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ ద్వారా రూ.20వేల కోట్ల గృహ రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. దీని వల్ల మధ్యతరగతి వారి స్వంతింటి కలలు నిజం కానున్నాయి! 5. గృహ రుణాల వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయన్నారు జైట్లీ. దీని వల్ల స్వగృహం చౌకగా మారనుంది!  6. గ్రామీణ నిరుపేదలకు కోటి పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది మోదీ సర్కార్. నీడలేని ఎంతో మందికి ఇది మేలు చేయనుంది! 7. విదేశాలకు వెళ్లే వారు ఇక పై పాస్ పోర్ట్ కార్యాలయాల ముందు క్యూలు కట్టనక్కర్లేదు. పోస్టాఫీసుల్లో కూడా పాస్ పోర్ట్ లు జారీ చేస్తారు! 8. బడ్జెట్ తో పాటూ రైల్వే బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టిన జైట్లీ ఐఆర్ సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి  సర్వీస్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేశారు! 9. 500 రైల్వే స్టేషన్లలో దివ్యాంగుల కోసం లిఫ్ట్ , ఎస్కలేటర్ లాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు! 10. వ్యవసాయం పై వరాల జల్లు కురిపించిన ఆర్దిక మంత్రి 10లక్షల కోట్ల వ్యవసాయ ఋణాలు ఇస్తామన్నారు. 60రోజుల్లోగా ఋణం తిరిగి చెల్లిస్తే పూర్తిగా వడ్డీ మాఫీ అయిపోతుంది! 11. సిగరెట్ తాగే వారిపై ఘాటు ప్రభావం చూపింది బడ్జెట్. ఎక్సైజ్ డ్యూటీ 6శాతం పెంపుతో సిగరెట్ ధరలు మరింత వేడెక్కిపోతాయి! 12. సెల్ ఫోన్ తయారీలో వాడే విడి భాగాలపై కస్టమ్స్ లెవీ ఒక శాతం పెంచటంతో ఈ సంవత్సరం మొబైల్స్ కాస్ట్ లీ అవ్వనున్నాయి!  

జైట్లీ బడ్జెట్ లో అత్యంత ముఖ్యమైన అంశాలు ఇవే...

  1. రక్షణ వ్యయం రూ.2.74లక్షల కోట్లు 2. ద్రవ్య లోటు 2.3శాతం 3. నోట్ల రద్దు వల్ల పన్ను వసూళ్లు పెరిగాయి 4. రూ.2500 కోట్ల నగదు రహిత లావాదేవీలు జరపాలన్నది లక్ష్యం. 5. ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి వెళ్లే నేరగాళ్ల ఆస్తుల జప్తు కోసం ప్రత్యేక చట్టం 6. ఇల్లు కట్టాక అందులో నివసించకపోయినా పన్ను కట్టాల్సిందే: జైట్లీ 7. ఇంటి నిర్మాణం పూర్తయిన ఏడాది తర్వాత ఖాళీగా ఉంటే పన్ను: జైట్లీ 8. 2020లోగా 20లక్షల ఆధార్‌ ఆధారిత పీవోఎస్‌ యంత్రాలు 9. అమరావతి రైతులకు క్యాపిటల్‌ గెయిన్‌ మినహాయింపు 10.రూ.5కోట్ల లోపు టర్నోవర్‌ ఉన్న స్టార్టప్‌లకు1శాతం పన్ను మినహాయింపు 11.డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించే పరికరాలు తయారుచేస్తే పన్ను మినహాయింపులు 12.రాజకీయ పార్టీలకు రూ.2వేల కన్నా ఎక్కువగా విరాళం ఇచ్చేవారి వివరాలు వెల్లడించాల్సిందే 13.రూ.2వేలకు మించితే చెక్కు, ఆన్‌లైన్‌లో విరాళాలు తీసుకోవాలి 14.ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్స్‌ కచ్చితంగా దాఖలు చేయాలి 15.రూ. 3 లక్షల వరకు పూర్తి పన్ను మినహాయింపు 16.రూ. 2.5 లక్షల నుంచి 5 లక్షల శ్లాబ్‌లో సగానికి తగ్గిన పన్నురేటు 17.రూ. 2.5 లక్షల నుంచి 5 లక్షల మధ్య ఆదాయంపై ఇక 5 శాతమే పన్ను 18.మిగతా శ్లాబ్‌లు యథాతథం

ఊరికే మాటలు కాదు... ఊరికి ఉత్సాహం తెచ్చే ప్రయత్నం చేశారు!

  భారతదేశం అంటే ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నైలు కాదు. బెంగుళూరు, హైద్రాబాద్, పూణేలు కూడా కాదు. అసలు నిర్మొహమాటంగా మాట్లాడుకుంటే భారతదేశం అంటే నగరాలు, పట్టణాలు కానే కాదు. అసలు సిసలు భారతమంతా లక్షల గ్రామాల్లోనే దాగి వుంది. అందుకే, ఈ సారి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఊళ్లపైనే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. మోదీ, జైట్లీ కింద నుంచీ మార్పుని తెచ్చే ప్రయత్నం చేశారు...  బడ్జెట్ 2017-18లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి భారీగా వరాలు ఇచ్చారు. అందులో మొదటిది 50వేల గ్రామ పంచాయితీల్లో పేదరిక నిర్మూలన. మన ఊళ్లలో ఎంతగా పేదరికం వుందో తెలిసిందే. అందుకే, 2019లోగా 50వేల పంచాయితీల్లో పేదరికం నిర్మూలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఏడాదికి మూడు లక్షల కోట్లు వెచ్చించనుంది.  మన దేశంలో మధ్య తరగతి వారికే కాదు పేదలకి కూడా స్వంత ఇల్లు జీవిత కాల స్వప్నమే. అందుకే, పేదల కోసం ప్రభుత్వమే కోటి ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. 2019లోగానే ఇది కూడా పూర్తి చేస్తారు. ఇక ఊళ్లలోని వారికి అత్యంత ప్రధానమైంది వ్యవసాయం. దీని అభివృద్ధికి ఈ సంవత్సరం లక్షా ఎనభై ఏడు వేల రెండు వందల ఇరవై అయిదు కోట్లు వెచ్చించనున్నారు. అలాగే, ఇప్పటికీ మన దేశంలో చాలా ఊళ్లు విద్యుత్ లేక చీకట్లో మగ్గుతున్నాయి. 2018లోగా కరెంట్ లేని ఇల్లు వుండదని జైట్లీ అన్నారు. ఈ ఆర్దిక సంవత్సరంలో నాలుగే వేల ఎనిమిది వందల పద్నాలుగు కోట్లు గ్రామీణ విద్యుదీకరణకు ఖర్చు చేయనున్నారు.  పంటతో పాటూ గ్రామాలకు పాడి కూడా చాలా ప్రధానమైంది. అందుకే, డెయిరీ ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయబోతున్నారు. 80వేల కోట్లు కేటాయించారు బడ్జెట్లో. కృషి విజ్ఞాన కేంద్రాల్లో మినీ ల్యాబ్స్ ఏర్పాటు చేయటం ద్వారా కూడా గ్రామాల్లో ఉత్పత్తి పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తోంది మోదీ సర్కార్. బడ్జెట్ లో ఇచ్చిన హామీలతో మనకు గ్రామ స్వరాజ్యం వచ్చేస్తుందని భావించాల్సిన పనిలేదు. అయితే, గతంలో కంటే ఎంతో కొంత అభివృద్ధి చెంది గ్రామీణ భారతీయుల వలసలు తగ్గితే అది దేశానికి ఎంతో మేలు చేసినట్లు అవుతుంది!   

గ్రీన్ బడ్జెట్ కి సై అన్న మోదీ సర్కార్.. ఇంతకీ గ్రీన్ అంటే ఏంటి?

  బడ్జెట్ అంటే లెక్కలు, పద్దులు. దేశం అభివృద్ధి చెందాలంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు లాంటి విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకునే ఆర్దిక మంత్రాంగం. అయితే, బడ్జెట్ లో ఆర్దిక మంత్రులు సాధారణంగా బోలెడు పొదుపు చర్యలు చేపడుతుంటారు. ఎక్కడా ఓ రూపాయి వృథా కాకుండా దేశ ఖజానాలో జమ అయ్యేలా జాగ్రత్తపడుతుంటారు. కాని, ఇక్కడ అత్యంత ఆశ్చర్యకర విషయమేంటంటే ఇన్నాళ్లూ దేశ సంపద పొదుపు చేయటానికి వేసుకున్న బడ్జెట్ కారణంగానే బోలెడు డబ్బు వృథా అయ్యేది. పైగా వాతావరణ కాలుష్యానికి కూడా దారి తీసేది. ఈ సారి మోదీ సర్కార్ గ్రీన్ బడ్జెట్ తో పొదుపు, అదుపు రెండు సాధించింది...   మోదీ ప్రధాన నినాదాల్లో డిజిటల్ ఇండియా ఒకటి. అందుకు తగ్గట్టే ఈ సారి బడ్జెట్ ప్రతుల్ని కూడా డిజిటిల్ ఫార్మాట్ లోనే అందుబాటులో వుంచారు. వెబ్ సైట్లోకి వెళ్లి ఎవ్వరైనా ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాని, పోయిన సంవత్సరం వరకూ బడ్జెట్ మొత్తాన్ని ప్రింట్ రూపంలో అందించే వారు. అసలు పోయిన సంవత్సరానికి ముందు 5వేల కాపీలకు పైనే అచ్చేసేవారు. ఈ కాపీ ఒక్కో దానికీ దాదాపు 3,500రూపాయలు ఖర్చయ్యేవి! అంత భారీ మొత్తంలో డబ్బు, చెట్ల నరకటం ద్వారా వచ్చిన పేపరూ ఖర్చు చేయటం వద్దని చాలా రోజులుగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి...బడ్జెట్ ప్రతుల్ని వేలాది ఉచిత కాపీలుగా అందించే సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా వస్తోన్న పోయిన సంవత్సరం బాగా కుదించారు. 5వేల నుంచి 2047కు సంఖ్యని తగ్గించారు. అయినా కూడా ప్రభుత్వ ఖజానాకు 70లక్షల పై మాటే ఖర్చైంది.   అందుకే, ఈ సారి బడ్జెట్ ను మరింత తక్కువ కాపీలు అచ్చేశారు. కేవలం 788 ప్రతులు మాత్రమే లోక్ సభ, రాజ్య సభ సభ్యులకి అందించారు. మిగతా వారెవరైనా పార్లమెంట్ లోని కౌంటర్లో కొనుక్కోవాల్సిందే! మీడియా వారైనా డిజిటిల్ కాపీల్ని డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ నిర్ణయం వల్ల గవర్నమెంట్ కి భారీగా వ్యయం తగ్గటకమే కాక ఎంతో అమూల్యమైన పేపర్ కూడా సేవ్ చేసినట్టు అయింది. చెట్లను కాపాడినట్లు, గ్రీన్ బడ్జెట్ కు శ్రీకారం చుట్టినట్టు అయింది!

రాణి పద్మావతి కల్పితమా? రాజ్ పుత్ ల ఆక్రోశం అనవసరమా?

  రాణి పద్మావతి... ఇప్పుడు దేశంలో ఈ పేరు బాగా వినిపిస్తోంది. కారణం పద్మావతి గురించి సినిమా తీస్తోన్న సంజయ్ లీలా బన్సాలీపై దాడి జరగటమే. ఆమె ముస్లిమ్ రాజైన అల్లావుద్దీన్ ఖిల్జీతో శృంగారం జరిపినట్టు బాన్సాలీ సినిమాలో చూపబోతున్నాడని రాజ్ పుత్ లు ఆరోపిస్తున్నారు. అంతే కాదు, షూటింగ్ స్పాట్ లో దర్శకుడిపై దాడికి కూడా పాల్పడ్డారు...  బన్సాలీపై దాడి , బాలీవుడ్ వాళ్ల రియాక్షన్ ఎలా వున్నా అసలు పద్మావతి అనే రాజ్ పుత్ రాణి ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్న చాలా మందికి కలుగుతోంది! ఆమె గురించి సినిమా అనగానే రాజ్ పుత్ జాతి మొత్తం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందుంటే ఆమెతో వారికి ఎంతో ఎమోషనల్ అటాచ్ మెంట్ వుండాలి. అందుకే, ఆమె రొమాంటిక్ సీన్స్ తెరపై కనిపించబోతున్నాయన్నా అనుమానాన్ని కూడా సహించలేకపోయారు! దక్షిణ భారతదేశం కన్నా ఉత్తర భారతదేశం ముస్లిమ్ రాజుల నుంచి ఎక్కువ దాడులు ఎదుర్కొంది. బాబార్లు, గజినీలు, ఘోరీలు ఉత్తరాది మీదే దండెత్తారు. దోచుకున్నారు. తమ సామ్రాజ్యాలు స్థాపించారు. ఆ క్రమంలో వార్ని ఎదుర్కొన్న రాజ వంశాల్లో రాజ్ పుత్ లే చాలా ముఖ్యం. కొందరు చరిత్రకారులు రాజ్ పుత్ లు ఇస్లామిక్ దండయాత్రలకి లొంగిపోయారని రాసినప్పటికీ రాజ్ పుత్ ల ప్రతిఘటన వల్లే చాలా కాలం విదేశీ ముస్లిమ్ రాజులు ముందుకు సాగలేకపోయారు. వందల ఏళ్ల పాటూ చేసిన ప్రయత్నం తరువాత ఔరంగజేబు నాటికి అత్యధిక భారతదేశం వారి చేతుల్లోకి వచ్చింది. మళ్లీ బ్రిటీష్ కాలంలో ఢిల్లీ సింహాసనం ముస్లిమ్ ల చేతుల నుంచి పోయింది. బయట నుంచి దండెత్తిన వచ్చిన ముస్లిమ్ రాజులతో జరిగిన సంఘర్షణ ఉత్తరాది జనంలో కథలు కథలుగా ప్రచారంలో వుంది. అలాంటి ఒక కథే రాణి పద్మావతి కథ కూడా! అందుకే, చాలా మంది చరిత్రకారులు రాణి పద్మావతి ఒక నిజమైన చారిత్రక పాత్ర కాదంటారు. ఆమె కేవలం కల్పితం అని వాదిస్తారు. వారు చెప్పే దాని ప్రకారం 13, 14 శతాబ్దాల మధ్య కాలంలో రాజస్థాన్ లోని చిత్తోర్ ఘడ్ సంస్థానంలో జీవించిన రాణి పద్మావతి... 1540లో మాలిక్ మహ్మద్ జయాసీ రచించిన ఒక కల్పిత ప్రేమ కావ్యంలో ప్రధాన పాత్ర. ఆ గ్రంథం పేరు పద్మావత్. అవధీ భాషలో రాయబడింది. అప్పట్నుంచీ ఇప్పటి దాకా అనేక సార్లు అనేక మంది రచయితలు ఈ కథనే మళ్లీ మళ్లీ చెప్పారు! పద్మావత్ అనే గ్రంథం ప్రకారం సింగాల్ రాజ్యం, అంటే, నేటి శ్రీలంకకు చెందిన అపురూప సౌందర్యవతి పద్మావతి. ఆమెను దైర్య, సాహసాలు ప్రదర్శించి పెళ్లాడతాడు రాజ్ పుత్ రాజు రతన్ సేన్. తరువాత రతన్ సేన్ రాజ్యమైన చిత్తోర్ పైకి దండెత్తి వచ్చిన అల్లా వుద్దీన్ ఖిల్జీ మహారాణి అందం చూసి మోహిస్తాడు. ఆమెను స్వంతం చేసుకోవాలనుకుంటాడు. యుద్ధంలో భర్త రతన్ సేన్ కూడా చచ్చిపోవటంతో రాణి పద్మావతి ఖిల్జీ చేతికి చిక్కకుండా తన వందలాది మంది పరివారంతో కలిసి మంటల్లో దూకుతుంది. సతీ సహగమనం లాంటి ఈ సంప్రదాయాన్ని జౌహర్ అంటారు రాజ్ పుత్ లు.  ప్రచారంలో వున్న రాణి పద్మావతి కథ ప్రకారం ఆమె ఖిల్జీని చూడను కూడా చూడలేదు. అలాగే ఆమెను మోహించిన ఖిల్జీ కూడా తను బతికుండగా చూడలేదు. కాని, బన్సాలీ డ్రీమ్ సీక్వెన్సెలలో ఖిల్జీ, పద్మావతీలపై పాటలు చిత్రీకరిస్తున్నారని రాజ్ పుత్ లు ప్రస్తుతం ఆరోపిస్తున్నారు. అలాంటివేవీ లేవని సంజయ్ చెబుతున్నాడు. నిజం సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని జనం ముందుకు వస్తేనే తెలిసేది! రాణి పద్మావతి నిజమని చెప్పే చారిత్రక ఆధారాలు వున్నా లేకున్నా ఆమె పట్ల రాజ్ పుత్ ల ప్రేమ, గౌరవం, అభిమానం తీక్షణమైన నిజాలు. వాట్ని దెబ్బతీయకుండా సినిమాను  తీయటం బాన్సాలీ బాధ్యత!