పవన్ తన శత్రువులకి తానే అస్త్రాలందిస్తున్నాడా?
posted on Jan 27, 2017 @ 3:41PM
పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రత్యేక కళ్యాణ్ అయిపోయాడు! అసలు రాష్ట్ర విభజన సమయంలో ఎవ్వరూ పట్టించుకోని ప్రత్యేక హోదాను వెంకయ్య నాయుడు బలంగా ప్రస్తావించారు. ఎలాగో మన్మోహన్ చేత ఒప్పించి హామీ తీసుకున్నారు. తీరా ఇప్పుడు ఆ రోజు ఆయన ప్రయోగించిన మంత్రమే ... ఆయన మీదే తిరగబడుతోంది! ఇచ్చేద్దామంటే హోదా ఇచ్చే పరిస్థితులు ఢిల్లీలో లేవు. ఊరుకుందామంటే అమరావతిలో జనం మర్చిపోయేలా లేరు. ఈ స్థితికి ప్రధాన కారణం , ఒక విధంగా, పవన్ కళ్యాణ్ అని కూడా చెప్పుకోవచ్చు! పదే పదే హోదా నిప్పుని రాజేస్తున్నాడు జనసేనాని! రాబోయే ఎన్నికల వరకూ ఆయన జనాల్లో వుండటానికి ప్రత్యేక హోదా కంటే లాభసాటి అంశం మరొకటి లేదు. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకీ హోదా విషయంలో పవన్ను గట్టిగా ఎదుర్కొనే ఛాన్స్ కూడా లేదు..
ప్రత్యేక హోదా విషయంలో జగన్ కూడా పవన్ తో పాటూ క్రెడిట్ కొట్టేయాలని తాపత్రయపడుతున్నా సినిమా గ్లామర్ వల్ల పవన్ ఎక్కువ ఎంకరేజ్ మెంట్నే ఎంజాయ్ చేస్తున్నాడు. మీడియా వద్దన్నా పబ్లిసిటీ చేసి పెడుతోంది. యూత్ కూడా అవలీలగా ఆకర్షితులవుతున్నారు. కాని, సమస్యల్లా పవర్ స్టార్ మాటలు, వ్యూహంతోనే వస్తోంది. ఆయన ఏ క్షణం ఏం ట్వీట్ చేస్తాడో, ఎవర్నిటార్గెట్ చేస్తాడో అర్థం కాని పరిస్థితి తయారవుతోంది. పైగా వ్యక్తిగత విమర్శలతో ప్రత్యర్థులకి నోరు తెరిచే మంచి వెసులుబాటు అందిస్తున్నాడు. ఇందుకు ఆయన తాజా ప్రెస్ మీటే ఉదాహరణ...
పవన్ టీడీపీ ఎంపీ రాయపాటిని ఘాటుగానే విమర్శించాడు. సుజనా చౌదరిని కూడా టార్గెట్ చేశాడు. వాళ్లు బ్యాంకులకి అప్పులు ఎగ్గొట్టారనీ, తమ వ్యాపార లాభాల కోసం రాష్ట్ర సంక్షేమాన్ని పక్కన పెడుతున్నారని అన్నాడు. దీనికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన రాయపాటి తమ సంస్థ బ్యాంక్ లకు అప్పు పడి వుందే తప్ప ఎగ్గొట్టలేదని తేల్చారు. పైగా తమకు కాంట్రాక్ట్ వచ్చింది కాంగ్రెస్ హయంలోనే కానీ, ఎన్డీఏ టైంలో కాదని చెప్పారు. మొత్తంగా పవన్ విమర్శల్ని తిప్పికొట్టి ఆయన్ని కార్నర్ చేశారు. ఇక పవన్ , రామ్ గోపాల్ వర్మల మధ్య కూడా పర్సనల్ వార్ మొదలైంది. ఎప్పుడూ పవన్ గురించి ఏదేదో ట్వీట్ చేసే రాము వైజాగ్ ఆర్కే బీచ్ ఉద్యమానికి ముందు రోజు పవర్ స్టార్ జిందాబాద్ అన్నాడు. తరువాతి రోజు మాత్రం పవన్ ప్రత్యక్షంగా వైజాగ్ కి రానేలేదని విమర్శించాడు. రామూ ఇలా ట్విట్టర్ లో పవన్ని మెచ్చుకోవటం, తిట్టటం కొత్తేం కాదు. కాని, ఈసారి పవన్ వాటిపై స్పందించటమే కొత్త కలకలం రేపింది...
ఎప్పుడూ వర్మని పట్టించుకోని పవన్ ఈ సారి మాత్రం ఆయన విమర్శలపై స్పందించాడు. కాని, ఆయన వేసిన ప్రశ్నకి జవాబు చెప్పకుండా వ్యక్తిగత అంశాలు మాట్లాడి పవన్ కాస్త పొరపాటే చేశాడు. పెళ్లైన కూతురున్న వర్మ పోర్నోగ్రఫీ చూస్తానని చెబుతాడు. ఆయన గురించి నేనేం మాట్లాడాలి అన్నాడు. ఇలా మాట్లాడటం ఆర్జీవీకి మంచి సందు దొరికేట్టుగా చేసింది. నేను ఆయన మూడు పెళ్లిల్ల గురించి ఎప్పుడూ మాట్లాడలేదంటూనే వర్మ కూడా పర్సనల్ విషయం పరోక్షంగా ప్రస్తావించాడు. ఆయన అలా మాట్లాడటం పూర్తిగా పవన్ చేసిన కామెంట్స్ వల్లేనని అందరూ ఒప్పుకుంటారు. పవన్ రామూ కూతుర్ని, పోర్నోగ్రఫిని చర్చలోకి తేవాల్సింది కాదు!
పవన్ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని , టీడీపీ ప్రభుత్వాన్ని అద్భుతంగా కార్నర్ చేస్తున్నాడు. కాకపోతే, ఆ క్రమంలో ఆయన చేసే కామెంట్స్ జాగ్రత్తగా చేస్తే బావుంటుంది. సాధ్యమైనంత వరకూ వ్యక్తిగత ఆరోపణలు చేయకుండా వుంటే బెటర్. అలాగే, ఉత్తరాది, దక్షిణాది అంటూ మాట్లాడటం, ఎంతకైనా తెగిస్తాం, వుంటే వుంటాం, పోతే పోతాం లాంటి ఆవేశపూరిత డైలాగ్స్ ఆయన స్థాయిలో వున్న వ్యక్తి నుంచి ఎంతైనా బాగోవు. పవన్ దీర్ఘ కాలం సాగే పంథాలో తనకు ప్రత్యర్థులు అనుకున్న వార్ని ఓపిగ్గా టార్గెట్ చేయాలి. అంతే తప్ప ఎంతగా ఆవేశపడి నోరు జారితే అంతగా ఆయన శత్రువులకి పైచేయి సాధించే అవకాశం దొరుకుతుంది....