ఆర్దిక మంత్రుల చేతుల్లో బడ్జెట్ బ్రీఫ్ కేస్... ఆసక్తికర అంశాలేంటో మీకు తెలుసా?
posted on Jan 31, 2017 @ 11:51AM
బడ్జెట్ అంటే మాటలు కాదు. అదో ఫైనాన్షియల్ బాక్సింగ్! ఆర్దిక అంశాలతో కుస్తీ పట్టాలి. అదీ భారత్ లాంటి అతి పెద్ద దేశంలో బడ్జెట్ అంటే మరింత జటిలంగా వుంటుంది. వర్గాలు, ప్రాంతాలు, కులాలు, మతాలు, రాష్ట్రాలు .. ఇలా బోలెడు కోణాలు దృష్టిలో పెట్టుకుని కత్తి మీద సాము చేయాలి. అయితే, బడ్జెట్ లెక్కలన్నీ ఎవరు ఎక్కడ వేస్తారో మనకు తెలియదు. మనకు కేవలం పార్లమెంట్లో మంత్రిగారి ఉపన్యాసమే వినిపిస్తుంది. సుదీర్ఘంగా సాగే బడ్జెట్ ప్రసంగంలోని ప్రతీ మాటా పవర్ ఫుల్లే. ఏది ఏ రంగం మీద ప్రభావం చూపిస్తుందో చెప్పలేం. అయితే, అలాంటి మాటలన్నీ భద్రంగా దాచుకొచ్చేఆర్దిక మంత్రి చేతిలోని సూట్ కేస్ గురించి మీకు తెలుసా?
బడ్జెట్ ప్రతీ యేడూ మారిపోతుంటుంది. అలాగే, కొన్నేళ్లు కాగానే ఆర్దిక మంత్రి కూడా మారిపోతుంటాడు. కాని, దాదాపు డెబ్బై ఏళ్ల మన స్వతంత్ర భారత దేశంలో ఎప్పుడూ మారనిది ఈ బడ్జెట్ బాక్సే! మంత్రిగారు పార్లమెంట్లో ప్రవేశించే ముందు ఫోటోలకు ఫోజులిస్తారు. అప్పుడు ఆయన చేతిలో ఓ బాక్సో , లేదా లెదర్ సూట్ కేసో దర్శనమిస్తుంది! పార్టీ, నాయకుడు మారిపోతున్నా బడ్జెట్ పేపర్లను ఇలా బ్యాగ్ లో తేవటం మాత్రం మారటం లేదు. దీని వెనుక పెద్ద కహానీనే వుంది...
మనం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఇతరత్రా వ్యవస్థలన్నీ పాశ్చాత్య దేశాల నుంచే అరువు తెచ్చుకున్నాం. మన రూల్సు, రెగ్యులేషన్స్ అన్నీ అక్కడి నమూనాతో రూపొందించుకున్నవే. ఈ బడ్జెట్ బ్యాగ్ కూడా అలాంటిదే. బడ్జెట్ ను ఫ్రెంచ్ భాషలో బోగెట్టి అంటారు. ఆ పేరే ఇంగ్లీషులో బడ్జెట్ అయింది. ప్రపంచమంతా అదే వాడుతోంది. ఈ బడ్జెట్ ప్రెజెంట్ చేసేటప్పుడు అవసరమయ్యే భారీ మొత్తం పేపర్లు ఏదో ఒక పద్ధతిలో పార్లమెంటుకు తీసుకురావాలి కాబట్టి మొట్ట మొదట బ్రిటన్ ఆర్దిక మంత్రి 1860వ సంవత్సరంలో ఒక బాక్స్ ఉపయోగించారు. అప్పట్నుంచీ మంత్రులందరూ ప్రపంచ వ్యాప్తంగా అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. ఎక్కడో ఒకరిద్దరు సింపుల్ గా ఫైల్ లో పెట్టుకుని వచ్చి బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పటీకీ చాలా వరకూ మాత్రం ఒక పెట్టేగాని, లెదర్ బ్యాగ్ గాని వాడతారు. మన దేశంలో కూడా అదే జరుగుతోంది. 1947 నవంబర్ 26న తొలి సారి షణ్ముగం అనే మంత్రిగారు బడ్జెట్ బ్యాగ్ సంప్రదాయం మొదలు పెట్టారు. ఇప్పటికీ అరుణ్ జైట్లీ శకంలో కూడా అదే నడుస్తోంది.
మొదట్లో బ్రిటీషు వారు బడ్జెట్ పత్రాలను పెట్టెలో పెట్టుకుని తీసుకొచ్చే వారు. కాని, తరువాత ఇప్పుడంతా బ్యాగులకే సై అంటున్నారు. రెడ్,బ్రౌన్, బ్లాక్ కలర్ లెదర్ బ్యాగుల్లోనే ఆర్దిక మంత్రులు కెమెరాల ముందు ప్రత్యక్షమవుతున్నారు. అయితే, ఇప్పటి రాష్ట్రపతి, యూపీఏ హయాంలోని ఆర్దిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మాత్రం బాక్స్ తెచ్చేవారు! ఈ మధ్య కాలంలో ఇలా పెట్టె మోసుకొచ్చిన మరెవరూ లేరు!
ఫైనాన్స్ మినిస్టర్ చేతిలోని బడ్జెట్ బ్యాగ్ వల్ల జనానికి వచ్చే లాభ, నష్టాలు ఏవీ లేవు కాని... తరతరాలుగా అది అమాత్యుల చేతుల్లో వెలిగిపోతూ ఒక సంకేతంగా మారిపోయింది! దాన్ని చూడగానే దేశానికి బడ్జెట్ మూడ్ వచ్చేస్తుంది!