మోడీ నట్టింట.. రాహుల్ భూకంపం..!

దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయడంతో పాటు కుప్పలు తెప్పలుగా పోగుపడుతున్న నల్లధనానికి అరికట్లే చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ నవంబర్ 8న సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు అర్థరాత్రి నుంచి రూ.1000, రూ.500 ల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పాత నోట్లను డిసెంబర్ 31 లోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు..అప్పటి నుంచి జనం తిప్పలు వర్ణనాతీతం..పాత నోట్లు మార్చుకోవడానికి, డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి తిండి, తిప్పలు మాని బ్యాంకులు, ఏటిఎం వద్ద పడిగాపులు పడుతున్నారు. అయినా డబ్బు దొరుకుతుందనే ఆశ లేదు. మొదట్లో మోడీ నిర్ణయాన్ని సమర్థించిన జనం..నిత్యావసరాలకు డబ్బులు దొరక్క తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు..దీంతో ఏ నోటితో అయితే పొగిడారో..అదే నోటితో మోడీని విమర్శిస్తున్నారు.   అటు మోడీని ఎలా టార్గెట్ చేయాలా అని ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలకు ఈ వ్యవహారంతో స్వయంగా ప్రధానే అస్త్రాన్ని అందించినట్లైంది. దీనిని సద్వినియోగపరచుకున్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్లమెంట్‌‌ శీతాకాల సమావేశాల్లో బీజేపీని బాగానే ఇరుకునపెట్టేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో తాను నోరు విప్పితే భూకంపం వస్తుందన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తాజాగా ఆ మాట నిజం చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ మోడీ సొంతరాష్ట్రమైన గుజరాత్‌లోని మెహసానాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.   ఈ సందర్భంగా అక్కడ జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ 2013-14 మధ్యకాలంలో మోడీకి భారీగా ముడుపులు ముట్టాయని సంచలన ఆరోపణలు చేశారు. మోడీకి 6 నెలల్లో 9 సార్లు డబ్బులు చెల్లించినట్లు సహారా కంపెనీ ఉద్యోగుల డైరీల్లో ఆధారాలు లభించాయని రాహుల్ ఆరోపించారు. ఈ వివరాలన్ని ఆదాయపుపన్ను శాఖ రికార్డుల్లో పడి ఉన్నాయని కానీ దీనిపై ఎటువంటి చర్యా తీసుకోలేదని ఆయన అన్నారు.  ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా విడతలవారీగా నగదు ముట్టిన తేదీలతో కూడిన వివరాలతో ట్వీట్ చేశారు. దీనిలో వాస్తవమెంతో తెలియదు గానీ ప్రస్తుతానికి ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. 

జయ మరణంపై తేల్చేసిన అపోలో అధినేత...

  జయలలిత మరణంపై ఇంకా చాలా మందికి చాలానే అనుమానాలు వున్నాయి. ఆమె 75రోజులు అనారోగ్యంతో పోరాడి ఓడారు. పైగా ఇక అమ్మ ఆసుపత్రి నుంచి వచ్చేస్తోందని వార్త వెలువడ్డాక అంతా ఊపిరి పీల్చుకున్న సమయంలో అనూహ్యంగా గుండెపోటు కలకలం రేగింది. కేవలం కొన్ని గంటల్లోనే ఆమె అంతమయ్యారని డాక్టర్లు ప్రకటించారు. ఇదంతా చూస్తే ఎవరికైనా అనుమానం రాక తప్పదు. మరీ ముఖ్యంగా, గౌతమీ లాంటి ఒక తమిళ సినిమా సెలబ్రిటీ కూడా ప్రధానికి లేఖ రాయటం మరింత అనుమానాలకి తావిస్తోంది. కాని, మోదీ సర్కార్ ఇప్పుడప్పుడే జయలలిత మరణంపై విచారణ లాంటి ఆలోచనలు ఏం చేస్తున్నట్టు కనిపించటం లేదు. ప్రస్తుతానికి అందరూ ఆమె హార్ట్ ఎటాక్ తోనే చనిపోయారని నమ్మాల్సిందే.   జయలలిత స్లో పాయిజన్ వల్ల చనిపోయారనీ, అపోలో ఆసుపత్రిలో ఏం చికిత్స చేశారో బయట పెట్టాలనీ చాలా మంది అంటున్నారు. అలాగే  ఆ మధ్య రాహుల్ ట్విట్టర్ ని హ్యాక్ చేసిన లిజియన్ గ్రూప్ వాళ్లు అపోలో సర్వర్ ని తాము హ్యాక్ చేశామని చెప్పారు. అందులో తమకు తెలిసిన విషయాలు బయటపెడితే అల్లకల్లోలం జరుగుతుందన్నారు. కాని, తరువాత లిజియన్ గ్రూప్ హ్యాకర్స్ కూడా పురుచ్చి తలైవీ డెత్ సీక్రెట్స్ ఏం బయటపెట్టలేదు. అయితే, జయ మరణం తరువాత ఇన్ని రోజులకి అపోల్ చైర్మన్ ప్రతాప రెడ్డి నోరు విప్పారు...   తమ హాస్పిటల్ లో చేరిన జయతో తాను రెగ్యులర్ గా టచ్ లో వుండే వాడ్నని చెప్పిన ఆయన ఆమె చికిత్సకి చక్కగానే స్పందించారనీ, సహకరించారనీ చెప్పారు. 75రోజులు చెన్నైలోనే వుండి ముఖ్యమంత్రి చికిత్సని పర్యవేక్షించిన ప్రతాప్ రెడ్డి ఆమెకు అనూహ్యంగా గుండె పోటు వస్తుందని ఊహించలేకపోయామని చెప్పారు. స్ట్రోక్ వచ్చాక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెను కాపాడలేకపోయామని విచారం వ్యక్తం చేశారు!    జయలలిత మృతిపై ఇక ముందు కూడా జనాలకి ఎన్నో అనుమానాలు వుంటూనే వుంటాయి. కాని, ప్రస్తుతానికి మాత్రం అపోలోచైర్మన్ ప్రతాప్ రెడ్డి స్వయంగా చెప్పిన మాటల సాక్షిగా ఆమె గుండెపోటుతో సహజంగానే మరణించారని భావించాలి. ఇది కాక మరొక సత్యం ఏదైనా వుంటే అది ఎప్పుడో అప్పుడు తప్పక వెలుగు చూడాలని ఆశిద్దాం...

ఎమ్మెల్యేగారు... జాతీయ గీతం టైంలో ఫోన్ మాట్లాడుకున్నారు!

  ఇప్పుడు ఎక్కడ చూసినా జాతీయ గీతం చర్చే! సుప్రీమ్ కోర్టు మొదలు పవన్ కళ్యాణ్ వరకూ అంతటా, అందరూ జనగణమన గురించే స్పందించేస్తున్నారు! సినిమా హళ్లలో జాతీయ గీతం వస్తే నిలబడాలా అని కొందరు, నిలబడకపోతే దేశ భక్తి లేనట్లా అని మరి కొందరూ ప్రశ్నిస్తున్నారు. కేరళలో అయితే ఫిల్మ్ ఫెస్టివల్ సందర్బంగా జనగణమన వస్తోంటే కూర్చుని వుండిపోయిన 12మందిని అరెస్ట్ కూడా చేశారు. తమిళనాడులో జాతీయ గీతం సమయంలో నిలబడని వార్ని కొట్టారు కూడా. ఇలాంటి రచ్చ జరుగుతోన్న సమయంలోనే ఒక ఎమ్మేల్యే వారు జాతీయ గీతానికి అవమానం చేశారు!   ప్రజాప్రతినిధులుగా వుండటమంటే ఉపన్యాసాలు దంచటం, అవినీతి సొమ్ము సంపాదించుకోవటం, బుగ్గ కార్లో తిరగటం అన్నట్టుగా మారిపోయింది వ్యవహారం. సమాజాన్ని ఉద్ధరించే పనులు చేయకున్నా కనీసం జాతీయ గీతాన్నిగౌరవించటం కూడా మన వాళ్లు చేయలేకపోతున్నారు. బెంగాల్ ని ఏలుతోన్న టీఎంసీ పార్టీలోని ఒక ఎమ్మెల్యే వైశాలీ దాల్మియా. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆమె ఈ మధ్యే ఒక స్పోర్ట్స్ ఈవెంట్లో పాల్గొంది. ఆ సమయంలో అక్కడ జాతీయ గీతం వినిపించారు. అందరూ  అటెన్షన్ గా నిల్చుని వుండగా ఈమెగారు మాత్రం ఫోన్ లో మాట్లాడుకున్నారు. కెమెరాలన్నీ ఆమెనే చూస్తూండటంతో కాల్ కట్ చేసి అలెర్ట్ అయ్యారు! అసలు జనగణమన వస్తున్న 52సెకన్లలోనే ఆమె మాట్లాడాల్సి వచ్చిన అంతటి అర్జెంట్ కాల్ ఏంటి? అయినా అలా చేస్తే దేశానికే అవమానం, కేసు పెట్టే అవకాశం వుందని ఆమెకు తెలియదా? తెలిసినా అధికార పక్షం ఎమ్మెల్యేననే అహంకారమా?   టీఎంసీ లోని ఒక్క ఎమ్మెల్యేనే కాదు మన దేశంలో అన్ని పార్టీల్లోని చాలా మంది నేతలు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుంటారు. తమ పార్టీ అధినేతలకి సాష్టంగా నమస్కారాలు చేసే ఈ బానిసలు దేశానికి, దేశ జెండాకు, జాతీయ గీతానికి ఔన్సు గౌరవం కూడా ఇవ్వరు. ఇలాంటి వారి సారథ్యంలో భారతదేశం వుండటం వల్లే మన పరిస్థితి 70ఏళ్లుగా ఇలా వుంటోంది! సినిమా థియేటర్లలో దేశ భక్తి నిరూపించుకోవాలా అని ప్రశ్నించే వారు ఈ బెంగాల్ ఎమ్మెల్యేని చూసి విషయం అర్థం చేసుకోవాలి! కనీసం 52 సెకన్లు కూడా దేశం కోసం వెచ్చించలేని పరమ దుర్మార్గమైన భారతీయులు మన దేశంలో వున్నారు! అదే పెద్ద విషాదం...   

ఆర్మీతో ఆటలాడుతున్న రాజకీయ నేతలు!

  మన పక్కనే వున్న పాకిస్తాన్ ఎప్పుడూ సైనిక పాలనలోనే మగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం వున్నా అది ఎంత బలహీనంగా వుంటుందో అందరికీ తెలిసిందే. అసలు పాకిస్తాన్ డెమోక్రసీ ఫెయిల్ కావటానికి కారణం ఏంటి? అక్కడి మిలటరీ ప్రజా ప్రభుత్వాల పట్టులో వుండకపోవటమే! అక్కడ సైన్యాధిపతి ప్రధానిని, రాజకీయ నేతల్ని అందర్నీ శాసిస్తాడు. కాని, ఇండియాలో అందుకు విరుద్ధంగా వుంటుంది వ్యవస్థ. అదే మన 70ఏళ్ల సక్సెస్ కి కారణం. కాని, ఈ మధ్య ఆర్మీని కూడా అడుసులోకి లాగుతున్నారు మన రాజకీయ నేతలు. తమ పాలిటిక్స్ కోసం సైనిక వ్యవస్థని టార్గెట్ చేసి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. జాతికే ద్రోహం చేస్తున్నారు.   మన దేశంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, జుడీషియరీ, ఈసీ, ఇస్రో.... ఇలాంటి కొన్ని వ్యవస్థలు అద్భుతంగా పని చేస్తుంటాయి. వాటిలో కూడా లోపాలు వున్నా మొత్తం మీద చక్కటి ఫలితాలు రాబడుతుంటాయి. మరీ ముఖ్యంగా, దేశ భద్రతకు కారణమైన త్రివిధ దళాలు ఢిల్లీలో ఏ ప్రభుత్వం వున్నా తమ పని తాము చేసుకుపోతుంటాయి. అతి తక్కువ రాజకీయ జోక్యంతో కొనసాగుతుంటాయి. కాని రాను రాను మన నేతల పొలిటికల్ బ్రెయిన్స్ కి ఇవ్వి కూడా మినహాయింపు కాకుండా పోతున్నాయి. అందుకు తాజాగా జరిగిన ఆర్మీ చీఫ్ ఎన్నికే తార్కాణం!   సైన్యాన్ని నడిపించే ఆర్మీ చీఫ్ ఎన్నిక  బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. కాని, ఇప్పుడు ప్రతిపక్షంలో వున్న కాంగ్రెస్ తాను అధికారంలో వుండగా ఎన్నో సార్లు ఆర్మీకి చీఫ్ కమాండర్ ని నియమించింది. తీరా జనం మద్దతు ఎన్నికైన మోదీ మాత్రం అదే పని చే్స్తే రాజకీయ విమర్శలకి దిగుతోంది. ఆర్మీ బాస్ గా బిపిన్ రావత్ నియమకం పై హస్తం పార్టీ అనవసర గోల చేస్తోంది. ఆ పార్టీ వాదన ప్రకారం బిపిన్ కంటే ఇద్దరు సీనియర్లు వరుసలో వున్నారు. వాళ్లని కాదని మోదీ బిపిన్ కి ఎలా సారథ్యం అప్పగిస్తాడని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. గతంలో ఎప్పుడూ సీనియారిటీని పక్కన పెట్టి సత్తాకి పట్టం కట్టకపోతే కాంగ్రెస్ ఇలా మాట్లాడవచ్చు. కాని, ఇందిరా గాంధీ హయాంలో రెండు సార్లు ఇలాంటి పరిణామమే జరిగింది. అప్పటి సీనియర్లని కాదని ఇందిర తనకు నమ్మకం ఏర్పడ్డ వ్యక్తిని ఆర్మీ చీఫ్ గా అపాయింట్ చేశారు. 2014లో నేవీ చీఫ్ విషయంలో సోనియా కూడా అదే పని చేశారు. మన్మోహన్ ప్రభుత్వం సీనియర్ ని కాదని తరువాతి స్థాయిలో వ్యక్తినే నేవీ చీఫ్ గా అపాయింట్ చేశారు. కాని, ఇప్పుడు మోదీ అదే బాటలో నడిస్తే మాత్రం ఆరోపణలు దిగుతున్నారు కాంగ్రెస్ వారు. మరీ దారుణంగా మొదటి సారి పీఎం హరీజ్ అనే ముస్లిమ్ ను ఆర్మీ చీఫ్ గా ఎన్నిక చేసే అవకాశం వస్తే ... మోదీ దాన్ని కాలరాశారని మతం రంగు పులిమే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నిజానికి పీఎం హరీజ్ నే కాదు ప్రవీణ్ భక్షీ అనే హిందువుని కూడా మోదీ గవర్నమెంట్ పక్కన పెట్టింది. పాకిస్తాన్ తో విషమ పరిస్థితులు నెలకొన్న సమయంలో ముందు ముందు జరిగే పరిణామాలకి అనుగుణంగా బిపిన్ రావత్ ను ఎంపిక చేసింది. దీంట్లోంచి రాజకీయ లబ్ది పొందాలని చూడటం ప్రతిపక్షాలకి తగదు.   నోట్ల రద్దుపై నానా యాగీ చేసిన మమత కూడా కోల్ కతా లో ఆర్మీ కదలికల్ని అడ్డుకుని విపరీతంగా ప్రవర్తించారు. మన దేశంలో మన సైనికులు తనిఖీలు చేపట్టడానికి కూడా ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందిన ఆర్మీని కూడా ఆమె తన రాజ్యంలో కాలు ఎలా పెట్టారని ప్రశ్నించారు? ఇలాంటి చర్యలు ఆర్మీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. కాంగ్రెస్ , తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు తాత్కాలిక లాభాల్ని పక్కన పెట్టి ఆర్మీ లాంటి వ్యవస్థలని అన్న తమ విమర్శలకు అతీతంగా వుంచితే చాలా మంచిది. అది యావత్ దేశానికి మేలు చేస్తుంది... 

ట్రంప్ వైట్ హౌజ్ లోకి వస్తే... ఇండియన్స్ కి బ్లాక్ డేసే!

  ట్రంప్ వచ్చాక భారతీయులకి కష్టమే! ఈ మాట అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు బాగా వినిపించేది. అందుక్కారణం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవిదేశీయుల్ని ఇంటికి పంపించి.. అమెరికన్స్ కి ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని ఆయన ప్రకటించటమే. అందుకు మార్గంగా ట్రంప్ హెచ్ 1బీ వీసాల జారీని కఠినతరం చేస్తానని కూడా చెప్పాడు. ఇప్పుడు అన్నంత పనీ చేస్తాడని బిక్కుబిక్కుమంటున్నారు లక్షలాది ఇండియన్స్! హిల్లరీ గెలిస్తే బావుండేదేమో అని వాపోతున్నారు!   ట్రంప్ ముస్లిమ్స్ ని పొలిటికల్ గా టార్గెట్ చేస్తే ఇండియన్స్, చైనీస్, మెక్సికన్స్ ని ఉద్యోగాల పరంగా టార్గెట్ చేశాడు ఎలక్షన్స్ కి ముందు. మరీ ముఖ్యంగా, ఐటీ రంగంలో మన ఇండియన్స్ ప్రతీ సంవత్సరం లక్షల మంది వెళ్లిపోతున్నారు డాలర్స్ దేశానికి! అక్కడ స్థానికుల కంటే మనోళ్లు తక్కువ ధరకు పని చేసి నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. వాళ్ల మీద ఆధారపడ్డ ఇండియాలోని కుటుంబాలు కూడా ఫుల్ హ్యాపీ! మా వాళ్లు అమెరికాలో వున్నారని గర్వంగా చెప్పుకునే వారు. కాని, ఇప్పుడు అలాంటి ఎన్నారై ఐటీ ప్రొఫెషనల్స్ కి అందరికీ కష్ట కాలం వచ్చినట్టే కనిపిస్తోంది. కొత్త వారు వళ్లటం, పాత వారు  అమెరికాలోనే కొనసాగటం ఏది జరగాలన్నా వీసాలు ముఖ్యం. కాని, ట్రంప్ మన వారు అక్కడ ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించే హెచ్ 1బీ వీసాల జారీ కఠినతరం చేస్తాడని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే భారతీయులకి మరీ ముఖ్యంగా తెలుగు వారికి లక్షల ఉద్యోగాలు పోయినట్టే లెక్క! ఎందుకంటే, దేశంలోనే అత్యధిక మందిని అమెరికాకి పంపే రెండో సిటీ హైద్రాబాద్. ఇక్కడి నుంచి అమెరికాకి వేలాది మంది పరుగులు తీస్తుంటారు. వాళ్లందరికీ అమాంతం డాలర్ డ్రీమ్స్  చెదిరిపోయినట్టే!   ఎన్నికల ముందు అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ మన  మోదీని కాపీ చేసి గాలం వేసిన ట్రంప్ ఇప్పుడు మన ఉద్యోగాలకే ఎందుకు ఎసరు పెడుతున్నాడు? దీనికి జవాబు కూడా ఎన్నికల ముందే ఆయన ఇచ్చేశాడు. మన వాళ్లు లక్షల్లో వెళ్లిపోయి ఉద్యోగాలు చేసేస్తుండటంతో స్థానిక అమెరికన్లకి జాబ్స్  దక్కటం లేదు. ఎప్పుడూ లేనిది అమెరికన్స్ కి కూడా నిరుద్యోగ సమస్య ఎలా వుంటుందో తెలిసి వస్తోంది. అందుకే, ముందు తమ వారికి ఉద్యోగం ఇచ్చాకే విదేశీయులకి ఇవ్వాలని  ట్రంప్ అంటున్నాడు. అమెరికన్ యాంగిల్ నుంచి చూస్తే ఇది కరెక్టే కాని.. మన ఎన్నారై ఇండియన్ ఓట్స్ తెలివిగా రాబట్టుకుని గెలిచిన ట్రంప్ ఇప్పుడు మనకే నష్టం చేయటం... కొంచెం బాధాకరమే! కాని, ఇండియన్స్ పెంచుకున్న అమెరికన్ డాలర్ డ్రీమ్స్ కి మాత్రం ఇది రైట్ టైం కాదు..

పవన్ దెబ్బకి, వాడిపోతోన్న పువ్వు పార్టీ అభిమానుల ముఖాలు!

  పవన్ కళ్యాణ్ ట్విట్టర్ పోరాటం వాడిగా వేడిగా నడుస్తోంది! ఆయన విమర్శలు ముఖ్యంగా బీజేపి అభిమానుల్ని, మోదీ భక్తుల్ని చాలా డిస్టబ్ చేస్తున్నాయి. అందుకే, సోషల్ మీడియాలో పవర్ స్టార్ పై ఎదురు దాడి మొదలైంది. ఆయన గోవధ గురించి మాట్లాడితే... అది ఎప్పుడో పాచిపోయిన అంశం, దాన్ని ఇప్పుడెందుకు అనవసరంగా తిరగదోడుతున్నాడని అంటున్నారు. ఇక రోహిత్ వేముల ఆత్మహత్య గురించి మాట్లాడితే.. టీడీపికి ఇబ్బంది కలిగించే రిషితేశ్వరి ఉదంతం ఎందుకు మాట్లాడడని నిలదీస్తున్నారు. జాతీయ గీతం పాడమన్నది కేంద్రం కాదనీ... సుప్రీమ్ కోర్టు నిర్ణయాన్ని కూడా పవన్ వ్యతిరేకిస్తాడా అని సెటైర్లు వేస్తున్నారు. ఇక ప్రత్యేక హోదా విషయంలో అయితే కమలం పార్టీ వద్ద కానీ, ఆ పార్టీ ఫాలోవర్స్ వద్ద కాని ఎలాంటి యాన్సర్ లేదు. అలాంటి సమయాల్లోనే ఆయన మీద వ్యక్తిగత దూషణలకి కూడా దిగుతున్నారు. ఆయన మూడు పెళ్లిల్ల గురించి, ఫ్లాప్ సినిమాల గురించి వగైరా వగైరాల గురించి డిస్కస్ చేస్తున్నారు!   సోషల్ మీడియాలో పవన్ కు వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రచారం ఒక ఎత్తైతే రియల్ గా మాత్రం ఎవ్వరూ ఇంత వరకూ ఘాటుగా స్పందించలేదు. మరీ ముఖ్యంగా, పవర్ స్టార్ పవర్ ఫుల్ దాడికి టార్గెట్ అయిన బీజేపి ఒక్క మాట కూడా అనటం లేదు. హోదా బదులు ప్యాకేజ్ ఇచ్చిన కమలం పార్టీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో మరోసారి చెప్పాల్సిన అవసరం వుంది. అలాగే, పవన్ కళ్యాణ్ కేవలం తమ ఒక్క పార్టీనే టార్గెట్ చేసి ఎన్డీఏలో భాగస్వామి అయిన టీడీపీని, రాష్ట్రాన్ని ఏలుతోన్న పాలక పక్షాన్ని పల్లెత్తు మాట అనకపోవటాన్ని రాష్ట్ర బీజేపి గమనిస్తున్నట్టు లేదు! గమనించినా ఇప్పుడు అనువుగాని టైం అనుకుని ఊరకుండిపోతుందో ఏమో? కాని, దేశంలోనే అతి పెద్ద పార్టీ అయిన కాషాయదళం బాగా ఫాలోయింగ్ వున్న హీరో చేత తిట్లు పడుతూ కామ్ గా వుండటం ... ముందు ముందు ప్రమాదకరమే! అందుకే, తెలుగు రాష్ట్రాల్లోని బీజేపి అభిమానులు, మోదీ ఫాలోవర్స్ పవన్ ట్విట్టర్ దాడితో లోలోన రగిలిపోతున్నారు. కాని, ఢిల్లీ నేతలు మాత్రం గల్లీ బీజేపి నాయకుల్ని పవన్ పై ప్రతి దాడికి ఇంకా ఆదేశించటం లేదు! మొత్తానికి పవన్ కి చెలగాటం... బీజేపి ఫ్యాన్స్ కు ప్రాణ సంకటం అన్నట్టు తయారైంది పరిస్థితి!

ఇండియన్ కార్డ్స్... చైనీస్ స్వైపింగ్!

  డీమానిటైజేషన్... ఇప్పుడు ఇది పద్మవ్యూహంలా తయారైపోయింది. మోదీ నిర్ణయంతో రో్డ్డు మీదకొచ్చిన జనం క్యూ లైన్లలో సతమతం అవుతున్నారు. అలాగని ఇప్పటికిప్పుడు నోట్ల రద్దును వెనక్కి తీసుకోవటం సాధ్యమా? అస్సలు కుదరదు! కాస్త భారంగానైనా క్యాష్ లెస్ ఎకానమీ వైపు అడుగులు వేయాలి. అందుకే, డీమానిటైజేష్ యావత్ దేశం చిక్కుకుపోయిన పద్మవ్యూహం అంటున్నారు కొందరు. ఏ మాత్రం తేడా వచ్చిన ఇందులోంచి బయటపడలేక ఆర్దికంగా చచ్చిపోవాల్సిందే. అందుకే, కేంద్ర ప్రభుత్వం చకచకా గండం గట్టెక్కే ఏర్పాట్లు చేస్తోంది...  డీమానిటైజేషన్ వల్ల నల్లదనం అరికట్టడం, ఉగ్రవాదానికి మూలలు లేకుండా చేయటం, ధరలు తగ్గించటం... ఇలాంటి బోలెడు లాభాలు వున్నాయి. కాని, అవన్నిటికి ముందు జనం చేతిలో డబ్బు లేకపోవటమనే టెన్షన్ వుంది. దాన్ని తగ్గించటానికే పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లు రంగంలోకి దింపుతున్నారు. ఈ పీఓఎస్ మిషన్లు అంటే మనం చూసే స్వైప్ మిషన్లే. కాకపోతే, వీట్ని భారీగా వాడాలని నిర్ణయించటంతో చైనా లాభపడుతోందట! ఎలాగో తెలుసా?  మన మార్కెట్లో లివింగ్ రూంలో వేసుకునే కుర్చీలు మొదలు వాష్ రూంలో వాడే మగ్గుల వరకూ అన్నీ చైనా వస్తువులే. కాని, ఎన్ని రకాల వస్తువులు దిగుమతైనా ఇంత కాలం స్వైపింగ్ మిషన్లు మాత్రం ఇండియాలోనే తయారు చేసేవారు. కాని, ఇప్పుడు గవర్నమెంట్ యుద్ధ ప్రాతిపదికన ఊరూరా, పట్టణాల్లో, నగరాల్లో వీట్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించటంతో మన దేశ కంపెనీల వల్ల సాధ్యం కావటం లేదట. భారీగా పీఓఎస్ మెషిన్లు తయారు చేయాలంటే అది డ్రాగన్ కంట్రీలోని రెండు ప్రధాన కంపెనీల వల్లే సాధ్యమట. అందుకే, వాటికి ఆల్రెడీ ఆర్డర్లు ఇచ్చేసింది సెంట్రల్ గవర్నమెంట్.  చైనా పాకిస్తాన్ తో క్లోజ్ గా మూవ్ అవుతూ ఇండియాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికల్లో ప్రవర్తించటం మామూలే. కాని, అలాంటి దేశానికి మనకు అత్యవసరం వుండటంతో భారీ ఆర్డర్స్ ఇవ్వాల్సి రావటం పెద్ద విషాదం. మన శత్రువుకే మనం ఆర్దిక లాభం చేకూర్చిపెడుతున్నాం అన్నమాట! దీనిపై మోదీ సర్కార్ తక్షణం దృష్టి పెట్టి చైనా మాల్ ను అరికట్టాలి. అలాగే, స్వైపింగ్ మెషిన్ల లాంటి ఆర్దిక లావాదేవీలకు సంబంధించిన పరికరాల్ని దిగుమతి చేసుకునేప్పుడు మరింత జాగ్రత్తగా కూడా వుండాలి. హ్యాకింగ్ లాంటి గోల్ మాల్ జరిగే అవకాశం కూడా వుంది. మరి మోదీ చైనీస్ మాల్ కి, గోల్ మాల్ కి విరుగుడు కనుక్కుంటారా లేదా వేచి చూడాలి...   

ఓల్డు గోల్డుపై బోల్డుగా స్పందించిన కేసీఆర్!

  నోట్ల రద్దు తరువాత మోదీకి మద్దతు కరువైంది. రాహుల్, కేజ్రీవాల్, మమత బెనర్జీ అయితే రో్డ్డు మీదకొచ్చి నానా యాగీ చేశారు. మిగతా నాయకులు, సీఎంలు అంతగా అల్లరి చేయకున్నా ప్రధానిని వీలైనంత టార్గెట్ చేశారు. కాని, ఇటువంటి సమయంలో నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్ నమోకి అండగా నిలిచి ఆశ్చర్యపరిచారు. అందుకే, మోదీ వాళ్లకు ధన్యవాదాలు కూడా చెప్పారు. అయితే, మొత్తం దక్షిణాదిలో ఎన్డీఏలో లేకున్నా మోదీ వైపు నిల్చిన ముఖ్యమంత్రి కేసీఆరే! అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన పీఎం వెంట అందరూ వుండాలని పిలుపునిచ్చారు. ఇది నరేంద్రడుకి నిజంగా నైతిక స్థైర్యాన్ని ఇచ్చేదే...  కేసీఆర్ నోట్లు రద్దు చేసిన వెంటనే ఏమీ స్పందించలేదు. తరువాత చిరు కోపం ప్రదర్శించారు. కాని, ప్రధాని ఆఫీస్ నుంచి ఫోన్ రాగానే ఒక్కసారే గేర్ మార్చేశారు. ఢిల్లీ వెళ్లి వచ్చాక మొత్తం టోనే మారిపోయింది. మోదీ తన భవిష్యత్ వ్యూహాలు కేసీఆర్ తో ఏం పంచుకున్నారో తెలియదుగాని తెలంగాణ సీఎం డీమానిటైజేషన్ కు నూటికి నూరు శాతం మద్దతు ప్రకటించారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో కూడా కేసీఆర్ మోదీ నిర్ణయాన్ని చారిత్రాత్మకమైందిగా అభివర్ణించారు. కాని, అంతలోనే తనదైన స్టైల్లో చిరు హెచ్చరిక కూడా చేశారు! మోదీ నోట్లు రద్దు చేసినప్పుడు అయిన గొడవ కన్నా ఎక్కువ హంగామా బంగారం లెక్కలు తీస్తారన్నప్పుడు అయింది. దీనికి కొంత వరకూ మీడియా అల్లరి కూడా కారణం. మహిళల్ని మరీ భయపెట్టేసే సరికి చాలా మంది అపోహలకి లోనయ్యారు. దాన్నే కేసీఆర్ చర్చిస్తూ చట్టబద్ధమైన బంగారం ఎవ్వరూ తీసుకుపోరని అన్నారు. కాని, లెక్కలు చూపని నల్ల బంగారం ఖచ్చితంగా బయటకు తీయాల్సిందేనన్నారు. అయితే, వారసత్వంగా వస్తున్న బంగారం కూడా కేంద్ర ప్రభుత్వం ముట్టుకోదని చెబుతూనే... అలాంటి ప్రయత్నం చేస్తే ముందు తానే ఎదురు తిరుగుతానని ఆయన అన్నారు! నిజానికి దేశంలోని అందరూ ముఖ్యమంత్రులు కేంద్రంతో ఇలా పట్టువిడుపు ధోరణిలో పని చేస్తే నోట్ల రద్దు సమస్య ఇంత జటిలం అయ్యేది కాదని అంటున్నారు కేసీఆర్ అభిమానులు. అదీ నిజమే...   

ఇద్దరు ప్రెసిడెంట్లు... రెండు దేశాలతో పేచీలు పెట్టుకుంటున్నారు!

అమెరికా పరిస్థితి విచిత్రంగా వుందిప్పుడు! ఆ దేశానికి ఇద్దరు ప్రెసిడెంట్లు కొనసాగుతున్నారు. ఒబామా ఇంకా దిగిపోలేదు. కాని, ట్రంప్ ఎన్నికైపోయాడు. ఒక వైపు ఒబామా తనదైన స్టైల్లో ప్రెసిడెంట్ గిరి ఇంకా చేస్తుండగానే ట్రంప్ కూడా ప్రపంచం మీద పడిపోయి ఫోన్ కాల్స్ చేసేస్తు సంచలనాలు సృష్టిస్తున్నాడు! అమెరికా తరువాత అంతటి శక్తివంతమైన దేశాలైన రష్యా, చైనాలతో వివాదాల్ని రాజేసుకుంటున్నారు ఇద్దరు ప్రబుద్ధులు...   ట్రంప్ తైవాన్ విషయంలో చేసిన ఘనకార్యం మనకు తెలిసిందే. ఆయన ఎప్పుడూ లేనిది ఆ దేశ అధ్యక్షురాలితో ఫోన్ లో మాట్లాడారు. తమ దేశానికి పర్యటన కోసం రమ్మన్నారు. ఇది తైవాన్ ను ఇప్పటికీ ప్రత్యేక దేశంగా గుర్తించని చైనాకు మంట పుట్టించింది. తైవాన్ తమ భూభాగమే అని దబాయించే డ్రాగన్ అమెరికాపై నిప్పులు కక్కుతోంది! ఇది అమెరికా భవిష్యత్ అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారమైతే ప్రస్తుత ప్రెసిడెంట్ ఒబామా కూడా వెళుతూ వెళుతూ తన సత్తా ఏంటో చూపించి వెళతానంటున్నాడు!   ఒబామాది డెమోక్రాటిక్ పార్టీ. హిల్లరీ కూడా డెమొక్రాటే. అయితే, మొన్న జరిగిన ఎన్నికల్లో ఆమె గెలుస్తుందని అంతా చెప్పినా అనూహ్యంగా ట్రంప్ గెలిచాడు. ఈ విషయమే హిల్లరీ స్వంత పార్టీ వాడైన ఒబామాకు ఇంకా మింగుడుపడటం లేదు. తమ అభ్యర్థిని ఓడించటానికి రష్యా కుట్ర చేసిందంటున్నాడు. పుతిన్ స్వయంగా తమ సర్వర్లపై దాడులు చేయించాడని ఆయన నిర్ధారణకొచ్చేశాడు. అంతే కాదు, తమ ఇంటలిజెన్స్ ఏజెన్సీలు త్వరలోనే రిపోర్ట్ ఇస్తాయని, అప్పుడు నేరుగా రష్యాపై దాడులు చేస్తామని అంటున్నాడు. కాని, ఒబామా వద్ద మిగిలింది చాలా తక్కువ రోజులే. అంతలోనే రష్యా తమ ఎన్నికల్ని ప్రభావితం చేసిందని నిరూపించి దాడులకి దిగాలని ఆయన ఆలోచన! కాని, అదంత ఈజీ ఏం కాదు.నెక్స్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అంగీకరించాలి. కాని, అసలు పుతిన్ అమెరికా ఎన్నికల్ని ఇన్ ఫ్లుయెన్స్ చేయటం ఆయనకు ముందు నుంచే తెలుసు. అందువల్లే ఆయన గెలిచాడు కూడా! మరిక ఒబామాకు ఆయన ఎందకు సహకరిస్తాడు?   నిజంగా రష్యా అమెరికాఎన్నికల్ని ప్రభావితం చేసినా కూడా ఆ దేశంపై అగ్ర రాజ్యం మిలటరీ దాడుల దాకా వెళ్లకపోవచ్చు. అదీ దిగిపోతోన్న ఒబామా ఆదేశాల మీద అస్సలు చేయకపోవచ్చు. కాని, రష్యాతో గొడవంతా టీ కప్పులో తుఫాన్ అయినా తైవాన్ విషయంలో చైనాతో ట్రంప్ పెట్టుకున్న పేచి ఇప్పుడే తెగేలా లేదు! ఆయన ఇంకా నాలుగేళ్లు వైట్ హౌజ్ లో వుంటాడు కాబట్టి డ్రాగన్ కు ఏదో ఒక విధంగా సెగ తగలటం, అది తిరిగి అమెరికాకు గట్టిగా బదులివ్వటం అనివార్యం అంటున్నారు ఇంటర్నేషనల్ రిలేషన్ ఎక్స్ పర్ట్స్!

వాటి పై లవ్వెక్కువైతే... లావైపోతారట!

మీరు బాగా లావైపోయారా? దీనికి కారణం ఏంటో అర్థం కావటం లేదా? ఎంతగా డైటింగ్ చేసినా కూడా ఒళ్లు తగ్గటం లేదా? పోనీ... రాత్రి పూట అన్నం మానేసి, పొద్దున్నే యోగా, ఎక్సర్సైజ్ లు చేస్తున్నా పెద్దగా ఫలితం వుండటం లేదా? అయితే, మీరు వెంటనే ఓ పని చేయాలి. అప్పుడు ఇక పాత పర్ఫెక్ట్ ఫిగర్, ప్లాట్ టమ్మీ... మీవి మీకు తిరిగొచ్చేస్తాయి! ఇంతకీ ఏంటా స్లిమ్ అండ్ సెక్సీ సీక్రెట్ అంటారా? మీ ఎలక్ట్రానిక్ డివైజెస్! ఆధునిక కాలంలో ఇంటి నిండా పరికరాలే! చేతి నిండా స్మార్ట్ టెక్నాలజీనే! ఇప్పుడు ఈ టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్లే కొంప ముంచుతున్నాయట! గోడకు తగిలించే ఎల్సీడీ టీవీలు మొదలు చేతిలో పట్టుకునే స్మార్ట్ ఫోన్ వరకూ అన్నీ ఉబకాయానికి ఊతమిస్తున్నాయట. ఎలా అంటే, టీవీలు, ఫోన్ లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ మనిషి మనస్సుపై ఒత్తిడి పెంచుతున్నాయి. కళ్లపై కూడా ప్రభావం చూపుతున్నాయి. అసలు అమెరికాలో చేసిన ఒక సర్వే ప్రకారం రోజుకు 5గంటల కంటే ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ వాడుతున్న యువత సరిగ్గా నిద్ర కూడా పోవటం లేదట. ఇక ఆహారం కూడా ఈ పరికరాల దెబ్బకు అదుపు తప్పుతోందట! మామూలు వారికంటే ఫోన్ లు ఎక్కువగా వాడేవారు, టీవీ ఎక్కువగా చూసేవారు, కంప్యూటర్ ముందు చాలా సేపు కూర్చునే వారు అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా వుందంటున్నారు నిపుణులు. చక్కెర ఎక్కువగా వుండే ఆహారాలు, పానీయాలు వీరు విపరీతంగా అలవాటు చేసుకుంటున్నారట. టీవీ, కంప్యూటర్ లాంటివి చూస్తూ ఎంత తాగుతున్నారో, తింటున్నారో అంచన లేక ఎక్కువే లాగించేస్తున్నారు. దీని వల్ల కూడా జబర్దస్త్ గా వుండాల్సిన ఫిగర్ కాస్తా బస్తాలా మారిపోతోంది...  సో... లావైపోయిన వారు కేవలం తిండి తగ్గిస్తేనో, ఆరోగ్యకరమైన ఆహారం తింటేనో బరువు తగ్గిపోరు. వాటితో పాటూ వెలుగులు విరజిమ్మే ఎలక్ట్రానిక్ తెరల్ని సాధ్యమైనంత తక్కువ సేపు చూడాలి. అది టీవీ అయినా, కంప్యూటరైనా, స్మార్ట్ ఫోనైనా... అవసరానికి మించి చూస్తూ కూర్చుంటే... మనకు మనం అద్దంలో చూసుకోబుద్ది కానంత షేపవుట్ అవ్వటం గ్యారెంటీ...   

గోవధ... గోవా... ఇంతకీ, గోపాలుడి గోలేంటి?  

పవన్ తెలిసి చేస్తున్నాడో... తెలియక చేస్తున్నాడోగాని... రిస్కీ రాజకీయమే చేస్తున్నాడు. ఇలా ఎందుకు అనాల్సి వస్తోందంటే ఒకవైపు సినిమాలు చేస్తూ ఇంకా ఫుల్ టైం పొలిటీషనే కాలేదు. కాని, ట్విట్టర్ వేదికగా, ఢిల్లీని పాలిస్తోన్న అతి పెద్ద పార్టీని టార్గెట్ చేస్తున్నాడు. దీని వల్ల ఆయన అశిస్తుందేంటో ఎంతకీ అర్థం కావటం లేదు. ఈ మాట అంటోన్నది మామూలు జనమే కాదు రాజకీయ విమర్శకులు కూడా... పవన్ కళ్యాణ్ 2014లో మోదీ, చంద్రబాబులతో కలిసి వేదికలు పంచుకున్నాడు. అప్పుడు కూడా బీజేపి హిందూత్వ పార్టీనే. గోవధ విషయంలో వారి స్టాండ్ ఎప్పుడూ ఒకటే. కాని, మోదీ అధికారంలోకి వచ్చాక దాద్రి ఘటన లాంటి వాటి నేపథ్యంలో కొంత గందరగోళం నెలకొంది. కాని, బీహార్ ఎన్నికల తరువాత బీఫ్ ని అందరూ మరిచిపోయారు. అటువంటి అంశం ఇప్పుడు పవన్ సంరద్భరం లేకుండా తిరగదోడుతున్నాడు. బీఫ్ ను ముందు గోవాలో బ్యాన్ చేయాలంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నాడు. కొంత వరకూ బీజేపీ గోవును, రామ మందిరాన్ని అధికారంలోకి వచ్చేందుకు వాడుకుని వుండవచ్చు. కాని, మోదీ ప్రధాని అయ్యాక గో వధ విషయం పై కేంద్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఏ రాష్ట్రంలోనూ కొత్తగా నిషేధం అమలు చేయటానికి ప్రయత్నించింది కూడా లేదు. పార్లమెంట్ లోనూ గో వధ నిషేధిస్తామని ఎవ్వరూ అనలేదు. అయినా పవన్ ఇప్పుడు బీఫ్ రాజకీయాలకు దిగటం ఆయన వ్యూహానికే అందాలి! గో వధ విషయంలోనే కాదు, రోహిత్ వేముల ఉదంతాన్ని కూడా తిరగదోడే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది పవన్. అసలు ఇలాంటి అంశాలు సామాన్య జనానికి ఎంత వరకూ కనెక్ట్ అవుతాయి? ప్రత్యేక హోదా , నోట్ల రద్దు లాంటివైతే ఓకేగాని బీఫ్ బ్యాన్, రోహిత్ వేముల ఆత్మహత్య... వీటి వల్ల పవన్ ఏపీలో సాధించేదేమిటి? ఆయన తాజాగా కమ్యూనిస్టులతో చేతులు కలపటమే ఈ విమర్శలకి కారణమా? కొందరైతే అదేనంటున్నారు! అచ్చం కమ్యూనిస్టులు బీజేపిని విమర్శించినట్టే పవన్ కూడా కామెంట్లు చేస్తున్నాడని అంటున్నారు. అయితే, ఇక్కడ ఎవ్వరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఆంధ్రాలో బీజేపి బలం చాలా పరిమితం. అటువంటి పార్టీని టార్గెట్ చేసి వచ్చే ఎన్నికల్లో ఎంత లాభపడవచ్చు? అదికారంలో వున్న టీడీపిని తగినంతగా విమర్శించకుండా, ప్రతిపక్షంలో వున్న వైసీపి ఓట్లను తనవైపు మరల్చుకునే ప్రయత్నం చేయకుండా, ఎక్కడో ఢిల్లీలోని కమలదళాన్ని ఇక్కడ్నుంచి విమర్శిస్తే వచ్చేదేంటి? అదీ ప్రత్యేక హోదా లాంటి వాల్యూ వున్న విషయలు కూడా కాకుండా గోవధ లాంటి ఫక్తు రాజకీయ అంశాలు నెత్తికోవటం దేనికీ? లోగుట్టు అంటు ఒకటి ఏదైనా వుంటే... అది పవన్ పెరుమాళ్ల వారికే ఎరుక!  

పెద్దాయన.. పెద్దలకు మాత్రమే వీడియో... పెద్ద గండంలో కాంగ్రెస్!

  మోదీ 2014లో ఇచ్చిన నినాదం కాంగ్రెస్ హఠావ్! నిజానికి వాలకం చూస్తుంటే కాంగ్రెస్ ను ఎవరో వచ్చి తొలగించే అవసరమే లేనట్లు కనిపిస్తోంది. హస్తం పార్టీ వరుసగా ఒక్కో రాష్ట్రంలో తనపై తానే భస్మాసుర హస్తం పెట్టుకుంటూ వస్తోంది! తాజాగా వారి చేతిలో వున్న ఏకైక పెద్ద రాష్ట్రం కర్ణాటక కూడా హస్తం చేయి నుంచి జారిపోయే పరిస్థితులు క్రమంగా అధికమవుతున్నాయి! సీఎం సిద్ధరామయ్య క్యాబినేట్లోని సీనియర్ మంత్రి హెచ్, వై. మేటి. ఎక్సైజ్ శాఖను నిర్వహించే ఆయన మత్తులో చిక్కుకుని చేయ కూడని పనే చేశాడు. మందు తాగినా బావుండేది. మగువతో అడ్డంగా దొరికిపోయాడు. అదీ ఆమెకు ఇష్టం లేకుండా బలవంతం చేశాడట ప్రబుద్ధుడు. ఇదంతా కేవలం ఆరోపణ కాదు. 70ఏళ్లు పైబడ్డ ఆ నవ యవ్వన సుందరాంగుడి గన్ మెన్ లో ఒకరే వీడియో తీసి మరీ సాక్ష్యం అందించాడు. దాన్నిఅందుకున్న ఓ సమాచార హక్కు ఉద్యమకారుడు బజారుకీడ్చాడు. ఇప్పుడు రాసలీల ముదురు, ముసలి మంత్రిగారి పదవి ఊడింది. స్వయంగా ఆయనే రాజీనామా చేయగా, గవర్నర్ ఉన్నపళంగా అమోదించారు!   నిజానికి పొలిటిషీన్స్ రాసలీలలు జరపటం మన దేశంలో పబ్లిక్ సీక్రెట్. అంతా అందరికీ తెలిసిందే. కాని, వీడియోతో సహా బయటపడ్డప్పుడు ఒక్కసారిగా అంతా షాకవుతారు. మేటి లాంటి మేటి నాయకులు కూడా ఆ దెబ్బకు తాటి పళ్లలా ఊడి కింద పడతారు. కాని, కర్ణాటకలో సమస్య కేవలం బజారున పడ్డ పెద్దాయనది మాత్రమే కాదు. త్వరలో ఎన్నికలు రానున్న వేళ మొత్తం పార్టీనే మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. అదీ ఇప్పుడు ఢిల్లీ హైకమాండ్ కు పెద్ద టెన్షన్!    హెచ్ వై మేటీ నేరుగా వ్యవహారం నడుపుతూ బుక్కయ్యాడు. కాని, అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ వారే బ్లూ ఫిల్ములు చూస్తూ అంసెబ్లీని భ్రష్ఠుపట్టించారు. ఇక అవినీతి ఆరోపణలకైతే కొదవే లేదు. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా బోలెడు మంది అధికార వర్గం నేతలపై ఆరోపణలు వచ్చాయి. కేసులు నడుస్తున్నాయి. వీటన్నిట్ని జనం నిశ్శబ్ధంగా చూస్తూనే వున్నారు. మరో వైపు కావేరి జలాల విషయంలో సుప్రీమ్ తీర్పు కూడా కర్ణాటక రాష్ట్రానికి వ్యతిరేకంగా వచ్చింది. దీన్ని ప్రతిపక్షం రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ కి వ్యతిరేకంగా వాడుకుంటోంది. అసలు బెంగుళూరు రోడ్లపై ట్రాఫిక్ సమస్య మొదలు పక్క రాష్ట్రం తమిళనాడుతో నీటి గొడవల వరకూ అనేక విషయాల్లో సిద్ధరామయ్య గవర్నమెంట్ ఫెయిలవుతూ వస్తోంది!   కర్ణాటక వచ్చే ఎన్నికల్లో దాదాపుగా హస్తం చేయి నుంచి జారిపోయే సూచనలు స్సష్టంగా కనిపిస్తున్నాయి. ఏదో అద్భుతం జరిగి మళ్లీ అక్కడ కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి తప్ప గత 5ఏళ్ల పాలన మాత్రం ఏ విధంగానూ ఓట్లు సంపాదించే స్థితిలో లేదు. దానికి తోడు ఇప్పుడు రాసలీలలు కూడా బయటపడటం రచ్చని మరింత ఎక్కువ చేసేసింది. ఒకవేళ కర్ణాటక లాంటి పెద్ద రాష్ట్రం కూడా పోతే... మోదీ చెప్పిన కాంగ్రెస్ ముక్త్ భారత్... దాదాపుగా జరిగిపోయినట్టే! కౌంట్ డౌన్ బిగిన్స్ ...

అరవింద్ కేజ్రీవాల్ మార్క్'ఫేక్' రాజకీయాలు!

  రాజకీయాల్లో కొంత మేర డ్రామా అవసరమే. కాని, రాజకీయమే డ్రామా అనుకుంటే పొరపాటు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ లాంటి పెద్ద పెద్ద అంశాలు వుండొచ్చు, వుండొకపోవచ్చు. కాని, కనీసం కామన్ సెన్స్ , న్యూసెన్స్ చేయకుండా వుండే డిగ్నిటీ అన్నా వుండాలి. వీటన్నిటికీ తాను అతీతం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. భారీ మెజార్జీతో రెండోసారి ఢిల్లీ సీఎం అయినా ఆయన ఎప్పుడు చూసినా పార్లమెంట్లో ప్రతిపక్ష నేత లాగే మాట్లాడుతాడు తప్ప ఏనాడూ రాష్ట్ర సీఎంగా వ్యవహరించరు. మోదీని విమర్శించంది రోజు గడవని ఆయన రాను రాను మరీ డ్రామా మాస్టర్ గా మారిపోతున్నారు. తాను  చేసే ఆరోపణల్లో పస ఎంతా అన్నది, వాటి వల్ల తనకి , జనానికి లాభం ఎంతా అని ఆలోచించటం లేదు...   మోదీపై అరవింద్ అత్యంత తాజా ఆరోపణ ఆయన విద్యార్హతలు నిజం కాదని! ఇది ఇంతకు ముందే ఏకే ప్రధాని పై గురి పెట్టిన అస్త్రం. అయితే, ఢిల్లీ, గుజరాత్ యూనివర్సిటిల్లో మోదీ సర్టిఫికెట్లు నకిలీ అని ఏ విధంగానూ నిరూపించలేకపోయారు. కోర్టులో కేసు నడుస్తూనే వుంది. కాని, ఇంతలోనే ఢిల్లీ సీఎం తన సహజ శైలిలో మీడియా ముందు విరుచుకుపడ్డారు. మోదీ అసలు చదువుకోలేదని, అందుకే, ఆయన నోట్లు రద్దు చేసి దేశం మొత్తాన్ని సంక్షోభంలో పడేశారని అన్నారు. డీమానిటైజేషన్ ఇబ్బందులు నిజమే కావచ్చు కాని... మోదీ నకిలి సర్టిఫికెట్లకి , డీమానిటైజేషన్ కి లింకు పెట్టడం ఏంటి? అయినా ప్రధానులు, ముఖ్యమంత్రులు చదువుకున్న వారే కావాలని మన రాజ్యాంగంలో లేదు కదా? ఒకవేళ చదువుకున్న ప్రధానే వుంటే నోట్ల రద్దు సక్రమంగా జరిగిపోయేదా? ఇలాంటి అనేక లాజికల్ ప్రశ్నలకి కేజ్రీవాల్ వద్ద సమాధానం లేదు.   నరేంద్ర మోదీ మన ప్రతిపక్షలకి నచ్చకపోవచ్చు. అలాగే, దేశంలోని చాలా మంది జనానికి, సంస్థలకి, సంఘాలకి నచ్చకపోవచ్చు. కాని, ఆయన ప్రపంచం ముందు భారతదేశ ప్రధాని. అటువంటి స్థాయిలో వున్న వ్యక్తిని సహేతుకంగా విమర్శించాలి కాని అర్థం పర్థం లేని ఆరోపణలు చేయకూడదు. అది దేశానికే అవమానం. అసలు అరవింద్ చెప్పినట్టు మోదీ నిజంగా చదువుకున్న వాడు కాకపోతే వచ్చిన నష్టం ఏంటి? 2014లో ప్రజలు ఆయన ఏ డిగ్రీ, ఏ యూనివర్సిటీ నుంచి సాధించాడని నిర్ధారించుకుని ఓటు వేయలేదు కదా? గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన ట్రాక్ రికార్డ్ గమనించి వేశారు. ఇప్పుడు ఆయన చేస్తున్న కార్యక్రమాలు నచ్చకపోతే వచ్చే ఎన్నికల్లో బుద్ది చెబుతారు. కాని, కేజ్రీవాల్ ఇవేవీ పట్టించుకోకుండా.. జనానికి ఎలాంటి ఉపయోగం లేని ప్రధాని విద్యార్హతల అంశం రచ్చ చేయటం డ్రామా మాత్రమే అనిపించుకుంటుంది!   ఢిల్లీ సీఎం అయినప్పటికీ కేజ్రీవాల్ దేశ వ్యాప్తంగా వున్న జనం సమస్యల గురించి మాట్లాడితే ఏ మాత్రం తప్పు కాదు. మోదీని విమర్శించినా తప్పు కాదు. కాని, ఆయన గమనించాల్సింది ఒక్కటుంది. ఉత్తర్ ప్రదేశ్ లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాలని పాలించే ముఖ్యమంత్రులు సహా త్రిపుర లాంటి చిన్న రాష్ట్రాలని ఏలుతోన్న సీఎంల వరకూ ఎవ్వరూ అవసరానికి మించి పీఎంని తిట్టిపోయటం లేదు. కేవలం కేజ్రీవాలే మాత్రమే ఆయన నిర్ణయాలు మొదలు చదువు వరకూ అన్నిటిని తూర్పార పడుతున్నారు. దీని వల్ల ఖచ్చితంగా లాభం కంటే నష్టం ఎక్కువగా వుండే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికిప్పుడు టీవీల్లో హడావిడి కనిపించినా ఎన్నికల సమయంలో ఢిల్లీ ప్రజలు కూడా ఆయన మీద పెట్టుకున్న ఆశల్ని వదిలేసి కఠిన నిర్ణయం తీసుకునే వీలుంది!

గడ్డం అడ్డమే అంటోన్న సుప్రీమ్ కోర్టు!

  గడ్డం మగవాళ్ల ఐడెంటిటీలో భాగం. చాలా వరకూ మేధావులు, సాధువులు, ముల్లాలు, మత గురువులు కూడా గడ్డాలు పెంచుతుంటారు! ఒక్కోసారి సినిమా హీరోలు కూడా క్యారెక్టర్ లో డెప్త్ రావాలంటే గడ్డం పెంచేస్తుంటారు. అసలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయే గడ్డంలోనే ఏదో తెలియని గాంభీర్యం వుంది. అందుకే, అన్ని వదిలేసిన సన్యాసులు మొదలు అన్నీ తెలుసన్నట్టు మాట్లాడే మేధావుల వరకూ గడ్డం గీయకుండా వుండటానికే ప్రిఫర్ చేస్తారు! కాని, తాజాగా గడ్డం పెంచేసుకోటం తప్పంటోంది సుప్రీమ్ కోర్టు. అయితే, ఎవ్వరూ పెంచొద్దని మాత్రం చెప్పటం లేదు...   ఇంతకీ విషయం ఏంటంటే, ఆ మధ్య భారత వాయుసేనకు చెందిన ఓ ముస్లిమ్ ను గడ్డం పెంచాడనీ, గీసుకునేందుకు నిరాకరించాడనీ సస్పెండ్ చేశారు. ఆయన దీనిపై సుప్రీమ్ కు వెళ్లాడు. సిక్కులకి  గడ్డం పెంచుకోవటం, తలపాగా పెట్టుకోవటం తప్పు కానప్పుడు ముస్లిమ్ లు గడ్డం పెంచితే తప్పేంటని ఆయన వాదించారు. సుప్రీమ్ ఈ కేసులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు, ఇండియన్ గవర్నమెంట్ కు నోటీసులు ఇచ్చింది. అయితే, 2008 నుంచీ నడుస్తోన్న ఈ కేసులో తాజాగా సుప్రీమ్ జడ్జీలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముస్లిమ్స్ అయినా సరే భద్రతా దళాల్లో వున్నప్పుడు గడ్డం తీసి నీట్ గా షేవ్ చేసుకోవాల్సిందేనని వారు అన్నారు. అది క్రమశిక్షణలో భాగంగా చూడాలే తప్ప మత స్వేచ్ఛకు భంగంగా చూడొద్దని అన్నారు. అయితే, సిక్కులకి మాత్రం దీన్నుంచి మినహాయింపు వుంది. ఇక ముందు కూడా అది అలాగే కొనసాగే అవకాశమే వుంది.   సిక్కులకి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ .. ఎందులో అయినా గడ్డం, తలపాగా అనుమతించబడతాయి. ఇది వాళ్ల మత నియమాన్ని గౌరవిస్తూ ఇచ్చే వెసులుబాటు. కాని, భద్రతా దళాల్లో పని చేసే ఇతర మతాల వారు, అంటే, హిందు, ముస్లిమ్, క్రిస్టియన్, పార్సీ ... ఎవరైనా క్లీన్ గా షేవ్ చేసుకోవాల్సిందే. హెయిర్ కట్ కూడా నియమాలకి లోబడే చేయించుకోవాలి. దీనికి కారణం సిక్కుల్లాగా ఇతర మతాల వారు అందరూ, అన్ని వేళలా గడ్డం పెంచకపోవటమే. వాళ్లు దాదాపుగా ఎప్పుడూ గడ్డం, జుట్టు కత్తిరంచరు. ఈ నియమం కాణంగానే సిక్కులకి అన్ని రంగాల్లో గడ్డం, తలపాగాకు సంబంధించి ప్రత్యేక మినహాయింపు కొనసాగుతూ వస్తోంది.   2008 నుంచీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై కోర్టులో పోరాడుతూ వస్తోన్న సస్పెండ్ అయినా ఉద్యోగి అన్సారీ, ఫైనల్ జడ్జిమెంంట్ కోసం మరికొంత కాలం ఎదురు చూడాల్సి వుంటుంది.ఇంకా ఈ కేసులో తుది తీర్పు ఇవ్వలేదు సుప్రీమ్.    

ఏమిటా అసంతృప్తి!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌  నిన్న కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు విశ్లేషకులకు పనిపెట్టేలా సాగాయి. ‘‘ఇప్పటివరకు భిన్న దృక్పథాలున్న పార్టీలెన్నో అధికారంలోకి వచ్చాయి. అనేక కార్యక్రమాలను చేపట్టాయి. అయినా ఇప్పటికీ సమాజంలో ఎక్కడో ఏదో అసంతృప్తి ఉంది. లోపం ఎక్కడుందో గుర్తించాలి. ప్రజలకు నిజంగా ఏం కావాలో తెలుసుకోవాలి. పరిష్కారాలు వెతకాలి. ప్రజల అసంతృప్తి పరిధి దాటితే.. దాన్ని కొన్ని శక్తులు దుర్వినియోగం చేసే అవకాశముంది...’’ అంటూ కేసీర్‌ చెప్పిన మాటలు వాస్తవాలను ప్రతిబించేలా ఉన్నాయి.   సమాజంలో తీవ్ర అసంతృప్తి ఉందన్న విషయాన్ని పాలకులు ఒప్పుకోవడం ఆశ్చర్యమే! కళ్ల ముందున్న ప్రజల జీవితాలు ఎంత దయనీయంగా ఉన్నా, భేషజాలకు పోయి ‘ఆల్ ఈజ్ వెల్‌’ అని వాక్రుచ్చే స్టేట్‌మెంట్స్‌కి ఈ వ్యాఖ్యలు కాస్త భిన్నంగా ఉన్నాయి. కానీ సమాజంలోని అసంతృప్తికి కారణం ఏమిటో తెలియాలంటే మేధావులు బుర్రలు బద్దలుకొట్టుకోనక్కరలేదు. ఒక సగటు మనిషి జీవితం సాఫీగా సాగిపోకుండా ఎక్కడెక్కడ ఇబ్బందుల పాలవుతున్నాడో తెలిస్తే చాలు. నీరు, రోడ్లు, విద్య, చదువు, విద్యుత్తుకి సంబంధించి మౌలిక సదుపాయాలు సవ్యంగా లేని సమాజంలో అసంతృప్తి ఉండకుండా మరేముంటుంది? గాలితో పాటు పోయే కరెంటు, వానతో పాటు నిండిపోయే రోడ్లు, అవసరానికి అందని వైద్యం, ప్రమాణాలు లేని విద్య ఉన్న రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఎలా ఉంటారు.   మౌలిక వసతుల సంగతి అలా ఉంచితే... పోనీ ప్రజల జీవన ప్రమాణాలు ఏమన్నా మెరుగుపడ్డాయా అంటే అదీ కనిపించడం లేదు. పేదవాడి కోసమని అమలుచేస్తున్న ఫలితాలు వారి జీవితాలను పెద్దగా మార్చినట్లు తోచడం లేదు. ఉద్యోగకల్పనలోనూ తెలంగాణ ప్రభుత్వం చెప్పుకోదగ్గ విజయాలేవీ సాధించలేదు. రైతుల పరిస్థితీ అంతంత మాత్రంగానే ఉంది. ముంపు గ్రామాలు, ఆదివాసీల హక్కుల విషయంలో గత ప్రభుత్వాలకు భిన్నంగా ఏమీ వ్యవహరించడం లేదన్నా ఆరోపణలు ఉన్నాయి.   ప్రజల జీవితాలు ఇలా ఉంటే పాలకుల తీరు మరోలా ఉంది. భూకబ్జాలలోనూ, అధికార దుర్వినియోగంలోనూ కొందరు అధికార పక్ష నాయకులు ఆరితేరిపోయారన్న వార్తలు వినవస్తున్నాయి. అధికారులు సైతం ఉదాసీనంగా ప్రవర్తిస్తున్నరన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక భవంతి కూలినా, ఒక క్రిమినల్‌ పట్టుబడినా... ఆ ఘటన వెనుక ఎవరో ఒక ప్రముఖ నాయకుని పేరు వినిపిస్తోంది. ఇలాంటి ఆరోపణల్లో నిజానిజాల మాట అటుంచితే... ప్రజా ప్రతినిధుల మీద మునుపటి నమ్మకాలు సన్నగిల్లాయన్న విషయంలో పెద్దగా అనుమానం లేదు.   మరి ఇలాంటి పరిస్థితుల్లో సమాజంలో అసంతృప్తి ఉండక మరేముంటుంది. ఆ విషయం తెలిసిన పాలకులు ముందుగా ప్రభుత్వం వైపు నుంచే కఠినమైన సంస్కరణలు చేపట్టవలసి ఉంటుంది. లేకపోతే ముఖ్యమంత్రిగారు భయపడినట్లుగానే – ‘ప్రజల అసంతృప్తి పరిధి దాటితే.. దాన్ని కొన్ని శక్తులు దుర్వినియోగం చేసే అవకాశముంది.’

ముందు ముందు... హైవేలపై నో మందు!

డ్రంక్ అండ్ డ్రైవ్ వద్దంటూ సిటీల్లో మనకు బోలెడు బోర్డులు కనిపిస్తాయి. పోలీసులు కూడా అప్పుడప్పుడు నోట్లో డిటెక్టర్లు పెట్టి చెకింగ్ లు చేస్తుంటారు. కాని, నిజంగా వాహనాలు వేగంగా వెళ్లేది ఎక్కడా? హైవే పైన! కాని, అక్కడ పెద్దగా చెకింగ్ లు జరిగినట్టు మనకు కనిపించదు. అసలు హైవేపై ఎవరన్నా మందు తాగి వంద కిలో మీటర్ల కన్నా ఎక్కువ వేగంతో దూసుకుపోతే ఏంటి పరిస్థితి? తాగిన వాడు చావటమే కాదు.. మిగతా వార్ని కూడా ఢీకొట్టి ప్రాణ నష్టం చేసే అవకాశం వుంది. కాని, విచత్రంగా మన ప్రభుత్వాలు అదే హైవేలపై మద్యం దుకాణాలకు లైసెన్స్ లు ఇస్తాయి తెలుసా? లారీల్లాంటి భారీ వాహనాలు నడిపే వారు హైవేపైనే ఫుల్ గా మందు తాగి విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తే ఎవరిది బాధ్యత? ఈ విషయం పై ఎట్టకేలకు సుప్రీమ్ కోర్టే స్పందించింది!   ఇక ముందు హైవేలపై మద్యం దుకాణాలకు లైసెన్స్ లు ఇవ్వరాదని సుప్రీమ్ కోర్టు తాజాగా తేల్చి చెప్పింది. ప్రస్తుతం నడుస్తోన్న లైసెన్స్ ల కాలం ముగిశాక కొత్తగా లైసెన్స్ లు ఇవ్వొద్దని చెప్పింది. జాతీయ, రాష్ట్ర  రహదారులు రెండిటి మీదా ఎక్కడా మందు వాసన రావటానికి వీల్లేదని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పు ద్వారా స్సష్టం చేసింది. దీంతో మార్చి 31 తరువాత హైవేలపై వైన్ షాపులు కనిపించవన్నమాట!   నిజానికి హైవేలపై మద్యం అమ్మకాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజా ప్రభుత్వాలదే. కాని, మందునే తమ ఆర్దిక రాబడికి మందుగా భావించే గవర్నమెంట్లు ఎంతో కాలంగా బాధ్య రాహిత్యంతో ప్రధాన రహదార్లపై మద్యం అమ్ముకోనిస్తున్నాయి. అధికారికంగా లైసెన్స్ లు ఇచ్చి ప్రొత్సహిస్తున్నాయి. దీని వల్ల సంవత్సరానికి దాదాపు ఒకటిన్నర లక్షల మంది మరణిస్తున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ఆ సంస్ఖ వేసిన పిల్ పై స్పందిస్తూనే సుప్రీమ్ మద్యం దుకాణాల బందుకి తీర్పునిచ్చింది. ఏప్రెల్ ఒకటి నుంచి హైవేలపై వైన్ షాపులు వుండటానికి వీల్లేదని తేల్చేసింది. కేవలం హైవేలపైనే కాదు మన దేశంలో ఇంకా చాలా చోట్ల మందు అమ్మకాలు అరికట్టాల్సి వుంది. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు సాధ్యం కాదనుకున్నప్పుడు గుళ్లు, బళ్లు, హైవేలు, ఆసుపత్రులు... ఇలాంటి అనేక చోట్ల వైన్, ఆల్కహాల్, కల్లు లాంటివి లభించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు వ్యాపార సంస్థల్లా రాబడి మీదే దృష్టి పెట్టడం కాకుండా జన సంక్షేమం కూడా గుర్తు పెట్టుకోవాలి!  

2వేల నోట్లు... పా(లి)చిపోతాయట!

నోట్ల రద్దు తరువాత ఎవరి నోట్లో విన్నా నోట్ల మాటే! నవంబర్ 8 నుంచీ నెల గడిచిపోతున్నా పెద్ద నోట్ల ఎఫెక్ట్ ఇంకా తగ్గటం లేదు. అయితే, సామాన్యులు 2వేల నోట్లు దొరక్క బాధపడుతుంటే నల్ల త్రాచులు మాత్రం భారీగా కూడబెట్టిన 2వేల నోట్లని ఎలా దాచిపెట్టాలో అర్థం కాక సతమతం అవుతున్నారు. రాత్రికి రాత్రి ఐటీ అధికారులు కలుగుల్లో దాచుకున్న నల్ల కట్టల్ని అమాంతం బయటకు లాగేస్తున్నారు. అయితే, మోదీని సమర్థించే వర్గం మాత్రం... పిక్చర్ అభీ బాకీ హై మేరే దోస్త్ అంటోంది! ఎందుకో తెలుసా?   కొత్త రెండు వేల నోటు రంగు పోతోంది అని ఆ మధ్య కొందరు గగ్గోలు పెట్టారు. ఇంత దారుణంగా కరెన్సీ తయారు చేస్తే ఎలా అంటూ విమర్శించారు. కాని, తాజాగా చక్కర్లు కొడుతోన్న రూమర్ ప్రకారం రంగు పోయేలాగే, కావాలనీ, ఆర్బీఐ 2వేల నోటు తయారు చేసిందట! దాని వల్ల లాభం ఏంటో తెలుసా? నల్లధనం నియంత్రణ! అవును, పింక్ కలర్ తో బ్లాక్ ని కంట్రోల్ చేయటమే లేటెస్ట్ టెక్నిక్ అంటున్నారు!   కొత్తగా వచ్చిన 2వేల నోటు ఇంటాగ్లియో ఇంక్ తో ముద్రించారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది నిర్ణీత కాలం తరువాత పాలిపోతుంది! ఆ విధంగా ఇప్పుడు వచ్చిన 2వేల నోటు మూడేళ్ల తరువాత ఎక్కడ వున్నా కలర్ పోతుందట! ఒకవేళ బ్లాక్ మనీగా మార్చి ఎవరన్నా పెద్ద ఎత్తున్న దాచేసినా... మూడేళ్ల తరువాత అదంతా వైట్ మనీ అయిపోతుంది! అదేనండీ, పింక్ రంగు పోయి వైట్ పేపర్ గా మారిపోతుంది! అప్పుడిక కోట్లాది రూపాయలు చిత్తు కాగితల కిందే లెక్కా! ఇదంతా నిజమంటారా అని మాత్రం ప్రశ్నించకండి! ఎందుకంటే ఈ మధ్య కాలంలో బోలెడన్ని గాసిప్స్ వచ్చాయి 2వేల నోటు గురించే! ఓసారి నానో చిప్ అమర్చారు అన్నారు. తరువాత రేడియోధార్మిక పదార్థం వుందీ అన్నారు. ఇప్పుడు ఇంటాగ్లియో ఇంక్ అంటున్నారు. ఇంతకు ముందటి గాసిప్స్ లాగే ఇది కూడా కేవలం పుకారు అయి వుండవచ్చు. లేదా నిజమూ కావొచ్చు. సామాన్యుడికి మూడేళ్ల దాకా 2వేల నోట్లు వాడకుండా కలుగుల్లో దాచాల్సిన అవసరం ఎలాగూ వుండదు. సో... ఇంటాగ్లియో ఇంక్ అయితే గియితే అంటుకునేది... నల్ల దొరల తెల్ల కాలర్లకే!

వారసత్వం..నాలుగు స్తంభాలాట..!

సహజంగా ఇంటిపెద్ద మరణిస్తే..అప్పటి వరకు ఆయన నిర్వర్తించిన బాధ్యతలు, అనుభవించిన ఆస్తులు అన్ని ఆయన వారసులకే చెందుతాయి. కానీ దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విషయంలో మాత్రం ఇది పెద్ద పజిల్ అయిపోయింది. జయకు వారసులు లేకపోవడంతో ఆమె ఆస్తులను, పార్టీని, ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తారా అనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఆస్తులను, రాజకీయాలను వేరు వేరు చేసినప్పుడు ఆస్తులకు వారసులుగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో జయ స్నేహితురాలు శశికళ ఒకరు కాగా..ఆమె మేనకోడలు దీప మరోకరు. ఇక రాజకీయం సంగతి చూస్తే..అమ్మకు అత్యంత నమ్మకస్తుడిగా పేరు పొందిన ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, హీరో అజిత్ పేరు కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో నలుగురి గురించి ఒకసారి చూస్తే..     శశికళ: జయ మరణించిన నాటి నుంచి మీడియాలో మారుమోగిపోతున్న పేరు శశికళదే. ఇప్పటికే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఆమెకు అప్పగించాలని పార్టీ నిర్ణయించింది. అలాగే జయ మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టి తద్వారా జయ తర్వాత తానేనని చిన్నమ్మ చెప్పకనే చెబుతున్నారు. ఈ మేరకు పోయెస్ గార్డెన్స్‌లో పార్టీ ముఖ్యనేతలతో ఆమె సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో కీలకంకానున్న చిన్మమ్మ కరుణా కటాక్షాల కోసం ఇప్పుడు పోయేస్ గార్డెన్స్‌‌కు క్యూకడుతున్నారు.వారిలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా ఉన్నారు.     జయమేనకోడలు దీప: జయ మరణం తర్వాత అనూహ్యంగా తెరమీదకు వచ్చిన పేరు దీప. శశికళను జయ వారసురాలిగా అభివర్ణించడం ఏమాత్రం నచ్చని దీప..అమ్మ అంత్యక్రియల రోజే శశికళపై విరుచుకుపడ్డారు. జయలలితకు అసలైన వారసురాలిని నేనేని ఆమె బాహాటంగానే ప్రకటించారు. అయితే అన్నాడీఎంకే నేతలు కానీ..జయ అభిమానుల నుంచి కానీ ఈమెకు మద్ధతు లభించడం లేదు..కానీ జయ రక్తసంబంధీకురాలు కావడం దీపకు మేజర్ అడ్వాంటేజ్.     పన్నీర్ సెల్వం: ప్రస్తుత రాజకీయాల్లో విశ్వాసానికి..నమ్మకానికి మారుపేరు ఎవరంటే ఖచ్చితంగా చెప్పాల్సిన పేరు పన్నీర్ సెల్వం. సామాన్య కుటుంబంలో జన్మించిన ఈయన చిన్న టీ కొట్టుతో తన జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఎంజీఆర్‌కు వీరాభిమాని, 1972లో డీఎంకేలో తలెత్తిన విభేదాల కారణంగా ఎంజీఆర్‌తో పాటు బయటకు వచ్చేశారు. ఎంజీఆర్ మరణించాకా ఆయన సతీమణి జానకీ రామచంద్రన్ అనుచరుల్లో ఒకరిగా కొన్నాళ్లు ఉన్నారు.. ఆ తర్వాత జయలలిత పంచన చేరారు..2001లో టాన్సీ భూముల కుంభకోణంలో జయను న్యాయస్థానం దోషిగా నిర్థారించినప్పుడు..తన స్థానంలో పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిగా ఎంపికచేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్పప్పటికీ కీలక డాక్యుమెంట్లపైన సంతకాలు చేయాలంటే అమ్మ ఇంటి నుంచి ఆదేశాలు వచ్చే దాకా నిరీక్షించేవారు. తాజాగా అక్రమాస్తుల కేసులో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు పన్నీర్ రెండోసారి సీఎం అయ్యారు. ఇప్పుడు జయ ఆకస్మిక మరణంతో తప్పనిసరి పరిస్థితుల్లో మూడోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉన్నా ఈయన పూర్తికాలం సీఎంగా ఉండకపోవచ్చు. దానికి శశికళ ఆశీర్వాదాలు తప్పనిసరి.     అజిత్: నాట్ బట్ నాట్ ద లిస్ట్ హీరో అజిత్..తమిళ రాజకీయాలతో కానీ..జయలలిత సన్నిహిత వర్గంతో కానీ ఏమాత్రం సంబంధాలు లేని బయటివ్యక్తి అజిత్. అనారోగ్యంతో అమ్మ ఆస్పత్రిలో ఉన్నపుడు మొదటిసారిగా అజిత్ పేరు తెరమీదకు వచ్చింది. అజిత్ తన కొడుకు లాంటి వాడని జయ, అమ్మ నిజంగా తన అమ్మే అని అజిత్ ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరిచారు. అజిత్ పేరు తెరమీదకు రావడం వెనుక మరో కారణం కూడా ఉంది..తమిళనాట రాజకీయాలను శాసించే సత్తా సినిమాకు ఉంది. ఇప్పటి వరకు చాలా సార్లు ఇది రుజువుచేయబడింది కూడా. అమ్మకు ఉన్న సినీ గ్లామర్ ఆమె రాజకీయంగా ఎదగడానికి చాలా తోడ్పడింది..ఇప్పుడు అజిత్‌కు కూడా అలాగే ఉపయోగపడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అజిత్ సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు..ఈ నేపథ్యంలో ఆయన సినిమాలను వదిలి రాజకీయాలవైపు మొగ్గుతాడా అనేది తెలియాలి.     ఈ నాలుగు స్తంభాలాటలో అంతిమంగా ఎవరు మిగులుతారో..భవిష్యత్‌లో తమిళనాడు రాజకీయాలను శాసించగల సత్తా ఉండి...అన్నాడీఎంకే‌ను ఒంటిచేత్తో నడిపించగలగిన నేత ఎవరో ఇంకా తేలాల్సి ఉంది.

ఐటి దాడుల వెనుక లింక్... ఇంకేనా?  

2వేల నోటు అంటే ఇప్పుడు అందరికీ మిక్స్ డ్ ఫీలింగ్స్ కలుగుతున్నాయి. అది దొరకాలంటే బ్యాంకుల్లో గంటలు గంటలు క్యూలో నిల్చోవాలి. తీరా చేతికొచ్చాక చిల్లర గొడవ. 2వేల నోటుకి వందలో, అయిదు వందల నోట్లో ఎవరు ఇవ్వాలి? ఇది మరో పెద్ద టెన్షన్! అయితే, కొత్త 2వేల నోటు పేద, మధ్యతరగతి వారికే కాదు గొప్పోళ్లకి కూడా నానా హింస రుచి చూపిస్తోంది. ఎలాగో తమ పాత నల్ల డబ్బు కొత్తగా మార్చుకుని పింకు నోట్లు దాచేసుకున్నాం అంటే కుదరటం లేదు! అమాంతం ఐటీ అధికారులొచ్చి మీద పడిపోతున్నారు. కోట్లకు కోట్లు ఎత్తుకెళ్లిపోతున్నారు. పైగా అరెస్టులు కూడా చేసి చుక్కలు చూపిస్తున్నారు. ఇంతకీ పెద్ద మొత్తంలో 2వేల నోట్లు ఎక్కడ వున్నా ప్రభుత్వ అధికారులకి ఎలా తెలిసిపోతోంది? దేశంలో ఏ మూల నల్ల సొమ్ము పోగేసిన వాళ్లు ఎలా పసిగట్టేస్తున్నారు? దీని గురించి ఇప్పుడు మరో కొత్త ప్రచారం జోరందుకుంది! 2వేల నోటు వచ్చీ రాగానే కొందరు ఏం చెప్పారో గుర్తిందిగా? యెస్... అందులో చిప్ వుందని, అది ఉపగ్రహానికి సంకేతాలు పంపుతుందని, ఆ సిగ్నల్స్ ద్వారా నల్ల త్రాచులు బుట్టలో పడిపోతాయని అన్నారు. కాని, చివరకు అదంతా తూచ్ అని తేలిపోయింది! ఇప్పుడు 2వేల నోటుకే మరో అత్యాధునిక టెక్నాలజీ అటాచ్ చేసేశారు గాసిప్ గాళ్లు! ఈ సారి చిప్ నుంచి కాస్త ముందుకు పోయి అణు ధార్మిక పదార్థం చర్చలోకి తీసుకొచ్చారు! 2 వేల రూపాయల నోట్లలో రేడియోధార్మిక పదార్థమైన పీ32 మెటీరియల్ వుందని చాలా మంది చెప్పుకుంటున్నారు. ప్రింటింగ్ కు  వాడిన ఇంక్ లో కూడా రేడియో ధార్మికత వుండేలా ఆర్బీఐ ప్లాన్ చేసిందట. దాని వల్ల 2వేలు భారీగా ఎక్కడ వున్నా అది ఉప్రగహానికి చేరిపోతుందట! అంతే, ఆ అడ్రస్ పట్టుకుని ఐటీ వారు వచ్చేస్తున్నారట! 2వేల నోటుకి సంబంధించిన ఈ వదంతి నిజం అయ్యే అవకాశం 2వేల రెట్లు లేదు. ఎందుకంటే, రేడియో ధార్మికత చాలా ప్రమాదకరమైంది. పీ32 వల్ల ఆరోగ్య సమస్యలు వుండవని ఎవరు ఎంత చెప్పినా అణు ధార్మికత అణు ధార్మికతే కదా! ప్రభుత్వం అలాంటి రిస్క్ ఎందుకు తీసుకుంటుంది?  కొత్త నోట్లు పోగేసిన బ్లాక్ డాగ్స్ ను ఐటీ తేలిగ్గా పట్టుకోటానికి కారణం... అవన్నీ బ్యాంకుల ద్వారా తప్ప మరే మార్గంలోనూ బయటకి రాలేదు. కాబట్టి బ్యాంకుల్ని, బ్యాంకు మ్యానేజర్లని ఓ కంట కనిపెట్టడం ద్వారా పెద్ద చేపల్ని ఈజీగా గుర్తిస్తున్నారు. దీనికి నానో చిప్స్, రేడియో ధార్మిక ఇంకు ఏమీ అక్కర్లేదు. నిజానికి అధికారికంగా అర్బీఐ చెబుతోంది కూడా అదే! 2వేల రూపాయల నోట్లో ఎలాంటి ప్రత్యేకతా లేదు... కేవలం దొరికిన వాడికి భారీగా దొరకటం, దొరకనోడికి అస్సలు దొరక్కపోవటం తప్పా!