మోదీని వెటకారం చేసే తొందర్లో యూఏఈ రాజకుమారుడ్నీ వదల్లేదు!
posted on Jan 28, 2017 @ 3:13PM
పచ్చకామెర్ల సామెత ఒకటుంటుంది తెలుగులో. అది మనందరికీ తెలిసిందే. కాని, అసదుద్దీన్ ఓవైసీకి తెలుసో లేదో! ఎందుకంటే, అది ఆయనకి సూటైనంతగా మరెవరికీ సూట్ కాదు. ఆయనకు లోకమంతా ఆకుపచ్చగానే కనిపిస్తుంది. లేదంటే, ఆకుపచ్చ రంగుకి ఏదో పెను ప్రమాదం సంభవించినట్టు కాషాయ రంగులో కనిపిస్తుంది. ఇదీ మన హైద్రాబాద్ నవాబ్ గారి పరిస్థితి...
హైద్రాబాద్ లోనే ఎంఐఎం ఇప్పటి వరకూ ఓల్డ్ సిటీ దాటి న్యూ సిటీలోకి రాలేకపోయింది. కాని, ఆ మధ్య మహారాష్ట్ర ఎన్నికల్లో వచ్చిన కొద్దిపాటి విజయం తరువాత ఓవైసీ ఓవర్ గా ఎగ్జైట్ అవుతున్నారు. ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా తన గాలిపటం గుర్తు వేసుకుని వాలిపోతున్నాడు. బీహార్లో అదే ప్రయత్నం చేస్తే మనోడి గాలిపటం అక్కడి నితీష్, లాలూ ప్రసాద్ ల మాంజాల కోతని తట్టుకోలేకపోయింది. ఇప్పుడు యూపీలో ఎంఐఎం హంగామా మొదలైంది...
ఉత్తర్ ప్రదేశ్ లో భారీగా ముస్లిమ్ ఓటర్లు వుండటంతో ఓవైసీ పార్టీకి మంచి అవకాశం దొరికింది పోటీ చేయటానికి. పైగా అది ప్రజాస్వామ్య దేశంలో తప్పు కూడా కాదు. కాని, సమస్యల్లా ఓవైసీ తన ఓవర్ ఉత్సాహంతో ఏదేదో మాట్లాడేయటమే ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఆయన ఎప్పటిలాగే యూపీలో ఓ సభలో మాట్లాడుతూ మోదీని విమర్శించాడు. అందులో కొత్తేం లేదు కాని... ఈ సారి అసదుద్దీన్ ఎంచుకున్న అంశమే వివాదాస్పదంగా మారింది. తన ఓటు బ్యాంకు రాజకీయాలకు ఏకంగా అబుదాబీ నుంచి వచ్చిన గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథి యూఏఈ క్రౌన్ ప్రిన్స్ నే వాడుకున్నాడు!
తన ఉపన్యాసం వినటానికి భారీగా పోగైన యూపీ ముస్లిమ్ ఓటర్లు ముందు ఓవైసీ మోదీని వెటకారం చేశాడు. ఆయన చేతులు ఉల్లాసంగా ఊపుతూ యువరాజుకి స్వాగతం పలికాడనీ, అది యోగా చేసినట్లు అనిపించిందని సెటైర్ వేశాడు. జనం చప్పుట్లు కొట్టడంతో రెచ్చిపోయి యూఏఈ రాజకుమారుడ్ని దాడి వాలా అన్నాడు. అంటే, గడ్డం వున్న ఆయన్ని... మోదీ తెరిచిన చేతులతో ఆలింగనం చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. కాని, విదేశం నుంచి వచ్చిన గడ్డం పెంచుకున్న వాడ్ని హత్తుకున్న ప్రధాని దేశంలోని గడ్డపోళ్లని ఎందుకు వాటేసుకోడని ప్రశ్నించాడు! మొత్తం మీద మోదీ ఈ దేశ ముస్లిమ్ లను వివక్షకు గురి చేస్తున్నాడని మరోసారి పాత ముచ్చటే చెప్పాడు ఓవైసీ...
మోదీ గురించి నెగటివ్ గా మాట్లాడటం వరకూ ఓకే. కాని, విదేశాల నుంచి వచ్చిన వీవీఐపీ సెలబ్రిటీని పట్టుకుని గడ్డం పెంచుకున్నవాడు అనటం ఏంటి? పైగా పాకిస్తాన్ కు మిత్ర దేశంగా వున్న అబుదాబీ మెల్లగా మనవేపు మొగ్గు చూపుతుంటే ఎంపీ అయినా ఓవైసీ వెటకారంగా మాట్లాడటం ఏంటి? యూఏఈలోని బుర్జ్ ఖలీఫాపై గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకం రంగుల్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఇది కొత్త పుంతలు తొక్కుతున్న భారత్, యూఏఈ సంబంధాలకు గొప్ప తార్కాణం. మరి ఇటువంటి సందర్భంలో ఓవైసీ చౌకబారు ఓటు బ్యాంకు మాటలు దేనికి సంకేతం? పాకిస్తాన్ కు పరోక్షంగా సాయపడటం తప్ప ఓవైసీ సాధించింది ఏముంది?
2002 నుంచీ మోదీని ముస్లిమ్ వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్న వాళ్లలో ఓవైసీ ఒకరు. అదే పంథా ముందు ముందు కొనసాగించినా ఫర్లేదు కాని ... అంతర్జాతీయంగా దేశానికి చెడ్డ పేరు తెచ్చే ప్రమాదకర విమర్శలు ఆయన మానుకుంటే చాలా మంచిది!