కొత్త రాష్ట్రం సందట్లో... హోదా సడేమియాలు!
posted on Jan 30, 2017 @ 2:37PM
అనగనగా ఓ స్వామీజీ దొంగతనం మహాపాపం అన్న అంశంపై గొప్పగా ప్రవచనం ఇస్తున్నారు! వేలాది మంది తన్మయంగా విన్నారు! ఉపన్యాసం పూర్తయ్యాక బయటకి వచ్చి చూసుకుంటే చాలా మంది జేబుల్లోని పర్సులు మాయం అయ్యాయట! అక్కడ స్వామి వారు దొంగతనం చెడ్డ పని అని చెబుతోంటే... ఇక్కడ దొంగలు తమ చేతివాటం చూపారన్నమాట!
నవ్యాంధ్రలో పరిస్థితి సదరు స్వామీ జీ సభలోలాగే వుంది! ఒకవైపు జనం కొ్త్తగా రాష్ట్రం ఏర్పడటం వల్ల వచ్చిన ఇబ్బందులన్నీ భరిస్తూ వుంటే... వెనక నుంచి తమ పని తాము చేసుకుపోతున్నారు ఆరితేరిన వారు! పైగా ఈ మొత్తం మోసానికి ప్రత్యేక హోదా ఉద్యమం అంటూ మాంచి గ్లామరస్ పేరు తగిలించారు. పదే పదే యువతను బురదలో దూకమంటూ గావు కేకలు పెడుతున్నారు...
అక్కడెక్కడో జల్లికట్టు ఉద్యమం జరగగానే, ఇక్కడా, మోకాళ్లలో ఆలోచనలు మొదలయ్యాయి. అక్కడ బీచ్ పక్కన జనం కూడారు కాబట్టి ఇక్కడా ఓ బీచ్ వెదికారు. వైజాగ్ కు రమ్మన్నారు. మౌనపోరాటం అన్నారు. కొవ్వుత్తుల ప్రదర్శనన్నారు. హోదా రావాల్సిందేనన్నారు. కాని, జనానికి పిలుపునిచ్చిన వారు చెప్పందేంటంటే, జల్లికట్టు అమలు చేసుకోటానికి ఒక ఆర్డినెన్సు, ఒక బిల్లు చాలు. కాని, ప్రత్యేక హోదా అసాధ్యం. ఏపీకే కాదు ఏ రాష్ట్రానికి ఇకపై హోదాలుండవని కేంద్రం తేల్చేసింది. అయినా ఆనాడు వెంకయ్య అడిగాడు, మన్మోహన్ ఇచ్చాడు అంటూ రెచ్చగొడుతున్నారు మన హీరోలు, పొలిటికల్ హీరోలు!
ప్రత్యేక హోదా ఇవ్వగలిగే అవకాశం వుంటే మోదీ సర్కార్ ఎప్పుడో ఇచ్చేది. కాని, ప్లానింగ్ కమీషన్ పోయి నీతి ఆయోగ్ వచ్చిన ప్రస్తుత తరుణంలో ప్రత్యేక హోదా గత చరిత్రే. ఇప్పుడు హోదా వున్న రాష్ట్రాలకి కూడా ముందు ముందు పోనుంది. ఇక హోదా ఇచ్చి తీరాల్సిందే అంటోన్న పవన్ , జగన్ ఆంధ్రా జనాలకి మరో వివరణ కూడా ఇచ్చుకోవాలి. ధశాబ్దాలుగా స్పెషల్ స్టేటస్ అనుభవిస్తున్న జమ్మూ, కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు ఏం అభివృద్ధి సాధించాయి? అక్కడికి పెట్టుబడులు ఎందుకు పోటెత్తటం లేదు? అలాగే, హోదా ఇవ్వకున్నా ప్యాకేజ్ వల్ల అనేక లాభాలు కలుగుతున్నాయి. వాట్ని కూడా వద్దని భీష్మించుకుంటే ఆ నష్టం ఎవరు పూడుస్తారు? హోదా ఇవ్వకుండా, ప్యాకేజ్ కూడా ఇవ్వకుంటే కేంద్రాన్ని ఎవరైనా ఏం చేయగలరు?
ప్రత్యేక హోదా లాభాలు, సాధ్యాసాధ్యాల గురించి జనంలో స్పష్టమైన అవగాహన తీసుకురాకుండా సముద్ర తీరాన సందడి చేద్దామంటే వీలు కాదు. అంతకంటే మించీ నిరంతరం రాష్ట్రం గురించి మాట్లాడకుండా వున్నట్టుండీ ఊడిపడి ఉద్యమం చే్ద్దామంటే కూడా కుదరదు. వైజాగ్ లో జల్లికట్టు తరహా వీర పోరాటం అన్న పవన్ గాని, జగన్ గాని ఇప్పటికీ హైద్రాబాద్ లోనే వుంటున్నారు. ఏపీలో స్థిరపడిందీ లేదు. అమరావతిలో మకామూ లేదు. ఈ యువ నాయకులిద్దరూ యువతనైతే బీచ్ కి రమ్మన్నారుగాని తాము మాత్రం పూర్తి స్థాయిలో నవ్యాంధ్రకు రావటం లేదు. మరో వైపు, పవన్ కేవలం కేంద్రానిదే తప్పనట్టుగా మాట్లాడటం, జగన్ చంద్రబాబుది మాత్రమే నేరమన్నట్టు మాట్లాడటం కూడా వీళ్ల చిత్తశుద్దిని తేటతెల్లం చేస్తాయి. హోదా తేవటంలో ఎన్డీఏలో భాగస్వామి అయిన టీడీపీ విఫలమైందని పవన్ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా అనలేకపోయాడు. అదే రీతిలో జగన్ ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం మోదీ తప్పని ధైర్యంగా చెప్పలేకపోయాడు. ఇందులో ఎవరి ఇబ్బందులు వారివి!
జనసేన పార్టీతో వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున రంగంలోకి దిగుదామని అనుకుంటోన్న పవన్ హోదా నినాదంతో జనంలో వుంటున్నాడు. కాని, పవన్ లాగే అప్పుడప్పుడూ ఉద్యమించే సినిమా వాళ్లు, మేధావులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు... ఎవ్వరూ కేంద్రంపై నిజంగా సీరియస్ గా వున్నట్టు కనిపించదు. తమకు వీలైనప్పుడు , ఖాళీ సమయం దొరికినప్పుడు హోదా అంటూ హోరు సృష్టిస్తున్నారు. మళ్లీ వారం తరువాత అంతా నిశ్శబ్దమే! ఇక పవన్ కంటే కాస్త బెటర్ గా హైద్రాబాద్ వదిలి వైజాగ్ ఎయిర్ పోర్ట్ దాకా వెళ్లిన జగన్ తనకు రాష్ట్ర హోదా కంటే స్వంత హోదానే ఎక్కువని చెప్పకనే చెప్పేశాడు! ఎయిర్ పోర్ట్ లో తానే కాబోయే సీఎం అంటూ బెదిరింపుకి దిగి ప్రత్యేక హోదా అసలు కారణమని కాదని తేల్చేశాడు!
పవన్, జగన్ అభిమానులు తమ నేతలు హోదా రాదని తెలిసి కూడా మభ్యపెడుతున్నారని అంటే ఒప్పుకోకపోచ్చు. కాని, వారిద్దరికి నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే దాకా మీడియా ముందు వుండటానికి ఇది గొప్పగా ఉపయోగపడుతోంది. అలాగే, ప్యాకేజీకి ఒప్పుకొని ముందుకు సాగిపోతున్న చంద్రబాబు అనివార్య పరిస్థితి కూడా వారికి కలిసి వస్తోంది. సీఎం ప్యాకేజీ కూడా వద్దని మొండికేస్తే వచ్చేది కూడా పోతుంది రాష్ట్రానికి. అందుకే, ఎన్డీఏలోంచి బయటకి రావటం లేదు టీడీపీ. ఇటువంటి పరిస్థితుల్లో సహజంగానే ప్రతిపక్షాలకి కావాల్సినంత పని దొరుకుతుంది. హీరో శివాజీ ఉద్యమాలు మొదలు కేవీపీ ప్రవేశ పెట్టే ప్రైవేట్ బిల్లుల వరకూ అన్నీ ఈ కోవలోకే వస్తాయి. కాని, ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం అయిదేళ్లకోసారి జనం చేతిలోనే వుంటుంది. హోదా కోసం హోరు సృష్టిస్తున్న ఎవరెవరి హోదా ఏంటో ఓటర్లే నిర్ణయిస్తారు!