ఉద్యమాల్లో... దేశ విద్రోహ ఊసరవెల్లులు!
posted on Jan 28, 2017 @ 9:34AM
జల్లికట్టు... సంక్రాంతి పండగ అయిపోగానే యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన ఉద్యమం ఇది. తమిళ యువత స్వచ్ఛందంగా మెరీనా బీచ్ కి వచ్చి ఉద్యమాన్ని పొటెత్తించారు. అది చూసి ఇప్పుడు మన దగ్గర కూడా పవన్ , జగన్ హోదా కావాలంటూ ఫూల్ జోష్ లోకి వచ్చారు. అటు కర్ణాటకలో మంగళూర్ జనం తమ సంప్రదాయ క్రీడ కంబళ పై నిషేధం ఎత్తి వేయాలని సమరానికి దిగారు! అంతే కాదు, మన హైద్రాబాద్ ఎంపీ ఓవైసీ అయితే కోర్టు యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలని తీర్పు ఇస్తే జల్లికట్టు తరహాలోనే ముస్లిమ్ లు ఉద్యమిస్తారని వారెంట్ ఇచ్చేశాడు! మొత్తానికి దేశంలో ఎవర్ని చూసినా, ఎక్కడ చూసినా జల్లికట్టు జగడం గురించే ప్రస్తావన. దాని నుంచే ప్రేరణ!
కోర్టు తీర్పుపై ఆగ్రహంతో తమిళ జనం ఊగిపోవటం, కమల్ , రజినీ లాంటి స్టార్స్ కూడా జల్లికట్టుకు మద్దతు పలకటం అమాంతం ఆవేశాలు రగిల్చింది. పన్నీర్ సెల్వం ప్రభుత్వం కూడా గొడవెందుకని ఆర్జినె్న్స్ , బిల్లూ తెచ్చింది. కాని, పైకి జన విజయంలా కనిపిస్తోన్న జల్లికట్టుపై మొండిపట్టు ఉద్యమం లోలోన చాలా పెద్ద కుట్రే అని మెల్లమెల్లగా తెలుస్తోంది. మెరీనా బీచ్ ను సామాన్య జనం ముంచెత్తటానికి తమిళ పార్టీలు ఏవీ కారణం కావు. అయినా అక్కడికి వేలాదిగా, లక్షలాదిగా ప్రజలు వచ్చేశారు. వాళ్ల మధ్యలోనే సంఘ విద్రోహ శక్తులు, దేశద్రోహులు కూడా చొరబడ్డారని ఇప్పుడు నిఘా వర్గాలు అంటున్నాయి. సాక్షాత్తూ తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వమే అసెంబ్లీలో ఈ మాట ఒప్పుకున్నారు. కొందరు ఉసామా బిన్ లాడెన్ బొమ్మలు వాహనాలపై ప్రదర్శిస్తూ ర్యాలీలో పొల్గొనగా, మరికొందరు ప్రత్యేక తమిళ దేశం కావాలనీ, ఎల్టీటీఈ ప్రభాకరన్ మహానేత అని నినాదాలు చేశారట! ఇలాంటి ముసుగు వేసిన దుర్మార్గులే ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చే ప్రయత్నం కూడా చేశారు. గవర్నమెంట్ ఆర్డినెన్స్, బిల్లు తీసుకొచ్చాక కూడా వెనక్కి తగ్గకుండా ఇంకా కొనసాగించే ప్రయత్నం చేశారు. కావేరీ సమస్య, ముళ్ల పెరియార్ డ్యాం సమస్య కూడా పరిష్కరించాలని బీచ్ లో బైటాయించే కుట్ర చేశారన్నారు పన్నీర్ సెల్వం...
సోషల్ మీడియా పుణ్యమాని జనం ఏదో ఒకచోట గుమికూడటం ఇప్పుడు చాలా ఈజీ అయింది. అలాగే, మీడియా ప్రచారం వల్ల ఏది జరిగినా ముందుకన్నా సమాచారం వేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా నిర్భయ ఆందోళనలు మొదలు జల్లికట్టు కలకలం దాకా అన్నీ ప్రభుత్వాలకి సవాలుగా మారుతున్నాయి. ఇలాంటి ఉద్యమాలు ప్రజాగ్రహానికి సంకేతం కావొచ్చు. ప్రజాస్వామ్యంలో సరైనవే కావొచ్చు. కాని, దేశ ద్రోహ ముఠాలు సామాన్య జనం మధ్యలో చేరితే అది ఎంత మాత్రం అంగీకారం కాదు. మరీ ముఖ్యంగా, దేశ ఐక్య తని దెబ్బతీసే ఉగ్రవాదులు, వేర్పాటు వాదులు ఎక్కడ వున్నా అందరం వ్య తిరేకించాల్సిందే. ఎందుకంటే, మన భాషా, సంస్కృతి, ప్రాంతీయ ఉద్యమాలన్నిటికి భారతదేశ భద్రతే ప్రధానం. అది చెక్కు చెదరకుండా వుంటేనే ఏ ఉద్యమానికైనా అర్థం వుంటుంది. అలా కాకుండా దేశం ఉపద్రవం పాలైతే మిగతా చిన్నా చితక ఉద్యమాలకు విలువే వుండదు. దీన్ని అర్థం చేసుకుని ముందు ముందు జనాన్ని రోడ్లపైకి రమ్మని పిలుపునిచ్చే నేతలు, సెలబ్రిటీలు , ఉద్యమకారులు అంతా జాగ్రత్తగా వుండాలి. మరో వైపు నిఘా సంస్థలు కూడా సోషల్ మీడియా శకంలో గతంలో కంటే మరింత చురుగ్గా వుండాలి. పరిస్థితి చేజారిపోయాక నియంత్రించటం హింసాత్మక పద్ధతులకి దారి తీస్తుంది..