తలనొప్పికి ఇన్ని కారణాలు ఉన్నాయా!
చాలామంది సహజంగా చిరాకు, అసహనంతో ఉన్నప్పుడు ఏమైంది అని అడిగితే తలనొప్పి అనే మాటను ఎక్కువశాతం చెబుతుంటారు. అయితే వస్తున్న తలనొప్పి ఏమైనదీ తేలక తికమక పడటం కూడా అంతే సహజం.
తలనొప్పికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయి.
1. మానసిక కారణాలు
2. మెదడులోపల కంతులు ఏర్పడటం
3. యరీమియా, డయబిటిస్ వంటి కారణాలు
4. మైగ్రేన్, టెన్షన్ తలనొప్పులు, ఇతర శారీరక బాధలవల్ల కలిగే తలనొప్పులు.
మానసికంగా తలనొప్పి ఉందని బాధపడే వ్యక్తి రోజులు, వారాల తరబడి తలనొప్పితో బాధపడతాడు. పెద్దగుడ్డ తీసుకుని తలచుటూ గట్టిగా బిగించి కట్టుకుంటాడు. ఇలా కట్టుకోవడానికి నొప్పికంటే ప్రెషర్ (ఒత్తిడి)కారణం. డిప్రషన్, ఆందోళన, ఆవేశం వల్ల వచ్చే తలనొప్పులు మామూలుగా వాడే తలనొప్పి టాబ్లెట్స్ తో తగ్గవు.
ప్రతీ తలనొప్పి ప్రమాదకరమైంది కాదు
మెదడులో ప్రెషర్, కంతివల్ల కొందరిలో తలనొప్పి రావడం వుంటే మరికొందరిలో జ్వరంవల్ల, అతిగా మద్యం సేవించడం వల్ల తలనొప్పి కలుగుతుంది. ముఖ్యంగా మద్యం మైకం వదిలే సమయంలో (హాంగ్ ఓవర్ ) తలనొప్పి అనిపిస్తుంది. తలకి దెబ్బ తగలడం, వడదెబ్బ తగలడం, మెదడుకి రక్తం సరఫరా తగ్గడం వంటి పరిస్థితుల్లో కూడా తలనొప్పి తీవ్రంగా ఉంటుంది.
మైగ్రేన్ తలనొప్పిని తెలుసుకోవడమెలా?
మైగ్రేన్ తలనొప్పి సాధారణంగా వంశ పారం పర్యంగా వస్తుంది. తలకి ఒకవైపే నొప్పి అనిపిస్తుంది. ఎండ చూసినకొద్దీ నొప్పి ఎక్కువ అవుతుంది. తలనొప్పి వచ్చే ముందు కంటిముందు రింగులు రింగులు లాగానో, మరోలాగానో కనబడతాయి. తలనొప్పి రావడానికి 10-15 నిమిషాలు ఇటువంటి చికాకు పరిస్థితి ఉండవచ్చు. ఆ తరువాత ఒక చెంపన నొప్పి మొదలవుతుంది. నిదానంగా రెండవ వైపుకి కూడా నొప్పి అనిపించవచ్చు. ఈ నొప్పి చాలా తీవ్రంగా వుంటుంది నొప్పి ఎక్కువైన తరువాత వాంతి అవవచ్చు. కొందరు ఈ నొప్పికి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతారు. మైగ్రేన్ తలనొప్పి 4 నుంచి 43 గంటల పాటు వుంటుంది.
కళ్ళజోడుతో తలనొప్పి పోవచ్చు!
కొందరికి కళ్ళకి సంబంధించిన దోషం ఉండి తలనొప్పి వస్తుంది. వీరికి కళ్ళు పరీక్ష చేసి కళ్ళజోడు పెడితే తలనొప్పి తగ్గిపోతుంది. గ్లాకోనూ అనే కళ్ళవ్యాధి వల్ల కూడా తలనొప్పి వస్తుంది. మెడ దగ్గర కండరాలు, లిగమెంట్లు బిగదీసుకోవడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. సైనసైటిస్ వల్ల కూడా. తలనొప్పి వస్తుంది.
తలనొప్పిలో తేడాలు
తలనొప్పి రావడానికి ఎన్నో కారణాలు, మానసిక ఆందోళన, ఒత్తిడి, మానసిక వ్యాధుల వల్ల తలనొప్పి రావడం ఉంటే, మెదడు వ్యాధులు, మెదడులో కంతులవల్ల తలనొప్పి వస్తుంది. రక్తనాళాల వ్యాకోచ సంకోచాలవల్ల తలనొప్పి వస్తే, విషజ్వరాలు, యబియా, డయబిటిస్ వంటి పరిస్థితుల్లో తలనొప్పి వస్తుంది.
ఏ తలనొప్పో తేల్చుకోవడమెలా?
తలనొప్పి ఎలా ప్రారంభమవుతున్నదీ, ఎంతసేపు ఉంటున్నదీ, నొప్పి ఏ రకంగా వున్నదీ, ఏ చోట ఎక్కువ అనిపిస్తున్నదీ, వదలకుండా వుంటున్నదా, వచ్చీ పోతూ ఉందా తలనొప్పి ఎప్పుడు ఎలా ఎక్కువ అవుతున్నదీ, వంశంలో ఇంకెవ్వరికైనా ఈ సమస్య ఉందా అనే అంశాలని దృష్టిలో ఉంచుకుని పరిశీలించడం అవసరం.
తలనొప్పి సంగతి అంతుపట్టనప్పుడు తక్కిన సాధారణ పరీక్షలతోపాటు సి. టి స్కానింగ్, యం. ఆర్. ఐ. పరీక్షలు, రక్త పరీక్షలు జరపాలి.
తలనొప్పే కదా అని తేలిగ్గా తీసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
◆నిశ్శబ్ద.