బరువు తగ్గడానికి వాకింగ్ చేస్తున్నారా...ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి..!
posted on Oct 23, 2025 @ 9:30AM
నేటి కాలంలో హెల్త్ పరంగా చాలామంది పెట్టుకునే టార్గెట్ ఏదైనా ఉందంటే అది బరువు తగ్గడమే.. బరువు తగ్గడం కోసం కొందరు జిమ్ చేస్తారు, మరికొందరు యోగ ఎంచుకుంటారు. ఇంకొందరు వివిధ రకాల వర్కౌట్లు చేస్తుంటారు. అయితే.. ఎటువంటి ఖర్చు లేకుండా, ఎలాంటి వ్యాయమ పరికరాలు లేకుండా చేయగలిగేది వాకింగ్ మాత్రమే.. అయితే బరువు తగ్గడం కోసం వాకింగ్ చేసే వారు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. అవన్నీ తప్పులని తెలియక వాకింగ్ చేసినా బరువు తగ్గడం లేదని గందరగోళానికి గురవుతూ ఉంటారు. బరువు తగ్గాలని అనుకునేవారు వాకింగ్ చేసేటప్పుడు అస్సలు చేయకూడని మిస్టేక్స్ ఏంటో తెలుసుకుంటే..
నెమ్మదిగా నడవడం..
చాలామంది వాకింగ్ చేసేవారు నెమ్మదిగా నడుస్తూ ఉంటారు. ఇలా నడవడం వల్ల కేలరీలు, కొవ్వు బర్న్ కావు. దీని వల్ల వాకింగ్ చేసినా శరీరం చురుగ్గా మారుతుంది, కండరాల చలనం ఉంటుంది అంతే తప్ప కేలరీలు, కొవ్వు బర్న్ కావు. అందుకే బరువు తగ్గడం జరగదు. బరువు తగ్గడం కోసం వేగంగా నడవాలి. నిమిషానికి దాదాపు 100 నుండి 120 అడుగులు వేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. అలా నడిస్తే బరువు మెల్లిగా బరువు తగ్గడం జరుగుతుంది.
వార్మప్..
వాకింగ్ చేయడం అంటే చెప్పులు లేదా షూస్ వేసుకుని చక్కగా నడుచుకుంటూ వెళ్లడమే చాలా మందికి తెలుసు. కానీ వాకింగ్ చేసేవారు వార్మప్ చేస్తే శరీరం వాకింగ్ ఫలితాలు చక్కగా పొందగలుగుతుంది. వార్మప్ వల్ల కండరాలు వాకింగ్ కు సిద్దం అవుతాయి. వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది కండరాలకు ఎదురవ్వదు. అందుకే వాకింగ్ చేయడానికి ముందు 3 నుండి 5 నిమిషాలు వార్మప్ చేయాలి.
పొజిషన్..
వాకింగ్ చేసేటప్పుడు శరీరం స్టేబుల్ గా ఉండటం చాలా ముఖ్యం. వీపు, తల వంచి నడవడం, మొబైల్ ఫోన్ చూడటం, అడుగులు సరిగా వేయకపోవడం ఇవన్నీ వాకింగ్ ఫలితాలను దెబ్బ తీస్తాయి. దీని వల్ల శరీరం ఇబ్బంది పడకపోయినా, వాకింగ్ వల్ల బరువు మాత్రం తగ్గరు.
షూస్ ఎంపిక..
వాకింగ్ చేయడానికి చెప్పులు లేదా పాత షూస్, లేదా అనుకూలంగా లేని షూస్ ను ఎంచుకోకూడదు. అనుకూలంగా లేని షూస్ వేసుకుని నడవడం వల్ల పాదాలు, మోకాళ్లు, వెన్ను నొప్పి వస్తాయి. వాకింగ్ కాస్తా బాధాకరంగా మారుతుంది. హాయిగా వాకింగ్ చేయడానికి అనువుగా ఉన్న షూస్ ను మాత్రమే ఎంచుకోవాలి.
వాకింగ్ పద్దతి..
వాకింగ్ చేయడానికి ఒక మంచి మార్గం ఎంచుకోవాలి. అలాగే రోజూ ఒకే సమయంలో వాకింగ్ చేయాలి. వాకింగ్ చేసేటప్పుడు వేగాన్ని కూడా బాలెన్స్ చేసుకోవాలి.
హైడ్రేషన్..
వాకింగ్ చేసేవారు హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. చెమట పట్టడం వల్ల అలసట, ఆకలి, బలహీనత కలుగుతాయి. అందుకే అవసరమైన కొద్ది మొత్తంలో నీరు తాగాలి.
ఆహార జాగ్రత్త..
చాలామంది వాకింగ్ బాగా చేస్తున్నాం, కేలరీలు బాగా ఖర్చు అవుతుంటాయి కాబట్టి బాగా తింటే ఏం కాదు అనే అపోహలో ఉంటారు. ఇలా ఒకవైపు బాగా తింటూ మరొకవైపు ఎంత వాకింగ్ చేసినా బరువు తగ్గడం అనేది జరగదు. వాకింగ్ ద్వారా ఫలితం కనిపించాలంటే మంచి డైటింగ్ కూడా వాకింగ్ కు తోడు కావాలి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...