విటమిన్-డి లోపిస్తే ఈ లక్షణాలు కనిపిస్తాయి..!
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల విటమిన్లు, ఎంజైమ్ లు, పోషకాలు, ప్రోటన్, ఫైబర్.. వంటివన్నీ చాలా అవసరం అవుతాయి. ఇవన్నీ శరీరం ఫిట్ గా ఉండటంలో సహాయపడతాయి. అయితే శీతాకాలంలో సూర్య రశ్మి తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి సూర్యుడి ఉనికి చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. శరీరానికి సూర్యుడి లేత కిరణాలు తగిలినప్పుడు శరీరంలో విటమిన్-డి ఉత్పత్తి అవుతుంది. కానీ సూర్యరశ్మి లేకపోవడం వల్ల విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. శరీరంలో విటమిన్-డి లోపం ఏర్పడినట్టు కొన్ని లక్షణాల ద్వారా చెప్పవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే..
అలసట..
శరీరం అలసిపోయిందని చెప్పే చాలా మంది ఎక్కువ పని చేయడం, నిద్ర సరిగా లేకపోవడం, ఆహారం సరిగా తీసుకోకపోవడం వంటివి కారణాలుగా చెబుతుంటారు. కానీ ఆహారం బాగా తీసుకుని, శరీరానికి తగిన విశ్రాంతి లభించి, మంచి నిద్ర లభించి, ఎక్కువ అలసట తెప్పించే పనులు చేయకపోయినా సరే.. అలసటగా అనిపిస్తుంటే అది విటమిన్-డి లోపానికి ముఖ్య లక్షణంగా పేర్కొంటారు.
కండరాల నొప్పి..
శరీరం కాల్షియం ను గ్రహించాలన్నా, ఎముకలు దృఢంగా ఉండాలన్నా విటమిన్-డి చాలా అవసరం. కాళ్లు, వెన్ను, కీళ్లు, కాలి కండరాలు బలహీనంగా ఉండటం, పట్టేయడం వంటివి జరుగుతూ ఉంటే అది కూడా విటమిన్-డి లోపానికి కారణం కావచ్చు.
ఎముకల నొప్పి..
ఎముకల నొప్పి, బలహీనత, ఎముకలు పెళుసుగా ఉండటం, నడుస్తున్నప్పుడ లేదా ఇతర పనులు చేస్తున్నప్పుడు ఎముకలు శబ్దం రావడం వంటివి జరుగుతుంటే శరీరంలో విటమిన్-డి లోపం కూడా ఉన్నట్టే అర్థం. ఎందుకంటే విటమిన్-డి ఉంటేనే శరీరంలో కాల్షియం ఏర్పడుతుంది. విటమిన్-డి లోపిస్తే కాల్షియం కూడా ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది.
మూడ్..
చాలామందికి ఉన్నట్టుండి మూడ్ మారిపోతూ ఉంటుంది. చిన్న విషయాలకు చిరాకుగా, కోపంగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఇలాంటి వారికి విటమిన్-డి లోపం ఉండే అవకాశం ఉంటుంది. మూడ్ స్వింగ్స్ అయ్యేవారిలో విటమిన్-డి లోపం ఉంటుంది. విటమిన్-డి లోపం ఒత్తిడి హార్మోన్లు పెరిగేలా చేస్తుంది.
జుట్టు రాలడం..
జుట్టు పలుచగా మారుతున్నా, జుట్టు రాలిపోతున్నా, జుట్టు విరిగిపోతున్నా.. బలహీనంగా మారుతున్నా అది విటమిన్-డి లోపానికి సంకేతమే..
రోగనిరోధక వ్యవస్థ..
శరీర రక్షణ వ్యవస్థ బలంగా ఉండటంలో విటమిన్-డి చాలా సహాయపడుతుంది. విటమిన్-డి లోపిస్తే తరచుగా జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలకు లోనవుతుంటారు.
గాయాలు..
సాధారణంగా శరీరం మీద ఏదైనా గాయం జరిగితే అది నయం కావడానికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది. కానీ గాయాలు నయం కావడానికి నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం పడుతుంటే శరీరంలో విటమిన్-డి లోపం ఉన్నట్టే లెక్క.
*రూపశ్రీ