రోజూ దాల్చిన చెక్క నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
posted on Mar 29, 2024 @ 11:43AM
భారతీయుల వంటింట్లో తప్పనిసరిగా మసాలా దినుసులు ఉంటాయి. ఈ మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. రుచికి కారంగా, తియ్యగా ఉండే దాల్చిన చెక్క వంటకు రుచిని, సువాసనను ఇవ్వడంలో ముఖ్యమైనది. బిర్యానీ నుండి సాధారణ మసాలా వంటకాల వరకు ఏదైనా సరే.. దాల్చిన చెక్క లేకుండా సంపూర్ణం కాదు. అయితే చాలామంది ఈ మధ్య కాలంలో దాల్చిన చెక్కను టీగానూ, పాలలోనూ, ఆహార పదార్థాల మీద చల్లుకుని తీసుకుంటున్నారు. దాల్చిన చెక్క నీటిని రోజూ తాగితే ఆరోగ్య పరంగా ఏ మార్పులు ఉంటాయి? దాని వల్ల కలిగే లాభాలేంటి? పూర్తీగా తెలుసుకుంటే..
జీవక్రియకు మంచిది..
దాల్చిన చెక్క నీరు జీవక్రియకు చాలామంచిది. బరువు తగ్గాలని అనుకునేవారు, బరువును నియంత్రణలో ఉంచాలని అనుకునేవారు దాల్చిన చెక్క నీరు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే దాల్చిన చెక్క నీరు శరీరంలో గ్లూకోజ్, కొవ్వు కణాల జీవక్రియను పెంచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల జీవక్రియ వేగాన్ని పెంచుకోవచ్చు. బరువు కూడా సులువుగా తగ్గవచ్చు.
మంట తగ్గిస్తుంది..
దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలిక మంట, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ తో పాటూ కొన్ని రకాల క్యాన్సర్ తో సహా బోలెడు ఆరోగ్య సమస్యలకు దాల్చిన చెక్క మంచిది. ఉదయాన్నే దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల పై ప్రయోజనాలు లభిస్తాయి.
జీర్ణ ఆరోగ్యం..
దాల్చిన చెక్క నీరు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గించడం ద్వారా జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్కను సాంప్రదాయకంగా జీర్ణశయాంతర అసౌకర్యాన్ని తగ్గించడంలో ఉపయోగిస్తారు. ఉదయాన్నే దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. కడుపు లైనింగ్ ను ఉపశమనం చేస్తుంది. సాధారణ ప్రేగుల కదలికలను ప్రోత్సహిస్తుంది.
చక్కెర స్థాయిలు..
దాల్చిన చెక్క నుండి లభించే అతి పెద్ద ప్రయోజనాలలో రక్తంలో చెక్కర స్థాయిలు తగ్గించడం ముఖ్యమైనది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే సమ్మేళనాలు దాల్చిన చెక్కలో ఉన్నాయి. కణాలు ఇన్సులిన్ కు మెరుగ్గా స్పందించడానికి, రక్తప్రవాహంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలోనూ సహాయపడతాయి. ఉదయాన్నే దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతను, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మెదడు పనితీరు..
దాల్చిన చెక్కలో మెదడు పనితీరును, అభిజ్ఞా సామర్థ్యాన్ని మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను, మొత్తం అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందని పరిశోధనలు కూడా సూచిస్తున్నాయి. ఉదయాన్నే దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల మెదడును సహజంగా బూస్టింగ్ చేయవచ్చు. రోజంతా ఏకాగ్రతతో పనిచేయవచ్చు.
*నిశ్శబ్ద.