Read more!

ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచిదేనా? అలా చేస్తే  జరుగుతుందో తెలుసా?

ఆహారం ఔషదం అని అంటారు. మనం తీసుకునే ఆహారమే శరీరానికి మూలాధారం. అదే శక్తిని ఇస్తుంది. సాధారణంగా ఆహారం తినేటప్పుడు, తిన్న వెంటనే నీరు తాగడం అనేది చాలామంది అలవాటు. కొందరు ఆహారం తిన్నంత వరకు అస్సలు నీరు తాగరు. కానీ ఆహారం తిన్న తరువాత మాత్రం కనీసం అరలీటరు నీళ్లు వేగంగా తాగేస్తుంటారు.  కానీ ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా అనే చర్చ ఇప్పుడు దుమారం లేపుతోంది. దీని గురించి ఆరోగ్య నిపుణులు స్పందించారు. ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం ఎంత వరకు కరెక్ట్? అలా నీరు తాగితే జరిగేదేంటి? అనే విషయాల గురించి కూడా స్పష్టత ఇచ్చారు.

ఆహారం తినేటప్పుడు నీరు తాగడం అవసరమేనా?

ఆహారం తినేటప్పుడు నీరు తాగడం చాలా మంది అలవాటు. ఆహారం తినేటప్పుడే కాదు తిన్న తరువాత కూడా నీరు తాగడం అస్సలు అవసరమే లేదన్నది ఆహార నిపుణులు, వైద్యుల మాట. ఎందుకంటే ఆహారం తినేటప్పుడు దాన్ని బాగా నమిలి తింటే నోట్లో ఊరే లాలాజలంతో కలిసి ఆహారం తగినంత ద్రవంగా మారుతుంది. ఇది నేరుగా జీర్ణాశయానికి వెళ్లి అక్కడ జీర్ణ ఎంజైమ్ లతో కలిసి సులువుగా జీర్ణమవుతుంది. అందుకే ఆహారం తినేటప్పుడు అస్సలు నీరు తాగాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆహారం కారంగా ఉన్నా, ఎక్కువ ఘనపదార్థాలు అయినా దానికి తగినట్టు చాలా కొద్ది మొత్తంలో ఒక అరగ్లాసు లోపు నీరు తాగడం మంచిది. అంతకు మించి నీరు తాగాల్సిన అవసరమే లేదని ఆహార నిపుణులు చెబుతున్నారు.

ఆహారం తిన్నవెంటనే నీరు తాగితే  ఏం జరుగుతుంది?
 
ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం అనేది సరైన పని కాదని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. కొందరు ఆహారం తిన్న వెంటనే సుమారు పావు లీటర్ నుండి అరలీటర్ నీరు  తాగేస్తుంటారు. దీనివల్ల చాలా పెద్ద ఇబ్బందే ఎదువుతుంది.  
 
ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్ లు పలుచబడిపోతాయి. ఇలా జీర్ణ ఎంజైమ్ లు పలుచబడిపోవడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. జీర్ణక్రియ చాలా నెమ్మదిస్తుంది. ఇది జీర్ణ సంబంధ వ్యాధులు రావడానికి కారణం అవుతుంది.  ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వస్తాయి.

మరొక షాకింగ్ విషయం  ఏమిటంటే.. ఆహారం తిన్న వెంటనే ఎక్కువగా నీరు తాగేవారు చాలా తొందరగా ఊబకాయం సమస్యకు గురవుతున్నారు.  అలాగే ఆహారంలో తీసుకున్న పోషకాలు ఏవీ శరీరానికి అంత సులువుగా అందవు.  దీనివల్ల సరైన ఆహారం తీసుకున్నా సరే పోషకాహార లోపానికి గురవుతారు.

ఆహారం తిన్న తరువాత ఎన్ని నిమిషాలకు నీరు తాగాలి? ఆహారం జీర్ణం కావడానికి ఎంత సమయం పడుతుంది?

ఏదైనా ఆహారం తిన్న తరువాత జీర్ణం కావడానికి 3గంటల సమయం పడుతుంది. అయితే జీర్ణాశయంలోని చిన్న ప్రేగులలో ఈ ఆహారం సుమారు 7గంటల వరకు ఉంటుంది. ఇలా జీర్ణమైన ఆహారం పెద్ద ప్రేగు గుండా ప్రయాణించడానికి 15 గంటల నుండి 28 గంటల వరకు ఉంటుంది.  24 గంటలు గడిచినా మలవిసర్జన జరగకపోతే శరీరంలో చాలా అసౌకర్యంగా అనించడానికి కారణం ఇదే..

ఇకపోతే ఆహారం తిన్న వెంటనే నీరు తాగే అలవాటు ఉంటే దాన్ని మానుకోవడం చాలామంచిది. వీలైనంతవరకు ఆహారం కారం, ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకుంటే నీరు తాగాల్సిన అవసరం అంతగా ఉండదు. అలాగే ఉడికించిన కూరగాయలు బాగా తీసుకుంటే వాటిలో ఉండే నీటి శాతం ఆహారాన్ని జీర్ణం చెయ్యడానికి సహకరిస్తుంది. అదేవిధంగా రసం,  మజ్జిగ వంటివి కూడా జీర్ణాశయంలో ద్రవాల సమతుల్యతను  చేకూరుస్తాయి.  ఆహారం తిన్న తరువాత కనీసం 40నిమిషాల సేపు నీరు తాగకుండా ఉండటం మంచిది.

ఆహారం తిన్న తరువాత నీరు తాగాలని అనిపిస్తే  కేవలం ఒకటి రెండు గుక్కల నీరు మాత్రమే తాగవచ్చు. అది కూడా గోరువెచ్చగా ఉండే నీరు తాగడం మంచిది. అదే విధంగా తిన్న వెంటనే నీరు తాగాలని అనిపిస్తే లాలాజలాన్ని బాగా ఉత్పత్తి చేసే కారం, ఉసిరి ముక్క వంటివి తినవచ్చు. తేలికపాటి నడక కూడా మంచిదే.

                                        *నిశ్శబ్ద.