నానబెట్టిన ఖర్జూరం తింటే కలిగే లాభాలేంటో తెలుసా?

ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ లో ఒక  భాగం. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి.  ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాస సమయంలో  ఖర్జూరం తినడం తోనే ఆ రోజు ఉపవాసాన్ని విరమిస్తారు. పోషకాలు పుష్కలంగా ఉండే ఖర్జూరాలు ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తాయి.  ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన 2 ఖర్జూరాలు తింటూ ఉంటే కలిగే మ్యాజిక్ ఫలితాలేంటో తెలుసుకుంటే తప్పకుండా ప్రతిరోజూ ఖర్జూరాలు తినడం మొదలుపెడతారు..


ఫైబర్..

నానబెట్టిన ఖర్జూరంలో అధికమొత్తంలో ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్ణవ్యవస్థను బలంగా మారుస్తుంది.  జీవక్రియను మెరుగుపరుస్తుంది.  మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది.  పేగు  ఆరోగ్యాన్ని కాపాడుతుంది.


ఎనర్జీ..


నానబెట్టిన ఖర్జూరాలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరానికి గొప్ప శక్తి అందుతుంది.  ఇది రోజును ఉత్సాహంగా ప్రారంభించేందుకు తోడ్పడుతుంది. రోజంతా చురుగ్గా ఉండాల్సి న వ్యక్తులు నానబెట్టిన ఖర్జూరం తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.


స్కిన్..


చర్మం ఆరోగ్యం మీద దృష్టి ఉన్నవారు నానబెట్టిన ఖర్జూరం తినడం చాలా అవసరం.  ఎందుకంటే నానబెట్టిన ఖర్జూరం చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.  ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.


గుండె..

ఖర్జూరంలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.   ఇవి రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.  అధిక రక్తపోటు ఉన్నవారు రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తింటే చాలా మంచిది.


ఎముకలు..


ఖర్జూరంలో ఐరన్, కాల్షియం,  విటమిన్లు మంచి మొత్తంలో ఉంటాయి.  ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి.  ఎముకలు బలహీనంగా ఉన్నవారు ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తినడం చాలా మంచిది.


మధుమేహం..

ఖర్జూరం తీపి ఎక్కువగా ఉన్నా నానబెట్టిన తరువాత వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఈ కారణంగా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకునే వారు నానబెట్టిన ఖర్జూరం తింటే చక్కెర స్థాయిలు ఆరోగ్యంగానే ఉంటాయి.

రక్తహీనత..

భారతదేశంలో ఎక్కువ మంది మహిళలు రక్తహీనత తో బాధపడుతున్నారు.  ఖర్జూరంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల నానబెట్టిన ఖర్జూరాలు రోజూ ఉదయమే తింటూ ఉంటే హిమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది.


ఒత్తిడి..

ఖర్జూరాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.  ఒత్తిడితో పోరాడేవారు రోజూ ఉదయం నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఒత్తిడి తగ్గుతుంది.


తల్లిపాలు..

పరిశోధనల ప్రకారం పిల్లలకు పాలిచ్చే తల్లులు ఉదయాన్నే నానబెట్తిన ఖర్జూరం తింటూ ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది.  


                                                   *రూపశ్రీ.