ఢిల్లీలో విదేశీ మహిళపై గ్యాంగ్ రేప్
posted on Jan 16, 2014 @ 11:47AM
దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. నగరం నడిబొడ్డున రైల్వేస్టేషన్‌వద్ద ఆరుగురు దుండగులు డెన్మార్క్ పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో వదలక ఆమెవద్ద ఉన్న సొమ్ము, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె, వైద్య పరీక్షకు నిరాకరించి దర్యాప్తులో సహకరిస్తానని హామీ ఇచ్చి స్వదేశం వెళ్లిపోయారు.
వివరాలిలా ఉన్నాయి... ఢిల్లీలోని పహార్‌గంజ్‌లో ఒక హోటల్‌లో బసచేసిన ఆమె, మంగళవారం కన్నాట్‌ప్లేస్‌లో మ్యూజియంను సందర్శించారు. ఆ తర్వాత హోటల్‌కు దారి మరచిపోయి కొందరి సాయం కోరారు. ఇదే అదనుగా దుండగులు ఆమెను తప్పుదోవ పట్టించి నిర్మానుష్యంగా ఉండే డివిజనల్ రైల్వే ఆఫీసర్ల క్లబ్ పరిసరాలకు తీసుకెళ్లారు. అక్కడ కత్తితో బెదిరించి నగదు, ఐపాడ్, ఇతర విలువైన వస్తువులు దోచుకున్నారు. అంతటితో వదలక సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె తంటాలుపడి రాత్రి 7:30 గంటలకు హోటల్ చేరుకుని, సహ పర్యాటకులకు సంఘటన గురించి వివరించారు.
అనంతరం హోటల్ మేనేజర్ పోలీసులను పిలిపించగా, వారు ఆమె ఫిర్యాదు స్వీకరించి, వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. వైద్య పరీక్షకు తీసుకెళ్తామని కోరగా ఆమె నిరాకరించారు. ఆ తర్వాత ఆమెను డెన్మార్క్ రాయబార కార్యాలయానికి తీసుకెళ్లారు. అటుపైన బుధవారం మధ్యాహ్నం స్వదేశం వెళ్లిపోతూ తదుపరి దర్యాప్తులో సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. త్వరలో మిగిలినవారినీ అరెస్ట్ చేస్తామని అధికారులు చెప్పారు.