రాహుల్ ప్రధాని కాదు...ప్రచార సారథే..!!
posted on Jan 17, 2014 @ 9:40AM
కాంగ్రెస్ గురువారం రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా ఖరారు చేసినట్లే కాని ప్రకటన చేయలేదు! కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నకాంగ్రెస్ నేతలందరూ రాహుల్ గాంధీని పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని సోనియాగాంధీని గట్టిగా కోరినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్ధిని ప్రకటించే ఆనవాయితీ లేనందున ఆమె తిరస్కరించినట్లు, ఆ పార్టీ సీనియర్ నేత జనార్ధన్ ద్వివేది మీడియాకు తెలిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఆయన సారధ్యంలోనే వచ్చేఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రచార కమిటీ సారథి అంటే దాదాపు ప్రధానమంత్రి అభ్యర్థేనని, పార్టీ విజయం సాధిస్తే ఆయనే ప్రధాని అవుతారని పార్టీ సంకేతాలు పంపిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేదీ కూడా అంగీకరించారు. "ఆయన సారథ్యంలో ఎన్నికల ప్రచారం జరిగి విజయం సాధిస్తే... భావి నాయకత్వం కూడా ఆయన చేతిలో ఉన్నట్లే'' అని తెలిపారు.
సీడబ్ల్యూసీ భేటీలో చివరగా రాహుల్ గాంధీ రెండు నిమిషాలు మాట్లాడారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా నిర్వర్తిస్తానని, తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం మాత్రం తనకు ఇష్టం లేదని చెప్పారు.