టిడిపిలోకి 'చిరు' ఎమ్మెల్యే

      పాపం కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెస్ లోని తన వర్గ ఎమ్మెల్యేలతో ఎంత మొత్తుకున్నా వారు పార్టీని వీడే౦దుకే మొగ్గుచూపుతున్నారు. నెల్లూరు అర్భన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి, ఫిబ్రవరి మొదటి వారంలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మరో నేత మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ చాన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కూడా జనవరి 23 తర్వాత పార్టీ మారే విషయమై తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. వీరితో పాటు మరికొందరు మాజీ పీఆర్పీ నేతలు త్వరలో టిడిపి లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లుగా రాజకీయ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది.

బీఏసీ సమావేశాల్లో కుదరని ఏకాభిప్రాయం

      ఈ రోజు జరిగిన బీఏసీ రెండు సమావేశాల్లోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. మొదటి సారి ఉదయం ప్రారంభమైన బీఏసీ సమావేశం దాదాపు రెండుగంటలకుపైగా జరిగిప్పటికీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోసారి గంటలకు మరోసారి భేటీ అవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సమైక్య తీర్మానానికి కట్టుబడి ఉన్నామని, తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టేవరకు సభ జరగనివ్వమని వైసీపీ స్పష్టం చేయగా, సమైక్య తీర్మానం అవసరం లేదని...టి.బిల్లుపై చర్చ జరుగుతుందని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు.   రెండో దఫా బీఏసీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం అర్దాంతరంగా ముగిసింది. రెండో సారి సమావేశం ప్రారంభమైన వెంటనే టీడీపీ నేతలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. బిల్లును తిరిగి పంపించేయాల్సిందే అంటూ సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు కోరారు.

అశోక్ బాబు దెబ్బకు జగన్ మైండ్ బ్లాక్..!!

      అశోక్ బాబు దెబ్బకు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయ్యిందని రాజకీయవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆదివారం జరిగిన ఏపీఎన్జీవో ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు ప్యానల్ ఘనవిజయం సాధించింది. వైసీపీ అధినేత జగన్ అండదండలు ఉన్నాయని ప్రచారం జరిగిన బషీర్ ప్యానల్ అశోక్ బాబుకు కనీస పోటీని కూడా ఇవ్వలేక ఘోరంగా ఓడిపోయింది.   ఏపీఎన్జీవో ఎన్నికలకు..మెయిన్ స్ట్రీం రాజకీయలకు అసలు సంబంధం లేదు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులలో ఏపీఎన్జీవోలు  సమైక్యాంధ్ర ఉద్యమానికి వేదికగా నిలిచి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఎంతగా వచ్చారంటే రాజకీయ ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో వారి సంఘం ఉంది. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోవాలని ఆనుకున్న జగన్... తమకు మద్దతు ఇవ్వాలని ఏపీఎన్జీవోలను కోరారని, ఆయన ప్రతిపాదనను ఏపీఎన్జీవోలు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అశోక్‌బాబుపై తీవ్ర అసంతృప్తిని పెంచుకున్న జగన్.. ఏపీఎన్జీవో సంఘాల ఎన్నికల్లో వారిని ఓడించాలని కంకణం కట్టుకున్నారట. ఒక పక్క అశోక్ బాబు ఎవరో తెలియదంటూనే..అశోక్ బాబు ప్యానల్‌కు పోటీగా వారు బషీర్ ప్యానల్‌ను రంగంలోకి దించినట్లు కథనాలు వచ్చాయి . ఈ క్రమంలోనే పెద్దఎత్తున డబ్బు చేతులు మారినట్లు కూడా ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. కడప సహా మరికొన్ని జిల్లాల్లో వైసీపీ నేతలు క్యాంపులను ఏర్పాటు చేయడం, మరికొన్ని జిల్లాల్లో డబ్బు పంపిణీ వంటి వ్యవహారాలు బయటకు పొక్కాయి. అయితే జగన్ వర్గీ౦ ఎంత తీవ్రంగా ప్రయత్నించినా చివరికి అశోక్ బాబునే ఉద్యోగులు చక్రవర్తిని చేశారు.  ఏపీఎన్జీవో ఎన్నికలను గుప్పిట పట్టాలని భావించిన జగన్‌కు ఉద్యోగులిచ్చిన షాక్ కి మైండ్ బ్లాక్ కాదు..రెడ్..ఎల్లో కూడా అయిందని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.    

అశోక్‌బాబు ఘనవిజయం

      ఏపీఎన్జీవో ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు ప్యానల్ ఘనవిజయం సాధించింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సహా పదిహేడు పదవులకు మొత్తం పదిహేడు పదవులను అశోక్‌బాబు వర్గీయులే గెలుచుకున్నారు. వైసీపీ అధినేత జగన్ అండదండలు ఉన్నాయని ప్రచారం జరిగిన బషీర్ ప్యానల్ అశోక్ బాబుకు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. ఏపీఎన్జీవో సంఘంలో మొత్తం ఓట్లు 847 కాగా.. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 815 పోలయ్యాయి. అశోక్ బాబు ప్యానల్‌కు 630 ఓట్లు రాగా.. బషీర్ ప్యానల్‌కు 174 ఓట్లు మాత్రమే దక్కాయి. అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన అశోక్‌బాబు 456 ఓట్ల ఆధిక్యంతోనూ.. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన చంద్రశేఖర రెడ్డి 425 ఓట్ల ఆధిక్యంతోనూ ఘన విజయం సాధించారు.  ప్రత్యర్థి వర్గమైన బషీర్ ప్యానల్‌లో ఏ ఒక్కరూ కూడా 180 ఓట్లను దాటలేకపోయారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల స్థానాలకు పోటీ చేసిన బషీర్, పీవీవీ సత్యనారాయణలకు 174.. 183 ఓట్లు మాత్రమే దక్కాయి. సమైక్య ఉద్యమంలో మరింత ఉధృతంగా పనిచేస్తాననీ, ఈ గెలుపు మరింత బాధ్యతను పెంచిందనీ అశోక్‌బాబు చెప్పుకొచ్చారు. గెలుపోటముల్ని పక్కన పెట్టి, అన్ని సంఘాలతోనూ కలిసి సమైక్య ఉద్యమాన్ని కొనసాగిస్తానన్నారాయన. రేపు అన్ని సంఘాల నేతలతో ప్రత్యేకంగా భేటీ అయి, సమైక్య ఉద్యమానికి సంబంధించి భవిష్యత్‌ కార్యాచరణపై ఆలోచిస్తామని అశోక్‌బాబు చెప్పారు.

చంద్రబాబు వైపు 'చిరు' వర్గం

      రాష్ట్రంలో గత కొంతకాలంగా మారుతున్న రాజకీయ పరిణామాలు టిడిపి పార్టీకి లాభంచేకూర్చేవిధంగా ఉన్నాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మొదట్లో తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న 'కాపు సామాజికవర్గం' తదనంతరం దశలవారీగా చోటుచేసుకున్న పరిణామాలలో కొంచెం కొంచెంగా ఆ పార్టీకి దూరమైంది. అయితే తాము నమ్మినవారందరు తమని నట్టేట ముంచుతూ వస్తున్నారని భావించిన 'కాపు సామాజికవర్గం'...తమ పాత మిత్రుని చెంతకే చేరాలని నిశ్చయించుకుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.   రెండు రోజుల క్రితం చిరంజీవి తనవర్గ ఎమ్మెల్యేలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సంధర్బంగా వారందరూ తాము టిడిపి పార్టీలోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నామని చిరుతో తేల్చిచెప్పినట్లు తెలిసింది. అయితే చిరంజీవి మాత్రం వారిని కాంగ్రెసునుంచి ఫిరాయించకుండా నిలువరించడంలో తన ప్రయత్నాలను ఇంకా ఆపలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఒకసారి ఉమ్మడిగా అందరితో కలిసి భేటీ అయిన చిరంజీవి, ఇప్పుడు ఒక్కరొక్కరుగా పిలిపించి మాట్లాడుతున్నారట. అయితే ఎమ్మెల్యేలు మాత్రం తమకు పార్టీ మారడం తప్ప వేరే గత్యంతరం లేదని అన్నారట. తన వెంట కాంగ్రెసులోకి వచ్చిన వారు ఇప్పుడు వెళ్లిపోతే గనుక.. ఆ ప్రభావం తన కెరీర్‌ మీద పడుతుందని చిరు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.   ఈ వార్తలకు నిదర్శనంగానే ప్రస్తుతం కాంగ్రెస్ లో వున్న కొంతమంది కాపు సామాజిక వర్గ ఎమ్మెల్యేలు టిడిపి వైపు చూస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ముఖ్యంగా మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తూర్పుగొదావరికి చెందిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రామాచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులూ, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు తిరిగి తెలుగు దేశంలో చేరనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకుని... కాపులకు మరింత దగ్గరయ్యేందుకు టిడిపి కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

జీఎస్ఎల్‌వీ-ఢీ5 ప్రయోగం విజయవంత౦

      జీఎస్ఎల్‌వీ-డీ5 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఆదివారం సాయంత్రం 4.18 గంటలకు షార్‌లోని 2వ ప్రయోగ వేదిక నుంచి దీనిని ప్రయోగించారు. జీఎస్ఎల్‌వీ-డీ5 అన్ని దశలను దాటుకుంటూ అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. ప్రయోగం విజయవంతమవడంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఒకరినొకరు అభినందించుకుంటూ ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్‌కు అభినందనలు తెలియజేశారు. 20 ఏళ్ల ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఫలించిందని ఆయన అన్నారు. శాస్త్రవేత్తలంతా అంకిత భావంతో పనిచేశారని అన్నారు. కీలకమైన క్రయోజనిక్ ఇంజన్‌పై పట్టు సాధించామని ఆయన పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీకి ఇది ముఖ్యమైన రోజని డాక్టర్ రాధాకృష్ణన్ వెల్లడించారు. ఇండియన్ క్రయోజనిక్ ఇంజన్ విజయవంతం కావడానికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలియజేవారు.  ఈ ప్రయోగం ద్వారా భారత కమ్యూనికేషన్ రంగం మెరుగుపడి మరింత బలపదనుందని ఆయన అన్నారు.ఈ ప్రయోగాన్ని దేశీయ పరిజ్ఞానంతో తయారు చేశామని, ఇస్రో చరిత్రలో ఇది 105వ ప్రయోగమని, దీని ఖర్చు విషయానికి వస్తే జీశాట్ -14 ఉపగ్రహం కోసం రూ. 45 కోట్లు ఖర్చుకాగా, మొత్తం ప్రయోగానికి అయిన ఖర్చు రూ. 205 కోట్లు అయినట్లు డాక్టర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు.

పొన్నం... పూటకో మాట!

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ను పెల్చేస్తానని నోరుజారిన కరీంనగర్ ఎమ్.పి పొ్న్నం ప్రభాకర్... దానిపై వివరణ ఇచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. తాను వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదని..తెలంగాణ ప్రజల ఆవేశాన్ని, బాధను వెల్లడించనని చెబుతున్నారు. అసెంబ్లీలో తెలంగాణ మంత్రులను కుట్రదారులుగా పేర్కొన్న ముఖ్యమంత్రిపై కేసులు ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. తనపై కేసులు నమోదు చేయాలని సీమాంధ్ర టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానన్న నన్నపనేనిపై ఎందుకు కేసు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్‌కు బిల్లు రావడం ఖాయమని, తెలంగాణ ఏర్పాటే అంతిమ విజయమని పొన్నం పేర్కొన్నారు.

కెసిఆర్ కు బాబు న్యూయర్ ఆఫర్

      తెలుగు దేశం పార్టీ చంద్రబాబు నాయుడు కెసిఆర్ కి న్యూయర్ ఆఫర్ ఇచ్చారు. కెసిఆర్ ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తే కోట్లు వస్తున్నాయి కాబట్టి రైతులందరి భూములు కెసిఆర్ తీసుకొని ఎకరాకు రూ. 5 లక్షల చొప్పున రైతులకిచ్చి మిగితా 95 లక్షల రూపాయలు తీసుకోవాలని అన్నారు. ఈ విధంగా చేస్తే రాష్ట్రంలోని రైతులు బాగుపడతారని చెప్పారు.   తెలంగాణ ప్రాంతంలో రైతులంతా గిట్టుబాటు ధర లేక కష్టాలు పడుతుంటే..కెసిఆర్ మాత్రం లాభపడ్డానని చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు. ఇదంతా నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకునే ప్రక్రియలో భాగమేనని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కేసీఆర్ తన ఫాంహౌజ్‌లో చేస్తోంది వ్యవసాయం కాదని, అవినీతి సాగేనని ఆరోపించారు. మరోవైపు వ్యవసాయం అంత లాభసాటి అయితే రాష్ట్రంలో రైతులెందుకు ఆత్మహత్య చేసుకుంటారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ బిల్లుపై ఓటింగ్ తప్పనిసరి: కిరణ్

      తెలంగాణ బిల్లుపై సోమవారం నుంచి చర్చ మొదలవుతుందని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయం అంటే ఓటింగే అని స్పష్టం చేశారు.చ ర్చలో పాల్గొని బిల్లుపై అభిప్రాయం చెబితేనే రాష్ట్రపతి పరిగణలోకి తీసుకుంటారని సీఎం వెల్లడించారు. అసెంబ్లీ అభిప్రాయంతోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని, దేశంలో ఓటింగ్ లేకుండా ఏ రాష్ట్రం ఏర్పడలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్‌లో రాజకీయ భవిష్యత్ ఉండదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. 23 తర్వాత రెండు రోజులు ప్రత్యేకంగా సమావేశమై ఏం చేయాలనేది చర్చిస్తామని తెలిపారు. ప్రాణహిత చేవెళ్ళకు రూ.38 వేల కోట్లు ఖర్చవుతున్నపుడు... చిత్తూరుకు ఆరువేల కోట్లు ఇస్తే తప్పా అని ప్రశ్నించారు. విభజన జరిగితే రెండు రాష్ట్రాలకు నష్టమే అని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు ఏటా రూ.60వేల కోట్లు కావాలని, విభజన జరిగితే సంక్షేమ పథకాలకు నిధులు ఉండవన్నారు. శ్రీధర్‌బాబు రాజీనామా లేఖ అందినట్లు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

ఆఇళ్ళు వద్దంటున్న కేజ్రీవాల్‌

      ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసాన్ని ఆయన తిరస్కరించారు. తనకు కేటాయించిన కొత్త ఇంటిపై వివాదాలు చెలరేగడంతో, విపక్షాల ఆరోపణలకు తావివ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. తనకు చిన్న ప్లాట్ ఇస్తే చాలని కేజ్రీవాల్ తెలిపారు. తనకు ఇంటిని కేటాయించే వరకు గజియాబాద్‌లోని తన ఇంటి నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగిస్తానని అరవింద్ కేజ్రివాల్ చెప్పారు. తనకు తన స్నేహితులు, మద్దతుదారుల నుంచి శుక్రవారం పలు ఫోన్ కాల్స్ వచ్చాయని, అందులో వారు నూతనంగా కేటాయించిన ఐదు పడకల భవనంలోకి వెళ్లరాదని కోరినట్లు తెలిపారు. దీంతో తాను ఆ భవనానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు కేజ్రివాల్ చెప్పారు.

రాహుల్ శల్య సారధ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ పని సరి

  అసలే రాష్ట్ర విభజనతో కుదేలయియిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు మూలిగే ముసలి నక్కపై తాటి పండుపడినట్లు నిన్న ప్రధాని మన్మోహన్ సింగ్ రిటర్మెంట్ ప్రకటనతో మరో గడ్డు సమస్య ఎదురవనుంది. ఇంతవరకు రాహుల్ గాంధీ ప్రచారం చేసిన ప్రతీ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోతోంది. ఇప్పుడు ఆయనను కాంగ్రెస్ పార్టీ తమ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాక సీమాంధ్ర కాంగ్రెస్ వ్యవహారాలలో కూడా ఆయన వ్రేలు పెడితే, ఇక తమ పని గోవిందా! అని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు బయపడుతున్నారు. ప్రజలలో కాంగ్రెస్ పార్టీపై ఉన్నవ్యతిరేఖత ఆయన రాకతో మరింత పెరిగే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. పైగా రాష్ట్రంలో తెదేపా, బీజేపీలు ఎన్నికల పొత్తులకి సిద్దమవుతున్నఈ సమయంలో రాహుల్ గాంధీ రాష్ట్రంలో పార్టీకి శల్యసారద్యం చేస్తే చేజేతులా ఉన్న కొద్దిపాటి అవకాశం కూడా చెడుతుంది.   మంచి పరిపాలనా దక్షులుగా పేరు పొందిన చంద్రబాబు, మోడీ ఒకపక్క, అనుభవరహితులయిన రాహుల్ గాంధీ, జగన్మోహన్ రెడ్డి మరోపక్క నిలబడితే ప్రజలు మోడీ-బాబు వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. సీమాంధ్రకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర విభజన ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోందని ఇప్పటికే దాదాపు స్పష్టమయింది. దానికి తోడు రాజకీయ అపరికత్వతతో రాహుల్ గాంధీ యువతకే పెద్దపీట, నీతి నిజాయితీ, పార్టీ ప్రక్షాళన అంటూ సీనియర్లను పక్కనబెట్టి కొత్తవారికి టికెట్స్ అంటే సీమాంధ్రలోనే కాక తెలంగాణాలో సైతం కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయం. ఇక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని తమ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించిన నాటి నుండి ప్రజలు అతనిని మోడీతో బేరీజు వేసి చూడటం మొదలుపెడితే, రాహుల్ గాంధీకి తక్కువ మార్కులు పడతాయి గనుక, ఆయన సారధ్యంలో నడిచే కాంగ్రెస్ పార్టీపై కూడా ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది.   ఇక, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తమకు ఎటువంటి సంబందమూ లేదని రుజువు చేయడానికి కాంగ్రెస్ పార్టీతో బాటు సోనియా, రాహుల్ గాంధీలను దుమ్మెత్తి పోస్తున్నన్నారు. కానీ ఇంతవరకు సోనియా, రాహుల్ గాంధీలు ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గురించి పల్లెత్తు మాట పలకకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీపై రగిలిపోతున్న సీమాంధ్ర ప్రజలు ఈ రెండు పార్టీల మధ్య ఉన్న రహస్య అనుబంధం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టవచ్చును. ఇక రాష్ట్ర విభజనతో తెలంగాణా ఏర్పాటు చేసి లబ్ది పొందాలని భావిస్తున్నకాంగ్రెస్ పార్టీ, తెరాసతో పొత్తులు ఖరారు చేసుకోగానే, కాంగ్రెస్ తన రాజకీయ లబ్ది కోసమే విభజన చేస్తున్నట్లు స్వయంగా ఖరారు చేసినట్లువుతుంది. అది కూడా సీమాంధ్రలో పార్టీపై తీవ్ర విపరీత ప్రభావం చూపవచ్చును. సీమాంధ్రలో ఈ గడ్డు పరిస్థితులను అధిగమించేందుకు రాహుల్ గాంధీకి తగిన సలహాలు ఇచ్చేనేతలు కూడా ప్రస్తుతం లేకపోవడం మరో పెద్ద సమస్య. రాజకీయ దురందరులనదగ్గ వారందరూ పార్టీకి దూరమయిపోయారు. ఈ తరుణంలో రాహుల్ గాంధీ వచ్చి శల్యసారధ్యం చేస్తే ఏమవుతుందో ఊహించవచ్చును.

ప్రజాధన౦ సభార్పణం

      రాష్ట్ర ప్రజల నుంచి వసూళుచేసిన ప్రజా ధనాన్ని రాజకీయ నాయకులు అప్పనంగా ఖర్చు చేస్తున్నారు.. అసెంబ్లీ సమావేశాల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నాశనం చేస్తున్నారు.   తెలంగాణ బిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చిన నాటి నుండి..అసెంబ్లీ సమావేశాలు ఒక్క రోజు కూడా సజావుగా జరగటం లేదు.. తెలంగాణ అంటూ ఒక వర్గం..సమైఖ్య తీర్మానం కావలంటూ మరో వర్గం అసలు చర్చ మొదలు కాకుండానే రచ్చ చేస్తున్నాయి. ఇలా చేసే గొడవలతో సభాసమయం వృధా కావటం తప్ప మరే ఉపయోగం లేదని ఇరు వర్గాలకు తెలిసిన ప్రజలను మభ్యపెట్టడానికే రాజకీయ దొంగలు డ్రామాలడుతున్నారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో జరిగే చర్యకు కేంద్రంలో ఎలాంటి ఉపయోగంలేదని తెలిసిన మన నాయకులు మాత్రం రాజకీయ చదరంగం ఆపడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజానాల గురించి ఆలోచించాల్సి౦ది పోయి తమ సొంత ప్రయోజనల కోసం సభాసమయాన్ని  ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు.

మన్మోహన్ వారి కొత్త సిద్ధాంతం

  సోనియా, రాహుల్ భక్త జనుల రాహుల్ గాంధీ భజనతో తపోభంగమయిన మౌన మునీశ్వరులు మన్మోహనులవారు, వారి (అధిష్టానం) మనోభావాలను గౌరవించకపోతే ఏమవుతుందో గ్రహించినవారయి, నిన్న మీడియాను పిలిచి తాను మళ్ళీ మూడోసారి ప్రధాని పదవి చెప్పట్టలేనని ప్రకటించేశారు. అంటే దానర్ధం తనకు ఆసక్తి లేకనే చేప్పట్టడం లేదా లేక అమ్మగారి అనుమతి లేదు గనుక చెప్పట్టలేకపోతున్నారా? అనే సంగతిని జనాల విజ్ఞతకే వదిలిపెట్టేసారు. ఏమయినప్పటికీ మన్మోహనులవారు సగౌరవంగా తన కుర్చీలోంచి దిగిపోయి రాహుల్ గాంధీకి అప్పగించబోతున్నట్లు స్పష్టమయింది. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీ గురించి నాలుగు మంచి ముక్కలు అనడం కూడా మెచ్చుకోవలసిందే. అయితే పోతూపోతూ నరేంద్ర మోడీ గురించి, తన పదేళ్ళ పరిపాలన గురించి చెప్పిన మాటలను మాత్రం అటు బీజేపీ, ఇటు ప్రజలు కూడా మెచ్చుకోలేకపోతున్నారు. కానీ చరిత్రలో శిలాక్షరాలతో లికించదగ్గ ఒక కొత్త సిద్ధాంతాన్నిఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.   ప్రధాని రేసులోనుండి తాను తప్పుకొంటున్నాని ప్రకటించేందుకు తప్పనిసరయి మీడియా సమావేశానికి హాజరయిన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రని కూడా చూడకుండా మీడియావాళ్ళు బొగ్గు కుంభకోణాలు, ఆయన ఎప్పుడో మరిచిపోయిన 2జీ స్పెక్ట్రం కుంభకోణాలు, అగస్టా హెలికాఫ్టర్ కుంభకోణాల గురించి ప్రశ్నలు అడుగుతూ కాకుల్లా పొడిచేస్తుంటే, పక్కనున్న ప్రసారశాఖా మంత్రి మనిష తివారీ కూడా నిస్సహాయంగా చూస్తూ కూర్చోకతప్పలేదు.   కానీ దాదాపు నలబై ఏళ్ళు కాంగ్రెస్ రాజాకీయాలలో తలపండిన మన్మోహన్ సింగ్ అంతూపొంతూ లేని ఆ ప్రశ్నలకు కొంచెం ఇబ్బందిపడినప్పటికీ, అప్పుడెప్పుడో మా యుపీఏ-1 హయాంలో జరిగిన 2జీ స్పెక్ట్రం కుంభకోణం గురించి ఇప్పుడు మీరు మాట్లాడటం భావ్యం కాదు. అయినా అంత పెద్ద కుంభకోణం గురించి ప్రజలే పట్టించుకోకుండా మళ్ళీ మా పార్టీకే అధికారం కట్టబెట్టారు కదా! అందువల్ల ఆ తప్పులనీ మాఫీ అయిపోయినట్లే! ఇప్పుడు యూపీయే-2లో కూడా మేము చాలా భాద్యతగా చేయవలసినంతా చేసాము. మా సమర్ధతను మోడీ గుర్తించక పోవచ్చును. మీడియా గమనించకపోవచ్చును. కానీ చరిత్ర మాత్రం నా పట్ల దయ చూపుతుందని నమ్ముతున్నాను” అని బదులిచ్చారు.   ఎన్నికలలో గెలిచినట్లయితే చేసిన తప్పులన్నీ మాఫీ అయిపోయినట్లే అని ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ఈ కొత్త సిద్ధాంతం ప్రకారం చూసుకొంటే,” మా మోడీ కూడా వరుసగా మూడుసార్లు ఎన్నికలలో గెలిచారు గనుక ఆయన చేసిన తప్పులు కూడా ప్రజలు క్షమించేసినట్లే!” నని బీజేపీ ఆయన సిద్ధాంతానికి పూర్తి మద్దతు తెలిపింది. మొత్తం మీద మన్మోహన్ సింగ్ పోతూపోతూ తన ప్రత్యర్ధి కూడా మెచ్చుకొనే విధంగా ప్రతిపాదించిన ఈ చక్కటి సిద్దాంతం మాత్రం చరిత్రలో శిలాక్షరాలతో లికించబడుతుంది.   కానీ ఆయన “నరేంద్రమోడీ ప్రధాని అయితే దేశం సర్వ నాశనమయిపోతుందని” జోస్యం చెప్పడాన్ని మాత్రం బీజేపీ జీర్ణించుకోలేకపోయింది. గుజరాత్ అల్లర్లలో అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లే, ఆయన ప్రధాని అయితే దేశంమంతటా మత ఘర్షణలు చెలరేగి ప్రజలు ప్రాణాలు కోల్పోతారని మన్మోహన్ సింగ్ హెచ్చరించారు. అయితే అప్పుడు దేశంలో ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కోర్టులు, ప్రజలు చోద్యం చూస్తూ కూర్చోంటారా? అనే ధర్మసందేహం ఎవరయికయినా కలిగితే అందుకు ఆయనను తప్పు పట్టలేము. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ తనకు నేర్పిన చిలక పలుకులనే వల్లెవేసారు అంతే.   ఇది గ్రహించని బీజేపీ మాత్రం దేశంలో ఇంతవరకు మరే ప్రధాని అభ్యర్ధి ఎదుర్కోనన్ని న్యాయ విచారణలు, సీబీఐ దర్యాప్తులు మోడీ ఎదుర్కొని నిష్కళంకంగా బయట పడ్డారు. అటువంటప్పుడు ఆయన గురించి పెద్దాయన ఆవిధంగా మాట్లాడటం చాలా తప్పు అని తీర్మానించేసింది.

యువరాజా వారికి చేతి నిండా పనే

  త్వరలో పట్టాభిషేకం చేసుకోనున్న కాంగ్రెస్ యువరాజా వారు ముందుగా దేశం నుండి అవినీతిని పారద్రోలాలనుకొన్నారు. ఆ ప్రయత్నంలో నలుగురు మహారాష్ట్ర ముఖ్యమంత్రులు మరెందరో అధికారులు కలిసి చేసుకొన్నఆదర్శకుంభకోణాన్నిమళ్ళీ త్రవ్వి తీయాల్సిందేనని ఆజ్ఞాపించారు. అందుకు రాజమాత కూడా ఆమోదముద్ర వేసారు. కానీ ముప్పై అంతస్తుల ఎత్తున్న ఆ ఆదర్శ భవనానికి, అంతే లోతుగా వేసిన అవినీతి పునాదులు కదిపితే బిల్డింగు, దానితో బాటు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ భవనం కూడా బీటలు వారడం ఖాయమని భావించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృద్వీ రాజ్ చవానులవారు, మధ్యే మార్గంగా ఆ భవనంలో అంతగా రాజకీయ పలుకుబడి లేని ఓ 26మంది మీద మాత్రం కేసులు పెట్టగలమని, అంతకంటే లోతుగా త్రవ్వడం కాంగ్రెస్ పార్టీకి శ్రేయస్కరం కాదని ఎలాగో యువరాజా వారికి సర్ది చెప్పారు.   ఆవిధంగా మహారాష్ట్రలో అవినీతిని తుడిచి పెట్టేయగానే, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సకుటుంబ సపరివారంగా విద్యుత్ కంపెనీల నుండి కోటానుకోట్లు పిండుకొంటున్నారని బీజేపీ కాంగ్రెస్ పార్టీకి కాకితో కబురంపింది. మొదట అందుకు కాంగ్రెస్ ఒప్పుకోకపోయినా, బహుశః మళ్ళీ యువరాజవారు సైగ చేసారో ఏమో ఒక సీబీఐ ఎంక్వయిరీ వేసేసి చేతులు దులుపుకొంది. ఎలాగూ మరో నాలుగయిదు నెలలో ఎన్నికలు వచ్చేస్తున్నాయి గనుక సీబీఐ దర్యాప్తు చేసినా అప్పుడే చూసుకోవచ్చునని అనుకొన్నారు.   కానీ, అదేమీ చిత్రమో! ఎన్ని కుంభకోణాలు కప్పెడుతున్నా శ్మశానంలో కంకాళాలాలాగ ఎక్కడో ఒక చోట కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయి. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు పెట్టుకొని అగస్టా హెలికాఫ్టర్లో తిరిగితే మిగిలిన పరువేదయినా ఉంటె ఆ నరేంద్ర మోడీ దానిని కూడా తీసి పడేస్తాడని భయపడి, అగస్టా కుంభకోణాన్ని(కాంట్రాక్టు) కూడా రద్దుచేసి పడేసారు.   ఇంకా బొగ్గు కుంభకోణం, రైల్వే వాగన్ల కుంభకోణం, భూ కుంభకోణాలు వగైరాలు చాలా కుంభకోణాలు ఎన్నికల నాటికి మిగిలిపోయేలా ఉన్నాయి. అందువల్ల యువరాజవారు కొంచెం ఓవర్ టైం చేయాలేమో కూడా!

చిరుతో 'మాజీ పీఆర్పీ' భేటి

      పూర్వ పిఆర్పీ నాయకులు చిరు ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారట. విభజన నిర్ణయం నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ పైన ప్రజలు కసి పెంచుకున్నారని, వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. కాంగ్రెసు పార్టీలోనే ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆవేదన వ్యక్తం చేశారట. కాంగ్రెసు పార్టీని అందరూ ఉమ్మడి శత్రువుగా చూస్తున్నారని, కేడరంతా పార్టీ మారుదామని సూచించారట. అయితే, చిరు మాత్రం ఎవరు తొందరపడవద్దని సూచించారట. 2014 ఎన్నికలు దగ్గర పడిన దరిమిలా, పార్టీ కోసం పనిచేయాలని మాజీ పీఆర్పీ నేతలకు సూచించిన చిరంజీవి, రాష్ట్ర విభజన దిశగా వేగంగా అడుగులు పడ్తున్నప్పటికీ ఎన్నికల్లోగా విభజన జరిగేందుకు అవకాశాలు తక్కువని చిరంజీవి వారికి సమాచారం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.