చంద్రబాబు ప్రయత్నాలు అందుకేనా?
posted on Jan 15, 2014 7:35AM
చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్తూరులో తన స్వగ్రామమయిన నారావారి పల్లెలో విడిది చేసి, ఒకప్పుడు తనతో కలిసి చదువుకొన్నబాల్య స్నేహితులందరినీ కలుస్తున్నారు. ఆయన ఇంతవరకు దాదాపు వందమంది స్నేహితులను కలిసారు. వారిలో ప్రతీ ఒక్కరు కూడా చంద్రబాబుతో తమకున్నసాన్నిహిత్యాని, ఆనాటి మధురానుభూతులు నెమరువేసుకొంటూ పులకరించిపోయారు.
చంద్రబాబు ఈవిధంగా అకస్మాత్తుగా తన బాల్యస్నేహితులను కలవడం కొంచెం ఆశ్చర్యం కలిగించినా, రాజకీయ కోణం నుండి చూసినట్లయితే ఆయన ఈవిధంగా తన రాజకీయ పునాదులు బలోపేతం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారని అర్ధమవుతుంది. మొదటి నుండి ఆయనకు అండగా నిలిచిన చిత్తూరు జిల్లాపై, ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజక వర్గంపై ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి కన్నేసిన సంగతి అందరికీ తెలిసిందే. వచ్చేఎన్నికలలో ఎలాగయినా అక్కడ పాగావేసి చంద్రబాబుని, ఆయన ప్రతిష్టని, తెదేపాను దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నప్పుడు చంద్రబాబు చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోబోరు. బహుశః ఆ ప్రయత్నంలోనే ఆయన తన బాల్యస్నిహితులను కలుస్తూ వారి ద్వారా పార్టీకి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారనుకోవచ్చును. ఆయన స్నేహితుల స్పందన చూస్తే ఆయన తన ప్రయత్నంలో సఫలం అయినట్లు అర్ధం అవుతోంది. ఆయన కేవలం వ్యక్తిగతంగానే కాక పార్టీ పరంగా కూడా ప్రజలతో అనుసంధానం అయ్యేందుకు ఇప్పటి నుండే గట్టిగా కృషి చేసినట్లయితే ఆయన కంచుకోటలోకి ఈగ కూడా ప్రవేశించే దైర్యం చేయదు.