మోడీ సభలో బురకాల వివాదం

  మొన్న ఆదివారంనాడు నరేంద్ర మోడీ గోవాలో నిర్వహించిన సంకల్ప్ ర్యాలీకి దాదాపు రెండు రెండు లక్షల మంది హాజరయినపట్లు సమాచారం. వారిలో బురకాలు ధరించిన ముస్లిం మహిళలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. గోవా రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనోహర్ అసగావొంకర్ మీడియాతో మాట్లాడుతూ,” నరేంద్ర మోడీ సభలోఆర్.యస్.యస్. కార్యకర్తలే బురకాలు ధరించి హాజరయ్యారు. తద్వారా ముస్లిం ప్రజలు కూడా మోడీపట్ల ఆసక్తి చూపుతున్నట్లు లోకానికి చాటాలని ఎత్తు వేసారు. అందుకోసం బురకాలు ధరించిన ఆర్.యస్.యస్. కార్యకర్తలు మోడీ సభలో వేర్వేరు ప్రదేశాలలో గుంపులు గుంపులుగా కూర్చోన్నారు. వారి ఎత్తుగడ బాగానే ఉంది. కానీ, ఆ హడావుడిలో గోవాలో ముస్లిం మహిళలు బురకాలు ధరించరనే విషయాన్నిమరిచిపోవడంతో వారి బండారం బయటపడింది,” అని ఆరోపించారు.   ఆ ఆరోపణలతో కంగు తిన్న బీజేపీ వాటిని తనదయిన శైలిలో ఖండించింది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విల్ ఫ్రెడ్ మేస్క్యుట మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు గోవాలో నిర్వహించిన ఏ సభకూ రెండు లక్షల మంది జనాలు రావడం ఎరుగదు. కానీ మోడీ సభకు అంత మంది తరలిరావడంతో కాంగ్రెస్ పార్టీ కలవరపడటం సహజమే. అందువలన అది ఎటువంటి నీచ ఆరోపణలయినా చేయగలదు. కానీ బీజేపీకి అన్ని వర్గాల ప్రజల నుండి అపూర్వమయిన ఆదరణ ఉందనే సంగతి మాత్రం కాంగ్రెస్ గుర్తించి నందుకు చాలా సంతోషం,” అని బదులిచ్చారు.

ఆమాద్మీ పార్టీలో చేరనున్నమేధా పాట్కర్

  గత అనేక సం.లుగా నర్మదా బచావ్ ఆందోళన చేస్తున్నమేధాపాట్కర్ త్వరలో ఆమాద్మీ పార్టీలో చేరవచ్చునని తెలుస్తోంది. ఆమె డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ “మా గమ్యాలు వేరయినా మా ఆశయాలు ఒక్కటే. అందుకే నేను ఆమాద్మీ పార్టీ కి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. ఈనెల 16,17 తేదీలలో నా సహచరులతో, ఆమాద్మీ నేతలతో చర్చించిన తరువాత నేను ఆ పార్టీలో ఎటువంటి పాత్ర పోషించాలో నిర్ణయించుకొంటాను,” అని ఆమె తెలిపారు. జవహర్ లాల్ నెహ్రు విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ప్రొఫెసర్ కమల్ మిత్ర చినాయ్ నిన్న ఆమాద్మీ పార్టీలో చేరారు. ఆమెతోబాటు పలువురు ప్రొఫెసర్లు, విద్యార్ధులు కూడా ఆమాద్మీ పార్టీలో చేరబోతునట్లు సమాచారం. దేశవ్యాప్తంగా అనేక మంది సామాజిక వేత్తలు ఆమాద్మీ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడం ఆ పార్టీకి కలిసిరావచ్చును.

ఫిబ్రవరి మొదటి వారంలో కాంగ్రెస్ తొలి జాబితా

  ఈనెల 17న డిల్లీలో జరగనున్న ఏఐసిసి సమావేశంలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించవచ్చును. ఆ సమావేశంలో వచ్చేఎన్నికలలో పార్టీ అనుసరించవలసిన వ్యూహం గురించి  కూడా చర్చించవచ్చును. ఇప్పటికే, అభ్యర్దుల ఎంపిక ప్రక్రియ కొంత వరకు పూర్తయింది గనుక, జనవరి 21లోగా దేశంలో అన్నిరాష్ట్రాలలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీలు అభ్యర్ధుల జాబితాలను సిద్దం చేసి సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేసే కేంద్ర ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి సమర్పించవలసిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ జాబితాలు అందగానే వారిలో నుండి టికెట్స్ ఖరారు చేయదలచుకొన్న అభ్యర్ధులతో జనవరి 22-26 తేదీల మధ్య నేరుగా మాట్లాడి, ఫిబ్రవరి 1 నుండి 7వరకు ఖరారు చేసిన అభ్యర్ధుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతోంది.   సాధారణంగా కాంగ్రెస్ పార్టీ నామినేషన్స్ వేసే రోజువరకు అభ్యర్ధుల పేర్లు ప్రకటించకుండా తాత్సారం చేస్తుంటుంది. కానీ ఈసారి రాహుల్ గాంధీ దాదాపు ఆరేడు నెలల క్రిందటే గెలుపు గుర్రాలను అన్వేషించేందుకు అన్ని రాష్ట్రాలకు తన పరిశీలకులను పంపించి కొంత పని పూర్తిచేయడంతో ఈసారి ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలల గడువు ఉండగానే అభ్యర్ధుల పేర్లు ప్రకటించేందుకు రంగం సిద్దమయింది. అయితే, ఈసారి ఆయన యువతకు పెద్దపీట వేయబోతున్నట్లు గ్రహించడంతో, సీనియర్లు తమ పుత్రరత్నాలను బరిలోకి దింపుతున్నారు.

మళ్ళీ పొగలు గ్రక్కిన వ్వోల్వో బస్సు

  రెండు నెలల క్రితం మెహబూబ్ నగర్ జిల్లా, పాలెం వద్ద జరిగిన వోల్వో అగ్ని ప్రమాదంలో 45మంది ప్రయాణికులు సజీవ దహనం అయిన సంగతి మరువక ముందే, మళ్ళీ మరో వోల్వో బస్సుమెహబూబ్ నగర్ జిల్లాలోనే పొగలు గ్రక్కింది. అయితే ప్రయాణికుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం నుండి అందరూ సురక్షితంగా బయటపడారు. హైదరాబాద్ నుండి తిరుపతి వెళుతున్న యస్.వీ.ఆర్ సంస్థకు చెందిన వోల్వో బస్సు మెహబూబ్ నగర్, ఇటిక్యాలపాడు వద్దకు సుమారు రాత్రి రెండు గంటలకి చేరుకొన్నపుడు బస్సులో నుండి పొగలు రావడంతో అప్రమత్తమయిన ప్రయాణికులు కేకలు వేయడంతో డ్రైవర్, క్లీనర్ బస్సుని నిలిపివేసి పారిపోయారు. బస్సులో ఉన్న30మంది ప్రయాణికులు, బస్సులో కూర్చొనే దైర్యం చేయలేక నిన్నరాత్రి నుండి హైవే రోడ్డు మీద మంచులో పడిగాపులు కాస్తున్నారు. బస్సు యాజమాన్యం కూడా ఇంతవరకు వేరే ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సంగతి తెలిసిన జిల్లా కలెక్టర్, పోలీసులు అక్కడికి చేరుకొని ప్రయాణికులను తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రియాంక బరేలి, అమేధీలకే పరిమితం: కాంగ్రెస్

  ఈనెల 17న జరగనున్న ఎఐసీసీ సమావేశంలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తారనే వార్తల నేపధ్యంలో, ఆయన సోదరి ప్రియాంక వాద్రా కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమావేశం కావడంతో, ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు చెప్పట్టనున్నారని మీడియాలో ప్రచారం మొదలయింది. కానీ, ఆమె కేవలం రాయ్ బరేలీ మరియు అమేధీ నియోజక వర్గాలలో మాత్రమే ప్రచారం చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకన్ ఈ రోజు మీడియాకు తెలిపారు. కానీ ఆమె తన తల్లి సోనియాగాంధీ, సోదరుడు రాహుల్ గాంధీల ప్రచార కార్యక్రమాలను తెరవెనుకే ఉంది పర్యవేక్షించవచ్చునని తెలుస్తోంది. అజయ్ మాకన్ ప్రకటన ప్రకారం చూస్తే ప్రియాంకా వాద్రా ప్రత్యక్ష రాజకీయాలలోకి రాకపోవచ్చునని స్పష్టం అవుతోంది. రాహుల్, సోనియా గాంధీలిరువురూ కలిసి ఎంత ప్రచారం చేసినా ఇటీవల నాలుగు రాష్ట్రాలలో ఓటమి తప్పలేదు. అందువల్ల కీలకమయిన 2014 ఎన్నికలలో ప్రియాంకా వాద్రాను ముందుకు తీసుకు రావచ్చని అందరూ భావించారు. కానీ, ఎందువలననో ఆమె రాజకీయాలలోకి వచ్చేందుకు ఆసక్తి కనబరచడం లేదు. బహుశః ఎన్నికలనాటికి ఆమె మనసు మార్చుకొంటారేమో!

టీ-బిల్లుకి బేషరతు మద్దతు ఇస్తాము: బీజేపీ

  రెండు రోజుల క్రితం బీజేపీ అధికార ప్రతినిధి నిర్మల సీతారామన్ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ తెలంగాణా బిల్లుకు బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని, అందువల్ల కాంగ్రెస్ పార్టీ వెంటనే పార్లమెంటులో తెలంగాణా బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేసారు. నిజానికి బిల్లుకి మద్దతు ఈయడం వలన కాంగ్రెస్ లాభపడుతుంది తప్ప బీజేపీ కాదు. తామే తెలంగాణా రాష్ట్రం ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకొని తెలంగాణాలో ఓట్లు దండుకోవచ్చును. కానీ, బిల్లుకి మద్దతు ఇచ్చినందుకు బీజేపీకి ఎటువంటి ప్రయోజనమూ కలుగకపోగా, సీమాంధ్రలో ఉన్న కొద్దిపాటి ఓట్లు కూడా పోవడం ఖాయం. మరి ఈ సంగతి తెలిసి కూడా బీజేపీ బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తానని ప్రకటన చేయడం అనుమానంగానే ఉంది.   ఒకవేళ బీజేపీ బిల్లుకి మద్దతు ఈయకపోయినట్లయితే, కాంగ్రెస్ ఆ పార్టీని తెలంగాణాలో దోషిగా నిలబెట్టడం ఖాయం. అయితే దానిని ఎదుర్కొనేందుకు బీజేపీ వద్ద కూడా ఆయుధాలు ఉన్నాయి. మరయితే బీజేపీ ఎందుకు బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్దం అవుతోంది అని ఆలోచిస్తే, రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ బిల్లుకి తను మద్దతు ఈయకపోతే, కాంగ్రెస్ పార్టీ తన పాత మిత్రులు డీయంకే, లాలూకి చెందిన ఆర్జేడీ, యస్పీ, బీయస్పీ, కొత్త మిత్రుడు నితీష్ కుమార్ (జేడీ-యూ) తదితరుల మద్దతు కూడగట్టి బిల్లును ఆమోదింపజేయగలదని భావించి ఉండవచ్చును. లేదా కాంగ్రెస్ పార్టీ చేత పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింపజేసి, వోటింగ్ సమయంలో హ్యాండ్ ఇచ్చితప్పుకోవాలనే ఆలోచన అయిఉండవచ్చును. ఏమయినప్పటికీ, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన తరువాత కానీ రెండు పార్టీలు అసలు రంగు బయటపడదు. అంతవరకు ఈ దోబూచులాట సాగుతూనే ఉంటుంది.

త్యాగమూర్తి శ్రీధర బాబు మంత్రిపదవికి ససేమిరా

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభ సమావేశాలు మొదలయ్యే ముందురోజు మంత్రి శ్రీధర్ బాబు నుండి శాసనసభా వ్యవహారాల శాఖను వెనక్కి తీసుకోవడంతో ఒక్కసారిగా ఆ ఇరువురూ కూడా వార్తలకెక్కారు. ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా పేరొందిన శ్రీధర్ బాబుకి తెలంగాణాలో తగిన ప్రచారం కల్పించేందుకే ఆయన ఆవిధంగా చేసారనే వార్తలను శ్రీధర్ బాబు గట్టిగా ఖండించారు. ఆయన తనపై వచ్చిన ‘కిరణ్ కుమార్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను’ గట్టిగా ఖండించినప్పటికీ, ఆయన మాటలు, కార్యక్రమాలు అన్నీకూడా ఆ ఆరోపణలను దృవీకరిస్తున్నట్లే ఉన్నాయి.   ముఖ్యమంత్రి రేసులో ఉన్న శ్రీధర్ బాబు, ఒక సీమాంధ్ర ముఖ్యమంత్రి చేతిలో తను ఏవిధంగా అన్యాయంగా బలయిపోయినది ప్రజలకి చెప్పుకొంటూ, తన రాజీనామా అంశాన్నిపదేపదే నొక్కి చెపుతూ తన నియోజక వర్గ ప్రజల సానుభూతిని, మెప్పు పొందే ప్రయత్నిస్తున్నారు. మొన్న ఆయన కరీంనగర్ వెళ్ళినప్పుడు, ఆయన అనుచరులు ఆయనకు చాలా భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఆ సందర్భంగా ఆయన అనుచరులు ఏర్పాటు చేసిన ఒక సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తానిక కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసే ప్రసక్తే లేదని, దమ్ముంటే తన రాజీనామాను ఆమోదించమని కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన సవాలు విసిరారు.   ఆయన తను మంత్రి పదవికి రాజీనామా చేయడమనేది తెలంగాణా కోసం చేసిన గొప్ప త్యాగంగా మాట్లాడటం కాంగ్రెస్ మార్క్ రాజకీయమే. అయితే ఇది ఆయనకు వచ్చే ఎన్నికలలో ఓట్లు రాల్చగలదేమో కానీ తెలంగాణాకు ముఖ్యమంత్రిని చేయలేదు. ఎందుకంటే టీ-కాంగ్రెస్ లో ఆయన కంటే చాలా మంది సీనియర్లు ఆ కుర్చీకోసం క్యూలో ఉన్నారు. అలాగని శ్రీధర్ బాబు తన ప్రయత్నాలు మానుకోనవసరం లేదు. ఎవరి ప్రయత్నాలు వారివి.   కాంగ్రెస్ యంపీలు, కేంద్రమంత్రులు రాజీనామాలు చేసి, సోనియాగాంధీని విమర్శిస్తూ ఏవిధంగా తమ పదవులలో కొనసాగుతున్నారో, శ్రీధర్ బాబు కూడా అదేవిధంగా ఎన్నికల వరకు కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తూ మంత్రిగా సకల రాజలాంచనాలు అనుభవిస్తూ ఈ మూడు నెలలూ లాగించేయవచ్చును.

ప్రయాణికులకు నరకం చూపిస్తున్నరవాణాశాఖ

  అమ్మ అన్నం పెట్టదు అడుక్కొని తిననివ్వదనట్లుంది మన ఆర్టీసీ, రవాణాశాఖవారి నిర్వాకం. పండుగ సందర్భంగా రద్దీ తట్టుకొనే శక్తి ఆర్టీసీకి లేదని తెలిసినప్పటికీ, రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ బస్సులను రోడ్ల మీద తిరగనీయకుండా అడ్డుపడుతూ పండుగకు స్వంత ఊర్లకు బయలుదేరుతున్నప్రజలకు నరకం చూపిస్తున్నారు. రెండు నెలల క్రితం పాలెం బస్సు దుర్ఘటన జరిగిన తరువాత నుండి రవాణాశాఖ వారు ప్రైవేట్ బస్సులపై కొరడా జుళిపిస్తున్నారు బాగానే ఉంది. కానీ, ఇంతవరకు అందుకు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం చేయలేదు. ఉద్యమాల వలన తీవ్ర నష్టాలలో కూరుకుపోయిన ఆర్టీసీ, ఇంత తక్కువ వ్యవధిలో అదనపు బస్సులను ఏర్పాటుచేసి ఈ లోటును భర్తీ చేయలేదని తెలిసికూడా రవాణాశాఖ ప్రైవేట్ బస్సులను రోడ్ల మీదకు రానీయకుండా కట్టడి చేస్తుండటంతో, దూరప్రాంతాల నుండి స్వంత ఊర్లకు బయలుదేరుతున్న ప్రజలు రైళ్ళు, బస్సులు లేక నానా కష్టాలు పడుతున్నారు.   కానీ ఇదేమీ పట్టనట్లు రవాణాశాఖ అధికారులు ఎక్కడికక్కడ ప్రైవేట్ బస్సులను పట్టుకొని నిలిపివేస్తూ గుడ్డెద్దు చేలో పడినట్లు వ్యవహరిస్తున్నారు. నిన్న ఒక్కరోజే విశాఖ, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 65 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రవాణాశాఖ అధికారులు పట్టుకొని నిలిపివేసినట్లు సమాచారం.   పాలెం బస్సు ప్రమాదం జరగక ముందు అవే ప్రైవేట్ బస్సులు నిబందనలు పాటించకుండా తిరుగుతున్నపుడు మరి రవాణాశాఖ వాటిపై ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదో ప్రజలకు సంజాయిషీ ఈయవలసి ఉంది. ప్రతీ ఉల్లంఘనకీ ఎంతో కొంత జరిమానా వేసి ఖజానా నింపుకొంటూ, పనిలోపనిగా తమ జేబులు కూడా నింపుకొనేందుకు అలవాటు పడిన నేతలు, అధికారుల వలననే, ప్రైవేట్ బస్సు యాజమాన్యాలలో కూడా నిర్లక్ష్యం పెరిగి, ఇటువంటి ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. అందువల్ల ఈ ప్రమాదాలకు కేవలం ప్రైవేట్ బస్సు యాజమాన్యాలే కాదు రవాణాశాఖ, ప్రభుత్వం కూడా సమాన బాధ్యత వహించవలసి ఉంటుంది.   ఇంతకాలం నిబంధనలు గుర్తుకు రాని రవాణాశాఖ అధికారులకు పాలెం బస్సుప్రమాదంలో 45మంది ప్రయాణికులు మరణించిన తరువాతయినా అవి గుర్తుకు రావడం, వెంటనే రోడ్డునపడి ఎక్కడికక్కడ ప్రైవేట్ బస్సులను పట్టుకొని కేసులు వ్రాసేసి నిలిపివేయడం ఎవరూ తప్పు పట్టలేరు. నిబంధనలు అతిక్రమిస్తే తప్పకుండా శిక్షించవలసిందే. కానీ, అవే నిబందనలు ఆర్టీసీకి కూడా వర్తింపజేస్తే, నేడు రాష్ట్రంలో ఒక్క ఆర్టీసీ బస్సు కూడా తిరిగే అవకాశం ఉండదని వారికి తెలియదా? తీవ్ర నష్టాలలో కూరుకుపోయిన ఆర్టీసీ కాలం చెల్లిన బస్సులను నడుపుతుంటే పట్టించుకోని రవాణాశాఖ అధికారులు, ప్రైవేట్ బస్సులను మాత్రం పట్టుకోవడం ఏమిటి? అంటే, ఆర్టీసీ బస్సులు అటువంటి ప్రమాదాలకు అతీతమయినవనా లేక ఆర్టీసీకి అటువంటి నిబందనలు వర్తించవని వారి అభిప్రాయమా?   ఏమయినప్పటికీ, సంక్రాంతి పండుగ సందర్భంగా ఎంత రద్దీ ఉంటుందో రవాణాశాఖ, ఆర్టీసీ అధికారులకు తెలియకపోలేదు. అయినా ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రైవేట్ బస్సులను కూడా పట్టుకొని నిలిపివేస్తూ ప్రయాణికులకు పండుగ ముందు నరకం చూపిస్తున్నారు. తాము చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నామని వారు భావించవచ్చును. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఈవిధంగా చేయడం బాధ్యతారాహిత్యమే.

టీ-బిల్లుపై ఓటింగ్ ఉంటుందిట!

  రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ ఉండదని తెలంగాణావాదులు, ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తో సహా సమైక్యవాదులు ఇంతకాలంగా వాదిస్తున్నారు. అయితే ప్రజలకు ఎవరి మాట నమ్మాలో తెలియని పరిస్థితి. ఈ సందిగ్ధాన్ని తొలగిస్తూ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బిల్లుపై చర్చ పూర్తయిన తరువాత ఓటింగ్ ఉంటుందని మొన్నప్రకటించారు. కానీ, అసలు చర్చే జరగకుండా ఓటింగ్ కోసం వైకాపా పట్టుబట్టడం సరికాదని ఆయన అన్నారు. ఇంతకాలం షిండే, దిగ్విజయ్ సింగ్ తదితరులు బిల్లుపై శాసనసభ్యుల అభిప్రాయాలు సేకరించడానికే తప్ప వారు బిల్లుని ఆమోదించడానికో లేక తిరస్కరించడానికో శాసనసభకు పంపలేదని చెపుతూ వచ్చారు.   ఇప్పుడు స్పీకర్ బిల్లుపై ఓటింగ్ జరిపినట్లయితే, మెజార్టీ సభ్యులు సీమాంధ్ర ప్రాంతానికే చెందివారు ఉన్నందున శాసనసభలో బిల్లు తిరస్కరింపబడే అవకాశాలే ఎక్కువ. రాజ్యాంగ బద్దంగా వ్యవహరించేందుకు మొగ్గు చూపే రాష్ట్రపతి శాసనసభ చేత తిరస్కరింపబడిన బిల్లుని తనవద్దే త్రొక్కిపెట్టి ఉంచదమో లేకపోతే కేంద్రాన్ని దానిపై సవరణలు, వివరణలు కోరడమో చేస్తే, బిల్లు బడ్జెట్ సమావేశాలలో కూడా ప్రవేశపెట్టడం అనుమానమే అవుతుంది. అందువల్ల ఒకవేళ స్పీకర్ బిల్లుపై ఓటింగ్ చెప్పట్టదలిస్తే, అది జరగకుండా తెలంగాణా సభ్యులు సభను స్తంభింపజేసి, జనవరి23న యధాతధంగా రాష్ట్రపతికి త్రిప్పి పంపే ప్రయత్నం చేయవచ్చును.   కాంగ్రెస్ పార్టీ, తెలంగాణా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కాక, ఎన్నికలలో తన రాజకీయ లబ్ది కోసమే రాష్ట్ర విభజనకు పూనుకొన్నందునే, అందరి ఆమోదంతో ఒక సామరస్య వాతావరణంలో శాస్త్రీయంగా జరుగవలసిన రాష్ట్ర విభజన ప్రక్రియ, ఈవిధంగా అడుగడుగునా ప్రశ్నార్ధకంగా సాగుతోంది. అయినప్పటికీ దీనివలన కాంగ్రెస్ పార్టీ లబ్ది పొందగాలదా అంటే అనుమానమే.

జైపాల్ రెడ్డి ఆరాటం దేనికో?

  టీ-కాంగ్రెస్ నేతలందరూ ఏదో ఓ సమయంలో తెలంగాణా ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారే. కానీ, తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్న సమయంలో కూడా తన పదవిని వదులుకోని జైపాల్ రెడ్డి, కనీసం ఏనాడు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు గురించి బహిరంగంగా మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. అటువంటి వ్యక్తి ఇప్పుడు హటాత్తుగా డిల్లీ నుండి హైదరాబాదులో వాలిపోయి తెలంగాణా సాధన తన గొప్పదనమేనని, తెలంగాణాకోసం తాను తెర వెనుక ఎంతగా కృషి చేసినదీ, రాష్ట్రం ఏర్పడిన తరువాత చెపుతానని శలవిస్తున్నారు. పనిలోపనిగా సీమాంధ్ర నేతలందరూ శుంటలని, ప్రజలు అమాయకులని ఆయన సర్టిఫికెట్స్ కూడా జారీ చేస్తున్నారు.   హైదరాబాదు అభివృద్ధి వెనుక రాష్ట్ర ప్రజలందరి సమిష్టి కృషి ఉందనే సంగతి అంగీకరించడానికి ఇష్టపడని జైపాల్ రెడ్డి, తను మెట్రో రైలు, సిటీ బస్సులను తెచ్చానని గొప్పలు చెప్పుకొంటున్నారు. నగరం అభివృద్దే జరగకపోయి ఉండి ఉంటే, మెట్రో రైలు, ఏసీ బస్సులు అవసరం ఉండేవికావనే సంగతి ఆయనకు తెలియదనుకోవాలా? హైటెక్ సిటీని నిర్మించి హైదరాబాదును దేశంలో ప్రధాన ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దిన చంద్రబాబు కూడా ఆయన నోటి ముందు బలాదూరే! జైపాల్ రెడ్డి ఇన్నేళ్ళు కేంద్రమంత్రిగా రాష్ట్రానికి, కనీసం తన తెలంగాణా ప్రాంతానికి చేసిందేమీ లేకపోయినా, తెలంగాణా ఏర్పాటవుతున్న సమయంలో నేడు అకస్మాత్తుగా ఊడిపడి, మిగిలిన టీ-కాంగ్రెస్ నేతలతో బాటు సీమాంధ్ర నేతలను దుమ్మెత్తి పోస్తూ ముఖ్యమంత్రి రేసులో అందరి కంటే ముందు నిలవాలని తహతహలాడుతున్నారు.   బహుశః వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని గ్రహించడం వలననే ఆయన అకస్మాత్తుగా తెలంగాణా వైపు దూసుకు వస్తున్నారేమో. అధికారంలోలేని కేంద్రాన్ని పట్టుకొని వ్రేలాడటం కంటే, తెలంగాణా రాష్ట్ర ఏర్పడి అక్కడ కాంగ్రెస్ పార్టీ, తెరాసతో కలిసి సంకీర్ణ ప్రభుత్వమయినా ఏర్పాటు చేయగలిగితే, దానికి తాను ముఖ్యమంత్రి కావచ్చునని ఆయన కలలు కంటున్నారేమో! అందుకే ఆయన సీమాంధ్ర నేతలను, ప్రజలను కించపరిచేలా మాట్లాడుతూ తనను తాను తెలంగాణా హీరోగా ప్రమోట్ చేసుకొనేందుకు చాలా శ్రమ తీసుకొంటునట్లున్నారు. కానీ, తెరాస కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తులు లేదా విలీనం కానంత కాలం ఆయన ముఖ్యమంత్రి కావడం కలగానే మిగిలిపోవడం ఖాయం.

దావూద్ మా దేశంలో లేడు: పాకిస్తాన్‌

      మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని భారత హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది. దావూద్ ఇబ్రహీం తమదేశంలో లేడని గతంలోనే స్పష్టం చేశామని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల కార్యాలయం అధికార ప్రతినిధి తస్నీమ్ అస్లామ్ అన్నారు. ప్రస్తుతం కూడా దావూద్ తమ దేశంలో లేడని తస్నీమ్ అస్లామ్ పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. అయితే షిండే మాత్రం తమకున్న సమాచారం మేరకు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని తెలిసిందని... అమెరికాతో కలిసి సంయుక్త ప్రయత్నంతో దావూద్‌ను పట్టుకుంటామని ఆయన చెప్పారు.

వి.హెచ్ రాక్షసుడు..!

      కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుపై మంత్రి టీజీ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆనాటి హనుమంతుడు గొప్ప రామ భక్తుడైతే, ఈ నాటి కలియుగ హనుమంతుడు వీహెచ్ కుప్పిగంతులు వేస్తున్నారని” ఆ హనుమంతుడు దైవాంశసంభూతుడైతే, ఈ హనుమంతుడు రాక్షస జాతికి చెందిన వాడని” ఘాటుగా విమర్శించారు. నోటికొచ్చినట్టు మాట్లాడటం తప్పితే, ఆయన చేసేదేమీ లేదని విమర్శించారు. కిరణ్, చంద్రబాబు, జగన్ లు ఐక్యంగా పోరాడితే రాష్ట్రాన్ని ఎవరూ విడగొట్టలేరని ఆయన అభిప్రాయ పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని, అలాంటి ఆయన గురించి మాట్లాడే అర్హత కుప్పిగంతులు వేసే హన్మంతరావుకు లేదని, విభజన వల్ల రాయలసీమ, కోస్తా జిల్లాలకు అన్యాయం జరిగిందని, తమకు ఉరి శిక్ష వేసి శాసనసభలో చర్చ పెట్టమనడం, అందులో పాల్గొనమనడం అన్యాయమని టీజీ అభిప్రాయపడ్డారు.

బోగి మంటల్లో తెలంగాణ బిల్లు..!!

      సంక్రాంతి సంధర్బంగా నిర్వహించనున్న బోగి మంటల్లో విభజన బిల్లును దహనం చేయాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నిర్ణయించింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17, 18 తేదీల్లో 48 గంటలపాటు రాష్ట్ర బంద్ నిర్వహించాలని ఏపీఎన్జీవోల జేఏసీ, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నిర్ణయించాయి. ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చే క్రమంలో ఈ నెల 20న శాసనసభను ముట్టడించాలని నిర్ణయించారు. విభజన బిల్లును శాసనసభలో ఓడిస్తేనె పార్లమెంటులో అడ్డుకోనెందుకు వీలుటు౦దని తెలిపారు. ఈ వివరాలను సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్, ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు వెల్లడించారు. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డిపై శాసనసభలో జరిగిన దాడి ఘటనను ఆయన ఖండించారు.

నిమ్మకూరులో బాలకృష్ణ ప్రత్యేక పూజలు

      వైకుంఠ ఏకాదశి సందర్భంగా నందమూరి బాలకృష్ణ నిమ్మకూరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్నరాత్రి నిమ్మకూరుకు చేరుకున్న బాలయ్య బంధువుల ఇంట్లో బస చేశారు. ఈ రోజు ఉదయం కాలినడకనే గ్రామంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత నిమ్మకూరులో ఉన్న ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిమ్మకూరులో ఏర్పాటు చేసి మంచినీటి ప్లాంట్‌ను బాలయ్య ప్రారంభించారు. తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో ముచ్చటించారు.చాలా రోజుల తర్వాత బాలకృష్ణ తన తండ్రి ఎన్టీరామారావు పుట్టిన నిమ్మకూరుకు చేరుకున్నారు. దీంతో ఆయన్ను చూసేందుకు భారీగా అభిమానులు పరిసర ప్రాంతాల నుండి తరలి వచ్చారు. భవిష్యత్‌లో అభిమానుల ఆధ్వర్యంలో ఎన్‌బికె సేవా సంస్థను ప్రారంభించనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. ఈ సంస్థకు చైర్మన్‌గా నేనే ఉంటానని చెప్పిన ఆయన....ఈ సంస్థ ద్వారా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.   

శాసనసభ 17వ తేదీకి వాయిదా

      శాసనసభ సమావేశాలు ఈనెల 17వ తేదీకి వాయిదా పడ్డాయి. విభజన బిల్లుపై సభలో సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్ ప్రసంగం అనంతరం స్పీకర్ నాదెండ్ల మనోహర్ శాసనసభను వాయిదా వేశారు.శుక్రవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. సభలో జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్‌నాదెండ్ల మనోహర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు.   వాయిదా అనంతరం తిరిగి ప్రారంభంకాగానే తెలంగాణ బిల్లుపై ఓటింగ్‌కు ప్రభుత్వం నుంచి ఎటువంటి హమీ రాలేదని నిరసిస్తూ సభ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. దీనిపై ఆ పార్టీ శాసనసభపక్ష నేత వైఎస్ విజయలక్ష్మి మాట్లాడుతూ మెజార్టీ సభ్యులు విభజనను వ్యతిరేకిస్తున్నారని, అన్ని క్లాజులను వ్యతిరేకిస్తూ సవరణలు పంపామన్నారు. ప్రధాన అంశాలపై బిల్లులో సమాచారం లేదని విజయమ్మ తెలిపారు. విజయమ్మ వ్యాఖ్యలపై స్పీకర్ మనోహర్ వివరణ ఇచ్చారు. టి.బిల్లుపై చర్చ తర్వాత ఓటింగ్ ఉంటుందన్నారు. చర్చ జరగకముందే ఓటింగ్ కోరడం సరికాదని తెలిపారు.

పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు..!

      తెలంగాణ బిల్లు రాష్ట్రపతి నుంచి రాగానే పార్లమెంట్ లో పెడతామని కేంద్ర హోంశాఖ మంత్రి షిండే అన్నారు. ఈ నెల 23 వరకు శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లు చర్చకు రాష్ట్రపతి గడువు విధించారని, ఆ తరువాత అది రాష్ట్రపతికి రాగానే మాకు పంపితే వెంటనే పార్లమెంటులో పెడతామని ఆయన వెల్లడించారు. ఒకవేళ పదిహేను రోజులు ఆలస్యమైతే పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోతాయి. పిబ్రవరి ప్రథమార్థం నుంచి పదిహేను రోజులు పాటు పార్లమెంట్ సమావేశాలుంటాయని ఇప్పటికే కమలనాథ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.. తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని ..శాసనసభలో చర్చకు మరింత గడువు కోరాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దానికి రాష్ట్రపతి ఒప్పుకుంటారా ? లేదా ? అన్నది ఆయన మీదనే ఆధారపడి ఉంటుంది.

నరేంద్ర మోడీకే నా ఓటు: కిరణ్ బేడీ

      ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆయన మాజీ మద్దతుదారు కిరణ్ బేడీ షాకిచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో సుస్థిర , సుపరిపాలన కావాలంటే మోడీకే తాను ఓటు వేస్తానని తేల్చిచెప్పారు. తనకు ప్రథమ ప్రాధాన్యం భారత్ అని, మంచి పాలన, మంచి యంత్రాంగం, నిజాయితీ, భాగస్వామ్య విధానం కారణంగా ఓ స్వతంత్ర ఓటరుగా తాను నరేంద్ర మోడీకి ఓటేస్తానని ఆమె ట్విట్టర్‌లో రాశారు. అన్నా శిష్యుడు అరవింద్ కేజ్రివాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో అన్నాకు సన్నిహితంగా ఆయనతో కలిసి ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న కిరణ్ బేడీ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాల్లో విలువలను మార్చిందని, ఇది దేశానికంతటికీ మంచిదని కిరణ్ బేడీ అన్నారు.