రాహుల్ పట్టాభిషేకానికి తరలి వెళ్లనున్నఅసమ్మత నేతలు
posted on Jan 15, 2014 6:58AM
కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన అంశాన్ని భుజానికెత్తుకొన్నపటి నుండి ఆ పార్టీలో ఎవరినీ కూడా ప్రజలు నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ‘సమైక్యం తమ నినాదం కాదని, అది తమ విధానమని’ నమ్మబలుకుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొదలు, రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తూ రాజీనామాలు, స్వంత ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం, ఇందిరాపార్కువద్ద నిరాహార దీక్షల డ్రామాలు చేసిన కాంగ్రెస్ యంపీలవరకు ఎవరినీ కూడా ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరు. వారందరూ కలిసి త్వరలో మరో కొత్త పార్టీ పెట్టుకొని సరికొత్త వేషాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ముందుకు రాబోతున్నారు. ఇంత జరిగినా కూడా కాంగ్రెస్ అధిష్టానం అదేమీ తెలియనట్లు వారందరినీ ఈనెల 17న డిల్లీల్లో జరగనున్నఎఐసిసి సమావేశానికి రమ్మని ఆహ్వానాలు పంపడం, అందుకు వారందరూ బయలుదేరుతుండటం గమనిస్తే, కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కలిసి సీమాంధ్ర ప్రజలను ఎంతగా మభ్యపెడుతున్నారో అర్ధమవుతుంది. నిజానికి అధిష్టానాన్నిఇంతగా ధిక్కరించిన వారెవరూ ఇంతవరకు పార్టీలో కొనసాగిన దాఖలాలు లేవు. కానీ ఇంతజరిగిన తరువాత కూడా పార్టీలో ఎవరిపైనా కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. సరికదా ఇప్పుడు వారందరినీ పార్టీ అత్యంత కీలకమయిన సమావేశానికి ఆహ్వానిస్తోంది. వారు తరలివెళ్ళబోతున్నారు. అందుకు ఎవరి సాకులు వారికి ఉన్నాయి. బహుశః తెలుగు ప్రజలను ప్రాంతాలు, కులాలు, మతాలు, వర్గాలవారిగా విడదీసి వారిని లొంగదీసుకోవచ్చుననే ధీమాతోనే వారిని చాలా తక్కువగా అంచనా వేసి కాంగ్రెస్ ఇంత దైర్యం చేయగలుగుతోందేమో.