ఆ ఆరుగురు ఏఐసీసీ సమావేశానికి
posted on Jan 17, 2014 9:17AM
అధిష్టానంపై తిరుగుబాటు చేసిన ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలకు నేడు డిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశానికి ఆహ్వానించకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం వారితో సంప్రదింపులు జరుపుతోంది. సమావేశంలో సమైక్యాంధ్ర అంశాన్ని లేవనేత్తకుండా ఉండే షరతుపై వారిని ఆహ్వానించాలని భావిస్తున్నట్లు తాజా సమాచారం. అందుకు వారు అంగీకరించినట్లయితే వారందరూ హుటాహుటిన రెక్కలు కట్టుకొని యువరాజవారి పట్టాభిషేక మహోత్సవ సభలో వాలిపోతారు. రాష్ట్ర విభజన చేస్తున్నందుకు తమ అధిష్టానంపై గుర్రుగా ఉన్న సీమాంధ్ర యంపీలు, రాహుల్ గాంధీని పార్టీ ఎన్నికల రధ సారధిగా ప్రకటించే ఏఐసీసీ సమావేశానికి తమను ఆహ్వానించలేదని చిందులు వేయడం ఒక వింత అయితే, పార్టీపై తిరుగుబాటు చేస్తున్నవారిని కాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ ఆహ్వానించాలనుకోవడం మరో వింత. కానీ, వారందరూ కూడా కాంగ్రెస్ అధిష్టానానికి విధేయులేనని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. లేకుంటే ఒకరినొకరు వ్యతిరేఖించుకొంటూ ఈవిధంగా పార్టీ సమావేశాలకు హాజరయ్యి భుజాలు రాసుకొని ఉండేవారు కాదు.