పవన్ కళ్యాణ్ కి ఎన్డీయే ప్రత్యేక ఆహ్వానం
posted on May 20, 2014 @ 11:39AM
తెదేపా-బీజేపీలకు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసి, ఎన్డీయే కూటమి విజయానికి కృషిచేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ న్ని నరేంద్ర మోడీ మరిచిపోకుండా గుర్తుంచుకొని, ఈరోజు డిల్లీలో జరుగబోయే ఎన్డీయే కీలక సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అందువల్ల పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో కలిసి ఈరోజు డిల్లీ వెళ్ళారు. ఈరోజు జరుగబోయే సమావేశంలో బీజేపీ మరియు ఎన్డీయే భాగస్వామ పార్టీలలో ఎవరెవరికి ఏ మంత్రి పదవి ఈయలనే విషయం చర్చ జరుగుతుంది. అటువంటి అతి ముఖ్యమంయిన సమావేశానికి పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడంతో ఆయనకు కూడా ఏదయినా కేంద్రమంత్రి పదవి ఇవ్వవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం తనకు పదవులపై ఎటువంటి ఆశలేదని, కేవలం స్నేహ ధర్మాన్ని పాటిస్తూ బీజేపీ ఆహ్వానాన్ని మన్నించి ఆ సమావేశానికి హాజరవుతున్నట్లు తెలిపారు. ఏమయినప్పటికీ, ఈ ఆహ్వానంతో మోడీ దృష్టిలో పవన్ కళ్యాణ్ కి ఎంత విలువ, గౌరవం ఉన్నాయో స్పష్టమయింది. మరే నేతకి దక్కని అరుదయిన గౌరవం పవన్ కళ్యాణ్ దక్కడం ఆయన అభిమానులకు కూడా చాలా ఆనందం కలిగిస్తోంది. నరేంద్ర మోడీ మార్గదర్శకంలో పవన్ కళ్యాణ్ మున్ముందు రాష్ట్ర రాజకీయాలలో మరింత చురుకయిన పాత్ర పోషిస్తారేమో!