కంటతడి పెట్టిన నరేంద్రమోడీ
posted on May 20, 2014 @ 12:58PM
భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నరేంద్రమోడీ ఆ తర్వాత ఉద్వేగభరితమైన సుదీర్ఘ ప్రసంగం చేశారు. చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన నరేంద్రమోడీ ప్రసంగం సభలో పాల్గొన్నవారందరిలో స్ఫూర్తి నింపేలా మాట్లాడారు. తన ప్రసంగం మధ్యలో నరేంద్రమోడీ హఠాత్తుగా మాట్లాటడం మానేసి మౌనంగా వుండిపోయారు. తల వంచుకుని కొన్ని క్షణాలు అలాగే వుండిపోయారు. సహాయకుడి అందించిన మంచినీటిని తాగిన మోడీ మళ్ళీ మాట్లాడ్డం ప్రారంభించారు. అమ్మ అనే టాపిక్ మాట్లాడుతుండగా మోడీ ఇలా మౌనంగా అయిపోయారు. మంచినీరు తాగిన తర్వాత మాట్లాడ్డం ప్రారంభించిన మోడీ ‘‘నా కన్నతల్లి మాత్రమే కాదు.. భారత మాత కూడా నా తల్లే.. భారతీయ జనతాపార్టీ కూడా నా తల్లే’’ అంటూ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. మళ్ళీ కొద్ది సేపటికే మామూలైపోయారు. నరేంద్రమోడీ కన్నీరు పెట్టుకోవడం, భావోద్వేగానికి గురి కావడం చూసి ఈ సమావేశంలో పాల్గొన్న అనేకమంది బీజేపీ ఎంపీలు కూడా భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు.