ఐబీ ఆందోళనపై ఆగ్రహం!
posted on Nov 21, 2013 @ 3:38PM
తెలంగాణ వచ్చేస్తే తమ జీవితాలలో ఏదో మార్పు వచ్చేస్తుందని తెలంగాణ ప్రజలు అనుకోవడం లేదు. రాష్ట్ర విభజన వల్ల తమకు నష్టం వాటిల్లే ప్రమాదం వుందనే భయపడుతున్నారు. అయితే ఈ భయం మాత్రం తెలంగాణ రాష్ట్రం వచ్చేయాలని తెగ ఉబలాటపడిపోతున్న విభజనవాదుల్లో మాత్రం కనిపించడం లేదు. ఎప్పుడు తెలంగాణ వస్తుందా ఎప్పుడు పదవులు పంచుకుందామా.. ఎప్పుడు సీమాంధ్రులను హింసిద్దామా అనే ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం హర్షించదగ్గ పరిణామం కాదని దేశవ్యాప్తంగా మేధావులు అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎన్నో ఇతర సమస్యలకు కారణం అయ్యే ప్రమాదం వుందని ఆందోళన పడుతున్నారు. అటు తెలంగాణతో గానీ, ఇటు సీమాంధ్రతో గానీ సంబంధంలేని వ్యక్తులు, ఆలోచనపరులు, కీలక బాధ్యతల్లో వున్నవారు కూడా ఈ మాటే చెబుతున్నారు. ఇప్పడీ విషయాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఇబ్రహీం కూడా చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడితే వచ్చే సమస్యలు అందరికంటే క్షుణ్ణంగా తెలుసుకోగలిగింది ఇంటెలిజెన్స్ బ్యూరో మాత్రమే. అలాంటి అధికారిక సంస్థ చీఫ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆందోళనకర పరిణామాలు ఏర్పడతాయని అంటున్నారు.
దేశ భద్రత అనే అంశం మీద ఇంటెలిజెన్స్ బ్యూరో న్యూఢిల్లీలో ఒక కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో డీజీపీ, ఐజీపీ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఐబీ చీఫ్ ఇబ్రహీం మాట్లాడుతూ, ‘తెలంగాణ ఏర్పాటు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కదానికే సంబంధించిన అంశం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలకు కొత్త సవాళ్ళు ఎదురయ్యే అవకాశం వుంది’ అన్నారు. దేశ ఇంటెలిజన్స్ వ్యవస్థకు అధిపతిగా వున్న అధికారి నోటి నుంచి వెలువడిన ఈ మాటలను అంత ఆషామాషీగా తీసుకోవడానికి వీల్లేదు. అయితే ఐబీ చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలను చేయడాన్ని తెలంగాణ వాదులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
ఇబ్రహీం చేసిన వ్యాఖ్యలను కూడా సీమాంధ్రుల కుట్రలో భాగంగా అభివర్ణించే ప్రయత్నాలు ప్రారంభించేశారు. ఇబ్రహీం తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా చేయాలన్న ఒత్తిడిని కేంద్ర ప్రభుత్వం మీద తెస్తున్నారు. వీళ్ళ ప్రయత్నాలు ఫలిస్తే ఐబీ చీఫ్ ‘నా ఉద్దేశం అది కాదు.. మీడియా వక్రీకరించింది’ లాంటి స్టేట్‌మెంట్‌తో మీడియా ముందుకు వచ్చే అవకాశం వుంది.