గవర్నర్ నోట ఆరడుగుల బులెట్
posted on Nov 21, 2013 @ 7:50PM
హైదరాబాద్ లో మొన్న జరిగిన 18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవ ముగింపు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సభకు హాజరయిన గవర్నర్ నరసింహన్ పవన్ కళ్యాణ్ న్ని ఉద్దేశ్యించి మంచి ఆసక్తికరమయిన సలహా ఇచ్చారు. ఆయన పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘అత్తారింటికి దారేది’ సినిమాలో బాగా పాపులర్ అయిన పాటలో ‘ఆరడగుల బులెట్...దైర్యం విసిరిన రాకెట్’ అని పవన్ కళ్యాణ్ న్ని సంబోధిస్తూ పలికినప్పుడు సభలో హర్షద్వానాలు మిన్నంటాయి. చివరికి పవన్ కళ్యాణ్ కూడా ఆయన మాటలకు నవ్వాపుకోలేకపోయాడు.
గవర్నర్ పవన్ కల్యాణ్ న్ని ఉద్దేశించి “మీరు ‘అత్తారింటికి దారేది’ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా నటించారు. గానీ ఇంటికి తిరిగిన వెళ్ళిన తరువాత కూడా అంతే పవర్ చూపించకండి. రియల్ లైఫ్ లో పవర్ విషయంలో చాలా జాగ్రత్త అవసరం” అని అన్నారు.
బహుశః గవర్నర్ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని అయినందున అతని సినిమాలను, అతని రాజకీయ ప్రవేశంపై వస్తున్న మీడియాలో వస్తున్న కధనాలను గమనించిన తరువాతనే రాజకీయాలోకి రావడం అంత మంచిది కాదని ఈవిధంగా సున్నితంగా సూచించి ఉంటారు.
పవన్ కళ్యాణ్ కి రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నందునే తన మెగా అన్నగారి ప్రజారాజ్యం కోసం అంత కష్టపడ్డారు. కానీ, ఆ తరువాత ఆయన తాము ఏ పార్టీకి వ్యతిరేఖంగా పోరాటం చేసారో మళ్ళీ అదే పార్టీలో తన పార్టీని కలిపేసి కేంద్రమంత్రి పదవి పుచ్చుకోవడంతో సహజంగానే అది పవన్ కళ్యాణ్ కి కోపం కలిగించి ఉండవచ్చును. అయితే కుటుంబ విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే అతను ఎన్నడూ కూడా అన్నగారిని విమర్శించలేదు. కానీ తన సినిమాల ద్వారా ఆయనకి అప్పుడప్పుడు చురకలు వేస్తుంటారు.
ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వస్తే బాగుంటుందనే ఆలోచనతో కొందరు చేసిన ప్రయత్నాలను నాగబాబు ఖండించారు. ప్రస్తుతం సినిమాలతో తీరిక లేకుండా ఉన్నతమకు రాజకీయాలలో రావడానికి కానీ, ఏ పార్టీలో చేరే ఆలోచనలు గానీ తమకు లేవని నాగబాబు స్పష్టం చేసారు.
రాజకీయలలో నైతిక విలువలు అదః పాతాళానికి పడిపోయిన ఈ తరుణంలో ప్రజలు అమితంగా అభిమానించే పవన్ కళ్యాణ్ వంటి నిజాయితీపరుడు చొరవ తీసుకొని రాష్ట్రాన్ని కడిగేయాలని ప్రజలు ఆశపడటం సహజమే. కానీ, అది టాగూర్ వంటి సినిమాలలోనే సాధ్యం అవుతుంది తప్ప నిజ జీవితంలో సాధ్యం కాదని స్వయంగా మెగా బ్రదరే రుజువు చేస్తున్నపుడు మచ్చలేని పవన్ కళ్యాణ్ కి కూడా మళ్ళీ ఈ రొంపిలోకి లాగడమెందుకనే ఉద్దేశ్యంతోనే గవర్నర్ ఆవిధంగా సలహా ఇచ్చి ఉంటారనుకోవాలి.
ఇంతకీ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో రావాలా వద్దా? మీరే డిసైడ్ చేయండి మరి.