గుళ్ళు గోపురాలు వద్దంటున్నబీజేపీ
posted on Nov 22, 2013 @ 10:18AM
కాంగ్రెస్ పార్టీ నుండి దాని భజన సంస్కృతిని వేరు చేసి చూడటం అసాధ్యం గనుక టీ-కాంగ్రెస్ నేతలు సోనియమ్మ భజన చేసినా, గుడి కడతామన్నా, తెలంగాణా రాష్ట్రానికి ఆమె పేరు పెట్టాలని డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదు. కానీ అలా చేయనివారినే అనుమానించవలసి ఉంటుంది.
మాజీ మంత్రి శంకరన్నఇంకా సోనియమ్మ గుడికి, నిత్యధూప నైవేద్య హారతులకి మొత్తం ఎన్నిఎకరాలు కావాలో లెక్కలు వేసుకొంటూ ప్రభుత్వ స్థలాల కోసం తిరుగుతుంటే, అతని కంటే వీరభక్తులు కొందరు కరీంనగర్ జిల్లా కేంద్రంలో అప్పుడే అమ్మకి గుడి కట్టేసి నిత్యపూజలు కూడా మొదలెట్టేసారుట!
దేశంలో ఏ గుడి మీద ఈగ వాలినా ఊరుకోని బీజేపీ నేతలు, ఈ సోనియమ్మ గుడిని మాత్రం ఎందుకో హర్షించలేకపొతున్నారు. ఈవిషయం స్వయంగా ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డే చెప్పారు. “టీ-కాంగ్రెస్ నేతలకు ఆమె దేవత అయితే కావచ్చుగాక! కానీ, తెలంగాణా ప్రజలకు కాదు. నిజానికి ఆమె వెయ్యి మందికి పైగా అమాయకుల ప్రాణాలు బలిగొన్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి గుడికట్టి పూజలు చేయడానికి మీకు సిగ్గు లేదూ?” అంటూ వీరంగం వేసేసారు.
కిషన్ రెడ్డి మాటలను నిజమేనని ఒప్పుకోవడానికి కాంగ్రెస్ నేతలకి తప్ప మరెవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చును. కాంగ్రెస్ పార్టీతో ఒకవైపు ఎన్నికలలో కత్తులు దూస్తూనే, పార్లమెంటులో దాని కుంభకోణాలను ఎండగడుతూనే, ఇలా సిగ్గు లేదని తిడుతూనే మళ్ళీ అదే పార్టీ పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే తెలంగాణా బిల్లుకి మద్దతు ఇస్తామని చాటింపు వేసుకోవడం ఎందుకు? వేసుకొన్నాక ఇస్తామని ఖచ్చితంగా మాట మీద ఎందుకు నిలబడలేకపోతునట్లు? తెలంగాణా బిల్లుకి మద్దతు ఈయడం వలన తనకి ఏ మాత్రం రాజకీయ ప్రయోజనం చేకూరదని గ్రహించిన బీజేపీ, ఇప్పడు వెనకడుగువేస్తే తానే స్వయంగా తెలంగాణా అడ్డుకొన్నట్లు కాదా? అప్పుడు తెలంగాణా యువకుల ఆత్మహత్యల పాపంలో బీజేపీ కూడా భాగం పుచ్చుకొంటుందా?
ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా తామే పరిశుద్దులమన్నట్లు, తామే ప్రజల ఆకాంక్షల కోసం కృషిచేస్తున్నట్లు ఎంత స్వంత డప్పు కొట్టుకొంటున్నపటికీ, అన్ని పార్టీల లక్ష్యం రానున్న ఎన్నికలలో గెలవడమేనని ప్రజలకి బాగా తెలుసు. బీజేపీ దానికి అతీతం కాదు.