డీఎస్ ఉబలాటం..!
posted on Nov 22, 2013 @ 1:37PM
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కంటున్న చాలామందిలో డి.శ్రీనివాస్‌కి ఒకరు. వారానికోసారి వార్తల్లో కనిపించి తెలంగాణకి అనుకూలంగా ఏదో ఒకటి మాట్లాడకపోతే ఆయనకి నిద్రపట్టేలా లేదు. తాజాగా ఆయన మాట్లాడిన పాయింట్లను గమనిస్తే, తాను మిగతా కాంగ్రెస్ నాయకులకంటే చాలా ఫార్వర్డ్ అయిపోయినట్టు, అధిష్ఠానానికి చాలా దగ్గరగా వున్నట్టు బిల్డప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆయన మాట్లాడిన పాయింట్లేంటంటే, 10 జిల్లాలతో, హైదరాబాద్‌తో కూడిన హైదరాబాద్ వచ్చేస్తోందట.
సీమాంధ్రులు ఆశ్చర్యపోయి ఆనందంతో గంతులు వేసే స్థాయిలో ప్యాకేజ్ రాబోతోందట! అంచేత సీమాంధ్రులు సమైక్యం అంటూ హడావిడి చేయకుండా వచ్చే అద్భుతమైన ప్యాకేజీ తీసుకుని పండగ చేసుకోవాలట. బిల్లు అసెంబ్లీకి వచ్చిన సమయంలో గప్‌చుప్‌గా బిల్లుకు ఆమోదం తెలిపి పంపేయాలట. అలా కాకుండా బిల్లును అడ్డుకోవడానికి ఏం చేసినా అది అసెంబ్లీ గౌరవాన్ని అప్రతిష్టపాలు చేసినట్టేనట!
ఉమ్మడి రాజధానిగా హెచ్ఎండీఎ పరిధి ఉంటుందని తాను అనుకోవట్లేదట. ఒకవేళ హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా వున్నా సీమాంధ్రులు హైదరాబాద్‌లో ఎక్కువకాలం ఉంటలేరట.. ఎందుకంటే తమ ప్రాంతం కంటే హైదరాబాద్ దూరంగా వుంది కాబట్టి ఇంతదూరం రాలేక అక్కడే రాజధాని ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోతారట. అలాగే రాయల తెలంగాణ డిమాండ్ చేసినవాళ్ళు రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నట్టేనట.. ఇవీ డీఎస్ గారు చెప్పిన విషయాలు!