విభజనుల గొంతులో వెలక్కాయ!
posted on Nov 21, 2013 @ 6:24PM
జాగో, భాగో నినాదాలతో, హైదరాబాద్, భద్రాచలం మాదేననే డిమాండ్లతో హోరెత్తిస్తున్న విభజనుల గొంతులో ఇప్పుడు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల రూపంలో పచ్చి వెలక్కాయ పడింది. శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం కర్నూలు జిల్లా భూముల్లో వున్నదని, నాగార్జునసాగర్ ప్రాజెక్టు గుంటూరు జిల్లా భూముల్లో వున్నదన్న వార్తలు రావడం, ఆ వార్తలకు తగిన ఆధారాలు కూడా వుండటంతో విభజనవాదులు అవాక్కయ్యారు.
అయితే కాసేపట్లోనే తేరుకున్న విభజనవాదులు తమ సహజమైన తెలివితేటల్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు. తమ గొంతులో వున్న వెలక్కాయ మింగుడు పడటం కోసం, ఈ వార్తలు మమ్మల్నేమీ భయపెట్టవని క్రియేట్ చేయడం కోసం స్టేట్‌మెంట్లు రువ్వడం ప్రారంభించారు. ‘ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా సీమాంధ్రులు కుట్రలు చేశారు’ అనే ఒక స్టాక్ డైలాగ్‌ని తక్షణం విడుదల చేశారు. ఆ తర్వాత ‘ప్రాజెక్టులు సీమాంధ్ర భూముల్లో వున్నా మాకేం పర్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా సరిహద్దులు నిర్ణయించి తెలంగాణకి హక్కులు ఇస్తుంది’ అంటూ మరో స్టేట్‌మెంట్ తెలంగాణ అమాయక ప్రజలకు కానుకగా ఇచ్చారు. తద్వారా తెలంగాణ ప్రజల్ని మరింత మోసం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అయితే పదవుల కోసం విభజనవాదాన్ని పెంచి పోషిస్తున్న రాజకీయ నాయకుల తీరు పట్ల చిరాకుగా వున్న తెలంగాణ ప్రజలు ఇప్పుడు రెండు ప్రాజెక్టుల విషయంలో వస్తున్న వార్తలను చూసి భయపడిపోతున్నారు. విభజనుల ప్రయత్నాలు ఫలించి రాష్ట్రం విడిపోతే, రెండు ప్రాజెక్టులూ తమకు అందుబాటులో లేకపోతే పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకుని హడలిపోతున్నారు. అయితే విభజనవాదులు మాత్రం హైదరాబాద్, భద్రాచలంతోపాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ మావేనంటూ ప్రచారం చేసుకుంటూ ఆత్మతృప్తి పడుతూ ఆత్మవంచన బాటలో పయనిస్తున్నారు.