విభజనకు ఎందుకు ఒప్పుకొన్నామంటే

 

మెగాస్టార్ చిరంజీవి కేంద్రమంత్రిగా మారిన తరువాత కెమెరాల ముందు సరిగ్గా నటించలేక చాలా తడబడుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు రాజీనామా చేసిన తరువాత మీడియా కెమెరాలను ఎదుర్కోవడానికి సైతం పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆయాన సహవాసం వల్లనో మరేమో కానీ మిగిలిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు మాత్రం చాలా నిర్భయంగా, అద్భుతంగా కెమెరాల ముందు నటించేస్తున్నారు. దానితో పదవులలో కొనసాగుతున్న వారెవరో, రాజీనామాలు ఇచ్చిన వారెవరో, రాజీనామా లేఖలను రాంగ్ అడ్రస్ కి పంపినవారెవరో ప్రజలకు తెలియనీయకుండా అందరూ చాలా చక్కగా మేనేజ్ చేసేస్తున్నారు.

 

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు గ్లూకోసు డబ్బాలు, బూస్టు సీసాలు చాలా ఖాళీ చేసేసి మరీ పోరాడుతున్న కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలంలు , రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే పాయె, కనీసం హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతంగానయినా చేయకపోతే రాజీనామా చేస్తామని బెదిరించినట్లు తాజా సమాచారం. కానీ అటు కేంద్ర మంత్రుల బృందం గానీ, ఇటు ప్రజలు గానీ ఆ తాటాకు చప్పుళ్ళను వినేందుకు ఇష్టపడటం లేదు.

 

అయితే ఈ సందర్భంగా అప్రయత్నంగా వారి నోట ఒక గొప్ప రహస్యం ప్రజలకు తెలుసుకొనే భాగ్యం కలిగింది. హైదరాబాద్‌ను యూటీ చేస్తారనే నమ్మకంతోనే రాష్ట్ర విభజనకు తాము ఒప్పుకున్నామని వారు వాపోతునప్పుడు ప్రజలు ఔరా! తెర వెనుక ఇటువంటి ఇంకెన్ని ఒప్పందాలు జరిగాయో’ అంటూ ముక్కున వేలేసుకోక తప్పలేదు.