వలసదారులపై అప్పుడే ట్రంప్ ఉక్కుపాదం...

  అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై విరుచుకు పడిన సంగతి తెలిసిందే. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు.. ఆయన ప్రచారంలో పాల్గొన్న ప్రతీసారి ఏదో ఒక సందర్బంలో వలసదారులపై విమర్శలు చేస్తూనే ఉండేవారు. ‘అక్రమ వలసదారులపై వేటు’పై వెనకడుగు వేయబోనని హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత కూడా దీనిపై స్పందించారు. అమెరికాలో కోటి మందికిపైగా అక్రమ వలసదారులు ఉన్నారని, వారిలో క్రిమినల్ రికార్డులున్న 30 లక్షల మందిని  దేశం నుంచి వెళ్లగొట్టేందుకు అవసరమైన చర్యలు త్వరితగతిన పూర్తిచేస్తామని ఆయన చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అక్రమ వలసదారులపై చర్యలు తప్పవని తెలిపారు. ‘యూఎస్ లో అక్రమంగా నివసిస్తోన్న వారిలో చాలామంది డ్రగ్స్ డీలర్లు, క్రిమినల్స్, గ్యాంగ్స్ నడిపేవారున్నారు. అలాంటివాళ్లు కనీసం 20 నుంచి 30 లక్షల మంది ఉంటారని అంచనా. వాళ్లందరినీ దేశం నుంచి తరిమేస్తాం. అంతర్గత భద్రతను పటిష్టం చేసుకుంటూనే దేశసరిహద్దుల్లోనూ అవసరమైన మేరకు రక్షణ ఏర్పాటుచేస్తాం. వలసదారులను వెళ్లగొట్టడం ఒక సవాలైతే, అలాంటి వాళ్లు తిరిగి అమెరికాలోకి రాకుండా సరిహద్దుల వద్ద నిఘాను పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే ముందుగా సరిహద్దు భద్రతను పెంచి, తర్వాత వలసదారు వేట కొనసాగిస్తాం’అని ట్రంప్ చెప్పారు.

నోట్ల రద్దుపై స్వామి సంచలన వ్యాఖ్యలు.. సొంత పార్టీ పైనే

  బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సంగతి అందరికి తెలిసిందే. ఉన్నది ఉన్నట్టు చెప్పడం.. సంచలన వ్యాఖ్యలు చేయడంలో ఈయన దిట్ట. ఇతర పార్టీలపైనే కాదు.. తేడా వస్తే సొంత పార్టీ పైన కూడా విమర్శలు చేయడానికి వెనుకాడని వ్యక్తి. ఇప్పుడు దేశంలో సంచలనం రేపుతున్న నోట్ల రద్దుపై ఈయన తొలిసారి నోరు విప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమాత్రం ముందు జాగ్రత్త, ముందస్తు ప్రణాళిక లేకుండా డీమానిటైజేషన్ పథకాన్ని తీసుకువచ్చారని, కొత్త నోట్ల జారీలో పేలవమైన పనితీరుతో గందరగోళ పరిస్థితి నెలకొందని వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశాన్ని అయోమయంలోకి నెట్టివేశాయని, దీని వెనుక తమ తప్పు లేదని ఫైనాన్స్ మినిస్ట్రీ వాదించడం క్షమించరాని నేరమని స్వామి తీవ్రంగా మండిపడ్డారు. ఆర్థిక శాఖ వ్యవహార శైలి తనను బాధించిందని ఆయన అన్నారు. మరి దీనిపై పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో.. మళ్లీ స్వామిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

అందుబాటులోకి కొత్త 500 నోట్లు...

  నేటి నుండి కొత్త 500 నోట్ల రూపాయలు అందుబాటులోకి రానున్నాయని ఆర్ధిక శాఖ కార్యదర్శి దాస్ తెలిపారు. ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో మొదటగా ఈ నోట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇప్పటికే ఢిల్లీలోని ఎస్‌బీఐ ప్రధాన బ్రాంచ్‌లో రూ. 500 నోట్ల పంపిణీని చేపట్టారు. అయితే కాగా రూ. 500, రూ. 2000 నోట్ల సైజులో మార్పు కారణంగా ఏటీఎం మెషిన్లను మార్పుచేసిన తర్వాతనే వీటిని ఏటీఎంల ద్వారా తీసుకునే అవకాశం ఉందని..ఏటీఎంల సాఫ్ట్ వేర్ అప్ డేట్ కోసం టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా.. దేశ వ్యాప్తంగా మైక్రో, మొబైలు ఏటీఎంలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో నోట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని.. గ్రామీణ పోస్టాఫీసుల్లోకి ఎక్కువ డబ్బును పంపిస్తున్నామని తెలిపారు. పదివేల లిమిట్ ను కూడా ఆర్ధిక శాఖ ఎత్తివేసింది. సరైన ఆధారాలు చూపిస్తే ఒకేసారి రూ.50 వేలు డ్రా చేసుకోవచ్చని తెలిపారు.

టీడీపీ నేతపై బాంబులు, కత్తులతో దాడి...

కడప జిల్లాలో టీడీపీ కి చెందిన నాయకుడిపై బాంబులు, కత్తులతో జరిపిన దాడి కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. కడప జిల్లా పులివెందుల మండలంలోని నామాలగుండు సమీపంలో తెదేపా నాయకుడు శంకరప్పపై  ప్రత్యర్థులు బాంబులు, కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో శంకరప్ప చేతులకు, కాళ్లకు గాయాలవ్వగా అతనిని చికిత్స నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఓ కేసుకు సంబంధించి రెండ్రోజుల్లో శంకరప్ప న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అతడిపై హత్యాయత్నం జరిగినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మాయావతికి పోటీగా ఆ హీరోయిన్..

  వచ్చే  ఏడాది యూపీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు ఇప్పటినుండే పార్టీలన్నీ కసరత్తు ప్రారంభించాయి. అంతేకాదు.. పార్టీలన్నీ ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నాయి. ఇదిలా ఉండగా ఎన్నికల బరిలోకి జహుజన సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతికి పోటీగా ఓ సినీనటి బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది. ఆర్పీఐ (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా) అధ్యక్షుడు, కేంద్ర సహాయ మంత్రి రామ్ దాస్ అథవాలే ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్నికల బరిలోకి జహుజన సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి దిగితే...ఆమెపై సినీ నటి రాఖీ సావంత్ ను పోటీగా నిలబెడతామని ఆయన చెప్పారు. ‘మాయావతి ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పించుకుంటున్నారు. ఈసారి మనసు మార్చుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తే ఆమెపై మా పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రాఖీ సావంత్‌ ను బరిలోకి దించుతాం. మాయావతి ఎక్కడి నుంచి పోటీచేస్తే అక్కడి నుంచి సావంత్‌ బరిలో ఉంటార’ని రామ్‌దాస్‌ అథవాలే తెలిపారు.   ఇక తమ పార్టీ పొత్తు గురించి మాట్లాడుతూ.. దళితుల మద్దతు బాగా ఉన్న ఆర్‌పీఐ.. బీజేపీతోనే పొత్తు పెట్టుకుంటుందని, కుదరని పక్షంలో 200 స్థానాల్లో సొంతంగా అభ్యర్థులను పోటీలో నిలబెడతామని అథవాలే వెల్లడించారు.

నోట్ల రద్దు.. ఆలయం వద్ద 44 లక్షలు..

ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను ఏ ముహూర్తాన రద్దు చేశారో కానీ.. అప్పటినుండి చిత్ర విచిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు.. నోట్ల మార్పిడి కోసం కష్టపడుతుంటే.. మరోపక్క డబ్బున్న మారాజులు మాత్రం ఏం చేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. కొంత మంది నోట్లను చింపుతుంటే.. కొంత మంది తగలబెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఆలయం వద్ద కొన్ని లక్షల రూపాయలు విరాళంగా వదిలి వెళ్లారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం...తమిళనాడులోని వెల్లోర్ లో పురాతన జలకందేశ్వరన్ ఆలయం వద్ద  ఏకంగా రూ. 44 లక్షల విరాళం వచ్చింది. గుర్తు తెలియని భక్తులు దేవాలయం హుండీలో ఇంత భారీ మొత్తంలో డబ్బును వేశారు. ఇవన్నీ పాత రూ. 500, రూ. 1000 నోట్ల కట్టలే. ఈ సందర్బంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ..  ఈ దేవాలయానికి చిన్న చిన్న కానుకలు తప్ప భారీ విరాళాలు ఏనాడూ వచ్చింది లేదు. పూజలు, ప్రత్యేక అర్చనల ద్వారానే అంతో ఇంతో ఆదాయం సమకూరేది.  ఒక భక్తుడు కానీ, లేక కొంత మంది కలిసి గానీ ఈ డబ్బును వేసి ఉండవచ్చని తెలిపారు. ఇంత మొత్తంలో ఆలయానికి విరాళం రావడం ఇదే తొలిసారని చెప్పారు.

మరో సంచలనానికి జియో రెడీ...

  ఇప్పటికే ఉచిత కాల్స్, ఉచిత డేటా ఇచ్చి సంచలనం సృష్టించిన రిలయన్స్ ఇప్పుడు మరో సంచలనానికి తెర తీస్తుంది. బ్రాడ్ బ్యాండ్, డీటీహెచ్ సేవల్లో విప్లవాత్మక మార్పులతో పాటు జియో టీవీ ద్వారా 360కి పైగా ఛానళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో కనీసం 50 హెచ్ డీ ఛానళ్లు ఉంటాయి. హైస్పీడ్ ఆప్లికల్ ఫైబర్ తో డీటీహెచ్ తో పాటు, హైస్పీడ్ ఇంటర్నెట్ ను కూడా అందించనుంది. దీనికోసం సంబంధించి సెట్ టాప్ బాక్స్, ఆండ్రాయిడ్ స్మార్ట్ బాక్స్ అందించనుంది. అంతేకాదు, వినియోగదారులు తమకు కావాల్సిన కార్యక్రమాలను జియో సర్వర్లలో సేవ్ చేసుకోవచ్చు. మాటలతో పని చేసే రిమోట్ తో ఛానల్స్ మార్చుకునే సదుపాయాన్ని కల్పించనుంది. మరి ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు సృష్టింస్తుందో చూడాలి.

వేతనం తీసుకోను.. ఒక్క డాలర్ మాత్రమే తీసుకుంటా..

  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20 వ తేదీన ఆయన 45 అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే అద్యక్షుడిగా ట్రంప్ తన వేతనం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను ఒక్క డాలర్ మాత్రమే వేతనంగా తీసుకుంటానని.. అధ్యక్షుడికి వేతనంగా లభించే 4 లక్షల డాలర్లను తాను త్యజిస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్ లో తాను ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం, వేతనం తీసుకోకుండానే అమెరికాకు సేవ చేయనున్నట్టు సీబీఎస్ చానల్ కు తెలిపారు. అమెరికాలో అమలవుతున్న చట్టాల ప్రకారం ఎంతో కొంత తీసుకోవాల్సిందే కాబట్టి సంవత్సరానికి ఒక్క డాలర్ ను వేతనంగా స్వీకరిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. మరి వేతనం తీసుకోకుండా సేవ చేస్తాననడం ఆభినందించాల్సిన విషయమే కదా...

ఆప్ లో చేరిన భాజపా బహిష్కృత ఎంపీ సతీమణి...

  భాజపా నేత పూనమ్‌ ఆజాద్‌ ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆమె ఆదివారం ఉదయం కలిసి ఆయన సమక్షంలో ఆప్‌లో చేరారు.  పూనమ్‌ భాజపాను వీడి ఆప్‌లో చేరుతున్నట్లు గత వారమే ఆప్‌ సీనియర్‌ నేత సంజయ్‌ సింగ్‌ అధికారికంగా ప్రకటించారు. దాదాపు 20 సంవత్సరాల పాటు ఆమె భాజపాలో పనిచేశారు. 2003 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం షీలా దీక్షిత్‌కు ప్రత్యర్థిగా భాజపా తరపు నుంచి పూనమ్‌ పోటీ చేసి ఓటమి చవిచూశారు. భాజపాలో ఆమెకు సరైన గుర్తింపు లేకపోవడం వల్లే ఆప్‌లో చేరుతున్నట్లు పూనమ్‌ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాగా పూనమ్‌ ఆజాద్‌ భాజపా బహిష్కృత ఎంపీ కీర్తి ఆజాద్‌ సతీమణి.

పరారైన ఖైదీల్లో ఒకరు పట్టివేత..

  తెలంగాణలోని వరంగల్‌ కేంద్ర కారాగారం నుంచి ఇద్దరు ఖైదీలు పరారైన సంగతి తెలిసిందే. ఇప్పుడు పరారైన ఇద్దరు ఖైదీల్లో ఒకడు పోలీసులకి చిక్కినట్టు తెలుస్తోంది. పరారైన ఇద్దరు ఖైదీల్లో ఒకరైన సైనిక్‌సింగ్‌ పోలీసులకు చిక్కాడు. విశాఖ గాజువాకలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని శనివారం రాత్రి గాజువాక పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. వరంగల్‌ జైలు నుంచి పారిపోయి వచ్చినట్లు వెల్లడించారు. దీంతో వైజాగ్‌ పోలీసులు వరంగల్‌ జైలు అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో వైజాగ్‌ చేరుకున్న పోలీసులు సైనిక్‌సింగ్‌ను పటిష్ట భద్రత నడుమ వరంగల్‌ తీసుకొస్తున్నారు. పరారైన మరో ఖైదీ కోసం గాలింపు కొనసాగుతోందని.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కాగా వరంగల్ కేంద్ర కారాగారం నుంచి బీహార్‌కు చెందిన ఇద్దరు ఖైదీలు  రాజేశ్‌యాదవ్, సైనిక్‌సింగ్‌లు పరారైన సంగతి విదితమే..

రోజాకి తప్పని నోట్ల తిప్పలు.. బ్యాంకు దగ్గర క్యూలో

పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలకే కాదు.. పెద్ద వాళ్లకి కూడా సమస్యలు తప్పడం లేదు. ఇప్పుడు ఈ పరిస్థితి వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు కూడా ఎదురైంది. పాత నోట్లు మార్పిడి కోసం అందరూ బ్యాంకుల వద్ద నిలబడుతుండగా.. ఈరోజు రోజా కూడా సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా నగరిలో పెద్ద నోట్లను మార్చుకునేందుకు ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లారు. అందరిలాగానే బ్యాంకు ముందు క్యూలో నిలబడ్డారు. అయితే కొద్దిసేపటికే క్యాష్‌ అయిపోయినట్టు తెలియడంతో ఆమె వెళ్లి బ్యాంకు సిబ‍్బందిని ప్రశ్నించారు. డబ్బులు తీసుకోకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ..  ఎమ్మెల్యే పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల విషయం ఏంటని ప్రశ్నించారు. ముందస్తు అవగాహన కల్పించకుండా ఉన్నఫళంగా పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల సామాన్యుడికి కష్టాలు వచ్చాయని అన్నారు. నల్లధనం దాచుకున్న కుబేరులకు లీక్‌ ఇవ్వడంతో వారు సంతోషంగా ఉన్నారని సామాన్యులే కష్టాలు పడుతున్నారని విమర్శించారు.

నా నిర్ణయంతో కొంతమందికి నిద్ర పట్టడంలేదు..

  నల్లధనం నియంత్రణపై ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. గోవాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..అత్యున్నత పదవి అనుభవించడానికి నేను పుట్టలేదు.. దేశం కోసం కుటుంబాన్ని, ఇంటిని కూడా త్యజించా అని చెప్పారు. నాజీవితం ప్రజల కోసమే అంకితం..ప్రజల కోసమే జీవిస్తా.. ప్రజల కోసమే జన్మిస్తా అని అన్నారు. ఆభరణాల కొనుగోలుకు పాన్ కార్డ్ తప్పనిసరి చేయోద్దని చాలా ఎంపీలు మంది నన్ను కోరారు.. బినామీ ఆస్తులపై చర్యలు తీసుకుంటాం..ఈ చర్యలు నల్లధనాన్ని రూపుమాపడంలో కీలక పాత్ర పోషిస్తాయి అని తెలిపారు. చాలామంది పెళ్లిళ్లు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు..అయినప్పటికీ నేను తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా అంగీకరిస్తున్నారు.. నోట్ల రద్దు నిర్ణయానికి బాసటగా నిలిచిన ప్రతి ఒక్క పౌరుడికి సెల్యూట్ తెలిపారు. రాత్రి 8 గంటలకు నేను తీసుకున్న నిర్ణయంతో భారత ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయారు. కానీ నా నిర్ణయంతో ఇప్పటికీ కొంతమందికి నిద్ర పట్టడంలేదు అని వ్యాఖ్యానించారు. దేశ సంపదను కొల్లగొట్టిన వారిని గుర్తించి పట్టుకోవడమే మా బాధ్యత అని అన్నారు.

నశించిన ఓపిక.. బ్యాంకులపై దాడులు..

  పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇప్పటివరకూ ఓపికగా ఉన్న ప్రజలు ఇప్పుడు ఆగ్రహిస్తున్నారు. ఈనేపథ్యంలోనే యూపీలో ప్రజలు ఏకంగా బ్యాంకులపై దాడులకు దిగారు. వివరార ప్రకారం.. యూపీలోని మురాదాబాద్, లక్నో, బులంద్ షహర్ తదితర ప్రాంతాల్లో నగదు నిండుకుందని చెప్పి, తిరిగి బ్యాంకులకు తాళాలు వేసి అధికారులు వెళ్లిపోవడాన్ని తట్టుకోలేని ప్రజలు ఆయా బ్యాంకులపై దాడులకు దిగారు. అద్దాలు ధ్వంసం చేశారు. మురాదాబాద్ లోని ఎస్బీఐ బ్యాంకు లోపలికి వెళ్లి ధ్వంసం చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని.. ప్రజలను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో వందల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి చేరి నిరసన తెలిపారు. మరోవైపు హర్యానా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది.

86 శాతం నోట్ల మార్పిడి జరిగింది... ఏటీఎం మెషీన్లు లేవు..

  బ్యాంకర్లతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అత్యవసరంగా సమావేశమయ్యారు. మోడీ తీసుకున్న నిర్ణయంతో జన జీవనం స్థంభించి పోయిన సంగతి తెలిసిందే. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు చిల్లర మార్పిడి కోసం తంటాలు పడుతున్నారు. ఏటీఎంలో డబ్బు వేసినా... క్షణాల్లోనే అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అరుణ్ జైట్లీ  బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ నోట్ల మార్పిడి ప్రక్రియ సజావుగా సాగుతుందన్నారు. ఇందుకు సహకరిస్తున్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత మూడు రోజుల నుంచి పాత నోట్లను మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారని.. ఇప్పటి వరకు 86 శాతం నోట్ల మార్పిడి జరిగిందన్నారు. కేవలం ఎస్బీఐ గ్రూపు రూ.2 కోట్ల 28 లక్షల లావాదేవీలు జరిపిందన్నారు. నేటి వరకు ఎస్‌బీఐ బ్యాంకుల వల్ల 58 లక్షల మంది నోట్ల మార్పిడి చేసుకున్నారని తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు కూడా రాత్రి పగలు అనకుండా కష్టపడుతున్నారని కితాబిచ్చారు. నోట్ల మార్పిడి అనేది అతిపెద్ద ఆపరేషన్ అని తెలిపారు. ఎప్పటికప్పుడు బ్యాంకుల్లో జరుగుతున్న లావాదేవీలను సమీక్షిస్తున్నామని తెలిపారు. కొత్త నోట్లకు తగ్గట్లుగా ఏటీఎం మెషీన్లు లేవని, ఆ ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు.

అమెరికా బేస్‌పై తాలిబ‌న్ల దాడి.. న‌లుగురు మృతి

  గత రెండు రోజుల క్రితం ఆప్ఝనిస్థాన్ లోని జర్మన్ కాన్స్ లేట్ పై ఆత్మహుతి దాడి జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో దాడి జరిగింది. వివరాల ప్రకారం.. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో అమెరికా సైనిక స్థావ‌రంపై తాలిబ‌న్ల‌ను దాడి చేశారు. కాబూల్‌కు స‌మీపంలో ఉన్న బాగ్రామ్ ఎయిర్‌పోర్ట్‌పై ఉగ్ర‌వాదులు సూసైడ్ బాంబ‌ర్ల దాడి జరిపారు. ఈ దాడిలో న‌లుగురు మృతిచెందగా.. మ‌రో 14 మంది గాయ‌ప‌డ్డారు. సూసైడ్ బాంబ‌ర్లు ఆ దాడి చేసిన‌ట్లు తాలిబ‌న్లు ప్ర‌క‌టించారు. బాగ్రామ్ విమానాశ్ర‌యంలో వెట‌ర‌న్స్ డే జ‌రుపుకుంటున్న స‌మ‌యంలో తాలిబ‌న్లు ఆత్మాహుతి దాడికి ప్ర‌య‌త్నించారు.