డబ్బులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే... మనిషి 3 లక్షలు

  నల్లధనాన్ని అరికట్టేందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సామాన్యం జనం పాత నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే.. ఇక నల్లధనం దాచుకున్న బడా బాబాలు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఈ టైంలో ఓ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. అదేంటంటే... ఓ ఎమ్మెల్యే పేదలకు డబ్బులు పంపిణీ చేస్తున్న ఫొటో. అసలు సంగతేంటంటే.. కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో బంగార్‌పేట ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు ఎస్‌ఎన్ నారాయణ స్వామి పేదలకు తలా మూడు లక్షల రూపాయలు పంచిపెట్టారు.  ఆయన పంపిణీ చేసినవన్నీ రూ.500, రూ.1000 నోట్లే. ఆయన టేబుల్ మీద డబ్బు కట్టలు పెట్టి జనానికి పంచుతున్న ఫొటో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా షేర్ అయింది. దీంతో ఈ ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. ఇక ఈ వార్త పోలీసుల వరకూ చేరడంతో దీనిపై విచారణ జరిపారు. అయితే ఈ విచారణలో తేలిన నిజం ఏంటంటే.. ఎమ్మెల్యే డబ్బు పంచి పెట్టింది సోమవారంనాడని.. ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడానికి ఒకరోజు ముందే ఈ డబ్బు పంపిణీ జరిగిందని చెప్పారు. మరి నిజంగానే ఎమ్మెల్యే మంచి ఉద్దేశ్యంతోనే డబ్బు పంచారా..? లేక ముందుగానే ఏమన్న సమాచారం అందిందా..? ఏమో ఆయనకే తెలియాలి.

గాంధీయిజం అన్ని సమస్యలకు మార్గం కాదు

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. నిన్న అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కాలేజి గ్రౌండ్‌లో జరిగిన సీమాంధ్ర హక్కుల సభలో ప్రసంగించిన ఆయన ఇవాళ గుత్తిలోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ నిరాహార దీక్షలతో అన్ని సమస్యలు పరిష్కారం కావని అన్నారు. అలాగని ఆవేశ పడటం కూడా సమస్యలకు పరిష్కారం కాదు. గాంధీయిజం అంటే తనకు ఇష్టమేనని కానీ అన్ని సమస్యలకు అది పరిష్కారం కాదని అన్నారు. ఓ ప్రణాళిక ప్రకారం ఆలోచించి ముందుకు వెళ్లాలని సూచించారు. తాను ఇచ్చిన మాటపై ఎక్కడా వెనక్కు తగ్గలేనని, ప్రజల సమస్యలపై మాట్లాడతానని అన్నారు.

నీలి చిత్రాలు చూస్తూ అడ్డంగా బుక్కయిన మంత్రిగారు..

ఈ మధ్య రాజకీయ నేతలు కూడా ఫోన్ల వల్ల అడ్డంగా బుక్కవుతున్నారు. ఇప్పటికి చాలా మంది నేతలనే చూశాం. ఇప్పుడు మరో మంత్రి అడ్డంగా బుక్కయ్యారు.  కర్ణాటక పాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి మంత్రి తన్వీర్‌ సేఠ్‌ తలంపులు తెచ్చే పనిచేసి అడ్డంగా దొరికిపోయారు. అది కూడా నీలి చిత్రాలు చూస్తూ.. వివరాల ప్రకారం..టిప్పు జయంతి సందర్భంగా గురువారం రాయచూరలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన  తన ఫోన్లో నీలి చిత్రాలు చూస్తూ దొరికిపోయారు. ఇక అంతా అయిపోయిన తరువాత దీనిపై స్పందించిన మంత్రి గారు... ‘తను ఇల్లు విడిచి మూడు నెలలు అయింద’ని నిసిగ్గుగా సమాధానం ఇచ్చారు. ఆ తరువాత వెంటనే... మైసూరుకు చెందిన తాను అక్కడ జరిగిన టిప్పు కార్యక్రమాలకు సంబంధించిన వీడియో చూసినట్టు బుకాయించారు. దీంతో ఇప్పుడు సిద్ధరామయ్య సర్కారు ఇరకాటంలో పడింది. తన్వీర్‌ సేఠ్‌ వ్యవహారంపై సిద్ధరామయ్యను రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ నివేదిక అడినట్టు సమాచారం.

మరోసారి రెచ్చిపోయిన తాలిబన్లు...జర్మనీ కాన్సులేట్ పై దాడి..

  ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. కాబూల్ లోని జర్మనీ కాన్సులేట్ కార్యాలయంపై దాడి జరిపారు. వివరాల ప్రకారం.. జర్మనీ కాన్సులేట్ కార్యాలయం దగ్గర కారులో బాంబులు నింపుకుని వచ్చిన ఉగ్రవాది తనను తాను పేల్చుకోని ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఇద్దరు మరణించగా.. మరో 100మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ దాడికి పాల్పడింది.. తామే అని  తాలిబాన్లు ప్రకటించుకున్నారు. అంతేకాదు..కుందుజ్ ప్రాంతంలో సైన్యం జరిపిన దాడులకు ప్రతీకారంగానే తాము ఈ దాడికి పాల్పడ్డట్టు కూడా తెలిపారు.

పారిపోయే వ్యక్తిని కాదు..

  సమస్యలొస్తే నిలబడే వ్యక్తిని, పారిపోయే వ్యక్తిని కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. ఈసారి కూడా పవన్ ప్రత్యేక హోదానే టార్గెట్ చేసి పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. కరువు కోరల్లో చిక్కుకున్న అనంతపురం జిల్లాకు ప్రత్యేక హోదా అమృతం చుక్క.. రాష్ట్రానికి నిధులు వస్తాయనే ఆనాడు మద్దతిచ్చా అని అన్నారు. ఒకప్పుడు ఇండియన్ ఎయిర్ లైన్స్.. ఇప్పుడు ఎయిరిండియా.. అంతమాత్రాన విమానాలు ఎగరడం లేదా.. అని సుజనా అన్నారు.. అది విమానం ఎగురుతుంది.. ఇది ప్రత్యేక హోదా పేపర్ విమానం ఎగరదు అని సమాధానమిచ్చారు. ప్యాకేజీకి చట్టబద్దత లేదని సుజనాకి తెలియదా అని ప్రశ్నించారు. అంతేకాదు మీరిచ్చిన ప్రత్యేక ప్యాకేజీలో చట్టబద్దత లేదు.. ఇవ్వలేరు కూడా అని స్పష్టం చేశారు. ప్యాకేజీలో లెక్కలు.. పేపర్లు అంకెల గారెడీ మాత్రమే.. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వంత పాడుతుంది అని మండిపడ్డారు.

ఎవరికి భయపడి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు.

సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అనంతపురంలో నిర్వహించిన సీమాంధ్రహక్కుల చైతన్య సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పవన్ ఏపీ ప్రత్యేక హోదాను టార్గెట్ చేస్తూ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రమంత్రుల మధ్యే సరైన స్పష్టం లేదని అరుణ్‌జైట్లీ ఒక మాట చెబితే..వెంకయ్యనాయుడు మరో మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఏ విధంగానైతే తలుపులు మూసీ, ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి రాష్ట్రాన్ని ఏ విధంగా విడగొట్టారో..ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా అర్థరాత్రి వేళ ఉన్నట్లుండి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేశారని అంత హాడవిడిగా ఇవ్వాల్సిన అవసరం ఏమోచ్చిందని పవన్ ప్రశ్నించారు. 

కొత్తగా ఇచ్చింది ఏం లేదు..

  అనంతపురం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనంతపురం అంటే నాకు చాలా ప్రేమ ఇష్టం.. 2014 ఎన్నికల సమయంలో అనంతకు వచ్చా.. అనంతపురం చాలా వెనుకబడిన జిల్లా అని అన్నారు. ప్రత్యేక హోదాపై  నిపుణులతో మాట్లాడా.. అందులో మనకు కొత్తగా ఇచ్చింది ఏం లేదు.. మనకు ఇవ్వాల్సిందే ఇచ్చారు అని అన్నారు. ఈ సందర్బంగా ఆయన మరోసారి వెంకయ్యనాయుడిపై విమర్సలు చేసినట్టు తెలుస్తోంది. వెంకయ్యనాయుడు, రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ మంచిదని చెబుతున్నారు.. చట్టబద్దత లేని ప్యాకేజీలు ఇచ్చి సన్మానాలు చేయించుకున్నారు అని ఎద్దేవ చేశారు.

ఇంగ్లండ్, భార‌త్‌ మొదటి ఇన్సింగ్స్.. 537 పరుగులు చేసిన ఇంగ్లండ్..

  ఇంగ్లండ్, భార‌త్‌ క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య మొద‌టి టెస్టు మ్యాచు మొదటి ఇన్సింగ్స్ ప్రారంభమైంది. రాజ్ కోట్ వేదిక జరిగిన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ టీమ్.. 159.3 ఓవర్లకు 537 పరుగులకు చేసి ఆలౌటయింది. టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. క్రీజులోకి విజ‌య్‌, గంభీర్‌లు ఓపెనర్లుగా వ‌చ్చారు. ప్ర‌స్తుతం విజ‌య్ 19 గంభీర్ 11 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు వికెట్ న‌ష్ట‌పోకుండా ప‌ది ఓవ‌ర్ల‌కు 35గా ఉంది.   ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ స్టోక్స్ 128 ప‌రుగులు చేయ‌గా, రూట్ 124, అలీ 117 ప‌రుగుల చేశారు. కాగా, కుక్ 21, హమీద్ 31, డకెట్ 13, బైర్‌స్టో 46, వోక్స్ 4, ర‌షీద్ 5, అన్సారీ 32 ప‌రుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీశారు. ఉమేష్‌, షమీ, అశ్విన్‌లకు చెరో రెండు వికెట్లు దక్కగా, అమిత్‌ మిశ్రాకు ఓ వికెట్ తీశాడు.

తన ఓటమిపై హిల్లరీ క్లింటన్...

  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ట్రంప్ కు ప్రత్యర్ధిగా హిల్లరీ క్లింటన్ కు గట్టి పోటీ ఇచ్చినా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే తన ఓటమి అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న హిల్లరీ భావోద్వేగానికి గురయ్యారు. ఫలితాలు విడుదలైన కొన్ని గంటల తర్వాత భర్త బిల్‌క్లింటన్‌, కూతురు చెల్సియా క్లింటన్‌, ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్‌ కైన్‌లతో కలసి మీడియా సమావేశంలో పాల్గొన్న హిల్లరీ నవ్వుతూ ప్రసంగం ప్రారంభించినప్పటికీ ఓటమిని అంగీకరిస్తూ పలుమార్లు ఉద్వేగానికి గురయ్యారు. ఇప్పటికీ అమెరికా పట్ల తనకు నమ్మకం ఉందని, ఎప్పటికీ ఉంటుందని అన్నారు. మీకు కూడా అదే విధంగా నమ్మకముంటే.. ఫలితాలను అంగీకరించి, భవిష్యత్తు గురించి ఆలోచించాలని హిల్లరీ అన్నారు. తర్వాతి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అని, అధికార మార్పును తన మద్దతుదారులంతా శాంతియుతంగా ఆహ్వానించాలని కోరారు.

పెద్ద నోట్ల రద్దు... మహిళ ఆత్మహత్య..

  రూ.500, 1000 నోట్లు రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయంతో జనజీవనం స్థంభించినపోయింది. పెద్ద నోట్లు రద్దుతో చిల్లర కోసం జనాలు ప్రాకులాడుతున్నారు. అంతేకాదు తమ వద్ద నోట్లను మార్చుకోవడానికి ఇప్పటికే జనాలు క్యూలు కడుతున్నారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడు ఈ టెన్షన్ వల్ల ఓ మహిళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాలోని శెనగపురంలో కందుకూరి వినోద (55) అనే మహిళ తమ వద్ద ఉన్న రూ. 54 లక్షలు చెల్లవన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. తమకు ఉన్న 12 ఎకరాల భూమిని రూ. 56.40 లక్షలకు ఆమె అమ్మేసింది. అందులో భర్త వైద్యానికి రూ. 2 లక్షలు ఖర్చు చేసింది. మిగిలిన రూ. 54 లక్షలతో వేరే ప్రాంతంలో భూమి కొనేందుకు యత్నిస్తోంది. ఈ సమయంలో... పెద్ద నోట్లు రద్దయిపోయాయని, ఈ నోట్లన్నీ చిత్తు కాగితాలతో సమానమని ఆమెకు ఎవరో చెప్పారు. అంతేకాదు చెప్పినా వినకుండా భూమి అమ్మేశావంటూ కొడుకు,భర్త కూడా ఆమెపై కోప్పడటంతో.. నిజంగానే డబ్బులు చెల్లవేమోనని భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

త్వరలో కొత్త 1000 నోట్లు...

  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూ.500 1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం 500 నోట్లు, రెండు వేల నోట్లు విడుదల చేయగా.. త్వరలోనే వెయ్యి నోట్లను విడుదల చేస్తామని తెలిపారు ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి శ‌క్తికాంత్ దాస్ తెలిపారు. త్వ‌ర‌లో కొత్త వెయ్యి రూపాయ‌ల నోట్ల‌ను రిలీజ్ చేయ‌నున్నామని... మ‌రికొన్ని నెల‌ల‌లో ఆ వెయ్యి నోట్లు మార్కెట్లోకి వ‌స్తాయ‌న్నారు. కొత్త నోట్ల డిజైన్‌కు సంబంధించిన ప్ర‌క్రియ గ‌త రెండు మూడు నెల‌లుగా సాగుతోంద‌ని, ఆర్‌బీఐకి చెందిన కేవ‌లం ఇద్దరు ముగ్గురు అధికారులు మాత్ర‌మే ఆ ప్ర‌క్రియ‌లో నిమ‌గ్న‌మైన‌ట్లు శ‌క్తికాంత్ దాస్ తెలిపారు.

ట్రంప్ కు వ్యతిరేకంగా ర్యాలీ.. దుండగుల కాల్పులు..

  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపుపొందిన విషయం తెలిసిందే. దీంతో ట్రంప్ అనుచరులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. ఇప్పటికీ ట్రంప్ గెలుపును కొంతమంది అమెరికన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిలో భాగంగానే.. నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే వీరిపై కాల్పులు చోటుచేసుకోవడంతో కలకలం రేగింది. వివరాల ప్రకారం..సియాటెల్ లో ట్రంప్ కు వ్యతిరేకంగా ర్యాలీ జరుగుతుంటే, గుర్తు తెలియని దుండగులు తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరుపగా, పదుల సంఖ్యలో గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానికులు, పోలీసు అధికారులు సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఒకరేనా? లేదా గ్రూప్ గా వచ్చారా? అన్న విషయమై సమాచారం లేదని, విచారణ జరుపుతున్నామని, నిందితుల కోసం గాలింపు ప్రారంభించామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.