అధ్యక్ష పీఠం ట్రంప్ దే.. ఎన్నిక్లలో విజయం.. హిల్లరీకి షాక్..

  అమెరికా అధ్యక్ష ఎన్నికలు నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు బరిలో రిపబ్లికన్ పార్టీ నుండి డొనాల్డ్ ట్రంప్... డెమొక్రటిక్ పార్టీ నుండి హిల్లరీ క్లింటన్ ఇద్దరూ పాల్గొనగా ఎంతో ఉత్కంఠం తరువాత డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. సర్వేలన్నీ తారుమారు అయ్యాయి. అంచనాలు తప్పాయి. ఎగ్జిట్‌పోల్స్‌, మీడియా విజయం ఖాయమన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమికి చేరువకాగా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఊహించనివిధంగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ విజయకేతనం ఎగురవేస్తున్నారు. మొత్తం 538 స్థానాలు ఉండగా అందులో 276 స్థానాలు గెలిచి అమెరికా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. దీంతో ట్రంప్ అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు హిల్లరీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

అప్పుడే ట్రంప్ ఎఫెక్ట్.. విదేశీ ఉద్యోగుల ఆందోళన.. వెబ్ సైట్ క్రాష్

  అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ గతంలో విదేశీ ఉద్యోగులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను కనుక ఎన్నికల్లో గెలిస్తే పొరుగు దేశం ఉద్యోగులను రానివ్వనని.. అంతేకాదు పొరుగు దేశం వారు మా ఉద్యోగాలు లాగేసుకుంటున్నారు.. దానిపై చర్యలు తీసుకుంటామని చాలాసార్లు తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఆ ప్రభావం బాగానే కనిపిస్తోంది. ఇప్పటికే ట్రంప్ ఆధిక్యంలో ఉండగా.. గెలుపు ట్రంప్ దే అని తెలుస్తోంది. దీంతో పలువురు విదేశీ ఉద్యోగులు అప్పుడే ఆందోళనలు గురవుతున్నారు. అంతేకాదు కెనడాకు వెళ్లాలన్న ఆలోచనతో ఇమిగ్రేషన్ కోసం పెద్దఎత్తున ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగా ఇమిగ్రేషన్ వెబ్ సైట్ కూడా క్రాష్ అయినట్టు తెలుస్తోంది. అమెరికా, ఆసియాలతో పాటు కెనడా యూజర్లకూ 'ఇంటర్నల్ సర్వీస్ ఎర్రర్' అన్న మెసేజ్ కనిపిస్తోందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్  పేర్కొంది. మొత్తానికి ఇప్పుడే ఇలా ఉంటా.. ట్రంప్ నిజంగా అధ్యక్ష పదవిని చేపడితే ఇంకా ఎన్ని ఘోరాలు జరుగుతాయో చూడాలి.

టెన్షన్ క్రియేట్ చేస్తున్న అమెరికా ఎన్నికలు... మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా ట్రంప్..

  అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు క్షణ క్షణం ఉత్కంఠతను రేపుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్, డెమొక్రెటిక్ పార్టీ తరపున హిల్లరీ క్లింటన్ బరిలో ఉండగా ఎన్నికల ఫలితాలపై మాత్రం ప్రపంచ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. గంట గంటకూ చేతులు మారుతున్న ఆధిక్యం టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఎన్నికల ఫలితాల్లో మొదట ట్రంప్ ఆధిక్యంతో నిలవగా... కాసేపటి తర్వాత హిల్లరీ ముందంజలో నిలిచారు. ఆ తర్వాత దూసుకుపోయిన ట్రంప్... ఒకానొక సమయంలో ఏకంగా 57 ఓట్ల ఆధిక్యతను సాధించారు. కాలిఫోర్నియా రాష్ట్రం ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆధిక్యంలోకి దూసుకుపోయిన హిల్లరీ... ఆ తర్వాత అదే ఊపును కొనసాగించలేకపోయారు. ఇప్పటివరకు 40 రాష్ర్టాల ఫలితాలు వెల్లడికాగా 23 రాష్ర్టాల్లో ట్రంప్, 17 రాష్ర్టాల్లో హిల్లరీ విజయం సాధించారు. మొత్తంమీద ట్రంప్ 244 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా హిల్లరీ 209 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అధికార కైవసానికి మొత్తం 538 స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 270 ఎలక్ట్రోరల్ సీట్లను గెలుపొందాలి. ఈ క్రమంలో, మ్యాజిక్ ఫిగర్ కు చేరువలోకి రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ వచ్చారు.

నగదు రహిత లావాదేవీలకు జనం ముందుకొస్తారా..?

రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం ప్రకటించారు. అంతేకాకుండా ఇకపై బ్యాంకులు, ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రాపైనా ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. దీంతో జనం దృష్టి నగదు రహిత లావాదేవీలపై పడింది. నగదు చెలామణి అధికంగా ఉన్న దేశాల్లో మనదేశం ఒకటి. దీనిని తగ్గించేందుకు గట్టి చర్యలు అవసరమని ప్రభుత్వం ఎంతో కాలంగా భావిస్తున్నాయి. అయితే ఇది ఇంకా నోటి మాటగానే ఉంది తప్ప ఈ దిశగా చర్యలు శూన్యం. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, మొబైల్ వ్యాలెట్లు ఎన్ని వచ్చినా ఇంకా 90 శాతం లావాదేవీల్లో పచ్చనోట్లే పెళపెళలాడుతున్నాయి. ప్రజలు ఇంకా నగదు రహిత లావాదేవీలకు అలవాటుపడక పోవడానికి ఇవి కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు: * దేశ జనాభాలో అధికశాతం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం..ఎక్కువ మంది నిరాక్ష్యరాస్యులు కావడం. * ఇంటర్నెట్, మొబైల్ పేమేంట్స్ తదితర లావాదేవీల్లో మోసాలకు ఆస్కారం ఉండటం, హ్యాకింగ్, సైబర్   దాడుల భయం * ఎక్కువ మంది ప్రజలకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన లేకపోవడం * ప్రభుత్వవ వైపు నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం

కొత్త నోట్ల ఫీచర్లు ఇవే....

  ప్రధాని నరేంద్రమోదీ పలు సంచలన నిర్ణయాలు ప్రకటించారు. నల్ల ధనాన్ని నిర్మూలించే చర్యల్లో భాగంగా..రూ.500, 1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా రూ.2000 , 500 నోట్లు రానున్నాయి. కొత్తగా వచ్చే ఈ నోట్ల ఫీచర్లు ఏంటంటే.. రూ.2000 నోటు ఫీచర్లు.. *కొత్తగా వచ్చే రెండు వేల నోటు పరిమాణం.. 66ఎంఎఎం గా ఉంటుంది * నోటు వెనుక భాగంలో మన దేశ అంతరిక్ష పరిశోధనల సత్తాను చాటిన మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహం ఉంటుంది. *ముందు భాగంలో గాంధీ బొమ్మకు ఎడమవైపు కొంత భాగం పారదర్శక రిజిస్టర్ ఉంటుంది రూ. 500 నోటు ఫీచర్లు.. * పాత నోటుతో పోలిస్తే.. కొత్త నోటు పరిమాణం, కలర్ అన్నీ కొత్తగా ఉంటాయి * ఈ నోటు పరిమాణం.. 63ఎంఎం గా ఉంటుంది * పాత నోటు వెనుక భాగంలో థీమ్ దండి మార్చ్ కాగా.. కొత్త నోటు థీమ్ లో ఢిల్లీలోని ఎర్రకోట బొమ్మ ఉంటుంది *దీనికి కూడా గాంధీ బొమ్మకు ఎడమ వైపున నోటులో కొంత భాగం పారదర్సక రిజిస్టర్ ఉంది. కాగా రెండు నోట్లకూ వెనుక స్వచ్ఛ భారత్ లోగో ఉంది.

డైట్ కోక్ తాగుతూ తాపీగా ట్రంప్..

  అమెరికా అధ్యక్ష ఎన్నికలు నిన్న జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల కౌంటింగ్ ఈరోజు జరుగుతుంది. రిపబ్లికన్ పార్టీ తరుపున ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ తరుపున హిల్లరీ క్లింటన్ పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అని ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది. అయితే ఓ ఓవైపు నరాలు తెగే ఉత్కంఠ మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంటే రిపబ్లికన్ల తరఫున పోటీ పడిన డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారో తెలుసా.. తాపీగా డైట్ కోక్ తాగుతూ కూర్చున్నారంట. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు, న్యూయార్క్ మాజీ మేయర్ రూడీ గులియానీ స్వయంగా వెల్లడించారు. రిపబ్లికన్ నాయకులతో ఆయన సమావేశమయ్యారని, పలు రాష్ట్రాల ఫలితాలు చూసి, విజయంపై ప్రశాంతంగా ఉన్నారని, ఇంకా డిన్నర్ చేయలేదని ట్రంప్ సన్నిహితులు వెల్లడించారు.

వెలిగిపోతున్న "వంద"

నిన్న, మొన్నటి వరకు పర్సులో బరువుగా ఉంటుందనో..సులభంగా వేరేచోటికి తీసుకెళ్లలేమనో మనం భావించి చిన్నచూపు చూసిన వంద రూపాయల నోటు తన గొప్పతనమేంటో చూపిస్తోంది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ నిన్న రాత్రి ప్రకటించారు. వాటిని డిసెంబర్ 31లోగా బ్యాంకుల్లోనూ..పోస్టాఫిసుల్లోనూ మార్చుకోవాలని తెలిపారు. రూ.500, రూ.1000 నోట్ల చెలామణి రద్దు కావడంతో వ్యాపారస్తులు ఆ నోట్లను అంగీకరించడం లేదు. 100 రూపాయల నోటు ఉంటేనే షాపుకి రండి లేకపోతే లేదు అని తెగేసి చెప్పడంతో సామాన్యుడు దిక్కుతోచని స్థితిలోకి పడిపోయాడు. దీంతో పాల ప్యాకెట్ నుంచి పెట్రోల్ వరకు ఎలా కొనుక్కోవాలో తెలియక తల్లడిల్లిపోతున్నారు జనం. ఇప్పుడు జేబులో రూ.500 ఉన్న వ్యక్తికన్నా..వందనోటు జేబులో ఉన్నోడే హీరో.

ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం ఆగ్రహం...

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరూ బయటకు రావద్దని.. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే తప్ప ఎవరూ రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఢిల్లీలో నెలకొన్న పరిస్థితిపై స్పందించిన సుప్రీంకోర్టు ప్రభుత్వంపై ప్రభుత్వపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీని గజగజలాడిస్తున్న కాలుష్యభూతాన్ని ఎలా ఎదుర్కొంటారో చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. 48 గంటలలో కనీస ఉమ్మడి కార్యక్రమంతో తమ ముందుకు రావాలని నిర్దేశించింది. ఢిల్లీ కాలుష్యం నివారణపై విధానమంటూ ఏదైనా ఉంటే తెలియజేయాలని స్పష్టం చేసింది. ఏంచేస్తారు? ఎలా చేస్తారు? ఎంతమంది సిబ్బంది కావాలి? అంటూ ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.

ఆధిక్యంలో ట్రంప్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

  అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హోరా హోరీగా ఉన్న ఈ లెక్కింపులో ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠం నెలకొంది. అయితే హిల్లరీ కంటే ట్రంప్ మాత్రం కాస్త ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరోపక్క ఈరోజు ఆరంభంలోనే స్టాక్ మార్కెట్లు భారీ నష్ట్లాల్లో కూరుకుపోయింది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రానున్నారన్న వార్తలతో, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించింది. దీంతో స్టాక్ మార్కెట్ ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా పాతాళానికి కూరుకుపోయింది. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే 1700 పాయింట్లకు పైగా నష్టంలో నిలిచింది. ప్రస్తుతం 1000 పాయింట్లకు పైగా నష్టంలో నడుస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 26,588 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇంకా చైనా, హాంకాంగ్, జపాన్ మార్కెట్లు కూడా 2 శాతం నష్టాల్లో కూరుకుపోయాయి.

కిక్కిరిసిపోయిన ఏటీఎంలు.. చిల్లర కోసం పాట్లు..

  ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంతో దేశం మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయింది. నల్లధనాన్ని అరికట్టేందుకు గాను  ప్రధాని నరేంద్ర మోడీ  రూ.500, 1000 రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పుడు పలు రాష్ట్రాల్లో ఏటీఎంలు కిక్కిరిసిపోయాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలు రూ. వంద నోట్ల కోసం ఏటీఎంల వద్ద క్యూ కట్టారు. ఇక అందరూ ఒక్కసారిగా మిషన్లపై పడిపోవడంతో ఏటీఎం మిషన్లు కూడా మొరాయించాయి. ఇదిలా ఉండగా...మనీ డిపాజిట్ మిషన్లు వద్ద కూడా రూ.500, 1000 నోట్లను డిపాజిట్ చేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో క్యూ కట్టారు.   ఇక విజయవాడ రైల్వేస్టేషన్లో కొత్త సమస్య ఎదురైంది. అదే చిల్లర అవస్థ. రూ. 500, రూ. 1000 నోట్లు చెల్లవన్న నిర్ణయం నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి రైల్వే కౌంటర్లలో ఈ నోట్లను తీసుకోవాలన్న ఆదేశాలు ఉన్నాయి. అయితే, ఓ యాభై లేదా వంద రూపాయల టికెట్ ఖరీదు చేస్తే, ఇవ్వాల్సిన మిగతా చిల్లర తమ వద్ద లేదని, చిల్లర ఇస్తేనే టికెట్ ఇస్తామని కౌంటర్లలోని సిబ్బంది స్పష్టం చేస్తుండటంతో ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితిలో పడ్డారు ప్రజలు. దీంతో స్పందించిన అధికారులు కౌంటర్ల సిబ్బందికి వంద రూపాయల బండిల్స్ కొన్ని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ఎంతో మంది క్యూలో నిలబడి, వరంగల్ కు రూ. 90 పెట్టి టికెట్ కొని రూ. 400 చిల్లర తీసుకుని ఆ టికెట్ చించి పడేసి తిరిగి క్యూలోకి వెళ్లి 400 రూపాయల చిల్లర కోసం మరో టికెట్ కొంటున్న పరిస్థితి ఏర్పడింది.

బ్యాంకులకు, ఏటీఎంలకు సెలవెందుకు..?

రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అలాగే బుధ, గురువారాలు బ్యాంకులు, ఏటీఎం సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని అలా ప్రకటించారో లేదో జనమంతా తండోపతండాలుగా ఏటీఎంలకు పరిగెత్తారు. పాత నోట్లను రద్దు చేస్తున్నారు సరే..! మరి బ్యాంకులకు, ఏటీఎంలకు సెలవులెందుకు అని జనం చర్చించుకుంటున్నారు. అందుకు కారణం ఉంది. బ్యాంకులన్నీ తమ దగ్గరున్న పాత నోట్లను రిజర్వు బ్యాంకుకు అందజేసి..కొత్తవి తెచ్చుకోవటానికి, వాటిని ఏటీఎంలలో పెట్టడానికి వాటికి కొంత సమయం కావాలి. అందుకే ప్రభుత్వం బ్యాంకులకు సెలవుగా ప్రకటించింది. ఏటీఎంలలో డబ్బు మార్చాలి కనుక..ఏటీఎంలు కూడా రెండు రోజులు పనిచేయవు.  

మోడీపై విపక్షాల విమర్శలు..

  నల్ల ధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ  రూ.500, 1000 రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయానికి కొంత మంది హర్షం వ్యక్తం చేస్తున్నా.. కొన్ని విపక్ష పార్టీలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  ప్రభుత్వ నిర్ణయం పాశవిక చర్యకు ఉదాహరణ అని ధ్వజమెత్తారు. ప్రధాని నిర్ణయంతో పేదలు చాలా ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లధనం, అవినీతికి తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రభుత్వ నిర్ణయం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు.   ఇంకా పశ్చిమబంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానిపై పలు విమర్శలు చేశారు.  ‘కేంద్రం అవివేకంతో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’ అని అన్నారు. నల్లధనాన్ని వెనక్కి రప్పించడంలో విఫలమవ్వడంతో ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ ఆకస్మిక తప్పుడు నిర్ణయంతో సామాన్య ప్రజల్లో తీవ్ర గందరగోళం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.   మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రధాని మోదీని తుగ్లక్ ఆత్మ ఆవహించిందని తీవ్ర విమర్శలు చేసింది. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.

నాన్నకు ఓటేశా.. చిక్కుల్లో ట్రంప్ కొడుకు..

  అమెరికా అధ్యక్ష ఎన్నికలు నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తనయుడు ఎరిక్‌ ట్రంప్‌ చిక్కుల్లో పడ్డాడు. అసలు సంగతేంటంటే..ఎరిక్ ట్రంప్ ఓటు వేసిన అనంతరం మా నాన్నకు ఓటు వేశాను అని.. అమెరికా ఉజ్వల భవిష్యత్‌కు ఆయన కృషి చేస్తారు అని చెబుతూ ట్వీట్ చేశాడు. ఇందులో తప్పేముంది అతని తండ్రికి ఓటు వేశాడు.. చెప్పుకున్నాడు అనుకుంటున్నారా.. అక్కడే వచ్చిపడింది చిక్కంతా.. ఎందుకంటే... న్యూయార్క్‌ రాష్ట్ర నిబంధనల ప్రకారం ఓటు వేసిన అనంతరం తాము ఎవరికి ఓటు వేశామో ప్రకటించడం చట్ట వ్యతిరేకం. దీంతో ఈ నిబంధనల ప్రకారం ట్రంప్‌ తనయుడిపై అధికారవర్గాలు ఏలాంటి చర్య చేపట్టనున్నారో అన్న అంశంపై ఉత్కంఠ ఏర్పడింది. ఇదిలా ఉండగా తాను ట్వీట్ చేసిన కొద్ది సేపటికే ఎరిక్ ట్రంప్ పోస్ట్ తీసేశాడు. మరి చూద్దాం న్యూయార్క్ చట్టం ఎరిక్ ట్రంప్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో..

మోడీ తీసుకున్ననిర్ణయానికి చంద్రబాబు హర్షం..

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. మోడీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయమని.. ప్రధాని నిర్ణయం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. పెద్ద నోట్ల రద్దును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. వెయ్యి రూపాయల నోట్లను దాచినంత తేలిగ్గా రూ.100 నోట్లను దాచలేరని, అందుకే చాలా కాలంగా పెద్ద నోట్లను రద్దు చేయాలని పోరాడుతున్నట్టు చంద్రబాబు తెలిపారు. నల్లధనం వల్ల ద్రవ్యోల్బణంతోపాటు రాజకీయ రంగం, పాలనా రంగాల్లో అవినీతి పెద్ద ఎత్తున పెరిగిపోయిందన్నారు. డబ్బు పిచ్చికి ఇక బ్రేకులు పడతాయని.. రాజకీయాల్లో డబ్బు ప్రభావం తగ్గుతుందని, దీని కోసమే ఇంతకాలం పోరాడామని వివరించారు.   కాగా నల్లధనాన్ని కట్టడి చేస్తామని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెబుతున్న మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నపేథ్యంలోనే తొలి అడుగుగా.. పాత రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 30లోగా రూ.500, రూ.1000 నోట్లు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని.. డిసెంబర్ 30లోపు డిపాజిట్ చేయనివారు..ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం డిపాజిట్ చేయవచ్చని తెలిపారు. అయితే ఈ నెల 11 వరకు వైద్య సేవలు, రైలు టికెట్ల కోసం రూ.500, రూ 1000 నోట్లు వినియోగించుకోవచ్చని ప్రధాని వెల్లడించారు.

కరెన్సీ రద్దు ఇంతకు ముందు కూడా..

అవినీతిని, నల్లధనాన్ని నిర్మూలించే చర్యల్లో భాగంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తోంది అదేంటంటే కరెన్సీ రద్దు ఇప్పుడేనా..ఇంతకు ముందు కూడా చేశారని. అవును కరెన్సీ రద్దు ఇంతకు ముందు కూడా జరిగింది. స్వాతంత్ర్యానికి పూర్వం 1946 జనవరిలో తొలిసారి భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ.1000, రూ.10 వేల రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేసింది. స్వాతంత్ర్యానంతరం 1954లో మరోసారి రూ.వెయ్యి, రూ.5 వేలు, రూ.10 వేల నోట్లను కొత్తగా ఆర్బీఐ ప్రవేశపెట్టింది. మరలా 1978 జనవరిలో రూ.10 వేలు, రూ.5 వేలు, రూ. వెయ్యి రూపాయల నోట్లను అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది.

బ్లాక్ మనీకి మోడింది..రూ.1000, 500 నోట్లు రద్దు

ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నల్లధనాన్ని కట్టడి చేస్తామని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెబుతున్న మోడీ ఆ ప్రయత్నంలో తొలి అడుగు వేశారు. పాత రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ అర్థరాత్రి నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 30లోగా రూ.500, రూ.1000 నోట్లు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని ప్రధాని తెలిపారు. సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.  అయితే ఈ నెల 11 వరకు వైద్య సేవలు, రైలు టికెట్ల కోసం రూ.500, రూ 1000 నోట్లు వినియోగించుకోవచ్చని ప్రధాని వెల్లడించారు. డిసెంబర్ 30లోపు డిపాజిట్ చేయనివారు..ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం డిపాజిట్ చేయవచ్చని తెలిపారు.