బీసీసీఐని కరుణించిన సుప్రీం

ఎట్టకేలకు బీసీసీఐని సుప్రీం కరుణించింది. నిధుల విడుదలపై విధించిన ఆంక్షలను తొలగించేలా ఆదేశాలివ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం బీసీసీఐకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున బీసీసీఐ సొంతంగా నిర్ణయం తీసుకోలేదు.. ఈ నేపథ్యంలో నిధుల విడుదలపై విధించిన ఆంక్షలను తొలగించాలని లేదంటే ఇంగ్లాండ్-భారత్ తొలి టెస్ట్‌ మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వస్తుందని కోర్టుకు విన్నవించుకుంది. దీనిని పరిగణలోనికి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం అందుకు సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. వెంటనే రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్‌కు రూ.58.66 లక్షలు విడుదల చేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే రాజ్‌కోట్ టెస్ట్ జరగనుంది.

కొందరు రాష్ట్రానికి పెట్టుబడులే రాలేందంటున్నారు-చంద్రబాబు

కొందరు వ్యక్తులు రాష్ట్రానికి పెట్టుబడులే రాలేందంటున్నారని కాని జరుగుతున్న అభివృద్ధి వారి కళ్లకు కనిపించడం లేదన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నీతి ఆయోగ్ వైఎస్ ఛైర్మన్ అరవింద్ పనగారియాతో సీఎం ఇవాళ విజయవాడలో సమావేశమయ్యారు. అనంతరం ఆయనతో కలిసి సమావేశ వివరాలను చంద్రబాబు మీడియాకు వివరించారు. నేటి వరకు 15.8 శాతం పెట్టుబడులు ఆకర్షించామని, అలాగే పెట్టుబడుల వివరాలను నీతి ఆయోగ్ బృందానికి వివరించామని తెలిపారు. విద్యుత్ రంగంలో ప్రస్తుతం ఏపీ అగ్రస్థానంలో ఉందని..విద్యుత్ సరఫరాలో నష్టాలను సింగిల్ డిజిట్‌కు తెచ్చామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ పార్క్ కర్నూలులో ఏర్పాటువుతోందని..దానిని ఏప్రిల్‌లో ప్రారంభిస్తామన్నారు. కోస్టల్ ఎకనామిక్ అంట్ ఎంప్లాయిమెంట్ జోన్ గురించి నీతీ ఆయోగ్‌కు వివరించామని..చైనా మాదిరిగా భారత్‌లో కూడా క్లస్టర్ల ఏర్పాటుకు నీతి ఆయోగ్ ముందుకు వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు.

ముగ్గురు భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించిన పాక్

గూఢచర్యం ఆరోపణలపై ముగ్గురు భారతీయ దౌత్య అధికారులను ఇవాళ పాకిస్థాన్ వెలివేసింది. అనురాగ్ సింగ్, విజయ్‌కుమార్ వర్మ, మాధవన్ నందా కుమార్‌లపై ఈ ఆరోపణలు చేసింది. దీంతో వారు ముగ్గురు ఇస్లామాబాద్ నుంచి భారత్‌కు బయల్దేరారు. వీరితో పాటు మొత్తం 8 మంది దౌత్య అధికారులపై పాకిస్థాన్ గూఢచర్యం ఆరోపణలు చేసింది. మిగతా అధికారులు కూడా వాఘా సరిహద్దు ద్వారా భారత్‌కు రానున్నారు. కాగా రా, ఇంటెలిజెన్స్ బ్యూరోల సూచనల మేరకు భారత దౌత్య అధికారులు పనిచేశారని పాక్ విదేశాంగ ప్రతినిధి నఫీస్ జకారియా ఇటీవల తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇది ఉగ్ర కార్యకలాపాల కిందకే వస్తుందని అలాంటి అధికారులను పాక్ ఎంతమాత్రం సహించేది లేదని ఆయన అన్నారు. 

కాంగోలో 32 మంది భారతీయ సైనికులకు గాయాలు

ఆఫ్రికా దేశం కాంగోలో ఇవాళ భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 32 మంది భారతీయ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. కాంగోలోని గోమా నగరంలో ఉదయం వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి దుర్మరణం పాలవ్వగా.. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికులు గాయపడ్డారు. గాయపడ్డ వారందరినీ సహాయక బృందాలు ఆసుపత్రికి తరలించాయి. 1996 నుంచి 2003 వరకు కాంగోలో జరిగిన ప్రాంతీయ ఆందోళనల్లో భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో, ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని శాంతి పరిరక్షక దళం అక్కడ శాంతి పరిరక్షణ కోసం పనిచేస్తోంది. ఈ దళంలో భారతీయ సైనికులు కూడా ఉన్నారు. 

తెలంగాణ స్పీకర్‌ను ఆదేశించే అధికారం లేదు..

తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ శాసనసభ్యుడు సంపత్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదనతో తాము ఏకీభవిస్తున్నామని న్యాయమూర్తులు జస్టిస్ రోహింగ్టన్ ఫాలీ నారిమన్, జస్టిస్ ఆర్కే అగర్వాల్‌లు వ్యాఖ్యానించారు. కానీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారన్న విశ్వాసం లేదని తెలిపారు.. అలాగే సభాపతిని ఈ విషయంలో ఆదేశించే అధికారం తమకు లేదని..దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఈ పిటిషన్‌ను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మసనానికి బదిలీ చేస్తున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు.

సుజాత ఆత్మహత్య: ఇంటి యజమానుల అరెస్ట్

హైదరాబాద్ కూకట్‌పల్లిలోని శ్రీనివాస్‌నగర్ కాలనీలో వివాహిత సుజాత ఆత్మహత్య కేసు నిన్న సంచలనం సృష్టించింది. తన ఇంటి యజమాని వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గోడలు, తలపులుపై సుజాత రాసింది. సుజాత ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఇంటి యజమానులు పారిపోయారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం బృందాలుగా విడిపోయి గాలింపు జరిపారు.  చివరికి ఇవాళ ఖమ్మం జిల్లా సత్తుపల్లి వద్ద ఇంటి యజమాని ప్రసన్నకుమార్, ఆయన భార్య స్నేహలతను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కూకట్‌‌పల్లిలోని మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు హాజరుపరచగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు.

తొలి ఫలితం: ట్రంప్‌పై హిల్లరీదే పైచేయి

ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు ఎవరా అని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం తొలి రిజల్ట్ విడుదలైంది. న్యూహాంప్‌ఫైర్‌లోని డిక్స్‌విల్లీ నాచ్, మిల్స్‌ఫీల్డ్, హార్ట్స్ లొకేషన్ పట్టణాల పరిధిలో జరిగిన ఓటింగ్ నిన్న అర్థరాత్రి ముగిసింది. అక్కడ జరిగిన ఎన్నికల్లో హిల్లరీ 4-2 తేడాతో ట్రంప్‌పై విజయం సాధించారు. డిక్స్‌విల్లీ నాచ్ ఓట్లలో సగం హిల్లరీ గెలుచుకోగా ట్రంప్‌కు రెండు ఓట్లు దక్కాయి. లిబర్టీ పార్టీ నేత గ్యారీ జాన్సన్‌కు కూడా ఓటు దక్కింది. అమెరికాలో 100 ఓట్ల కన్నా తక్కువ ఉండే ప్రాంతాల్లో ఓటింగ్ అర్థరాత్రే మొదలవుతుంది. 

టిఫెన్ సెంటర్‌లో సిలిండర్ బ్లాస్ట్..పేలుడుపై అనుమానాలు

హైదరాబాద్‌ నార్సింగిలోని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో సిలిండర్ పేలింది. నార్సింగి బస్టాండ్‌ను ఆనుకుని నిర్వహిస్తున్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో సిలిండర్ లీకై ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిసరాలు పరిశీలిస్తున్నారు. ఉదయం కావడం, జన సంచారం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది..అయితే ప్రమాదంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి..గ్యాస్ లీకై ప్రమాదం జరిగిందా లేదంటే దీనివెనుక విద్రోహ కుట్ర ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దయ చూపండి..సుప్రీంను వేడుకున్న బీసీసీఐ

నిధుల విడుదలపై విధించిన ఆంక్షలను తొలగించేలా ఆదేశాలివ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్ణయం మేరకు సభ్యత్వ సంఘాలకు నిధుల పందేరం జరగకుండా లోథా కమిటీ అడ్డుకట్ట వేసింది. తమ అనుమతి లేకుండా బీసీసీఐ నుంచి నిధుల బదిలీ జరపరాదంటూ బ్యాంకులను ఆదేశించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం అతిథ్యమిచ్చే జట్టు బోర్డే పర్యటిస్తున్న క్రికెట్ జట్టు ఖర్చులు భరించాలి..అయితే ప్రస్తుతం బీసీసీఐకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున బీసీసీఐ సొంతంగా నిర్ణయం తీసుకోలేదు.. ఈ నేపథ్యంలో నిధుల విడుదలపై విధించిన ఆంక్షలను తొలగించాలని బీసీసీఐ సుప్రీంలో పిటిషన్ వేసింది. తాము డబ్బులు పంపించకుంటే, మ్యాచ్ నిర్వహణ క్లిష్టతరం అవుతుందని, ఈ పరిస్థితుల్లో మ్యాచ్ రద్దు మినహా మరో మార్గం లేదని సుప్రీంకు విన్నవించింది. 

అద్వానీకి బర్త్‌ డే విషెస్ చెప్పిన మోడీ..

బీజేపీ సీనియర్ నేత, మాజీ భారత ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ ఇవాళ 88వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.  ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. న్యూఢిల్లీలోని అద్వానీ ఇంటికి వెళ్లిన ప్రధాని ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ మనకు స్పూర్తిదాయకంగా నిలిచారని..ఆయన పూర్తి ఆరోగ్యంతో సంతోషంగా జీవించాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రధానితో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా కూడా అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అద్వానీ, మోడీ, అమిత్ షా కాసేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు.

ఢిల్లీ కాలుష్యంతో హిమాచల్ కిటకిట..

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించి..ప్రజలను ఇళ్లలోంచి బయటకు రావద్దని హెచ్చరించిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఢిల్లీలో ఉండి లేనిపోని వ్యాధులు కోనితెచ్చుకోవడం ఎందుకనుకున్నారో ఏమో గానీ ప్రజలంతా విహారయాత్రలకు వెళుతున్నారు. స్వచ్ఛమైన గాలి కోసం జనం హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా, ధర్మశాలకు తరలివెళుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ హోటల్స్, లాడ్జిలతో పాటు అన్ని టూరిస్ట్ స్పాట్‌లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఇదే అదనుగా అక్కడి వ్యాపారులు నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు.

ప్రారంభమైన అమెరికా అధ్యక్ష ఎన్నికలు..గెలుపెవరిది..?

ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రారంభమైంది. అందుకోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఇప్పుడిప్పుడే ప్రజలు పోలింగ్ బూత్‌లకు తరలివెళ్తున్నారు. అయితే కాబోయే శ్వేతసౌధాధిపతి ఎవరా అని ప్రపంచం లెక్కలు వేసుకుంటోంది. ఇప్పటికే చాలా సర్వేలు అధ్యక్షుడు ఎవరో ప్రకటించేశాయి. తాజాగా రాయిటర్స్జ్/ఇప్సాస్ స్టేట్స్ ఆఫ్ ద నేషన్ నిర్వహించిన తుది సర్వే ప్రకారం హిల్లరీకే 90 శాతం విజయావకాశాలున్నాయని తేలింది. దీంతో పాటు అమెరికన్ మీడియా కూడా హిల్లరీకే సపోర్ట్ చేస్తుండటంతో ఆమెనే విజయం వరిస్తుందని సర్వేలో పేర్కొన్నారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే 538 ఓట్లలోనూ అభ్యర్థి తప్పకుండా 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధించాలి. హిల్లరీ 303 ఓట్లతో తిరుగులేని మెజార్టీ సాధిస్తారని ట్రంప్‌కు 235 ఓట్లు వస్తాయని సర్వే చెబుతోంది. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా దాదాపు 15 కోట్లమంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

నల్గొండలో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య

నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్‌జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్నను హత్య చేసిన ఘటనలో అజ్మీరా వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి 80 రోజుల రిమాండ్ విధించగా అతన్ని మిర్యాలగూడ సబ్‌జైలుకు తరలించారు. అక్కడ రిమాండ్‌లో ఉండగా..గత సోమవారం రాత్రి బాత్‌రూం క్లీనర్ తాగాడు..దీనిని గమనించిన తోటి ఖైదీలు జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు వెంటనే అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు..అనంతరం అక్కడ చికిత్స పొందుతూ వెంకటేశ్వర్లు మరణించాడు. ఇదే కేసులో అతడి భార్య కూడా రిమాండ్ ఖైదీగా ఉండి కొద్ది రోజుల క్రితం బెయిల్‌పై విడుదలైంది.

శాంసంగ్‌పై అవినీతి ఆరోపణలు..

ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీ శాంసంగ్‌కు వారి సొంతదేశంలో ఊహించని షాక్ తగిలింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఉన్న శాంసంగ్ ప్రధాన కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. దేశాధ్యక్షురాలు పార్క్ జ్యున్-హై ఆప్తమిత్రురాలు చాయ్ సూన్-సిల్ అవినీతి కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో శాంసంగ్ కంపెనీలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. జర్మనీలో చాయ్ సూన్‌కు ఉన్న కంపెనీకి శాంసంగ్ అక్రమంగా 3.1 మిలియన్ డాలర్లు బదిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. చాయ్ సూన్ కుమార్తె చుంగ్ యో-రా గుర్రపు స్వారీ శిక్షణ నిమిత్తం ఈ నిధులను బదిలీ చేసినట్లు తెలియడంతో ఈ సోదాలు జరిగాయి. అవినీతి ఆరోపణలతో చాయ్ సూన్ అరెస్ట్ కావడంతో ప్రధాని, ఆర్థిక మంత్రులను దేశాధ్యక్షురాలు పార్క్ జ్యున్-హై ఈనెల 2న తొలగించారు. అంతేకాకుండా రెండు ఎన్జీవోలకు అక్రమంగా నిధులు ఇవ్వాలని స్థానిక కంపెనీలను చాయ్ సూన్ ఒత్తిడి చేస్తున్నారని శాంసంగ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాంగ్మూలం ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ సోదాలు జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  

విమానంలో విషసర్పం..

విమానంలో విష సర్పం..ఇదిదో హాలీవుడ్ సినిమా టైటిల్ కాదు..నిజంగానే జరిగిన సంఘటన. మెక్సికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టొర్రెన్ నుంచి మెక్సికోకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఓ పాసింజర్‌కు లగేజి కంపార్ట్‌మెంట్ వద్ద భారీ సైజులో ఉన్న గ్రీన్ రెప్టైల్ కనిపించింది. దీంతో ప్రయాణికులందరూ షాక్‌కు గురయ్యారు. వారిలో ఒక ప్రయాణికుడు దానిని ఫోన్‌లో బంధించాడు. అనంతరం అందరూ ధైర్యం చేసి క్యాబిన్ నుంచి పాము కిందకు జారిపడకుండా, అది కిందకు పడే ప్రదేశాన్ని బ్లాంకెట్లతో మూసివేశారు. వెంటనే ఈ విషయాన్ని విమాన సిబ్బంది పైలట్లకు తెలియజేశారు. అయితే విమానం చేరాల్సిన గమ్యస్థానం దగ్గర్లోనే ఉండటంతో పది నిమిషాల తర్వాత మెక్సికోలో విమానాన్ని ల్యాండ్ చేశారు. అనంతరం యానిమల్ కంట్రోల్ వర్కర్లు పామును బంధించారు. దీనిపై స్పందించిన ఏరో మెక్సికో సంస్థ విచారణకు ఆదేశించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

భారతీయులపై మళ్లీ నోరుపారేసుకున్న ట్రంప్...

అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే మొదట్లో కాస్త ఎక్కువగానే నోరు పారేసుకున్న ట్రంప్.. ఈ మధ్య కాస్త నెమ్మదించాడు. కానీ ఇప్పుడు తాజాగా మరోసారి ట్రంప్ భారతీయులపై నోరు పారేసుకున్నారు. గతంలో అమెరికా ఉద్యోగాలు ఇండియావారు తన్నుకుపోతున్నారు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలే చేశారు. అమెరికాకు చెందిన ప్రముఖ టెక్‌ సంస్థ ఐబీఎం(ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మెషీన్స్‌ కార్పొరేషన్‌) ఉద్యోగాలను అమెరికా పౌరులకు ఇవ్వకుండా భారత్‌ సహా ప్రపంచదేశాలకు చెందిన వారికి కట్టబెడుతోందని ధ్వజమెత్తారు. మిన్నెపోలిస్‌లోని ఐబీఎం కంపెనీలో సుమారు 500 ఉద్యోగాల్లో భారత్‌తో పాటు పలు దేశాలకు చెందిన వారిని నియమించడాన్ని ఆయన తప్పుపట్టారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఇలాంటి చర్యలకు పాల్పడిన కంపెనీలపై 35శాతం పన్ను విధిస్తానని హెచ్చరించారు. ‘ఏదైనా కంపెనీ మిన్నెసొటా నుంచి వెళ్లిపోవాలనుకుంటే మొత్తం ఉద్యోగులతో సహా పోవచ్చు. వేరే దేశంలో కంపెనీ ఏర్పాటు చేసుకుని మీ వస్తువులను అమెరికాలో అమ్ముకోవచ్చు. అందుకు 35శాతం పన్ను విధిస్తాం’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.