చిల్లర కష్టాలు.. త్వరలో 20, 50 నోట్ల‌ు

  పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు చిల్లర కోసం పాట్లు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఇబ్బందుల నుండి కాస్త బయటపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే త్వ‌ర‌లోనే రూ. 20, 50 నోట్ల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్‌ప‌ర్స‌న్ అరుంధ‌తి భ‌ట్టాచార్య తెలిపారు. ప్ర‌స్తుతం ఏటీఎంల‌లో డ‌బ్బు ఊహించిన దాని కంటే చాలా త్వ‌ర‌గా అయిపోతుండ‌టంతో త‌మ సిబ్బంది అంతా అదే ప‌నిలో ఉన్నార‌ని, ఈ నెల చివ‌రిలోగా ఈ గంద‌ర‌గోళ ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆమె చెప్పారు. ఆ త‌ర్వాత తాము రూ.20, 50 నోట్ల పంపిణీ మొద‌లుపెడుతామ‌ని అన్నారు.

జనం రోడ్ల మీద పడ్డారు... మళ్లీ మోడీపై కేజ్రీవాల్

  పెద్ద నోట్ల రద్దుపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇప్పటికే పలుమార్లు ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆయన మోడీపై మండిపడ్డారు. మోడీ తీసుకున్న నిర్ణయంతో జనం రోడ్ల మీద పడ్డారని... దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు అంశం నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం పాటించిన విధానాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం విధించిన ఈ శిక్ష న‌ల్ల‌ధ‌నం ఉన్న‌ పెద్ద‌ల‌కు కాదని, పేద‌ల‌కేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల ర‌ద్దును ఉప‌సంహ‌రించుకోవాల‌ని కోరుతూ తాము రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీని క‌ల‌వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

ముద్రగడ పాదయాత్రకు కోర్టు గ్రీన్ సిగ్నల్..

  కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన కాపు ఐక్య గర్జన పేరిట పెద్ద దుమారం రేపారు. అయితే ఇప్పుడు ఆయన సత్యాగ్రహ పాదయాత్రను ప్రారంభించాలనుకుంటున్నారు. కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 16 నుంచి 21 వరకూ కోనసీమలో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయన చేపట్టాలనుకున్న పాదయాత్రపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పుడు దీనిపై విచారించిన హైకోర్టు పాదయాత్రకు అంగీకారం తెలిపింది. ఆయన యాత్ర చేసినంత మాత్రాన శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పడం సరికాదని.. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, ఒకవేళ ఏదైనా శాంతిభద్రతల సమస్యలు వస్తే పోలీసులు చూసుకోవాలని స్పష్టం చేసింది. దాంతో ఆయన యాత్రపై ఉత్కంఠ నెలకొంది.

విత్‌డ్రా చేసుకున్న వారికి సిరా గుర్తు...

  నోట్ల మార్పిడిపై కేంద్ర ఆర్దిక శాఖ రోజుకో ప్రకటన చేస్తుంది. ఇప్పుడు తాజాగా మరికొన్ని చర్యలు తీసుకొచ్చింది. కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి శక్తికాంతదాస్ మాట్లాడుతూ.. వ‌చ్చిన వ్య‌క్తులే మ‌ళ్లీమ‌ళ్లీ ఏటీఎంలు, బ్యాంకుల ద‌గ్గ‌ర విత్‌డ్రా కోసం వ‌స్తున్నార‌ని, అందువ‌ల్లే క్యూ భారీగా పెరిగిపోతోంద‌ని.. అందుకనే ఒకసారి విత్‌డ్రా చేసుకున్న వారికి సిరా గుర్తు వేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. కొంద‌రు వ్య‌క్తులు ప‌దే ప‌దే డిపాజిట్ చేయ‌డానికి వ‌స్తున్నార‌ని, అలాంటివారిపై నిఘా ఏర్పాటుచేసిన‌ట్లు తెలిపారు. పాత నోట్ల ర‌వాణా, స్టోరేజ్‌లాంటి అంశాల్లో బ్యాంకుల‌పై ఒత్తిడి త‌గ్గించ‌డానికి ప్ర‌త్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాట్లుచేస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేద‌ని, స‌రిప‌డిన‌న్ని నోట్లు అందుబాటులో ఉన్నాయ‌ని దాస్ స్ప‌ష్టంచేశారు. ఉప్పు కొర‌త కూడా లేద‌ని, నిత్యావ‌స‌రాల స‌ర‌ఫరాపై నిఘా ఏర్పాట్లుచేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

డిసెంబరు 30 వరకు ఏటీఎం ఛార్జీలు రద్దు...

  పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఏటీఎంల వద్ద బారులు తీరుతున్న సంగతి తెలిసిందే. అయితే వారికి కొంత ఊరటనిచ్చే నేపథ్యంలో ఆర్బీఐ ఓ నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. ఏటీఎంల ద్వారా జరిపే అన్ని లావాదేవీలపై డిసెంబరు 30వ తేదీ వరకు ఛార్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇది సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాదార్లకు వర్తిస్తుంది. ‘తమ బ్యాంకుల ఏటీఎంలతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలలో ఎన్నిసార్లు లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర) జరిపినా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబోమ’ని ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ప్రస్తుతం సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి నెలకు అయిదు సార్లు, ఆరు మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నెలకు మూడు సార్లు మాత్రమే ఉచితంగా లావాదేవీలు జరిపే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.

ట్రంప్ కు మోడీ కితాబు..

  అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపొందితే అమెరికా సర్వనాశనం అవుతుందని..ముఖ్యంగా ట్రంప్ గెలిస్తే అన్ని దేశాల సంగతేమో కానీ.. భారత్ కు మాత్రం తీవ్ర నష్టమే అని పలు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇక అందరూ ఊహించనట్టుగానే ట్రంప్ గెలిచారు. అయితే ఇప్పుడు తాజాగా ట్రంప్ పై మాట్లాడిన ప్రధాని మోడీ ఆయనకు మంచి కితాబే ఇచ్చారు. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇచ్చిన విందుకు హాజరైన మోదీ అక్కడ ట్రంప్ పై కొద్ది సేపు నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది. ట్రంప్ తనకు మిత్రుడేనని.. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక బంధంలో ఏ విధమైన మార్పులూ జరగబోమని, ట్రంప్ హయాంలో ఈ బంధం మరింతగా బలపడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ట్రంప్ సైతం భారత్ పట్ల సానుకూల ధోరణితోనే ఉన్నారని, గతంలో అమెరికాను రిపబ్లికన్లు పాలించిన సమయంలోనూ దృఢమైన స్నేహబంధం కొనసాగిందని గుర్తు చేశారు. డొనాల్డ్ ట్రంప్ మంచివారేనని, ఆయన హయాంలో ఇండియాకు మేలు కలుగుతుందని భావిస్తున్నానని మోదీ వ్యాఖ్యానించారు. మరి మోడీ ఆశించినట్టు ట్రంప్ భారత్ విషయంలో మంచిగానే వ్యవహరిస్తారో.. లేక ఆయనకు నచ్చినట్టు వ్యవహరిస్తారో చూడాలి. కాగా ఎన్నిక్లలో గెలుపొందిన ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20 వ తేదీన 45 వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మోడీకి కుష్బూ సలహా...

  పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నసంగతి తెలిసిందే. దీంతో ప్రధాని పైనా... ప్రధాని తీసుకున్న నిర్ణయంపైనా పలువురు విమర్శలు చేసిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు దీనిలో భాగంగా.. నటి ఖుష్బూ మోడీకి ఓ సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. చెన్నైలో నిర్వ‌హించిన‌ ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ... ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను అర్థం చేసుకోవ‌డానికి ప్ర‌ధాని మోదీ ఏటీఎం సెంట‌ర్ల వ‌ద్ద‌కు వెళ్లాల‌ని ఆమె సూచించారు. ప్ర‌ధాని మోదీ మొసలి కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన జ‌నాలు ఆయనను నమ్ముతారా? అని ప్ర‌శ్నించారు. మోదీ విధానాల‌తో దేశ‌ ప్రజలంతా ఎన్నో క‌ష్టాలు ఎదుర్కుంటున్నార‌ని, వారి ఇబ్బందుల‌ను ప్ర‌ధాని అర్థం చేసుకోవాలని ఖుష్బూ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల ర‌ద్దు చేసేముందు ముందస్తు జాగ్ర‌త్త‌లు తీసుకోకపోవ‌డంతో మోదీపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నార‌ని ఆమె అన్నారు.

గాలి వారి పెళ్లికి వెళ్లొద్దు..

  గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వివాహానికి దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నేతలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ నేతలెవరూ ఈ వివాహ కార్యక్రమానికి వెళ్లరాదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని అమిత్ షా, స్వయంగా యడ్యూరప్పకు ఫోన్ చేసి చెప్పారని, ఇప్పటికే ఈ పెళ్లికి వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్న బీజేపీ నేతలు వెనక్కు తగ్గవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. పెద్ద నోట్లు రద్దు చేసిన తరుణంలో, అక్రమ ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లికి వెళితే, వివాదాలు, విమర్శలు చుట్టుముట్టవచ్చని భావిస్తున్న బీజేపీ అధిష్ఠానం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి నిజంగానే నోట్ల రద్దు తరుణంలో ఎంత మంది పెళ్లికి వెళతారో...?వెళ్లరో..? తెలియాలి.

రైల్వే ప్రయాణికులకు ఊరట... 500, 1000 నోట్లు అనుమతి...

  ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రయాణికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక నోట్ల రద్దు కారణంతో ప్రయాణాలు సైతం రద్దు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు రైలు ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. 500, 1000 రూపాయల నోట్ల రద్దుపై ఇండియన్ రైల్వేస్ సానుకూల నిర్ణయం తీసుకుంది. రైల్వే రిజర్వేషన్లు, టికెట్ల కొనుగోలు, రైల్వే క్యాటరింగ్ సర్వీసుల్లో పాత నోట్లను తీసుకోవాలని నిర్ణయించారు. రద్దు చేసిన 500, 1000 రూపాయల నోట్లను ఈ నెల 24 వరకు అనుమతించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. నోట్లు రద్దు చేసేముందు పెట్టిన గడువు ఈరోజు రాత్రితో ముగియనుంది. దీంతో తాజాగా దానిని ఈ నెల 24 వరకు పొడిగించారు.

కష్టాల్లో పాక్ ప్రధాని... న‌వాజ్ ష‌రీఫ్‌ కి వ్యతిరేకంగా ఆధారాలు..

పనామా పేపర్స్ విడుదల జాబితాలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పేరు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైన సంగతి విదితమే. అయితే ఇప్పుడు ఈ విషయంలో నవాజ్ షరీఫ్ తీవ్ర ఇబ్బందుల్లో పడినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. న‌వాజ్ ష‌రీఫ్‌కి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత ఇమ్రాన్‌ ఖాన్ న్యాయ‌స్థానానికి ఆధారాలు ఇవ్వ‌డంతో ష‌రీఫ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆయ‌న న్యాయ‌స్థానానికి అందించిన ఆధారాల్లో ష‌రీఫ్ అక్ర‌మాల చిట్టాను బ‌య‌ట‌పెట్టారు. 1988 నుంచి షరీఫ్‌ కుటుంబం అక్రమ వ్యాపారాలు చేస్తోంద‌ని, ట్యాక్స్ క‌ట్ట‌కుండా రూ. 14.5 కోట్ల న‌గ‌దుని మనీలాండరింగ్ చేశార‌ని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. బ్యాంకు అకౌంట్‌ వివరాలు, రుణాలను ఎగ్గొట్టిన వివరాల ఆధారాల‌ను ఇమ్రాన్ ఖాన్ అందించారు.

కేజ్రీవాల్ కు వర్మ ఫన్నీ ట్వీట్..

  రాంగోపాల్ వర్మ ఈ మధ్య రాజకీయ నాయకులను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై సెటైర్లు విసిరారు. ఈ రోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా వర్మ కేజ్రీవాల్‌ పై ట్వీట్ చేశారు. హ్యాపీ చిల్డ్రన్స్‌ డే అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు. దీంతో వర్మ ట్వీట్ పై నెటిజెన్లు స్పందించారు. ఇక ఎవరికి తోచిన విధంగా వారు జోకులు వేసుకుంటున్నారు. కేజ్రీవాల్‌ దేశంలోనే అతిపెద్ద కంప్లెయిన్‌ బాక్స్‌ అని, అందుకే ఆయనకు వర్మ చిల్డ్రన్స్‌ డే శుభాకాంక్షలు చెప్పారని ఓ నెటిజెన్‌ స్పందించాడు. కేజ్రీవాల్‌తో పాటు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి శుభాకాంక్షలు చెప్పడం వర్మ మరిచాడా లేక కావాలనే వదిలేశాడా? అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. మరి ఇంకెన్ని జోకులు పేలుతాయో చూడాలి.

2000 నోటుకు నీటి ప‌రీక్ష‌.. నో టెన్ష‌న్..

  నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ఒక పక్క పాత నోట్ల మార్పిడి పై ప్రజలు బ్యాంకుల దగ్గర క్యూ కడుతుంటే మరోపక్క కొత్త నోట్లు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కొత్తగా వచ్చిన 2000 నోటు. ఇప్పటికే ఈ నోటుపై పలు వదంతులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రూ.2000 నోటుకు కొంద‌రు వ్య‌క్తులు ర‌క‌ర‌కాల ప‌రీక్ష‌లు పెడుతున్నారు. కొంద‌రు పూర్తిగా న‌లిపేస్తూ.. మ‌రికొంద‌రు నీటిలో నాన‌బెడుతూ చేస్తున్న ప్ర‌యోగాలు నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే... ఓ వ్య‌క్తి రెండు వేల నోటును క‌డుగుతూ తీసిన వీడియో తీశాడు. పొర‌పాటును నోటు నీటిలో ప‌డినా టెన్ష‌న్ ప‌డొద్దు.. ఈ రెండు వేల నోటుకు ఏమీ కాదు అని వీడియోలో తెలిపాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ వీడియోకి 50 లక్షల వ్యూస్ రావడం.

ట్రంప్ కు ఓటేసినందుకు భర్తకు భార్య శిక్ష...

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ముందు ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారు అని అందరూ అనుకోగా ఆ తరువాత ట్రంప్ పై వ్యక్తిగత ఆరోపణలు ఒక్కసారిగా వెల్లువెత్తడంతో హిల్లరీ కాస్త ముందడుగు వేసింది. ఇక హిల్లరీ క్లింటనే ఎన్నికల్లో గెలుపొందుతారు అనుకున్నారు. కానీ ఊహించని రీతిగా ట్రంప్ గెలుపొందాడు. అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. ట్రంప్ గెలిచిపోయాడు. కానీ ట్రంప్ కు ఓటేసినందుకు మాత్రం ఓ భార్య తన భార్తకు విచిత్రమైన శిక్ష విధించాడు. ఈ ఘటన వాషింగ్టన్ లో చోటుచేసుకుంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు ఓటు వేసినందుకు ఓ వ్యక్తికి అతని భార్య వెరైటీ శిక్షను విధించింది. నెల రోజుల పాటు శృంగారానికి దూరంగా ఉండాలంటూ భర్తకు తేల్చి చెప్పింది. దీంతో, అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ శిక్ష తనను ఎంతో అసంతృప్తికి గురి చేస్తుందని అతను వాపోయాడు. మొత్తానికి ట్రంప్ ఎఫెక్ట్ భార్య భర్తల మీద కూడా పడింది.