86 శాతం నోట్ల మార్పిడి జరిగింది... ఏటీఎం మెషీన్లు లేవు..
posted on Nov 12, 2016 @ 3:58PM
బ్యాంకర్లతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అత్యవసరంగా సమావేశమయ్యారు. మోడీ తీసుకున్న నిర్ణయంతో జన జీవనం స్థంభించి పోయిన సంగతి తెలిసిందే. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు చిల్లర మార్పిడి కోసం తంటాలు పడుతున్నారు. ఏటీఎంలో డబ్బు వేసినా... క్షణాల్లోనే అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అరుణ్ జైట్లీ బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ నోట్ల మార్పిడి ప్రక్రియ సజావుగా సాగుతుందన్నారు. ఇందుకు సహకరిస్తున్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత మూడు రోజుల నుంచి పాత నోట్లను మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారని.. ఇప్పటి వరకు 86 శాతం నోట్ల మార్పిడి జరిగిందన్నారు. కేవలం ఎస్బీఐ గ్రూపు రూ.2 కోట్ల 28 లక్షల లావాదేవీలు జరిపిందన్నారు. నేటి వరకు ఎస్‌బీఐ బ్యాంకుల వల్ల 58 లక్షల మంది నోట్ల మార్పిడి చేసుకున్నారని తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు కూడా రాత్రి పగలు అనకుండా కష్టపడుతున్నారని కితాబిచ్చారు. నోట్ల మార్పిడి అనేది అతిపెద్ద ఆపరేషన్ అని తెలిపారు. ఎప్పటికప్పుడు బ్యాంకుల్లో జరుగుతున్న లావాదేవీలను సమీక్షిస్తున్నామని తెలిపారు. కొత్త నోట్లకు తగ్గట్లుగా ఏటీఎం మెషీన్లు లేవని, ఆ ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు.