నల్గొండలో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య

నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్‌జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్నను హత్య చేసిన ఘటనలో అజ్మీరా వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి 80 రోజుల రిమాండ్ విధించగా అతన్ని మిర్యాలగూడ సబ్‌జైలుకు తరలించారు. అక్కడ రిమాండ్‌లో ఉండగా..గత సోమవారం రాత్రి బాత్‌రూం క్లీనర్ తాగాడు..దీనిని గమనించిన తోటి ఖైదీలు జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు వెంటనే అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు..అనంతరం అక్కడ చికిత్స పొందుతూ వెంకటేశ్వర్లు మరణించాడు. ఇదే కేసులో అతడి భార్య కూడా రిమాండ్ ఖైదీగా ఉండి కొద్ది రోజుల క్రితం బెయిల్‌పై విడుదలైంది.

శాంసంగ్‌పై అవినీతి ఆరోపణలు..

ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీ శాంసంగ్‌కు వారి సొంతదేశంలో ఊహించని షాక్ తగిలింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఉన్న శాంసంగ్ ప్రధాన కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. దేశాధ్యక్షురాలు పార్క్ జ్యున్-హై ఆప్తమిత్రురాలు చాయ్ సూన్-సిల్ అవినీతి కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో శాంసంగ్ కంపెనీలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. జర్మనీలో చాయ్ సూన్‌కు ఉన్న కంపెనీకి శాంసంగ్ అక్రమంగా 3.1 మిలియన్ డాలర్లు బదిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. చాయ్ సూన్ కుమార్తె చుంగ్ యో-రా గుర్రపు స్వారీ శిక్షణ నిమిత్తం ఈ నిధులను బదిలీ చేసినట్లు తెలియడంతో ఈ సోదాలు జరిగాయి. అవినీతి ఆరోపణలతో చాయ్ సూన్ అరెస్ట్ కావడంతో ప్రధాని, ఆర్థిక మంత్రులను దేశాధ్యక్షురాలు పార్క్ జ్యున్-హై ఈనెల 2న తొలగించారు. అంతేకాకుండా రెండు ఎన్జీవోలకు అక్రమంగా నిధులు ఇవ్వాలని స్థానిక కంపెనీలను చాయ్ సూన్ ఒత్తిడి చేస్తున్నారని శాంసంగ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాంగ్మూలం ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ సోదాలు జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  

విమానంలో విషసర్పం..

విమానంలో విష సర్పం..ఇదిదో హాలీవుడ్ సినిమా టైటిల్ కాదు..నిజంగానే జరిగిన సంఘటన. మెక్సికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టొర్రెన్ నుంచి మెక్సికోకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఓ పాసింజర్‌కు లగేజి కంపార్ట్‌మెంట్ వద్ద భారీ సైజులో ఉన్న గ్రీన్ రెప్టైల్ కనిపించింది. దీంతో ప్రయాణికులందరూ షాక్‌కు గురయ్యారు. వారిలో ఒక ప్రయాణికుడు దానిని ఫోన్‌లో బంధించాడు. అనంతరం అందరూ ధైర్యం చేసి క్యాబిన్ నుంచి పాము కిందకు జారిపడకుండా, అది కిందకు పడే ప్రదేశాన్ని బ్లాంకెట్లతో మూసివేశారు. వెంటనే ఈ విషయాన్ని విమాన సిబ్బంది పైలట్లకు తెలియజేశారు. అయితే విమానం చేరాల్సిన గమ్యస్థానం దగ్గర్లోనే ఉండటంతో పది నిమిషాల తర్వాత మెక్సికోలో విమానాన్ని ల్యాండ్ చేశారు. అనంతరం యానిమల్ కంట్రోల్ వర్కర్లు పామును బంధించారు. దీనిపై స్పందించిన ఏరో మెక్సికో సంస్థ విచారణకు ఆదేశించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

భారతీయులపై మళ్లీ నోరుపారేసుకున్న ట్రంప్...

అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే మొదట్లో కాస్త ఎక్కువగానే నోరు పారేసుకున్న ట్రంప్.. ఈ మధ్య కాస్త నెమ్మదించాడు. కానీ ఇప్పుడు తాజాగా మరోసారి ట్రంప్ భారతీయులపై నోరు పారేసుకున్నారు. గతంలో అమెరికా ఉద్యోగాలు ఇండియావారు తన్నుకుపోతున్నారు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలే చేశారు. అమెరికాకు చెందిన ప్రముఖ టెక్‌ సంస్థ ఐబీఎం(ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మెషీన్స్‌ కార్పొరేషన్‌) ఉద్యోగాలను అమెరికా పౌరులకు ఇవ్వకుండా భారత్‌ సహా ప్రపంచదేశాలకు చెందిన వారికి కట్టబెడుతోందని ధ్వజమెత్తారు. మిన్నెపోలిస్‌లోని ఐబీఎం కంపెనీలో సుమారు 500 ఉద్యోగాల్లో భారత్‌తో పాటు పలు దేశాలకు చెందిన వారిని నియమించడాన్ని ఆయన తప్పుపట్టారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఇలాంటి చర్యలకు పాల్పడిన కంపెనీలపై 35శాతం పన్ను విధిస్తానని హెచ్చరించారు. ‘ఏదైనా కంపెనీ మిన్నెసొటా నుంచి వెళ్లిపోవాలనుకుంటే మొత్తం ఉద్యోగులతో సహా పోవచ్చు. వేరే దేశంలో కంపెనీ ఏర్పాటు చేసుకుని మీ వస్తువులను అమెరికాలో అమ్ముకోవచ్చు. అందుకు 35శాతం పన్ను విధిస్తాం’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

రెచ్చిపోయిన ముష్కరుడు.. 9 మంది మృతి

  ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. దక్షిణ సూడాన్‌ రాజధాని జూబాలో ఓ బార్‌లోకి ప్ర‌వేశించిన ముష్క‌రుడు విచక్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపాడు. బార్‌లో ఉన్న వ్య‌క్తులు అక్క‌డ ఏర్పాటు చేసిన టీవీల్లో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తుండ‌గా ఈ కాల్పులు జ‌రిగాయి. ఈ ఘటనలో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా, మ‌రో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల్లో గాయ‌ప‌డిన మ‌రో 11 మందికి ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం...

  శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఎప్పటినుండో వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై కేరళ ప్రభుత్వం ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత కొద్ది సంవత్సరాలుగా రుతుక్రమానికి లోనయ్యే 10 ఏళ్ల బాలికల నుంచి 50 ఏళ్ల మహిళల వరకు శబరిమల ఆలయంలోకి ప్రవేశించరాదన్న నిబంధనను ఆలయ బోర్డు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆలయంలోకి వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలందరికీ ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సుప్రీంకు తెలియజేసింది. దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతండగా     ‘దేవుణ్ణి పూజించడానికి ఫలానా భక్తులు మాత్రమే అర్హులని ఎక్కడైనా ఉంటుందా? అసలు దేవునికి భక్తుల విషయంలో తేడాలు ఉంటాయా? చిన్నాపెద్దా, కులం, మతంతోపాటు లింగబేధం కూడా ఉంటాయా?’ అని ప్రశ్నించింది. ‘ఏ విధానం ఆధారంగా ఆలయాలకు వెళ్లకుండా మహిళలను అడ్డుకుంటున్నారు? దేవుణ్ణి ఎవరైనా ఆరాధించవచ్చు. దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు ఆయన దర్శనానికి స్త్రీ, పురుష వివక్ష ఏమిట’ని సుప్రీం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మహిళల ఆలయ ప్రవేశం విషయంలో సుప్రీంకోర్టుకు తన తాజా నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం తెలిపింది. కేరళ నిర్ణయాన్ని నమోదుచేసుకున్న సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది.

మరో ఉగ్ర దాడికి లష్కరే తాయిబా ప్లాన్...

  భారత్ పై పాక్ ఇప్పటికే పలు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కుట్రలను భగ్నం చేసిన భారత్ ఇప్పుడు తాజాగా మరో దాడికి కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. లష్కరే తాయిబా అధినేత హఫీజ్ సయీద్ భారత్ పై భారీ దాడులకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా కుట్ర పన్నుతున్నట్టు సమాచారం. అయితే సరిహద్దులో ఇప్పటికే భద్రతను  కట్టుదిట్టం చేయడంతో ఉగ్రవాదులు భూమార్గం ద్వారా ఇండియాలోకి ప్రవేశించడం కష్టంగా మారింది. దీంతో జలమార్గం ద్వారా భారత్ లోకి ప్రవేశించాలని భావించి.. నిక్కి, తావి, బడీతావి నదుల ద్వారా ప్రవేశించాలని ప్లాన్ చేసింది. ఈ మొత్తం వ్యవహారానికి ఇంఛార్జ్ గా ఇర్ఫాన్ తండేవాలాను హఫీజ్ నియమించినట్టు సమాచారం. ఈ ఆపరేషన్ లో తొమ్మిది మంది వరకు ఉగ్రవాదులు పాల్గొనే అవకాశం ఉంది. జలమార్గంలో ఉగ్రవాదులు ప్రవేశించవచ్చన్న సమాచారంతో... నదులు, ఇతర జలమార్గాలు ఉన్న అన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఘోర అగ్ని ప్రమాదం... వందకు పైగా ఇళ్లు దగ్దం..

  తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఘార అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వందకు పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం శివారు ధవళేశ్వరం మండలం కొంతమూరు గ్రామం జంగాలపేటలో గ్యాస్‌ సిలిండర్‌ లీకై మంటలు చెలరేగడంతో వందకు పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే రాజమహేంద్రవరం నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.  ప్రమాదంలో సుమారు రూ.30లక్షల ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. ప్రమాదస్థలాన్ని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సందర్శించి బాధితులను పరామర్శించారు.

సోనియా స్థానంలో రాహుల్ గాంధీ..

  కాంగ్రెస్‌​ పార‍్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన సీడబ్ల్యుసీ సమావేశం జరుగుతోంది. అయితే ఈ సమావేశాని అధ్యక్షత  వహించాల్సిన సోనియా గాంధీ మాత్రం హాజరు కాలేదు. దానికి కారణం ఆమెకు ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లనే అని తెలుస్తోంది. ఆమెకు గొంతులో ఇన్ఫెక‌్షన్‌ వచ్చిందని.. ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల ఆమె రాలేదని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా తెలిపారు. ఇక సోనియా గాంధీ గైర్హాజరు కారణంతో రాహుల్ గాంధీ అధ్యక్ష వహించారు. ఈ సదస్సులో ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌ రాష్ట్రాలలో జరిగే ఎన్నికలకు సంబంధించిన పార్టీ వ్యూహాలను రూపొందించడంతో పాటు.. పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటుచేసినట్లు తెలిసింది. సమావేశంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ తదితర సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

జేఎన్యూలో కలకలం...మారణాయుధంతో బ్యాగు

  వివాదాలకు అడ్డాగా మారిన ప్రతిష్టాత్మక జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే క్యాంపస్ లో ఎమ్మెస్సీ బయెటెక్నాలజీ విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యంపై ఆందోళనలు నెలకొనగా.. ఇప్పుడు క్యాంపస్ లో మారణాయుధంతో దొరికిన బ్యాగు కలకలం రేపింది. నిన్న అర్థ్రరాత్రి 2 గంటల సమయంలో ఈ బ్యాగును గుర్తించిన యూనివర్సిటీ సెక్యురిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 7.65 పిస్టల్, ఏడు తూటాలు ఉన్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ బ్యాగు క్యాంపస్ లోకి ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.

హిల్లరీకి ఊరట.. ఎఫ్‌బీఐ క్లీన్ చీట్..

  రేపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్ కు పెద్ద ఊరట లభించింది. ఈ మెయిల్స్ విషయంలో ఆమెకు క్లీన్ చిచ్ ఇచ్చింది ఎఫ్‌బీఐ. హిల్ల‌రీ విదేశాంగ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అధికారిక ఈమెయిల్స్ కోసం ప్రైవేట్ స‌ర్వర్ వినియోగించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జులైలో తాము వెలువ‌రించిన అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేద‌ని.. హిల్ల‌రీ క్రిమిన‌ల్ కేసును ఎదుర్కోవాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టంచేసింది. అయితే గతంలోనే హిల్లరీకి క్లీన్ చిట్ ఇచ్చిన ఎఫ్‌బీఐ.. అప్పుడే క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఆతరువాత హిల్ల‌రీ వ్య‌క్తిగ‌త స‌హాయ‌కురాలు హ్యూమా అబెదిన్ భ‌ర్త ఆంథోనీ వీన‌ర్‌పై విచార‌ణ‌లో భాగంగా ఈ కొత్త ఈమెయిల్స్ బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో కొత్త‌గా దొరికిన‌ ఈమెయిల్స్‌పై తాము పునఃస‌మీక్ష నిర్వ‌హిస్తున్న‌ట్లు ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా 11 రోజుల ముందు ప్ర‌క‌టించి హిల్ల‌రీ క్యాంప్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టించింది ఎఫ్‌బీఐ. ఇప్పుడు దీనిపై విచారించిన ఎఫ్‌బీఐ మరోసారి హిల్లరీకి క్లీన్ చిట్ ఇచ్చారు.   ఈ సందర్భంగా ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ..పునఃసమీక్ష‌లో భాగంగా తాము ప‌రిశీలించిన వేలాది ఈమెయిల్స్‌లో చాలావ‌ర‌కు గ‌తంలో చూసిన‌వాటికి డూప్లికేట్‌వే అని, వీటిలో వ్య‌క్తిగ‌త మెయిల్స్ కూడా ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. అందుకే విచార‌ణ త్వ‌రిత‌గ‌తిన పూర్త‌యింద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. విదేశాంగ మంత్రిగా ఉంటూ సున్నితమైన వివ‌రాల‌పై హిల్ల‌రీ అజాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించారు త‌ప్ప‌.. అధికార దుర్వినియోగానికి మాత్రం పాల్ప‌డ‌లేద‌ని చెప్పారు. కాగా తాజాగా మ‌రోసారి క్లీన్‌చిట్ ద‌క్క‌డం ఎన్నిక‌ల్లో హిల్ల‌రీకి క‌లిసొచ్చేదే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

భారత్ - యూకే టెక్ సదస్సు.. మోడీ తో బ్రిటన్ ప్రధాని..

  ఈరోజు ఢిల్లీలో భారత్ - యూకే టెక్ సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని థెరిసా మే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. సాంకేతికాభివృద్ధికి ఇరు దేశాలూ పరస్పర సాయం చేసుకోవాల్సి వుందని అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఇండియా, బ్రిటన్ దేశాల మధ్య సంబంధం మరింతగా పెరగాలని.. సాంకేతికాభివృద్ధికి ఇరు దేశాలూ పరస్పర సాయం చేసుకోవాల్సి వుందని అన్నారు. తమ దేశంలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని, బ్రిటన్ నుంచి కూడా పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ మెంట్స్ ఇప్పటికే వచ్చాయని గుర్తు చేశారు. అందుకు బ్రిటన్‌ ప్రధానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.   ఇంకా ఈ సందర్భంగా థెరెసా మే మాట్లాడారు. ఈ రెండు దేశాల మధ్య ప్రత్యేక బంధం ఉందన్నారు. ఈ బంధం మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఒక్క ఆర్థిక విషయాల్లోనే కాకుండా ఇతర విషయాల్లో బ్రిటన్, భారత్‌కు మధ్య దగ్గర పోలికలున్నాయని తెలిపారు. సామాజిక, ఆర్థిక సంస్కరణలపై దృష్టి సారించామన్నారు. భారత పెట్టుబడులు బ్రిటన్ ఆర్థిక రంగానికి సహాయం చేస్తాయని చెప్పారు.

ఢిల్లీ కాలుష్యం... ఎవరూ బయటకు రావద్దు..

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు వందల స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మరోవైపు ఈ కాలుష్య నివారణ చర్యలను సైతం చేపట్టింది. పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు కళ్లల్లో మంట, శ్వాసకోశ సమస్యలకు గురవుతుండటంతో ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. అత్యవసర పనులు ఉంటే తప్పించి.. ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించింది. గాలిలో దుమ్మ, ధూళి శాతాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షం కురిపించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే కేంద్రాన్ని సంప్రదించినట్లు సమాచారం. మరోవైపు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేశారు.

బిల్ క్లింటన్ ను ఏమని పిలవాలి...?

  అమెరికా అధ్యక్ష ఎన్నికలు రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ అధ్యక్షబరిలో ఉన్న డొనాల్డ్  ట్రంప్, హిల్లరీ క్లింటన్ లతో పాటు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలియదు కానీ ఇప్పుడు ఓ ప్రశ్న మాత్రం చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. బిల్ క్లింటన్ ను ఏమని పిలవాలి. విచిత్రంగా ఉంది కదా.. అసలు సంగతేంటంటే.. ఒకవేళ ఈ ఎన్నికల్లో  హిల్లరీ క్లింటన్ కనుక గెలిస్తే ఆమె భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ను ఏమని పిలవాలి? అన్న ప్రశ్న ఇప్పుడు అమెరికాలో మిలియన్ డాలర్ల ప్రశ్నట. ఎందుకంటే.. ఇంతకుముందెన్నడూ ఓ మహిళ అమెరికా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించలేదు కాబట్టి, ఈ ప్రశ్నకు సమాధానం ఆలోచించాల్సిన అవసరమూ లేకపోయింది. దీంతో ఇప్పుడు, హిల్లరీ గెలిస్తే, బిల్ ను ఏమనాలన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో పలు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.. హిల్లరీ కనుక గెలిస్తే.. ఇక బిల్ ను 'మిస్టర్ ప్రెసిడెంట్' అనవచ్చని, 'ఫస్ట్ జంటిల్ మెన్' అనాలని ఎవరికి తోచిన సలహా వారు ఇస్తున్నారు. మరి చూద్దాం ఎవరు గెలుస్తారో..

అపూర్వ భారత్‌ ప్రచారకర్తగా మోడీ...

  ప్రధాని నరేంద్ర మోడీ అపూర్వ భారత్‌ ప్రచారకర్తగా నియమితులయ్యారు. అపూర్వ భారత్ ప్రచారకర్తగా ప్రధాని నరేంద్ర మోదీని నియమించాలని కేంద్ర పర్యాటక శాఖ నిర్ణయం తీసుకుంది. అపూర్వ భారత్‌ ప్రచారకర్తగా ఆమిర్‌ఖాన్‌ గడువు ముగిసిన తర్వాత ఆ స్థానంలో కేంద్రం మరొకరిని నియమించలేదు. ఇక ప్రచారకర్తగా బాలీవుడ్ ప్రముఖుల్ని నియమించే సంప్రదాయాన్ని పర్యాటక శాఖ పక్కకు పెట్టింది. అపూర్వ భారత్‌ ప్రచారకర్తగా ఇకపై బాలీవుడ్‌ నటులను నియమించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్బంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మనీశ్‌ శర్మ మాట్లాడుతూ..విదేశీయులను ఆకర్షించేందుకు మోదీనే సరైన వ్యక్తి అని..గతంలో మోదీ చేసిన ప్రసంగాలను ప్రకటనలుగా రూపొందించి ప్రసారం చేస్తామని వెల్లడించారు. కాగా అమితాబ్‌ బచ్చన్‌, ప్రియాంక చోప్రాల్లో ఎవరో ఒకరిని నియమించనున్నారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.