తుంగభద్ర నీటి వివాదం.. వైసీపీ నేతల గృహ నిర్భంధం..

  తుంగభద్ర ఆయకట్టు భూములకు నీటిని తక్షణం వదలాలని వైసీపీ నేతలు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పలువురు వైసీపీ నేతలను గృహ నిర్భంధం చేశారు పోలీసులు. అనంతపురంలో వైసీపీ నేతలు ఆందోళనలు చేపట్టగా..  వైకాపా నేతలు పెద్దఎత్తున తరలివచ్చారు. అంతేకాదు వారికి వేలాది మంది కార్యకర్తలు, రైతులు మద్దతు పలికారు. దీంతో పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. వైకాపా నేతలు ర్యాలీ జరపకుండా, ఎలాంటి నిరసనలు తెలియజేయకుండా చూసేందుకు పలువురిని గృహ నిర్బంధం చేశారు. పార్టీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, గుర్నాథరెడ్డి, పద్మావతిని హౌస్ అరెస్ట్ చేశారు. వైకాపాకు మద్దతు తెలిపిన సీపీఎం, సీపీఐ నేతలను సైతం ఇల్లు కదలనివ్వకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. దీంతో వైసీపీ నేతలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు అడిగిన పాపానికి ఇలా ఇళ్ల నుంచి బయటకు కదలనీయకపోవడం దుర్మార్గమని ఆరోపించారు.  

మీడియాపై అశ్విన్ ఫైర్.. పదే పదే ఎందుకు అడుగుతారు..?

  క్రికెటర్స్ అప్పుడప్పుడు మీడియాపై ఆగ్రహం చెందుతూనే ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలో టీమిండియా స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ కూడా చేరిపోయారు. ఇండియన్ పిచ్ గురించి మీడియా ఈయనను ప్రశ్నలడగగా సహనం కోల్పోయిన రవిచంద్రన్ అశ్విన్ ఆగ్ర‌హం వ్యక్తంచేశాడు. పిచ్ గురించి మీ కామెంట్ ఏంట‌ని ప్ర‌శ్నించ‌గా.. రోజంతా మ్యాచ్‌ను చూసే మీడియానే త‌మ కంటే బాగా పిచ్ గురించి చెప్ప‌గ‌ల‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. పిచ్‌పై ప‌దే ప‌దే ప్ర‌శ్నలు ఎందుకు అడుగుతారో అర్థం కాద‌ని అశ్విన్ అన్నాడు. ఏదో ఒక‌రోజు ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌ల‌లో పిచ్‌ల గురించి స‌మాధానం చెప్ప‌డం తాను ఆపేస్తాన‌ని చెప్పాడు.

జకీర్ నాయక్ కు కేంద్రం ఝలక్...ఏకకాలంలో దాడులు

   ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్ చేసే ప్రసంగం ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా ఉందని ఆయనపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు కూడా నమోదైంది. అయితే ఇప్పుడు మరోసారి కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఝలక్ ఇచ్చింది. ఆయనపై జాతీయ దర్యాప్తు సంస్థ వేట మొదలుపెట్టింది. మహారాష్ట్రలోని ఆయన నిషేధిత సంస్థతో సంబంధం కలిగి ఉన్న పది ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఇందులో ఆయనకు సంబంధించిన ఆస్తుల పత్రాలు, ఆ సంస్థలకు జకీర్ కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే విషయంపైనా ఆరా తీస్తుంది. ఐదేళ్ల పాటు ఐఆర్ఎఫ్ పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఐఆర్ఎఫ్ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర కేబినేట్ నిర్ధారించింది.

బీజేపీ నేత వద్ద 91 లక్షలు స్వాదీనం....

  కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం లేకున్నా..నల్ల కుబేరులు మాత్రం సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ మంత్రిగారు చిక్కుల్లో పడ్డారు. అది కూడా ఏ పార్టీ అయితే కేంద్రంలో అధికారంలో ఉందో.. అది కూడా నోట్లు రద్దు చేసిన పార్టీ బీజేపీయే కావడం ఆశ్చర్యకరం. బీజేపీ పార్టీకి చెందిన సుభాష్‌ దేశ్‌ముఖ్‌ నుంచి 91 లక్షలా 50 వేల రూపాయల విలువైన 500, 1000 రూపాయల నోట్లను మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోలాపూర్‌లో మంత్రికి చెందిన ఎన్జీవో వాహనంలో డబ్బును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డబ్బుతో పాటు వాహనాన్ని సీజ్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. అంతేకాదు ఈ డబ్బును జిల్లా ట్రెజరీలో డిపాజిట్‌ చేసినట్టు తెలిపారు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఈ డబ్బు తన వద్ద ఉంచుకున్నట్టు ఆయన పోలీసులకు తెలిపారు. ఇక దీనిపై స్పందించిన ప్రతి పక్ష నేతలు మంత్రి పదవి నుంచి దేశ్‌ముఖ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

జయలలిత ఎప్పుడైనా డిశ్చార్జ్ అవ్వచ్చు...

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడిందని.. ఆమె ఎప్పుడైనా డిశ్చార్జి కావొచ్చని  ఏఐఏడీఎంకే వర్గాలు స్పష్టం చేశాయి. గత కొద్ది కాలంగా చెన్నై లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయ ఆరోగ్యంపై ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. ఆమె ఆరోగ్యం కుదుటపడిందని.. త్వరలోనే ఆమె డిశ్చార్జ్ అవుతుందని పలుమార్లు చెప్పారు. ఇప్పుడు కూడా అలానే చెబుతున్నారు పార్టీ నేతలు. అమ్మ కూర్చోగలుగుతుంది..మాట్లాడగలుగుతుంది.. తనంతటకు తానే ఆహారం తీసుకుంటుందని.. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్, శ్వాసవ్యవస్థ పూర్తిగా మెరుగుపడిందని.. ఆస్పత్రి నుంచి అమ్మ ఎప్పుడైనా డిశ్చార్జి కావొచ్చని చెప్పారు.

ప్రజల వద్దకు వెళ్లి వాస్తవాలు వివరించండి...

పెద్ద నోట్లపై పార్లమెంట్ లో పెద్ద రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉభయ సభల్లో దీనిపై చర్చ జరపాలని.. ప్రధాని దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ ఈరోజు మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక శాఖ చర్యలపై ప్రజల నుంచి సానుకూలత..పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక శాఖ చేపట్టిన చర్యలు పటిష్టంగా అమలయేలా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యక్తమవుతుందన్నారు. కొద్ది రోజుల్లో అన్ని సజావుగా సాగుతాయని.. మంత్రులంతా క్షేత్రస్తాయిలోకి వెళ్లి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని.. శని, ఆదివారాల్లో ఎంపీలంతా ప్రజల వద్దకు వెళ్లి వాస్తవాలు వివరించాలని నిర్దేశించారు.

చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది...

పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ లో పెద్ద రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. నోట్ల రద్దుపై చర్చ జరపాలని ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అయితే దీనిపై స్పందించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని విపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతామని.. సభను కాంగ్రెస్ తప్పుదోవ పట్టించాలని చూస్తోందని విమర్శించారు. ప్రధాని సభకు కచ్చితంగా రావాలని ఎందుకు కోరుతున్నారని.. అవసరమైన సమయంలో ప్రధాని సభకు వచ్చి సమాధానం చెబుతారన్నారు.

బీజేపీలో బ్రహ్మచారులు ఎక్కువ.. అందుకే ఈ నిర్ణయం..

  ప్రధాని నరేంద్ర మోడీ నల్లధనాన్ని అరికట్టే దిశలో భాగంగా పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆరోజు నుండి ఈ రోజు వరకూ ప్రతి పక్షాలు ఈ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి యోగా గురువు రాందేవ్ బాబా కూడా చేరిపోయారు. నోట్ల రద్దుపై స్పందించిన ఆయన బీజేపీ నేతలపై విమర్సలు గుప్పించారు. భాజపాలో ఎక్కువ మంది పెళ్లి కాని ఉన్నారు.. అందుకే ఇది పెళ్ళిళ్ల సీజన్‌ అని వారు గ్రహించలేదు.. అదే తప్పు.. అని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ వ్యాఖ్యానించారు. పెళ్లిళ్ల సీజన్ లో నోట్ల రద్దును ప్రకటించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని...  రాంగ్ టైమ్ లో నోట్లను రద్దు చేశారని కామెంట్లు విసిరారు. వివాహ సీజన్ లో ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం తప్పేనని.. "ఇదే నిర్ణయాన్ని ఓ నెల రోజుల తరువాత ప్రకటించి వుంటే, పెళ్లిళ్లకు విఘాతం కలిగుండేది కాదు. అయినా ఇక్కడ ఓ మేలు కూడా జరిగింది. చాలా పెళ్లిళ్లు కట్నాలు లేకుండానే జరుగుతున్నాయి" అన్నారు.

ఇంక్ గుర్తుపై ఎన్నికల సంఘం ఆగ్రహం...

  పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పాత నోట్ల మార్పిడి కోసం జనం బ్యాంకుల వద్ద బారులు తీస్తున్నారు. అయితే తీసుకుంటున్న వారే పదే పదే వచ్చి తీసుకుంటున్న నేపథ్యంలో ఈ చర్యలను అరికట్టడానికి గాను కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బును ఎక్సేంజ్ చేసుకునేపుడు బ్యాంకు అధికారులు వారి ఎడమ చేతి చూపుడు వేలుకు సిరా గుర్తు పెట్టడం. నిన్నటి నుండి ఈ పద్దతి అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయినట్టు సమాచారం. నోటు మార్పిడి చేసుకునే వారికి ఇంకు గుర్తు పెట్టడం ఏంటని ప్రశ్నించింది. త్వరలో ఐదు రాష్ర్టాల్లో ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ హెచ్చరిక చేసినట్టు తెలుస్తోంది. మరి కేంద్ర ప్రభుత్వం దీనికి స్పందిస్తుందో లేదో చూడాలి.  

ప్లేట్లు ప‌ట్టుకొని విప‌క్షాల నిరసన...

పార్లమెంట్ లో పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు తీవ్ర ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజుల నుండి ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై ప్రధాని మోడీ చర్చ జరపాలని.. స్పష్టత ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారు వినూత్నంగా తమ నిరసనను తెలిపారు. పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద చేతిలో ప్లేట్లు ప‌ట్టుకొని విప‌క్షాలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ప్రజలు ఇప్పుడు ఏం తినాలి.. ఏటీఎం కార్డుల‌ను తింటారా? భారతదేశాన్ని మొత్తం క్యూలో నిలబెట్టారని, ప్ర‌తి ఒక్క‌రినీ బిక్ష‌గాళ్లలా మార్చారంటూ చేతిలో ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దుతో మొత్తం క‌ష్టాలేన‌ని, వ‌చ్చేదేమీలేద‌ని నినాదాలు చేస్తున్నారు.

ఉభయ సభల్లో నోట్ల రచ్చ... వాయిదాల పర్వం

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వేడి వేడిగా సాగుతున్నాయి. లోక్ సభలోనూ, రాజ్యసభలోనూ నోట్ల రద్దుపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్‌ సహా అన్ని పక్షాలు ఆందోళన కొనసాగించగా..లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.   ఇక రాజ్యసభలోనూ అదే పరిస్థితి కొనసాగుతుంది. విపక్ష సభ్యులు ఛైర్మన్‌ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్‌ కురియన్‌ ఎంత నచ్చజెప్పినప్పటికీ వారు వినకపోవడంతో సభను వాయిదా వేశారు.

మళ్లీ రాజకీయాల్లోకి గాలి... రీ ఎంట్రీకి ప్లాన్...

  గాలి జనార్ధన్ రెడ్డి మళ్లీరాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారా..? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా తన కూతురి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి.. తన కూతురి పెళ్లి అనంతరం రాజకీయ రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఈనేపథ్యంలోనే ఆయన ఆ దిశగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఆయన బీజేపీ పార్టీలో మంత్రిగా పని చేశారు. ఆ తరువాత.. 2011లో గనుల అక్రమ తవ్వకం ఆరోపణలపై అరెస్ట్ అయి, ఆపై షరతులతో కూడిన బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన, రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి ఆయన రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నట్టు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అయితే మళ్లీ బీజేపీలోకే వెళ్లాలని చూస్తున్నట్టు సమాచారం. పైగా కేంద్రంలో కూడా ఆ పార్టీయే అధికారంలోకి ఉండటంతో గాలి బీజేపీలోకే చేరే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. మరి గాలి ఎంట్రీకి బీజేపీ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో..లేదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

పెట్రోల్ ట్యాంకర్ పేలి 73 మంది మృతి...

  పెట్రోల్ ట్యాంకర్ పేలి 73 మందికి పైగా మృతి చెందగా.. వందమందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటన మొజాంబిక్ లోని టెటె ఏరియాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..  మొజాంబిక్ లోని బీరా నగరం నుంచి మాలావికి ఓ ట్యాంకర్ పెట్రోల్ లోడ్‌తో వెళ్తుండగా మార్గం మధ్యలో వాహనాన్ని నిలపగా.. పెట్రోల్ కొనుగోలు చేసేందుకు టెటె గ్రామస్తులు ట్యాంకర్ చుట్టూ గుమిగూడారు. ఆ సమయంలో అది పేలడంతో 73 మంది అక్కడికక్కడే మరణించారు. మ‌రో 110 మంది గాయ‌ప‌డ్డారు. అందులో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. స్థానికుల దాడి వ‌ల్లే ఆ ట్ర‌క్కు పేలి ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. పేలుడు ఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించనుందని తెలిపారు.