సుష్మాస్వరాజ్‌ కు కిడ్నీ ఆపరేషన్..!

  బీజేపీ సీనియర్ నేత, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ కిడ్నీ ఫెయిల్ కావడంతో ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆమెనే స్వయంగా ఈవిషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ప్రస్తుతం డయాలిసిస్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే ఆమెకు త్వరలో ఆపరేషన్ జరగనున్నట్టు తెలుస్తోంది. కిడ్నీ దానానికి ఆమె కుటుంబసభ్యులు ప్రస్తుతం అందుబాటులో లేనందువల్ల వెంటనే ఆపరేషన్ చేయలేమని డాక్టర్లు తెలిపారు. కిడ్నీదాత దొరికి ఆపరేషన్ చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా  సుష్మకు కిడ్నీ ఇస్తానని రాహుల్‌వర్మ అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక విషయం తెలుసుకున్న పార్టీ నేతలు ఆమెను పరామర్శించడానికి తరలివస్తున్నారు.

పాకిస్థాన్ అబద్ధాలు చెబుతోంది..

  భారత సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా కూడా పాక్ పలు మార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అయితే ఈ కాల్పుల్లో భారతసైన్యాన్ని హతమార్చామని పాక్ చెబుతున్న మాటలను భారత్ ఖండిస్తుంది. కాల్పుల్లో 11 మంది భారత జవాన్లను హతమార్చామని పాకిస్థాన్ ప్రకటన చేసిన నేపథ్యంలో దీనిపై స్పందించిన భారత్..పాకిస్థాన్ పచ్చి అబద్ధాలు చెబుతోందనికాల్పుల్లో ఎవరూ పెద్దగా గాయపడలేదని నార్త్ రన్ కమాండ్ పేర్కొంది. 14న భారత పోస్టులపై దాడులు చేసి 11 మందిని చంపామనడం అవాస్తవమని తెలిపింది.   కాగా నిన్న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ మేనేజర్ రహీల్ షరీఫ్ మాట్లాడుతూ, భారత్ కాల్పుల్లో ఏడుగురు పాక్ జవాన్లు అమరవీరులయ్యారని, ప్రతిగా పాక్ చేసిన దాడిలో 11 మంది హతమయ్యారని చెప్పిన సంగతి తెలిసిందే.

మోడీ ఎప్పుడో వార్నింగ్ ఇచ్చారు..

  పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేతలు మోడీ తీసుకున్న ఈ నిర్ణయంపై మండిపడుతున్నారు. అయితే ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..  కేంద్ర ప్ర‌భుత్వం దేశంలో న‌ల్ల‌ధ‌నాన్ని వెలికి తీసే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని..  ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌లించేందుకు విప‌క్షాలు ప్ర‌య‌త్నిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తాము చెందుతున్న ఆందోళ‌న నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని, నిజానిజాల‌ను ప‌రిశీలించాల‌ని సూచించారు. 50 రోజులు ఓపిక ప‌ట్టాల‌ని ఎందుకింత హ‌డావుడి చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌తిప‌క్షాల‌ను ప్ర‌శ్నించారు. భార‌తీయులు ఎవ్వ‌రూ మోదీ తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల ప్ర‌శ్నించ‌డం లేద‌ని.. ప‌న్ను ఎగ్గొడుతున్న వారికి ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ ఎప్పుడో వార్నింగ్ ఇచ్చారని తెలిపారు.

ట్రంప్ కు ఓటు వేసినందుకు...

  ట్రంప్ కు ఓటు వేసినందుకు గాను అమెరికాలో ఓ భార్య తన భర్తకు విచిత్రమైన శిక్షను విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ట్రంప్ కు ఓటు వేసినందుకు ఓ తల్లి ఏకంగా తన కొడుకును ఇంట్లో నుండి గెంటేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఓటు వేసింది నిజమైన ఎన్నికల్లో కూడా కాదు.. స్కూల్ లో. యూఎస్‌లోని టెక్సాస్‌ నగరంలో ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. స్కూల్లో జరిగిన మాక్‌ ఎలక్షన్స్‌లో ట్రంప్‌కు ఓటు వేశాడని తెలుసుకున్న ఆ బాలుడి తల్లి కొడుకుపై చేయి చేసుకోవడమే కాక.. అతని బట్టలు, సామాగ్రిని సూట్‌కేస్‌లో సర్ది ఇంటి నుంచి బయటకి పంపింది. ‘బై.. డొనాల్డ్‌ ట్రంప్‌ లవర్‌’ అంటూ ఆ తల్లి బాలుడి ముఖంపై తలుపు వేసేసింది. దీంతో ఆ బాలుడు బోరున విలపించాడు. తలుపు తీయమంటూ తల్లిని బతిమాలాడు. రేపు తనకు స్కూలుందని చెప్పాడు. అయినా ఆమె వినిపించుకోలేదు సరికదా ఆ విషయం ముందే ఆలోచించి ఉండాల్సింది అని కోప్పడింది.   కాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన ట్రంప్ 45వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

పాక్ మరో దుస్సాహసం...

  భారత్-పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో భాగంగా ఈరోజు పాక్ మరో దుస్సాహసం చేసింది. అదేంటంటే..సరిహద్దుల వెంబడి సైనిక విన్యాసాలు చేస్తోంది. అంతేకాదు ఈ విన్యాసాలు పర్యవేక్షించడానికి స్వయంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫే అక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధానితో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ కూడా హాజరయ్యారు. హెలికాప్టర్ గన్‌షిప్‌లు, పదాతి దళాలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏదైనా అవాంఛిత పరిస్థితి వస్తే తమ సైన్యం దాన్ని ఎదుర్కోడానికి ఎంతవరకు సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఈ సైనిక విన్యాసాలు సూచిస్తాయని పాక్ భద్రతా అధికారులు చెబుతున్నారు. తమపై దాడి జరిగితే కాపాడుకోగల సామర్థ్యం ఉందన్నారు.

గాలి వారి పెళ్లిపై దాడికి ఐటీ శాఖ సిద్దం..

  గాలి జనార్ధన రెడ్డి కుమార్తె వివాహం ఈరోజు అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకకు.. దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు గాలి జనార్థన్ రెడ్డి కొన్ని కోట్లు ఖర్చు చేశారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఐటీ శాఖకు పిర్యాదు అందినట్టు తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన సీనియర్ అడ్వొకేట్ టి.నరసింహమూర్తి ఈ పెళ్లి ఖర్చులకు సంబంధించి ఐటీ శాఖకు ఫిర్యాదు చేశారు. మొత్తం నాలుగు పేజీల ఫిర్యాదులో గాలి జనార్దన్ రెడ్డి పెద్ద మొత్తంలో ఆదాయపు పన్ను ఎగవేశారని.. కూతురి పెళ్లి కోసం గాలి దాదాపు రూ. 650 కోట్లు ఖర్చు చేశారు..ఇంత ఘనంగా పెళ్లి జరిపించడానికి ఆయనకు ఇంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో, ఆయనకున్న ఆదాయ మార్గాలు ఏమిటో వెల్లడించాలని కోరారు. ఇక ఈ ఫిర్యాదుతో పెళ్లి వేడుకపై దర్యాప్తు చేయడానికి ఐటీ శాఖ సిద్ధమయింది.

బ్యాంకుకు పవన్ కళ్యాణ్... నోట్లు మార్పిడి..

  సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ తల్లికే నోట్ల మార్పిడి కష్టాలు తప్పలేదు. రాజకీయ నేతలు, సెలబ్రిటీలు కూడా నోట్ల మార్పిడి కోసం ఇక సామాన్య ప్రజల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఇదే క్రమంలో జనసేన అధినేత, ప్రముఖ సినీ హీరో పవన్ కల్యాణ్ హైదరాబాద్ లోని ఓ బ్యాంకుకు స్వయంగా వచ్చి, తన వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకున్నారు. అందుకు సంబంధించి పవన్ బ్యాంకులో కూర్చున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, బ్యాంకుకు పవన్ వచ్చారన్న విషయం చుట్టుపక్కల పొక్కడంతో, ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. అయనను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. కానీ, ఆయన మాత్రం తన పనిని పూర్తి చేసుకుని, అక్కడ నుంచి త్వరగా వెళ్లిపోయారు.

ఎస్‌బీఐ బంపరాఫర్.. డిఫాల్ట‌ర్ల రుణాల రద్దు..

  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వ్యాపార వేత్తలకు ఓ బంపరాఫర్ ఇచ్చింది. అదేంటంటే తమ వద్ద రుణం తీసుకొని ఎగ్గొట్టిన వ్యాపార వేత్తలకు ఊర‌ట క‌లిగించే ప్ర‌క‌ట‌న చేసింది. మొత్తం 63 మంది డిఫాల్ట‌ర్లకు చెందిన రూ.7 వేల కోట్ల మొండి బ‌కాయిల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఎస్‌బీఐ పేర్కొంది. ఇందులో వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఒగనామం వేసి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా పేరు కూడా ఉంది. విజ‌య్ మాల్యాకు చెందిన బ‌కాయిల‌ను కూడా ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఎస్‌బీఐ పేర్కొంది. ఈ బ్యాంకులో  లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సంబంధించిన రూ.1,201 కోట్లు ఉండగా..విక్టరీ ట్రాన్స్ అండ్ స్విచ్‌గేర్స్ రూ.65 కోట్లు, ఘన్‌శ్యామ్ దాస్ జెమ్స్ అండ్ జెవెల్స్ రూ.61 కోట్లు, యాక్సిస్ స్ట్రక్చరల్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.51 కోట్లు, టోటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ.93.68 కోట్లు, తదితర కంపెనీల బకాయిల మాఫీ జరిగింది.

క్రికెట్ బోర్డులో తొలి మహిళ...

  క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ పదవికి ఓ మహిళ  ఎన్నికై ప్రపంచ క్రికెట్ చరిత్రలో రికార్డ్ సృష్టించింది. అయితే ఇది మన దేశ క్రికెట్ బోర్టులో కాదులెండి. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులో జరిగింది. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధ్యక్షురాలిగా డెబ్బీ హాక్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  మూడు సంవత్సరాల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. కాంటర్ బెరీ క్రికెట్ల నుంచి ఈ పదవికి డెబ్బీ నామినేషన్ వేశారు. 122 ఏళ్ల చరిత్ర గల న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులో ఎన్నికైన మొదటి మహిళగా ఈమె చరిత్ర సృష్టించారు. కాగా డెబ్బీ హాక్లీ 1979లో క్రికెట్ లో ఆరంగేట్రం చేశారు. 2000 సంవత్సరంలో ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు.

నోట్ల రద్దు.. పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ కు ర్యాలీ

  పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమయ్యాయో లేదో.. సభలో నోట్ల రద్దు విషయంపై అప్పుడే గందరగోళం నెలకొంది. విపక్షాలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. ఈ నిర్ణయంపై మొదటినుండి వ్యతిరేకత చూపించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈరోజు పార్లమెంట్లో కూడా తన నిరసన గళాన్ని విప్పారు. ఇంకా మమతా బెనర్జీకి ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన పార్టీలు మద్దతుగా నిలిచాయి. దీంతో 500, 1000 నోట్ల రద్దు కారణంగా దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్రం తయారు చేసిన ఆర్ధిక ఎమర్జెన్సీని ఎత్తివేయాలని పార్లమెంట్ నుండి రాష్ట్రపతి భవనం వరకూ ర్యాలీ నిర్వహించారు.

మోడీ ఆ పని చేస్తే తెలిసేది...

నల్లధనంపై మోడీ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. నల్లధనం పేరుతో ప్రధాని మోదీ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తనపాటికి తాను నిర్ణయం తీసుకున్నారు.. దానివల్ల ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు. బ్యాంకుల వద్ద క్యూ లైన్లలో నిల్చుంటే మోదీకి ప్రజల బాధ తెలిసేది..ఈ నిర్ణయం వల్ల ధనికులు ఇబ్బందులు పడతారు అనుకున్నారు కానీ.. వారు మాత్రం ఎలాంటి ఇబ్బందులు పడటంలేదు.. క్యూ లైన్లలో సామాన్య ప్రజలు నిల్చుంటున్నారు.. ధనికులు ఎందుకు నిల్చోవడం లేదు అని ప్రశ్నించారు. 5 మంది కోసమే మోదీ పాలన.. ఆ పదిహేను మంది ఎవరో దేశ ప్రజలకు తెలుసన్నారు. దేశ ప్రజలు ఏడుస్తుంటే మోదీ నవ్వుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పార్లమెంట్లో ఈ విషయంపై చర్చలు జరుపుతాం... పార్లమెంట్ ను స్థంభింపజేస్తాం అని మండిపడ్డారు.

మేం చర్చకు సిద్ధం: మోడీ

పార్లమెంట్‌లో తాము ఏ అంశంపైనైనా..ఎలాంటి చర్చకైనా సిద్ధమన్నారు ప్రధాని నరేంద్రమోడీ..పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకావడానికి ముందు ప్రధాని సీనియర్ మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..గత సమావేశాల్లో జీఎస్‌టీ లాంటి ముఖ్యమైన బిల్లు ఆమోదం పొందిందని..అందుకు అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపినట్లు చెప్పారు. ప్రస్తుత సమావేశాల్లోనూ అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని..మంచి వాతావరణంలో చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. సభ సజావుగా జరిగేలా ప్రతిపక్ష సభ్యులు సహకరించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. మరోవైపు పెద్ద నోట్లపై పార్లమెంట్‌లో దుమారం రేపేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్న వేళ ప్రధాని ప్రకటన ఆసక్తిని రేకిత్తిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ గాడ్..

భారత క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ఇవాళ ఆంధ్రప్రదేశ్‌‌కు రానున్నారు. తాను దత్తత తీసుకున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగ‌లో ఆయన పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సచిన్ ఆ గ్రామానికి చేరుకుంటారు..అనంతరం 1.15 కోట్ల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఆ తరువాత గ్రామస్థులతో స్వచ్ఛభారత్‌పై ముఖాముఖి నిర్వహించి, ఊరంతా పర్యటించి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతులను పరిశీలించనున్నారు. తరువాత 1.60 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న గొల్లపల్లి, నెర్నూరు గ్రామాల్లోని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. సచిన్ రాకను పురస్కరించుకుని గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.

కోర్టుకు హాజరైన రాహుల్

ఆర్ఎస్ఎస్‌ పరువు నష్టం కేసులో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ ముంబైలోని బివండి కోర్టుకు హాజరయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 2014 మార్చి 6న బీవండిలోని ఓ బహిరంగసభలో రాహుల్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మహాత్మా గాంధీని హత్య చేసింది ఆర్ఎస్ఎస్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్ఎస్ఎస్ కోర్టును ఆశ్రయించింది..తమ పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పరువు నష్టం దావా వేసింది. ఈ నేపథ్యంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలన్న కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇవాళ బీవండిలోని న్యాయస్థానానికి వచ్చారు.

ఇవాళ్టీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ్టీ నుంచి ప్రారంభంకానున్నాయి. ముఖ్యంగా పెద్దనోట్ల రద్దు, యూరీ ఉగ్రదాడీ, కశ్మీర్ అల్లర్లు వంటి అంశాలపై ప్రతిపక్షం, అధికారపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమైంది. యూరీ ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. దానికి తోడు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయడంతో పాటు నల్లధనానికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. జాతి ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం సరైనదే అయినా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయాల్లో పైచేయి సాధించేందుకు అధికార, విపక్షాలు ఎత్తులు, పై ఎత్తులతో రెడీ అవ్వడంతో పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలున్నాయి.

ట్రంప్ కు పుతిన్ ఫోన్...

  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఇప్పటికే పలు దేశాల నేతలు అభినందనలు తెలపగా ఇప్పుడు ట్రంప్ కి ప్రత్యర్థ దేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆ త‌రువాత ఇరువురు నేత‌లు ఇరు దేశాల మ‌ధ్య స‌త్సంబంధాల‌తో పాటు, పలు అంశాల‌ గురించి చ‌ర్చించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి  ట్రంప్‌ తరఫున ఓ ప్రకటన విడుదలైంది. అందులో అమెరికా, ర‌ష్యా మ‌ధ్య ప్రస్తుతం స‌త్సంబంధాలు స‌రిగాలేవ‌ని ఇరువురు నేత‌లూ ఒప్పుకున్నార‌ని, ఇరు దేశాల మ‌ధ్య‌ సాధారణ స్థితి వ‌చ్చేందుకు కృషి చేయాల‌ని మాట్లాడుకున్న‌ారని.. రష్యాతో స‌త్సంబంధాలు కొన‌సాగించ‌డానికి తాము కూడా ఎదురుచూస్తున్నామ‌ని పుతిన్‌కి ట్రంప్ తెలిపినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇద్దరు ముఖాముఖి కలుసుకోవడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు సమాచారం.