నాలుగోరోజు గృహ నిర్బంధంలో ముద్రగడ... భారీగా పోలీసులు

  కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గత నాలుగు రోజులుగా ఆయన గృహ నిర్బంధంలోనే ఉండగా... ఆయన, ఏ క్షణమైనా బయటకు తప్పించుకు వచ్చి వెళ్లిపోగలడని భావించి పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అంతేకాదు  అతని కదలికలను బాడీ వార్మ్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు. ఈ విధానంలో శరీరంలో వేడి హెచ్చతగ్గుల ఆధారంగా థర్మల్ బేస్డ్ వీడియో లభిస్తుంది. మరోవైపు ముద్రగడ మాట్లాడుతూ, పోలీసులు ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండమంటే అన్ని రోజులు ఉంటానని, వారు వెళ్లిపోయిన తరువాతే పాదయాత్ర చేపడతానని స్పష్టం చేశారు. పోలీసుల నుంచి స్వేచ్ఛ లభించిన తరువాత జాయింట్ యాక్షన్ కమిటీతో చర్చిస్తానని స్పష్టం చేశారు.   ఇదిలా ఉండగా ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేపట్టాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఈయన పాదయాత్ర పై కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు ముద్రగడకు అనుకూలంగానే తీర్పు నిచ్చింది. ఆయన పాదయాత్రకు అనుమతించింది.

మహిళా అధ్యక్షురాలికి అవమానం.... బహిరంగ సభలలో మాట్లాడరాదు...

  ఓ పక్క మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా..మరోపక్క మాత్రం వారిపై మాత్రం చులకన భావన పోవట్లేదు. ఇలాంటి ఘటనే కేరళలో చోటుచేసుకుంది. బహిరంగ సభలో మాట్లాడే సంప్రదాయం మహిళలకు లేదంటూ అడ్డుకున్నారు. వివరాల ప్రకారం..కేరళలోని ముస్లింలీగ్ పార్టీలో కమరున్నీసా అన్వర్ (60).. ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు. అయితే  తిరువనంతపురంలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆమె కూడా పాల్గొన్నారు. ప్రసంగానికి లేచి నిలబడగానే పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంసీ మయీన్ హాజీ ఆమెను అడ్డుకున్నారు. పురుషులను ఉద్దేశించి మహిళలు మాట్లాడటం సరికాదన్నారు. ఇక ఈ వార్తలపై స్పందించిన హాజీ    ''మహిళలు బహిరంగ సభలలో మాట్లాడరు. మేము మహిళలకు పురుషుల కంటే ఎక్కువ గౌరవం ఇస్తాం. అందుకే వాళ్లను బహిరంగ సభలు, రాత్రివరకు జరిగే కార్యక్రమాలకు హాజరు కాకుండా ఆపుతాం'' అని ఆయన చెప్పారు. ఏదైనా ఒక బృందం వచ్చినప్పుడు వాళ్లతో మాట్లాడటానికి పర్వాలేదు గానీ, బహిరంగ సభలను ఉద్దేశించి మాట్లాడకూడదని తెలిపారు.   ఇదిలా ఉండగా జరిగిన ఘటనపై కమరున్నీసా అన్వర్ మాట్లాడుతూ.. తాను గత 20 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని, జరిగిన ఘటన పట్ల చాలా బాధపడుతున్నానని తెలిపారు.

బులంద్‌షహర్‌ గ్యాంగ్ రేప్... ఆజంఖాన్‌ క్షమాపణ చెప్పాల్సిందే..

  సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, యూపీ మంత్రి ఆజంఖాన్‌ బులంద్‌షహర్‌ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోయిడాకు చెందిన ఓ కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా కొందరు దుండగులు కారును ఆపి అందులో ఉన్న తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఆజంఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఈ విషయంపై బాధితురాలైన బాలిక ఆజంఖాన్‌ను విచారించాల్సిందిగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు అత్యాచార బాధితురాలికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. బాధితురాలు చదువుకునేందుకు వీలుగా దగ్గర్లోని పాఠశాలలో ప్రవేశం కల్పించాలని ఆదేశించింది.

టీమిండియా తొలి రోజు స్కోర్... 317/4

  భారత్-ఇంగ్లండ్ ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో తొలి రోజు ముగిసింది. విశాఖపట్టణంలోని ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికగా మారింది. తొలి రోజు ఆటలో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పొయి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశారు. అయితే క్రీజులో నిలదొక్కుకున్నపుజారా, కోహ్లీ మాత్రం సెంచరీలు చేసి మంచి స్కోరునే అందించారు. వీరిద్దరి అద్భుతమైన భాగస్వామ్యంతో టీమిండియా తొలిరోజు పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఆ తరువాత (119) పరుగుల వద్ద పుజారా తన వికెట్ ను కోల్పోగా.. ఆతరువాత బ్యాటింగ్ కు దిగిన అజింక్యా రహనే కూడా 23 పరుగులకే ఔటయ్యాడు.  దీంతో విరాట్ కోహ్లీకి, రవిచంద్రన్ అశ్విన్ (1) జతకలిశాడు. దీంతో ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా 317 పరుగులు చేసింది.

కొత్త వెయ్యి నోటు రాకపోవచ్చు..

  పాత రూ.500,1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే వాటి స్థానంలో కొత్త రెండు వేల నోట్లు వచ్చాయి. ఇక 500, 1000 నోట్లు కూడా వస్తాయని వార్తలు వస్తున్న సంగతి కూడా విదితమే. అయితే 500 నోట్ల సంగతేమే కానీ.. వెయ్యి రూపాయల నోట్లు మాత్రం వచ్చే పరిస్థితులు లేనట్టే కనిపిస్తోంది. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను బట్టి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నోట్ల ర‌ద్దు అంశంపై మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన 22500 ఏటీఎంల‌ను కొత్త నోట్ల‌కు అనుగుణంగా మార్పు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.ధుల దుర్వినియోగానికి అడ్డుక‌ట్ట వేయ‌డానికే రోజువారీ ప‌రిమితిని రూ.4500 నుంచి రెండు వేల‌కు త‌గ్గించిన‌ట్లు జైట్లీ తెలిపారు. ఇంకా ర‌ద్ద‌యిన వెయ్యి నోట్ల స్థానంలో ప్ర‌స్తుతానికైతే కొత్త‌వి ప్ర‌వేశ‌పెట్టే ఆలోచ‌న లేద‌ని స్ప‌ష్టంచేశారు.

ఆర్‌బీఐ ముట్ట‌డికి మ‌మ‌తా బెన‌ర్జి, కేజ్రీవాల్ యత్నం..

  నల్లధనాన్ని అరికట్టే చర్యలో భాగంగా మోడీ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జి, ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ఇప్పటికే పలుమార్లు పలు విమర్సలు చేశారు. ఈరోజు కార్యకర్తలతో కలిసి ఢిల్లీలోని ఆర్‌బీఐ కార్యాల‌య ముట్ట‌డికి ప్ర‌య‌త్నించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్ర‌మ‌త్త‌మ‌యి వారిని అడ్డుకున్నారు. దీంతో అక్క‌డ తీవ్ర‌ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.   కాగా పెద్ద‌నోట్ల ర‌ద్దు అంశంపై అరవింద్‌ కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌మండీ వ‌ద్ద కార్మికులు, వ్యాపారులు, రైతులతో స‌మావేశం ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఈ స‌మావేశంలో ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జి కూడా పాల్గొన్నారు.

నోట్ల రద్దుపై రచ్చ.. ఉభయ సభలు రేపటికి వాయిదా..

  మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ ఉభయ సభల్లో పెద్ద దుమారమే రేగింది. రెండు సభల్లోనూ నోట్ల రద్దుపై చర్చ జరపాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనలు చేపట్టారు. లోక్‌సభలో విపక్షాలు ఈ అంశంపై చర్చకు పట్టుబట్టాయి. స్పీకర్ పొడియంను చుట్టుముట్టాయి. స్పీకర్ ఎంత వారించినా విపక్షాలు వినలేదు. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తోన్నట్టు ప్రకటించారు.   ఇక సభ ప్రారంభమైనప్పటి నుండి రాజ్యసభ వాయిదా పడుతూనే ఉంది.  నోట్ల రద్దు అంశంపై ఛైర్మన్‌ పోడియం వద్ద విపక్షాలు ఆందోళన చేపట్టాయి.  ప్రధాని నరేంద్రమోదీ సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశాయి. కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ దీనిపై వివరణ ఇస్తారని చెప్పినా వారు శాంతించకపోవడంతోస ప్రతిపక్షాల ఆందోళన నడుమ రాజ్యసభ రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు స్పీకర్.

పాకిస్థాన్‌లో శుభ‌కార్యాల‌కు మీరు వెళ్తారు.. వెంకయ్య ఆగ్రహం..

  రాజ్యసభలో నోట్ల రద్దుపై తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరపాలని.. మోడీ దీనిపై ఖచ్చితంగా మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై  ప్ర‌తిప‌క్ష నేత గులామ్ న‌బీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. గులామ్ న‌బీ ఆజాద్ నోట్ల రద్దుపై మాట్లాడుతూ.. యూరీలో పాక్ ఉగ్ర‌వాదుల వ‌ల్ల మ‌ర‌ణించిన వారికంటే కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నోట్ల రద్దు వ‌ల్ల మ‌ర‌ణాలు ఎక్కువ‌య్యాయ‌ని ఆజాద్ ఘాటుగా ఆరోపిణ‌లు చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌భ‌కు వ‌చ్చేంత వ‌ర‌కు నోట్ల ర‌ద్దు అంశంపై చ‌ర్చ జ‌ర‌గ‌రాద‌ని ఆజాద్ డిమాండ్ చేశారు.   ఇక ఈ చర్యను పాకిస్థాన్ ఉగ్రవాదంపై పోల్చినందుకు గాను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్ర‌తిప‌క్ష నేత దేశాన్ని అవ‌మానించార‌ని మండిపడ్డారు. ఇక వెంకయ్య మాటలకు మళ్లీ కల్పించుకున్న ఆజాద్.. పాకిస్థాన్‌లో పెళ్లిలు, శుభ‌కార్యాల‌కు మీరు వెళ్తార‌ని, వాళ్ల‌కు రెడ్ కార్పెట్ కూడా వేస్తార‌ని, అలాంటి మీరు మ‌మ్మ‌ల్ని విమ‌ర్శిస్తారా అని అన్నారు. దీంతో స‌భ‌లో రెండు వ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకున్న‌ది. అరుపులు, కేక‌ల‌తో స‌భ దద్ద‌రిల్లింది.

మోడీ లంచం తీసుకున్నారు...సాక్ష్యాలు ఇవే..

  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీ పై మరోసారి మండిపడ్డారు. మోడీ పెద్ద నోట్లు రద్దు చేసిన దగ్గర నుండి కేజ్రీవాల్ మోడీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఆజాద్ పూర్ మండీ వద్ద పెద్ద నోట్ల రద్దుపై నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మోదీ మంచివారని దేశ ప్రజల్లాగే తాను కూడా నమ్మానని.. యితే ఓ సారి ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కు దొరికిన పత్రాల్లో ఎవరూ ఊహించని వాస్తవాలు వెల్లడయ్యాయని ఆయన చెప్పారు. బిర్లా సంస్థ ప్రధాని నరేంద్ర మోదీకి 12 కోట్ల రూపాయలు లంచం ఇచ్చిందని..  అలాగే సహారా ఇండియా సంస్థ కూడా ప్రధానికి కోట్ల రూపాయల లంచం ఇచ్చిందని ఇవన్నీ నిజమేనని నిర్ధారించుకున్న తరువాత వాటి గురించి మాట్లాడుతున్నానని ఆయన చెప్పారు.ఇందుకు సంబంధించిన సాక్ష్యాల పత్రాలను కూడా ఆయన ప్రదర్శించారు.

మోడీని పొగిడిన ట్రంప్... భారత్కు పూర్తి అనుకూలం

  రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్ కనుక ఎన్నికల్లో గెలిస్తే అమెరికా సర్వనాశనం అవ్వడమే కాకుండా.. అది భారత్ కు నష్టమే అని అనుకున్నారు. ట్రంప్ భారత్ కు పూర్తి వ్యతిరేకంగా ఉంటాడని అనుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త భిన్నంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ట్రంప్ మోడీ పై ప్రశంసలు కురిపించిన విధానం చూస్తుంటే ట్రంప్ భారత్కు పూర్తి అనుకూలంగా ఉన్నారని స్పష్టమవుతోంది.  ట్రంప్ కు చెందిన భారత వ్యాపార భాగస్వామి పంచశిల్ రియాలిటీ డైరెక్టర్ సాగర్ చోర్దియా ట్రంప్ మోడీపై ప్రశంసలు కురిపించారని..  మోదీ చాలా గొప్పగా పనిచేస్తున్నారని అంటున్నారని అన్నారు. భారత్, అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని, విస్తరిస్తాయని ట్రంప్ మాటలను బట్టి తనకు అర్థమైందని చెప్పారు. ట్రంప్ ఏర్పాటు చేసిన సమావేశంలో మోడీ గురించి మాట్లాడారని.. భారత ఆర్థిక వ్యవస్థ, మోదీపైనే చర్చ జరిగిందని సాగర్ చోర్దియా చెప్పారు.

మళ్లీ పార్టీలోకి రాంగోపాల్‌ యాదవ్‌...

  సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ కుటుంబంలో రాజకీయ విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ వివాదాల నేపథ్యంలోనే రాజ్యసభ ఎంపీ అయిన రాంగోపాల్‌ యాదవ్‌ పై వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనను మళ్లీ పార్టీలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. రాంగోపాల్‌ యాదవ్‌ పై వేటు పడినా కానీ ఆయన నిన్న రాజ్యసభకు హాజరయ్యారు. అంతేకాదు నోట్ల రద్దుపై కూడా స్పందించారు. ఈ నేపథ్యంలోనే రాంగోపాల్‌ యాదవ్‌ను పార్టీ మళ్లీ ఆహ్వానించింది. ఎస్పీలో ఆయన గతంలో చేసిన బాధ్యతలను మళ్లీ అప్పగిస్తున్నట్లు ప్రకటిస్తూ పార్టీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ లేఖను విడుదల చేశారు.  రాంగోపాల్‌ యాదవ్‌పై వేసిన వేటును ఎత్తివేస్తున్నామని, ఆయన పార్టీలో పూర్వపు బాధ్యతలే నిర్వర్తిస్తారని ప్రకటించారు.

వివాహాలకు 2.5 లక్షలు డ్రా చేసుకోవచ్చు..

  పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలు దేవుడికే ఎరుక. పాత నోట్ల మార్పిడి కోసం ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీస్తున్నారు. నోట్లు రద్దు చేసి దాదాపు పదిరోజులు కావస్తున్నా మొదటి రోజు ఎలా ఉందో ఇప్పటికీ అదే పరిస్థితి నెలకొంది. ఇక నోట్ల రద్దుతో విహహాలు సైతం ఆగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఓ ఊరట కలిగించే ప్రకటన చేసింది. అదేంటంటే.. ఆధారాలు చూపిస్తే వివాహాలకు బ్యాంకుల నుంచి రెండున్నర లక్షలు విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపారు. ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ... ఆధారాలు చూపిస్తే వివాహాలకు బ్యాంకుల నుంచి రెండున్నర లక్షలు విత్ డ్రా చేసుకోవచ్చని.. పెళ్లి కోసమే డబ్బులు తీసుకుంటున్నట్టు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. ఏపీఎంసీ ట్రేడర్లు వారానికి రూ.50 వేలు తీసుకోవచ్చని వెల్లడించారు. వ్యాపారులు వారానికి రూ.50 వేలు విత్ డ్రా చేసుకోవచ్చని.. రైతులు వారానికి రూ.25 వేలు విత్ డ్రా చేసుకోవచ్చని.. రేపటి నుంచి బ్యాంకుల కౌంటర్లలో నోట్ల మార్పిడి రూ.4.500 నుంచి రూ.2 వేలకు తగ్గించామని తెలిపారు.

నోట్ల రద్దుపై లోక్ సభలో రచ్చ...

  పెద్ద నోట్ల రద్దుపై ఉభయసభల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా.. ఇక లోక్ సభలో కూడా అదే పరిస్థితి నెలకొంది.  లోక్ సభలో ప్రశ్నోత్తరాలను విపక్షాలు అడ్డుకున్నాయి.  లోక్ సభలో కాంగ్రెస్, టీఎంసీ, లెఫ్ట్ సహా మొత్తం 21 నోటీసులు ఇచ్చాయి. అంతేకాదు  లోక్ సభలో ప్రధాని మోదీ కనిపించక పోవడంతో ఆగ్రహానికి గురైన విపక్షాలు.. ఆయన సభకు వచ్చి సమాధానం చెప్పే తీరాలని డిమాండ్ చేస్తున్నారు. విపక్ష పార్టీల ఎంపీలు పోడియంలోకి ప్రవేశించి ప్రభుత్వ వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. నసభ్యులు శాంతించాలని చర్చకు ప్రభుత్వం సిద్ధమని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎన్నిమార్లు ప్రకటించినా, విపక్ష సభ్యులు మాత్రం వినే పరిస్థితిలో లేరు.

పాక్ ఉగ్రదేశం.. బిల్లును అప్రూవ్ చేయనున్న ట్రంప్..!

  పాకిస్థాన్ ను ఉగ్ర దేశంగా ప్రకటించాలని చెబుతూ అమెరికా పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఓ ఆన్ లైన్ వెబ్ సైట్లో కూడా పాక్ ను ఉగ్రదేశంగా ప్రకటించాలని లక్షల సంఖ్యలో సంతకాలు కూడా నమోదైన సంగతి విదితమే. వాస్తవానికి లక్ష సంతకాలు వస్తేనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.. అలాంటిది ఒబామా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి త్వరలో అధికారం చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ మాత్రం దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా అభివర్ణించేలా తయారైన ఓ కాంగ్రెస్ బిల్లును ట్రంప్ అప్రూవ్ చేయనున్నారని ట్రంప్ సలహా సంఘంలోని సభ్యుడు, ప్రముఖ భారత సంతతి వ్యాపారవేత్త శలభ్ కుమార్ వెల్లడించారు. "అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య కచ్ఛితంగా మంచి స్నేహబంధం ఉంటుంది. భారత్ - అమెరికా భాగస్వామ్యం ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కొత్త శిఖరాలకు చేరుతుంది" అని ఆయన అన్నారు.

భారత్-ఇంగ్లండ్ రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం..

భారత్-ఇంగ్లండ్ ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఈ రోజు జరుగుతుంది. దీనికి విశాఖపట్నం వేదికైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా  రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రా అయిన విషయం తెలిసిందే.   టీం ఇండియా ఆటగాళ్లు: మురళి విజయ్, కే.ఎల్ రాహుల్, ఛటేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, ఆర్. అశ్విన్, వృద్ధిమాన్ సాహా, జడేజా, జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ   ఇంగ్లాండ్ ఆటగాళ్లు: కుక్, హమీద్, రూట్, డకెట్, మోయిన్ అలీ, బెన్‌స్టోక్స్, బరిస్ట్టో, అన్సారీ, రషీద్ బ్రాడ్, అండర్‌సన   ఇదిలా ఉండగా పెద్ద నోట్ల రద్దు ప్రభావం మ్యాచ్ పైనా పడింది. మ్యాచ్ ను చూడటానికి అభిమానులు రాకపోవడంతో ఉచితంగా లోపలికి అనుమతిస్తున్నారు.

సుష్మాస్వరాజ్‌ కు కిడ్నీ ఆపరేషన్..!

  బీజేపీ సీనియర్ నేత, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ కిడ్నీ ఫెయిల్ కావడంతో ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆమెనే స్వయంగా ఈవిషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ప్రస్తుతం డయాలిసిస్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే ఆమెకు త్వరలో ఆపరేషన్ జరగనున్నట్టు తెలుస్తోంది. కిడ్నీ దానానికి ఆమె కుటుంబసభ్యులు ప్రస్తుతం అందుబాటులో లేనందువల్ల వెంటనే ఆపరేషన్ చేయలేమని డాక్టర్లు తెలిపారు. కిడ్నీదాత దొరికి ఆపరేషన్ చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా  సుష్మకు కిడ్నీ ఇస్తానని రాహుల్‌వర్మ అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక విషయం తెలుసుకున్న పార్టీ నేతలు ఆమెను పరామర్శించడానికి తరలివస్తున్నారు.

పాకిస్థాన్ అబద్ధాలు చెబుతోంది..

  భారత సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా కూడా పాక్ పలు మార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అయితే ఈ కాల్పుల్లో భారతసైన్యాన్ని హతమార్చామని పాక్ చెబుతున్న మాటలను భారత్ ఖండిస్తుంది. కాల్పుల్లో 11 మంది భారత జవాన్లను హతమార్చామని పాకిస్థాన్ ప్రకటన చేసిన నేపథ్యంలో దీనిపై స్పందించిన భారత్..పాకిస్థాన్ పచ్చి అబద్ధాలు చెబుతోందనికాల్పుల్లో ఎవరూ పెద్దగా గాయపడలేదని నార్త్ రన్ కమాండ్ పేర్కొంది. 14న భారత పోస్టులపై దాడులు చేసి 11 మందిని చంపామనడం అవాస్తవమని తెలిపింది.   కాగా నిన్న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ మేనేజర్ రహీల్ షరీఫ్ మాట్లాడుతూ, భారత్ కాల్పుల్లో ఏడుగురు పాక్ జవాన్లు అమరవీరులయ్యారని, ప్రతిగా పాక్ చేసిన దాడిలో 11 మంది హతమయ్యారని చెప్పిన సంగతి తెలిసిందే.