అందుబాటులోకి కొత్త 500 నోట్లు...

 

నేటి నుండి కొత్త 500 నోట్ల రూపాయలు అందుబాటులోకి రానున్నాయని ఆర్ధిక శాఖ కార్యదర్శి దాస్ తెలిపారు. ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో మొదటగా ఈ నోట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇప్పటికే ఢిల్లీలోని ఎస్‌బీఐ ప్రధాన బ్రాంచ్‌లో రూ. 500 నోట్ల పంపిణీని చేపట్టారు. అయితే కాగా రూ. 500, రూ. 2000 నోట్ల సైజులో మార్పు కారణంగా ఏటీఎం మెషిన్లను మార్పుచేసిన తర్వాతనే వీటిని ఏటీఎంల ద్వారా తీసుకునే అవకాశం ఉందని..ఏటీఎంల సాఫ్ట్ వేర్ అప్ డేట్ కోసం టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా.. దేశ వ్యాప్తంగా మైక్రో, మొబైలు ఏటీఎంలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో నోట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని.. గ్రామీణ పోస్టాఫీసుల్లోకి ఎక్కువ డబ్బును పంపిస్తున్నామని తెలిపారు. పదివేల లిమిట్ ను కూడా ఆర్ధిక శాఖ ఎత్తివేసింది. సరైన ఆధారాలు చూపిస్తే ఒకేసారి రూ.50 వేలు డ్రా చేసుకోవచ్చని తెలిపారు.

బోత్ ఆర్ నాట్ సేమ్.. మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాలు సమానం కాదనీ, వెటికవి డిఫరెంట్ అని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. వైసీపీ తరచుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను, వాటికి అయిన వ్యయాన్నీ పోలుస్తూ చంద్రబాబు సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.  అమరావతి సచివాలయం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామనీ, ఇది ముఖ్యమంత్రి కార్యాలయం సహా, ఇందులో మంత్రులు, కార్య దర్శులు, అన్ని శాఖాధిపతుల కార్యాలయాలు ఉంటాయనీ,  మొత్తం పాలనాయంత్రాంగాన్ని ఒకే గూటి కిందకు తెస్తున్నామన్నారు. అదే తెలంగాణ సచివాలయంలో అయితే ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శుల కార్యాలయాలు మాత్రమే ఉంటాయనీ, శాఖాధిపతులు, సిబ్బంది కార్యాల యాలు వేరే చోటనుంచి పని చేస్తాయన్నారు.  అయితే అమరావతి సచివాలయం అయితే కార్పొరేషన్లు, వాటి శాఖలతో సహితంగా ఇక్కడే ఉంటా యన్నారు.   పాలనా సౌలభ్యం లక్ష్యంగా అమరావతి సచివాలయ నిర్మాణం ఉంటుందన్నారు. ఇది పాలనను ప్రజలకు చేరువ చేస్తుందన్నారు. ఇవేమీ అవగాహన లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అజ్ణానంతో, అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ముందుగా అమరావతి ప్రాజెక్టును పూర్తిగా అవగాహన చేసుకుని ఆ తరువాత మాట్లాడాలని సజ్జలకు సూచించారు.  ప్రపంచంలోని ఐదు టాప్ నగరాలలో ఒకటిగా అమరావతి అభివృద్ధి చేస్తున్నామన్న నారాయణ ఇక్కడ డ్రైనేజి వ్యవస్థలు, తాగునీటి పైప్ లైన్ లు, విద్యుత్ లైన్లు, టెలిఫోన్ కేబుల్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్నామన్నారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అన్న స్పష్టమైన విజన్ తో ముందుకు సాగుతున్నదన్నారు. రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్ ఏమిటని ఆయన నిలదీశారు. ప్రతిపక్ష నేతగా అమరావతిని రాజధానిగా అసెంబ్లీ సాక్షిగా ఆమోదించిన జగన్ మోహన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టగానే మూడు రాజధానులంటూ మూడుముక్కలాట మెదలెట్టారని విమర్శించారు.  రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు కావాలని జగన్ అన్నారని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి రాగానే మూడు రాజధానులంటూ ఆయన చేసిన విన్యాసాల వల్ల అమరావతిని భూములిచ్చిన రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తు చేశారు.  ప్రస్తుతం అమరావతి రాజధాని అభివృద్ధి పట్ల రైతులు, మహిళలూ ఆనందంగా ఉన్నారని మంత్రి నారాయణ చెప్పారు. ఇక అమరావతిని ఆపడం ఎవరి తరమూ కాదని నారాయణ స్పష్టం చేశారు.  

తెలంగాణ మునిసిపోల్స్ లో తెలుగుదేశం, జనసేన పొత్తు?!

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికలు రాష్ట్రంలో తమ ఉనికి చాటుకోవడానికి తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఒక గొప్ప అవకాశంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటికే తెలంగాణ మునిసిపోల్స్ లో పోటీ చేయనున్నట్లు జనసేన అధికారికంగా ప్రకటించింది.  ఇక ఆ ప్రకటన స్వయంగా జనసేనాని పవన్ కల్యాణ్ నుంచి రావాల్సి ఉంది. జనసేన తెలంగాణ ఇన్ చార్జ్ పోటీపై ప్రకటన చేశారు. ఆయనా ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు.. రాష్ట్రంలో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదనీ, ఒంటరిగానే రంగంలోకి దిగుతామని ప్రకటించారు. బీజేపీ అధ్యక్షుడి ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది. ఎందుకంటే.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ  కూటమి  అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  అయితే ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల కొంత కాలం కిందట జనసేనాని పవన్ కల్యాణ్ కోనసీమ కొబ్బరి రైతుల కష్టాలకు తెలంగాణ దిష్టి తగలడమే కారణమంటూ చేసిన వ్యాఖ్య లు. ఈ వ్యాఖ్యలను  తెలంగాణ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలూ తీవ్రంగా ఖండించాయి.  అంతకు ముందు కూడా జనసేనాని పవన్ కల్యాణ్  తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంపై ఎమోషనల్ గా స్పందించారు. రాష్ట్ర విభజన సమయంలో దాదాపు పది రోజులు తాను నిద్రలేని రాత్రులు గడిపాన్న ఆయన వ్యాఖ్య పట్ల కూడా తెలంగాణ సమాజంలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే  జనసేనతో పొత్తు వల్ల తెలంగాణలో నష్టం జరుగుతుందన్న భావనతోనే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు పొత్తునకు నో అని ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇది పక్కన పెడితే.. తెలంగాణలో మరీ ముఖ్యంగా సెటిలర్స్ ఎక్కువగా ఉండే జీహచ్ఎంసీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగితే కచ్చితంగా ప్రభావం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.  గ్రేటర్ హైదరాబాద్‌లో సెటిలర్ల ప్రభావం గణనీయంగా ఉండటం వల్ల  ఆ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన కూటమిగా పోటీలోకి దిగితే చెప్పుకోదగ్గ స్థానాలలో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు.  ఇది తెలంగాణలో ఇతర ప్రాంతాలలో కూడా బలోపేతం కావడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.   ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తెలుగుదేశం, జనసేన పార్టీలు తెలంగాణలో తమ పార్టీల బలోపేతంపై పెద్దగా దృష్టి సారించలేదు. తెలుగుదేశం పార్టీలో తెలంగాణలో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ, నాయకత్వం లేకపోవడంతో ఇక్కడి ఎన్నికలలో రాష్ట్ర విభజన తరువాత పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక జనసేన పరిస్థితీ అంతే.. జనసేనాని పవన్ కల్యాణ్ కు తెలంగాణలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నప్పటికీ, పార్టీ పరంగా వారి సేవలను ఉపయోగించుకోవడానికి ఏమంత ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు  ఆ రెండు పార్టీలకూ కూడా మునిసిపోల్స్ ఒక అవకాశంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలలో జనసేన కొన్ని స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ, తరువాత బీజేపీకి మద్దతుగా తమ అభ్యర్థులను ఉపసంహరించుకుంది.  అలా అప్పట్లో జనసేన ఒక అవకాశాన్ని జారవిడుచుకుందని చెప్పవచ్చు.   జనసేన ఇప్పటివరకు తెలంగాణలో ఒకే ఒక ప్రధాన ఎన్నికల్లో అంటు  2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేసింది. భారతీయ జనతా పార్టీతో పొత్తులో భాగంగా ఆ పార్టీ ఎనిమిది సీట్లలో పోటీ చేసినా ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయిన సంగతి  తెలిసిందే.  ఇక తెలంగాణాలో కూడా తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయంగా క్రియాశీలం కావడానికి ప్రయత్నిస్తున్నది. కనుక ఈ రెండు పార్టీలకూ తెలంగాణ మునిసిపోల్స్ ఒక అవకాశం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలో కూటమిగా ఈ ఎన్నికలలో పోటీ చేస్తే నిస్సందేహంగా గణనీయమైన ప్రభావం చూపుతాయనీ, ఇది భవిష్యత్ లో రాష్ట్రంలో ఈ రెండు పార్టీలూ అత్యంత క్రియాశీలంగా మారడానికి, రాష్ట్రంలో చెప్పుకోదగ్గ విధంగా బలోపేతం కావడానికి దోహదపతుందనీ అంటున్నారు.  చూడాలి మరి ఈ రెండు పార్టీల నిర్ణయం ఎలా ఉంటుందో?  

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ

  జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బ‌రిలో దిగాలని ఆ పార్టీ డిసైడ్ అయింది. ఎన్నిక‌ల‌కు నెల రోజుల కంటే త‌క్కువ స‌మ‌యం ఉన్నప్ప‌టికీ సాధ్య‌మైన‌న్ని స్థానాల్లో పార్టీ అభ్య‌ర్థులు పోటీ చేయున్నట్లు తెలిపారు. ప్ర‌తి జ‌న‌సైనికుడు, వీర మ‌హిళ ఉత్సాహంగా ప్ర‌చారానికి సిద్ధం కావాల‌ని ప్ర‌క‌టించింది.  పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం, అధ్యక్షుడు  ప‌వ‌న్ క‌ల్యాణ్ భావ‌జాలాన్ని ప్ర‌జ‌ల్లోకి చేర‌వేయ‌డం ద్వారా తెలంగాణలో స‌రికొత్త రాజ‌కీయ వేధిక‌కు పునాధి వేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని సూచించింది. త్వ‌ర‌లోనే పార్టీ కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొంది.   ఈ ఎన్నికల ప్రచారంలో జనసైనికులు చురుగ్గా పాల్గొని పార్టీ బలోపేతానికి తోడ్పడాలని జనసేన పార్టీ పిలుపు నిచ్చింది.  

త్వరలో 73 రాజ్యసభ స్థానాలు ఖాళీ

  2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు. వాళ్ల వివరాలను రాజ్యసభ సచివాలయం బులిటెన్ ద్వారా వెల్లడించింది, వీళ్లలో దశాబ్దాలుగా పని చేసిన అనుభవఘ్నలైన నేతలు కూడా ఉన్నారు. రాజ్యసభలో ఈ ఏడాది మార్చి నుంచి నవంబర్ మధ్య కాలంలో 73 మంది ఎంపీలు సభ్యులు తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఈ సభ్యుల పదవీ విరమణతో పలు రాష్ట్రాల నుంచి ఖాళీలు ఉంటాయి. ఈ 73 మంది సభ్యులలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది ఉన్నారు. మహారాష్ట్ర నుంచి ఏడుగురు, తమిళనాడు నుంచి ఆరుగురు సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు.  పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరి నుంచి ఐదుగురు చొప్పున సభ్యులు బయటకు వెళ్తున్నారు.ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అసోం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున సభ్యులు తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, హరియాణా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు.  హిమాచల్‌ప్రదేశ్, మణిపుర్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వైఎస్సార్‌సీపీకి చెందిన అయోధ్య రామి రెడ్డి, పరిమళ్‌ నత్వానీ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, అలాగే టీడీపీకి చెందిన సానా సతీష్‌బాబు తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఈ నాలుగు స్థానాలూ రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీలకే దక్కే అవకాశాలు న్నాయని భావిస్తున్నారు.  ఇక తెలంగాణ విషయాని కొస్తే, బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్‌ సురేష్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కేశవరావు రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందిన సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ కూడా పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణలో ఉన్న రెండు రాజ్యసభ స్థానాలను అధికార పార్టీ కాంగ్రెస్‌ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే త్వరలో ఖాళీ కానున్న 73 సీట్లకు ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది, ఏప్రిల్ నెలలో తొలి విడత నవంబర్ లో రెండో విడతలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

అమరావతిపై మరోసారి జగన్ విషం.. ప్రజాగ్రహ సెగతో వైసీపీలో భయం!

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జగన్ అక్కసు తెలియంది కాదు. తాను అధికారంలో ఉండగా అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులంటూ సృష్టించిన గందరగోళ, అయోమయ పరిస్థితులే గత అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒక్కటన్నది నిర్వివాదాంశం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతిపై జగన్ కుట్రల ఫలితమే.. 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం. వైసీపీకి కనీసం ప్రతిక్ష హోదాకు కూడా అర్హత లేదని జనం ఆ ఎన్నికలలో తమ ఓటు ద్వారా విస్పష్ట తీర్పు ఇచ్చి 11 స్థానాలతో ఆ పార్టీని సరిపెట్టారు. కూటమి సర్దు బాట్ల కారణంగా కొన్ని స్థానాలలో వైసీపీ విజయం సాధించింది. లేకపోతే ఆ ఓటమి మరింత ఘోరంగా ఉండేదని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషించిన సంగతి తెలిసిందే.  అయితే అంతటి ఘోర పరాజయం తరువాత కూడా అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్. తాజాగా అమరావతి నదీగర్భంలో నిర్మిస్తూ చంద్రబాబు ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. అమరావతి నిర్మాణం ప్రజాధనం వ్యయంగా అభివర్ణించిన ఆయన రాష్ట్ర రాజధానిని విజయవాడ, గుంటూరు జాతీయ రహదారికి సమీపంలో నిర్మించాలన్నారు. అమరావతిపై జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. అమరావతిపై జగన్ ద్వేషం వెళ్లగక్కుతున్నారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.  దీంతో నష్ట నివారణకా అన్నట్లుగా మాజీ మంత్రి పేర్ని నాని రంగంలోకి దిగారు. జగన్ వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చడానికా అన్నట్లు హెరిటేజ్ కార్యాలయాన్ని నదీ గర్భంలో నిర్మించగలరా  అన్న జగన్ ప్రశ్నకు ముందు నారా చంద్రబాబు, ఆయన కుటుంబం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  అమరావతి విషయంలో జగన్ మాటలను తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ మాట్లాడారు. జగన్ అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 24 గంటలలో పేర్ని నాని రంగంలోకి దిగడం, జగన్ వ్యాఖ్యల తీవ్రతను డైల్యూట్ చేసేలా మాట్లాడటం చూస్తుంటే అమరావతి విషయంలో వైసీపీ తీరు పట్ల ప్రజా వ్యతిరేక సెగలు వైసీపీకి మరోసారి గట్టిగా తగిలాయనే భావించాల్సి వస్తోంది.  

రాజకీయ గూఢచర్యంలో భాగమే ఈడీ దాడులు.. కేంద్రంపై తృణమూల్ ధ్వజం

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని ఐప్యాక్ కార్యాలయం, ఆ సంస్థ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసాలపై ఈడీ సోదాలు ఆ రాష్ట్రంలో పెను రాజకీయ వివాదానికి దారి తీశాయి. ఈ దాడులను ఆ రాష్ట్రంలో అధకారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ గూఢచర్యంగా అభివర్ణించింది. ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ సోదాలు జరుగుతుండగా మమతా బెనర్జీ అక్కడికి వెళ్లడాన్ని తృణమూల్ కాంగ్రెస్ సమర్ధించుకుంది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ మహువామోయిత్రా మాట్లాడుతూ.. సీఎం మమతా బెనర్జీ తృణమూల్ అధినేత్రి కూడా అని పేర్కొన్నా మహువా మోయిత్రా, ఇంట్లో దొంగతనం జరుగుతున్నప్పుడు మన వస్తువులను కాపాడుకునే హక్కు మనకు ఉంటుంది కదా అన్నారు.   పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని  బీజేపీ సాగిస్తున్న దోపిడీని, గూండాయిజాన్ని ఎదుర్కొంటున్న ఏకైక నాయకురాలు మమతా బెనర్జీ మాత్రమేనన్న మహువా మోయిత్రా ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల జాబితా వంటి రహస్య డేటాను దొంగిలించేందుకే ఈడీ దాడులని తీవ్ర విమర్శలు చేశారు.  ఈడీ దాడులకు నిరసనగా  మమతా బెనర్జీ కోల్‌కతాలో భారీ పాదయాత్ర నిర్వహించారు.ఆ ర్యాలీకి సంఘీ భావంగా  ఢిల్లీలో నిరసన చేపట్టిన టీఎంసీ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, తమ దర్యాప్తును ముఖ్యమంత్రి అడ్డుకున్నారని ఈడీ, తమ పార్టీ సమాచారాన్ని అక్రమంగా సేకరించారని టీఎంసీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించాయి. వీటిపై విచారణను కోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది.   ఇలా ఉండగా తమ పార్టీ రాజకీయ వ్యూహకర్త   ఐ-ప్యాక్ పై ఎ ఈడీ  దాడుల   నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనపైన, తన ప్రభుత్వంపైన  స్థాయికి మించి ఒత్తిడి పెంచితే బొగ్గు కుంభకోణంలో అమిత్ షా పాత్రకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను బయటపెడతానని హెచ్చరించారు.  

హింసకు ప్రోత్సాహం.. ఇదేం రాజకీయం జగన్!?

జ‌గ‌న్ ది తొలి  నుంచీ హింసాత్మ‌క ప్ర‌వృత్తే. ఈ విష‌యం గతంలోనే పలుమార్లు రుజువైంది. తాజాగా మరోసారి వెల్లడైంది.  త‌న ఫ్లెక్సీల ముందు పొటేళ్ల‌ను అత్యంత హింసాత్మ‌కంగా న‌రికి.. ఆపై ఆ ర‌క్తాన్ని ఆయ‌న ఫ్లెక్సీల‌కు పూశారు. ఒక విధంగా చెప్పాలంటే రక్తాభిషేకం చేశారు  గ‌తంలో హోం మంత్రిగా  ప‌ని  చేసిన తానేటి వ‌నిత నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గోపాల‌పురం బ్యాచ్. అయితే  వీరిని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేసింది ఏపీ  పోలీస్ డిపార్ట్ మెంట్. వీరు విడుద‌ల‌య్యాక నేరుగా ఇళ్ల‌కు వెళ్లారో లేదో తెలీదు.  కానీ, స‌రాస‌రి జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌ వాలిపోయారు. వారిని స్వయంగా జగన్ వద్దకు మాజీ హోం మంత్రి తానేటి వ‌నిత‌ తీసుకువెళ్లారు.   హోం మంత్రిగా  ప‌ని చేసిన వనితకు డూస్ ఏంటి?  డోంట్స్ ఏంట‌ి?  అన్న‌ది క్లియ‌ర్ క‌ట్ గా తెలిసి ఉంటుంది. త‌మ‌కు తెలిసింది ఇత‌రుల‌కు కూడా చెప్పాలి. కానీ, వ‌నిత ఆ ర‌క్త‌సిక్త నిందితుల‌ను  ఏదో పెద్ద ఘ‌న‌కార్యం చేసిన‌ట్టు నేరుగా జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు తీసుకువచ్చి నిల‌బెట్టారు. దీంతో వారు కూడా తాము తిన్న పోలీసు లాఠీ దెబ్బ‌ల‌కు అక్క‌డ ఎక‌బికిన  ఏడ్చేశారు. ఇలా ఎప్పుడూ చేయ‌కండ‌ని వారించాల్సిన  జ‌గ‌న్..  మీకు నేను అండ‌దండ‌గా ఉన్నానంటూ.. భుజం త‌ట్టి  పంపించారు. జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి  కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా?  ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు.  దీంతో  వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని  కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.  అవ‌స‌ర‌మైతే కోటాను కోట్లు కుమ్మ‌రించేయగలరు?  అదే ఈ  రప్పార్పా నిందితుల ప‌రిస్థితి  అలాక్కాదు. వీరిని నేరుగా తీసుకెళ్లి తమదైన స్టైల్ ట్రీట్ మెంట్ ఇచ్చి మరీ వదిలారు పోలీసులు. చాలా మంది  వైసీపీ  వారు చేస్తున్న రివ‌ర్స్ ట్రోలింగ్ ఏంటంటే గ‌తంలో చంద్ర‌బాబు ఫ్లెక్సీల‌కు ర‌క్తాభిషేకం చేసిన ఫోటోలు, బాల‌కృష్ణ సినిమా విడుద‌ల  స‌మ‌యంలో పొటేళ్ల త‌ల‌లు అలంక‌రించిన  వీడియోల‌ను రీ పోస్ట్ చేస్తున్నారు. కానీ, వాట‌న్నిటిపైనా  చ‌ట్ట‌ప్ర‌కారం చర్యలు తీసుకున్న సంగతిని మాత్రం ఈ రివర్స్ ట్రోలింగ్ చేస్తున్న వారు బయటకు చెప్పడంలేదు. పైగా అప్పట్లో అలా రక్తాభిషేకం చేసిన వారిని చంద్రబాబు, బాలయ్య సమర్ధించలేదు. అటువంటి చర్యలు తగవని హితవు పలికారే తప్ప వారిని సమర్ధిస్తూ, ప్రోత్సహిస్తూ జగన్ లా ప్రకటనలు గుప్పించలేదు.   ప్ర‌స్తుత ప‌రిస్థితికి వ‌స్తే.. ర‌క్త త‌ర్ప‌ణం జ‌గ‌న్ కి. బాధలు, కేసులు ఈ నిందితులకు అన్నట్లుగా ఉంది.  వీరిని వారించాల్సిన జ‌గ‌న్ వారించ‌కుండా రెచ్చిపోండి నేనున్నాననడమంటే..  అర్ధమేంటి? జగన్ ప్రోత్సాహం, మద్దతు చూసుకుని వీరింకెంత రెచ్చిపోతారో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.  ఇలాంటి హింసాత్మ‌క‌త గుర్తించిన జ‌నం వ‌చ్చే రోజుల్లో ఆ ప‌ద‌కొండు సీట్లు కూడా  ఇవ్వ‌కుండా పులివెందుల‌లో  కూడా  జ‌గ‌న్ని ఓడించి మూల కూర్చోబెడితే.. పార్టీకి కాస్తా  ఆయ‌న‌ పేక‌ప్ చెప్పేస్తారు. సంపాదించుకున్నదాంతో జ‌గ‌న్ కేం  తృప్తిగా  బ‌తికేస్తారు. కానీ ఇలాంటి నిందారోప‌ణ‌ల‌తో జీవితాంతం బ‌త‌కాల్సింది మాత్రం వీరే. కాబ‌ట్టి ఇలాంటి వారు ఒక సారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నారు పోలీసులు.. మ‌రి  పోలీసుల మాట విని బుద్ధిగా మ‌స‌లుకుంటారో.. లేక ఇలాగే రెచ్చి పోయి కేసుల మీద కేసులు నెత్తికి వేసుకుంటారో అది వారి వారి ఇష్టం. మ‌రి  మీరేమంటారు?

కవిత కొత్త పార్టీ.. బీఆర్ఎస్ భవిష్యత్తేంటి?

తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు కల్వకుంట్ల కవిత ప్రయాణం అత్యంత ఆసక్తికర అంశంగా మారింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె అయిన కల్వకుంట్ల కవిత  రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం ఖాయమైన నేపథ్యంలో.. ఆమె కొత్త పార్టీ ప్రభావం బీఆర్ఎస్ పై ఏ మేరకు ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది.  కవిత తాను సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే ఆమె పార్టీ నిర్మాణ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో ఆరంభించేశారు.  32 వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయి పార్టీ ప్రకటన ఇక లాంఛనమే అని పరిశీలకులు సైతం అంటున్నారు. అయితే ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.   తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలను ఎండగట్టడం ద్వారా.. ప్రత్యేక రాష్ట్ర ఫలాలను తెలంగాణ సమాజానికి అందించడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని తేల్చే దిశగా కవిత అడుగులు ఉన్నాయని అంటున్నారు.    ఇప్పటి వరకూ కవిత విమర్శలపై బీఆర్ఎస్ అగ్రనాయకత్వం స్పందించకపోవడం ఆ పార్టీని డిఫెన్స్ లో పడేసిందంటున్నారు. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి కవిత దూకుడును అడ్డుకోకుంటే.. బీఆర్ఎస్ స్థానాన్ని కవిత ఆరంభించనున్న కొత్త పార్టీ ఆక్రమించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. 

ఉప్పు సముద్రం పాలౌతున్న వృధా జలాల వినియోగమే లక్ష్యం.. చంద్రబాబు

నీటి వివాదాల వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాటిని సామరస్యంగా పరిష్కరిం చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. జలవివాదాలను రాజకీయం చేయడం వల్ల ఎవరికీ ఎటువంటి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయాన్ని ఇరువురు ముఖ్యమంత్రులూ కూడా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే జల వివాదాల పరిష్కారం విషయంలో ఏపీ ఒక అడుగు ముందుకు వేస్తే.. తాము పది అడుగులు ముందుకు వేస్తామన్నారు. అదే విధంగా చంద్రబాబు కూడా తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలను కొందరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారని విమర్శించారు.    ఉప్పు సముద్రంలోకి వృధాగా పోతున్న నీటి వినియోగం విషయంలో తెలుగు రాస్ట్రాల మధ్య వివాదాలు అనవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.  తూర్పుగోదావరి జిల్లా రాయవరం గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్‌బుక్కులు పంపిణీ చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో  ప్రసంగించిన ఆయన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని విమర్శించారు.  ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రశక్తే లేదని స్పష్టం చేసిన ఆయన  అనవసర వివాదాల వల్ల  ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు.    ప్రతి ఏటా సముద్రంలోకి వృథాగా పోతున్న 300 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో కరవు అనే మాటే ఉండదన్న చంద్రబాబు.. పోలవరం పూర్తయితే  నీటి సమస్యలు తీరతాయనీ,  పోలవరం నుంచి విశాఖపట్నం, అక్కడి నుంచి వంశధార వరకు నీటిని తీసుకెడతామని చెప్పారు.  పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ కూడా మిగులు జలాలను వాడుకోవచ్చన్న ఆయన  పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించి, అక్కడి నుంచి రాయలసీమకు నీరందించడం వల్లే ఆ ప్రాంతం హార్టికల్చర్ హబ్‌గా మారుతోందన్నారు.   

ఏపీ ఒక అడుగు ముందుకేస్తే మేం పదడుగులేస్తాం

జలవివాదాల పరిష్కారంపై తెలంగాణ సీఎం రేవంత్ ఏపీ ముఖ్యమంత్రికి ప్రతిపాదన తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదన చేశారు. రెండు రాష్ట్రాల  జలవివాదాలను నేరుగా చర్చించుకుని పరిష్కరించు కుందామంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిపాదించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో  శుక్రవారం (జనవరి 9) ఆయన పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను  ఇరు రాష్ట్రాలూ పరిష్కరిం చుకోవాలన్నారు.  ఇందు కోసం ఏపీ ఒక అడుగు మందుకు వేస్తే తాము పదడుగులు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కోర్టుల ద్వారా కాకుండా జల వివాదాలను రాష్ట్రాల మధ్యే పరిష్కరించుకుందాని కోరారు.  జల వివాదం విషయంలో రాజకీయ ప్రయోజనం కోసం తాము ప్రయత్నించడం లేదన్నారు. పంచయతీ కావాలా? నీళ్లు కావాలా అంటే తాను నీళ్లు కావాలనే అంటానని స్పష్టం చేశారు.   కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు సృష్టించవద్ద కోరారు.  తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ ఉండాలంటే పక్క రాష్ట్రం సహకారం తప్పని సరి అన్న రేవంత్ ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యా పరస్పర సహకారం ఉంటేనే సమస్యలు పరిష్కారమౌతాయన్నారు.